“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, అక్టోబర్ 2015, గురువారం

చంద్రశేఖర సరస్వతి -2

మొన్న సాయంత్రం చంద్రశేఖర్ నుంచి మళ్ళీ ఫోనొచ్చింది.

'నిన్న సాయంత్రం రిజైన్ చేసేశాను అన్నగారు' అన్నాడు.

'మంచిది.ఆలస్యం అయినట్లుందే?' అడిగాను.

'అవును.ఆఫీసులో కొన్ని పనులవల్ల లేటైంది.నిన్నటితో ఉద్యోగం పని అయిపోయింది' అన్నాడు.

'తరువాత ఏమిటి ఆలోచన?' అడిగాను.

'ఏముంది? ముందుగా అనుకున్నట్లు రమణాశ్రమం చేరడమే.ఆలోపల ఒక్కసారి మైసూరు వెళ్లి స్వామీజీని చూచి రావాలి' అన్నాడు.

'ఎలా ఉన్నారు వారిద్దరూ?' అడిగాను.

'బాగానే ఉన్నారు.బాగా పెద్దవాళ్లై పోయారు.' అన్నాడు.

ఇక్కడ ఈ 'ఇద్దరి గురించి' కొంత చెప్పాలి.

చంద్రశేఖర్ కు గత ఇరవై ఏళ్ళనుంచీ ఇద్దరు చాలా ఉన్నతులైన వ్యక్తులు పరిచయం ఉన్నారు. ఇద్దరూ సన్యాసజీవితం గడుపుతున్న వారే. వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు.సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.అన్నగారికి ఇప్పుడు 90 ఏళ్ళు.చెల్లెలికి 80 పైన ఉంటాయి. ఆయన 60 ఏళ్ళక్రితం IAS ఆఫీసరు.బాగా ఆధ్యాత్మిక చింతనాపరుడు.తనకు దాదాపుగా 45 ఏళ్ళ వయసు ఉన్నపుడు ఉద్యోగానికి రిజైన్ చేసేసి సన్యాసం స్వీకరించాడు.ఆయన చెల్లెలు కూడా అలాంటి వ్యక్తే.ఆమెకూ ఆధ్యాత్మిక చింతన అధికం.ఇద్దరూ వివాహాలు చేసుకోలేదు.ఆమె కూడా సన్యాసం స్వీకరించింది.వీరికి ఇంకెవ్వరూ బంధువులు లేరు. హిమాలయాలలోని ఉత్తరకాశీలో నరసంచారం లేని అడవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ దాదాపు 20 ఏళ్ళపాటు వీరిద్దరూ తపస్సు చేశారు.కనీస వైద్యసౌకర్యం కావాలంటే ఒక 100 మైళ్ళు పోతేగాని ఏమీ దొరకనంత ఎత్తులో హిమాలయాలలో వీళ్ళు రెండు దశాబ్దాలున్నారు.ఆ తర్వాత హిమాలయాలు వదలి మైసూరు ఊరిబయట రెండెకరాల స్థలంలో ఆశ్రమం కట్టుకుని అక్కడే ప్రశాంతంగా ఉంటున్నారు.చంద్రశేఖర్ అంటే వీరిద్దరికీ ఎంతో ప్రేమ.అతను అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి వస్తుంటాడు.

వీరి ఆశ్రమంలో వీరిద్దరూ తప్ప ఎవరూ ఉండరు.వాళ్ళు పూర్తిగా శంకరాద్వైత సంప్రదాయానికి చెందిన సాధువులు.ప్రపంచపు గొడవ వారికి లేదు.అధ్యయనమూ తపస్సూ తప్ప వేరే పని ఉండదు.నేటి 'మోడరన్ ఆశ్రమాల' లాగా వీరి ఆశ్రమం ఉండదు.నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. లోకంతో ఏ విధమైన పనీ వీరు పెట్టుకోరు.నేటి సోకాల్డు ఆశ్రమాలలో తండోపతండాలుగా కనిపించే దొంగభక్తులూ దొంగశిష్యులూ వీరికి లేరు.వీరిని చూచేవాళ్ళు కూడా ఎవరూ లేరు.'మరెలా? ఈ వయస్సులో ఎవరూ తోడు లేకుండా మీరు ఎలా ఉంటున్నారు?' అని ఎవరైనా అడిగితే వారినుంచి 'దైవమే మాకు దిక్కు దైవమే మాకు తోడు' అంటూ ఒకటే జవాబు వస్తుంది."నరసంచారం కనిపించని హిమాలయపు ఎత్తులలోనే భగవంతుని పైన భారం వేసి ఎన్నో ఏళ్ళు ఉన్నాము.దానితో పోల్చుకుంటే ఇప్పుడు సిటీలో ఉన్నట్లే లెక్క"- అంటారు.

'ఈ మధ్యనే ఒకసారి మైసూరు వెళ్లి వచ్చాను అన్నగారు.ఇద్దరూ బాగా వృద్దులై పోయారు.కానీ ఎవరినీ తమ పనులు చెయ్యనివ్వరు.వారి పనులు వారే ఇప్పటికీ చేసుకుంటారు.వంట కూడా వారే చేసుకుంటారు.వేరే వాళ్ళు చేసిన వంటను వారు తినరు.అలాంటి తపోధనులను నేను ఇప్పటిదాకా చూడలేదు' అన్నాడు.

వింటున్న నాకు దైవాదేశం లాగా ఒక ఆలోచన వచ్చింది.

'తమ్ముడూ. ఒక మాట చెబుతాను.వింటావా?' అడిగాను.

'చెప్పండి' అన్నాడు.

'నువ్వు ప్రస్తుతం రమణాశ్రమం వెళ్ళవద్దు.వెళ్లి మైసూరులో స్థిరపడు' అన్నాను.

'అదేంటి అన్నగారు?' అన్నాడు.

'అవును తమ్ముడూ. రమణాశ్రమం ఎప్పుడైనా వెళ్ళవచ్చు.కానీ ఇలాంటి మహనీయులకు సేవచేసే అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు.మైసూరు వెళ్ళు.అక్కడే ఆశ్రమంలో వారికి తోడుగా ఉండు.వాళ్ళిద్దరికీ సేవ చెయ్యి.నీ సాధన కూడా చేసుకో.వాళ్ళున్నంత కాలం వారికి సేవకునిగా ఉండు.ఆ తర్వాత ఎలాగూ నీవు రమణాశ్రమం చేరవచ్చు.లేదంటే ఆ ఆశ్రమంలోనే ఉండిపోవచ్చు.

నువ్వనుకున్నట్లు రమణాశ్రమంలో ఉండటం అంత సులభం ఏమీ కాదు.ఒక్క వారంలోనే నీకు భయంకరమైన బోరు కొడుతుంది.ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పుడుతుంది.అప్పుడైనా అక్కడ ఏదో ఒక సేవ చెయ్యక తప్పదు.మనిషి 24 గంటలూ ధ్యానంలో ఉండలేడు,ఈ విషయం తెలిసే, కర్మను యోగంగా చెయ్యమని వివేకానందస్వామి రామకృష్ణా మిషన్ ను స్థాపించారు. నిస్వార్ధంగా, యోగంగా చెయ్యబడిన కర్మ, ధ్యానం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.

కనుక నా మాటను దైవాదేశంగా స్వీకరించు.మైసూరుకు వెళ్లి వారి సేవలో పునీతుడవు కా.ఇంకొక విషయం విను.తపోధనులూ నిష్కల్మష హృదయులూ అయిన అటువంటివారి సేవాభాగ్యం అంత తేలికగా లభించదు.దానికి ఎన్నో జన్మల పుణ్యబలం ఉండాలి.చాలామంది ఇలాంటివారిని కనీసం చూడను కూడా చూడలేరు.ఈ అదృష్టం అందరికీ దొరకదు.నీకు దొరికింది.ఈ అవకాశాన్ని వృధా చేసుకోకు.రమణాశ్రమం ఎక్కడికీ పోదు.కానీ వీరిద్దరూ ఎంతోకాలం ఈ భూమిమీద ఉండరు.ఇది నీకు సువర్ణావకాశం.దీనిని చేజార్చుకున్నావంటే తరువాత చాలా బాధపడతావు.వారు దైవం మీద భారం వేసి జీవిస్తున్న పవిత్రాత్ములు.ప్రస్తుతం వారికి ఎటువంటి సాయమూ లేదు.కనీసం సుస్తీ చేస్తే మందులిచ్చే దిక్కు కూడా లేరు.వండిపెట్టే వారు కూడా లేరు.వారికి నీవు గనక ప్రేమగా భక్తిగా నిస్వార్ధంగా సేవ చెయ్యగలిగావా, దైవం నిన్ను ఎంత కరుణిస్తాడో నేను మాటల్లో చెప్పలేను.

నీవు చేసే ఈ నిస్వార్ధమైన సేవవల్ల ఆ మహనీయుల కటాక్షం నీవు పొందగలిగావంటే నీకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు.అలాంటివారి కృపవల్ల సాధనలో నీవు అనూహ్యంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు.నీవు ఏకాంతంగా చేసే సాధన కూడా అంత ఫలితాన్ని ఇవ్వదు.నీ మనస్సు ఎంతో శుద్ధంగా మారుతుంది.నీలోని చెడు వాసనలన్నీ దగ్ధమై పోతాయి.ఇది సత్యం.కనుక నా మాట విను. నీ రమణాశ్రమం ఆలోచన మానుకో.కావాలంటే నెలకొకసారి అక్కడకు వెళ్లి ఒకటో రెండో రోజులు ఉండి వస్తుండు. సరిపోతుంది.ఇప్పుడు మాత్రం నీవు చెయ్యవలసిన పని ఇదే.సంసారంలో ఇరుక్కుని పోయిన మాలాంటి వారికి ఈ అవకాశం రాదు.నీకా బాదరబందీ లేదు.ఈ అవకాశం సద్వినియోగం చేసుకో.వారికి సేవ చెయ్యి.వాళ్ళ అనుగ్రహాన్ని పొందు.అందులోనే భగవంతుని అనుగ్రహం ఉన్నది.' - అన్నాను.

చంద్రశేఖర్ కాసేపు మాట్లాడలేదు.

'నిజమే అన్నగారు.ఒక ఏడాది క్రితం స్వామీజీకి బాగా సుస్తీ చేసింది.పూర్తిగా మంచం పట్టారు.ఆ సమయంలో నేను లీవుపెట్టి ఆయన దగ్గరే ఉండి, ఒక వారంరోజులు ఆయనకు అన్ని సేవలూ నేనే చేశాను.స్వామీజీ ఎవరి సహాయాన్నీ కోరుకోరు చేసినా ఒప్పుకోరు.అలాంటిది నేను సేవ చేస్తుంటే మాత్రం ఏమీ అనలేదు.మాతాజీ కూడా అదే అన్నారు.'నువ్వు చాలా పవిత్రాత్ముడివి.ఎప్పుడూ జపం చేస్తూనే ఉంటావు.దైవస్మరణలోనే ఎల్లప్పుడూ ఉంటావు గనుక నీ సేవను ఆయన స్వీకరించారు.లేకుంటే ఆయనను ఎవరూ అసలు తాకరు.ఆయన కూడా ఎలాంటి పరిస్థితిలోనూ ఎవ్వరి సాయమూ స్వీకరించరు.నువ్వు అదృష్టవంతుడివి' అన్నారు. నాకుకూడా ఆ వారం రోజులూ చాలా ఆనందంగా ఉన్నది.మనస్సు ఎంతో పవిత్రం అయిపోయినట్లు అనిపించింది.ప్రపంచాన్ని దాటి ఎంతో ఎత్తులో ఉన్నట్లు ఫీల్ వచ్చింది.

ఎందుకోగాని మీకు ఫోన్ చేసిన ప్రతిసారీ నేను ఊహించని రీతిలో నా జీవితం మారుతున్నది అన్నగారు.మీరు చెప్పినట్లే చేస్తాను.దీనిని భగవంతుని ఆదేశంగా స్వీకరిస్తాను.ప్రస్తుతం రమణాశ్రమం వెళ్ళను.మైసూరు వెళ్లి మాతాజీని అర్ధిస్తాను.వారు ఒప్పుకుంటే అక్కడే వారికి సేవకుడుగా ఉండిపోతాను.' అన్నాడు.

ఆ మాట విని నాకు చాలా ఆనందం కలిగింది.

'నీలాంటి ఉత్తముడిని వాళ్ళు తప్పకుండా వారితో ఉండనిస్తారు తమ్ముడూ.ఆ నమ్మకం నాకుంది.ఇక ఆలస్యం చెయ్యకు.వెంటనే మైసూరు బయల్దేరు.' అన్నాను.

మనుషులలో నిస్వార్ధపరులు ఇంకా ఉన్నారు.నిజమైన విలువల కోసం బ్రతికేవాళ్ళు ఇంకా అక్కడక్కడా నైనా ఉన్నారు.జీవితపు అంతిమగమ్యం కోసం తపించేవాళ్ళూ దానిని వెదికేవాళ్ళూ ఇప్పటికీ ఉన్నారు.

షేవ్ చేసుకుంటుంటే చెంప తెగితే దానికోసం ఇన్స్యూరెన్స్ చేసే అల్పులమైన మనమెక్కడ?చావుబ్రతుకుల్లో ఉన్నాకూడా తపోదీక్షను వీడని వారెక్కడ?ఒకరోజు టీవీ లేకపోతే,కాసేపు కరెంటు పోతే,లేదా కాసేపు సెల్ ఫోన్ నెట్ వర్క్ అందకపోతే ప్రపంచం తల్లకిందులైపోయినట్లు గందరగోళ పడిపోయే మనమెక్కడ? జీవితం ఏమైపోయినా సరే అనే మొండిధైర్యంతో భగవంతుని మీద భారం వేసి ఎక్కడో హిమాలయాలలో అన్ని వేల అడుగుల ఎత్తున,రేపటి చింత లేకుండా,సౌకర్యాల ఆలోచనే లేకుండా,అన్నెన్నేళ్ళు దైవం కోసం తదేకదీక్షతో తపస్సు చేసిన వారెక్కడ? అసలు పోలికే లేదేమో?

మనం జంతువుల స్థాయిలో బ్రతుకుతున్నాం.వాళ్ళు దేవతాస్థాయిలో ఉన్నారు.

ఇలాంటి ఉత్తమవ్యక్తులను నాకు పరిచయం చేసినందుకూ,వారికి మార్గదర్శనం చేసే అదృష్టాన్ని నాకిచ్చినందుకూ,మనుషులమీదా మానవత్వం మీదా నానాటికీ దిగజారిపోతున్న నా నమ్మకాన్ని ఇలాంటి సంఘటనలద్వారా ఇంకా నిలబెడుతున్నందుకూ శ్రీరామకృష్ణులకు మనస్సులోనే ప్రణామాలు అర్పించాను.

మనద్వారా దైవనిర్ణయం పనిచెయ్యడం కంటే, మనల్ని దైవం ఒక సాధనంగా వాడుకోవడం కంటే మనకు కావలసింది ఇంకేముంటుంది?