“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, అక్టోబర్ 2015, గురువారం

క్రొత్త ఉదయం








ప్రతి వ్యాధీ ఒక క్రొత్త ఉత్సాహాన్ని మోసుకొస్తుంది
ప్రతి క్రుంగుబాటూ ఒక క్రొత్త ఉత్తేజాన్ని నింపిపోతుంది
జీవితాన్నే ఆటగా చూచేవాడికి బాధేముంటుంది?
ప్రతి కిరణమూ ఒక అంత:తిమిరాన్నే నిర్మూలిస్తుంది
ప్రతి మరణమూ ఒక క్రొత్త జీవితాన్నే ప్రసాదిస్తుంది

ప్రతి నిరాశా ఒక వెలుగు వైపే నడిపిస్తుంది
ప్రతి ఓటమీ ఒక గెలుపు దరికే దారితీస్తుంది
చీకటిని కూడా ప్రేమించేవాడికి చిరునవ్వు ఎలా మాసిపోతుంది?
ప్రతి వైఫల్యమూ తనను తానే అంతం చేసుకుంటుంది
ప్రతి అంధకారమూ ఒక తేజస్సునే సొంతం చేసుకుంటుంది

ప్రతి పతనమూ ఒక ఔన్నత్యానికే పునాదౌతుంది
ప్రతి వెనుకడుగూ ఒక నిద్రిస్తున్న బలాన్ని తట్టి లేపుతుంది
ప్రతిదాన్నీ చేయూతగా తీసుకునేవాడికి తిరోగమనమేముంటుంది?
ప్రతి వేదనా ఒక ఉజ్జ్వలానందాన్నే ప్రోది చేస్తుంది
ప్రతిరాత్రీ ఒక క్రొత్త ఉదయానికే తెరతీస్తుంది....