“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, జులై 2014, సోమవారం

రాహుకేతువుల రాశిమార్పు -2014-ఫలితాలు

13-7-2014 న రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.గత ఏడాదిన్నర నుంచీ వీరు వరుసగా తులా మేషరాశులలో ఉన్నారు.ఈ తేదీనుంచి దాదాపు ఇంకొక ఏడాదిన్నరవరకూ కన్యా మీనరాశులలో ఉండబోతున్నారు.

కనుక వీరి స్థితి ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది.దీని ఫలితంగా అనేకమంది జీవితాలలో ఊహించని విధంగా అనేక మార్పులు కలుగుతాయి.

ద్వాదశరాశులకు ఆయాఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్థూలంగా పరికిద్దాం.

మేషరాశి
గురువుగారు చతుర్దంలోకి వచ్చిన మంచి ఫలితాలు రాహుకేతువుల ఈ మార్పుతో స్థిరీకరించ బడతాయి.ఎప్పటినుంచో బాధిస్తున్న సమస్యలు తొలగిపోవడం చూడవచ్చు.వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన మార్పులు కనిపిస్తాయి.పనిలో ఉత్సాహం ఎక్కువౌతుంది.ఆశావహమైన ఆలోచనలు కలుగుతాయి.నిరాశ దూరమౌతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శత్రుబాధ తగ్గుతుంది.మంచిపనులకు అకస్మాత్తుగా ఖర్చు చేస్తారు.

వృషభరాశి
వ్యాపారం వృద్ధి అవుతుంది.షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి.అనేక రకాలైన ప్లానులు వేస్తారు.సృజనాత్మకత విజ్రుంభిస్తుంది.సాంస్కృతిక కళా రంగాలలోని వారికి మంచికాలం మొదలౌతుంది.సంతానానికి మంచిరోజులు వస్తాయి.మంత్రసాధన,ఆధ్యాత్మికచింతనలు ఎక్కువౌతాయి.

మిధునరాశి
విద్యావృద్ధి కలుగుతుంది.గృహసౌఖ్యం పెరుగుతుంది.వాహనయోగం కలుగుతుంది.వృత్తిపరంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు.వృత్తిలో మార్పులు ఉంటాయి.దూరప్రయాణాలు జరుగుతాయి.ధనవృద్ధి సూచన ఉన్నది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

కర్కాటకరాశి
అధికారం పెరుగుతుంది.మాట చెల్లుబాటు అవుతుంది.ధైర్యం ద్విగుణీకృత మౌతుంది.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దగ్గర/దూర విదేశీప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

సింహరాశి
ఆకస్మిక ధనవృద్ధి.పిత్రార్జితం రావడం,రాదనుకున్న డబ్బు రావడం జరుగుతుంది.విద్యకోసం విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది.అకస్మాత్తుగా ఉద్రేకాలకు లోనుకావడం,దానివల్ల అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం, దానివల్ల అనర్దాలూ ఉంటాయి.కొంతమందికి తీవ్రమైన ఆధ్యాత్మికభావాలు ముప్పిరిగొంటాయి.

కన్యారాశి
ఉన్నట్టుండి వెలుగు కనిపిస్తుంది.ఎనర్జీ ఎక్కువౌతుంది.ఇంద్రియశక్తులు ఉన్నట్టుండి పెరుగుతాయి.మానసిక శక్తి వృద్ధి చెందుతుంది.ఉత్సాహం ద్విగుణీకృతమౌతుంది.శత్రువులు తగ్గుతారు.

తులారాశి
తండ్రిగాని తండ్రి సమానులు గాని ఉన్నట్టుండి మంచాన పడతారు.లేదా పరలోక యాత్రకు వెళతారు.ఏదో ఒక కారణంగా ఆస్పత్రి దర్శనం తరచూ కలుగుతుంది.ఊహించని ఖర్చులు బాగా పెరుగుతాయి.రహస్య ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి మెరుగౌతుంది.విదేశీ ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.శత్రువులు దూరమౌతారు.

వృశ్చికరాశి
పిత్రార్జితం అందుతుంది.స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది.జ్యేష్ట సోదరులకు మంచి జరుగుతుంది.సాంప్రదాయ ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.జీవితం లాభయుతంగా ఉంటుంది.కానీ ప్రతి లాభం వెనుకా ఒక నష్టం కూడా వెంటనే జరుగుతుంది.

ధనూరాశి
వృత్తిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి.ఎదుగుదల ఉంటుంది. అయితే త్రిప్పటా,చికాకూ కూడా పక్కపక్కనే ఉంటాయి.ఉద్యోగ పరంగా ఎక్కువగా ఊళ్లు తిరగవలసి వస్తుంది.దాని ఫలితంగా గృహసౌఖ్యం తగ్గిపోతుంది.మానసికచింత పట్టి పీడిస్తుంది.దానిని అధిగమించడానికి దైవసంబంధ విషయాల ఆసరా తీసుకుంటారు.

మకరరాశి
ఇన్నాళ్ళూ ఇంటిలో పీడిస్తున్న చికాకులు దూరం కావడం చూస్తారు.ధైర్యం పెరుగుతుంది.కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.దూరప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.కొందరికి సాధనలో సిద్ధి కలుగుతుంది.

కుంభరాశి
మానసిక చింత ఎక్కువౌతుంది.కంటి వ్యాధులు పీడిస్తాయి.గృహసౌఖ్యం తగ్గుతుంది.కమ్యూకేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి.మాట తడబడుతుంది. సంతానం దూరమౌతుంది. రహస్య ఆధ్యాత్మిక చింతనలో సేదదీరుతారు.

మీనరాశి
శత్రువులు బలపడతారు.ఎదుటివారి ప్లానులకు ఇష్టం లేకున్నా తలొగ్గవలసి వస్తుంది.కాని చివరకు అంతా మంచే జరుగుతుంది.బాధ్యతలు పెరుగుతాయి.తనవారికి కాలం కలసి వస్తుంది.దూరప్రయాణాలు ఉంటాయి.కొందరికి స్థలమార్పు సూచితం అవుతున్నది.దీర్ఘరోగాలు విజ్రుంభిస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.తొందరపడి నిర్ణయాలు తీసుకుని మోసపోతారు.జీవితభాగస్వామిలో చురుకుదనం పెరుగుతుంది.

ఈ ఫలితాలు గమనించడానికి 13-7-2014 వరకూ ఆగనక్కర లేదు.ఇప్పటికే ఆయా దిశలలో మార్పులు కలుగుతూ ఉండటం గమనించండి.