“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, జులై 2014, శనివారం

ముందే చెప్పొచ్చు కదా?

మలేషియా విమానం MH 17 కూలిపోయిన సంఘటన గురించి వ్రాశాక నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి.

నాకు దాదాపు ప్రతిరోజూ చాలామంది నుంచి ఇలాంటి మెయిల్స్ వస్తుంటాయి.

'మీరు ఏదైనా సంఘటన జరిగిన తర్వాత జ్యోతిష్య పరంగా వ్రాస్తారు.ముందే చెప్పొచ్చు కదా.ఆపద జరగకుండా నివారించవచ్చు కదా?' అని వాటిలో వ్రాస్తుంటారు.

కొంతమంది బాగా దగ్గర మిత్రులు కూడా ఇదే విషయాన్ని అడుగుతూ ఉంటారు.

వాళ్ళ అమాయకత్వానికి నాకు జాలీ కలుగుతుంది.నవ్వూ వస్తుంది.

కర్మసూక్ష్మాలు ఎలా ఉంటాయో తెలియక వారు అలా మాట్లాడుతూ ఉంటారు.బాధితుల మీద జాలితో అలా మాట్లాడుతూ ఉంటారు.అందుకే వారిపైన నాకు కోపం రాదు.

వారికి తెలియని కొన్ని విషయాలున్నాయి.ఆ విషయాలను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను.

వ్యక్తిగత జీవితాలలో జరగబోయేది ముందుగా ఊహించవచ్చు.దానిని తప్పుకోడానికి రెమేడీలు చేసుకుని తప్పుకోవచ్చు.ఇలాంటివి కొన్ని వేలు నేను నా జీవితంలో కాని,నా సన్నిహితుల జీవితాలలో కాని ఎన్నోసార్లు చేశాను.కాని అలాంటి రెమేడీలను చెప్పినా కూడా అందరూ చెయ్యలేరు.ఇది వినడానికి వింతగా ఉంటుంది కాని-- పచ్చినిజం.అలా రెమేడీలు చెయ్యాలంటే కూడా ఆ జాతకునికి కొన్ని అర్హతలు ఉండాలి.

నిన్న విమాన ప్రమాదంలో కూడా ఒక కుటుంబం రక్షించబడింది.వాళ్ళు అదే విమానంలో ప్రయాణించాలని విమానాశ్రయానికి వచ్చారు.కాని వారికి సీట్లు లేనందువల్ల ఇంకొక విమానంలో టికెట్లు ఇవ్వబడ్డాయి.ముందు వారుకూడా 'ఈ విమానం మిస్సయిందే' అని బాధపడ్డారు.ఈ ప్రమాదం జరిగాక దిమ్మెరపోయి,తమను కాపాడిన ఏదో శక్తిని తలచుకొని ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నారు. కర్మసూత్రాలు ఇలా ఉంటాయి.

సామూహికంగా జరగబోయేవి కూడా ముందుగా ఊహించవచ్చు.కాని వాటిని తప్పించలేము.సామూహిక దృఢకర్మను తప్పించడం చాలా కష్టం.కష్టం అనే మాటకు అర్ధం- 'చెయ్యలేమని' కాదు.చెయ్యవచ్చు.కాని దానికి పరిహారంగా త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చే మనుష్యులు ఎక్కడున్నారు?

కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ప్రకృతి నియమం.ప్రకృతిలో జాలి అనేది లేదు.నియమం(Law) మాత్రమే ఉన్నది.ఒకరి ప్రాణాన్ని కాపాడాలంటే ఇంకొకరు తమ ప్రాణాన్ని అర్పించాలి.అక్కడ ఆ సమయంలో ఆపరేట్ అవుతున్న కర్మనియమాన్ని (Karmic Law) తృప్తి పరచాలి.అలా చేసేవారు ఎవరున్నారు?ఈ ప్రపంచం మొత్తంలో అలాంటివాళ్ళు ఒక్కరూ లేరు.అందరూ ఉత్త మాటలు చెప్పే స్వార్ధపరులే గాని ఒకరికోసం తమ ప్రాణాన్ని అర్పించే నిస్వార్ధపరులు ఎవరున్నారు?

మాటలు మాత్రం తేలికగా చెప్పవచ్చు గనుక ఎన్నైనా చెబుతారు.అదే నిజజీవితంలో అయితే ఎంగిలి చేతితో కాకిని కూడా విదిలించరు.కొన్ని మెతుకులు దానికి పోతాయేమో అని. 

కొన్నేళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదాహరణను చెబితే విషయం బాగా అర్ధమౌతుంది.

ఇదే పాయింట్ మీద చాలాసార్లు అడిగి వాదించే సన్నిహితుడైన పెద్దమనిషి ఒకాయన ఉండేవాడు.ఆయన కూడా ఇదే విషయం మీద ఎన్నోసార్లు నన్ను గతంలో ప్రశ్నించాడు.చాలాసార్లు కర్మతీరు ఎలా ఉంటుందో అతనికి ఎంతో ఓపికగా వివరించేవాడిని.కాని అతను ఒప్పుకునేవాడు కాదు.చాలామంది ఇలాగే ఒప్పుకోలేరు.చాలాసార్లు ఇలా మొండిగా వాదించేవారిలో పచ్చి స్వార్ధం దాగి ఉంటుంది.అదే వారిచేత అలా మాట్లాడిస్తుంది.

ఒక చెడు జరుగబోతున్నపుడు ముందే తెలుసుకుని తప్పిస్తేనే జ్యోతిష్యం యొక్క ఉపయోగం.లేకుంటే అది దండగ అని ఆయన మూర్ఖంగా వాదించేవాడు.తెలుసుకున్నంత మాత్రాన తప్పించడం సాధ్యం కాదు దాని వెనుక చాలా లెక్కలుంటాయి అని ఎంత చెప్పినా అర్ధం చేసుకునే వాడు కాదు.డబ్బుతో ఏదైనా చెయ్యవచ్చు అనే అహం అతనిలో బాగా ఉండేది. డబ్బులు పడేసి రెమేడీలు చేయిస్తే సరిపోతుంది అనుకునేవాడు.కొన్నికొన్ని సార్లు డబ్బులు ఉన్నా పనులు కావు,కర్మ నియమాలు నీ డబ్బుకు లొంగవు అని ఎంత చెప్పినా అతనికి అర్ధం అయ్యేది కాదు. 

ఇతనికి ప్రాక్టికల్ ఉదాహరణతో చూపిస్తే గాని అర్ధం కాదనుకుని నేనూ నవ్వుతూ ఊరుకునేవాడిని.

ఒకసారి ఏదో సందర్భంగా వాళ్ళ అల్లుడి జాతకం నాకు చూపించాడు.అది పరిశీలించినప్పుడు,ఇన్నాళ్ళూ అతను దేనినైతే అడుగుతున్నాడో దానిని ఇతనికి అర్ధమయ్యేలా చేసే సమయం వచ్చిందని నాకు అర్ధమైంది.

ఆ అల్లుడికి త్వరలో ఒక యాక్సిడెంట్ జరగబోతున్నదని జాతకంలో సూచన ఉన్నది.అదే విషయం అతనితో చెప్పాను.

అతను యధాప్రకారం ఊహించినట్లే అన్నాడు.

'దీనిని తప్పిస్తేనే మీ జ్యోతిష్యాన్ని నమ్ముతాను'

నేను నవ్వుతూ ఇలా అన్నాను.

'తప్పిస్తే ఎలా నమ్ముతారు?తప్పిపోతే,అసలు అది రాసిపెట్టి ఉన్నదో లేదో మనకు ఎలా తెలుస్తుంది? జరిగితేనే కదా తెలిసేది.ప్రతిరోజూ మనకు అనేకం తప్పిపోతుంటాయి.కాని మనం దైవానికి కృతజ్ఞతలు చెప్పడం లేదే? జరగకపోతే నా గొప్ప.జరిగితే నీ తప్పు అనేగా మనం దేవుడిని అనేది?' అన్నాను.

అతను కాసేపు ఆలోచించాడు.

'అలా కాదు.మీరు చెప్పినట్లు యాక్సిడెంట్ జరగబోయే పరిస్థితి ఎదురు కావాలి.అంటే, 'ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది' అని చూచేవారికి అందరికీ తెలియాలి.ఇక అయిపొయింది.యాక్సిడెంట్ తప్పదు.అన్న సీన్ క్రియేట్ కావాలి.అప్పుడు అది జరగకుండా తప్పిపోవాలి.అలా జరిగితే మీరు చెప్పినది నమ్ముతాను' అన్నాడు.

నాకు భలే నవ్వొచ్చింది.

మనుష్యులు తెలివితెటలలో నక్కను కూడా మించిపోయారు.కాని ఎంత అతితెలివి సంపాదించినా ప్రకృతినియమాలను వారు తప్పుకోలేరు.

'అంటే.ఏది ఎలా జరగాలో దేవుడినీ ప్రకృతినీ కూడా నిర్దేశించేటంత అహంకారం మీలో పెరిగిపోయిందన్న మాట' అన్నాను.

'మీరేమైనా అనుకోండి.ఇలా జరిగితేనే నేను నమ్ముతాను.లేకుంటే మీ కబుర్లు నేను నమ్మను' అన్నాడు.

'మీరు నమ్మకపోతే నాకు వచ్చిన నష్టం ఏమీలేదు.మిమ్మల్ని నమ్మించవలసిన అవసరమూ నాకు లేదు' అన్నాను.

'అలా అని తప్పించుకోవాలని చూడకండి' అన్నాడు తెలివిగా.

'సరే.మీ అల్లుడికి జరగబోయే ప్రమాదాన్ని తప్పించాలంటే మీరు కొన్ని రెమేడీలు చెయ్యవలసి ఉంటుంది.' అన్నాను.

'చేస్తాను.దానిదేముంది?ఎంత అవుతుంది?' అన్నాడు డబ్బు అహంకారంతో.

'తొందరపడకండి.దీనికి డబ్బుతో పనిలేదు.మీరే దీనిని చెయ్యాలి.అదికూడా ఎక్కడో దూరంగా కాదు,నా ముందే చెయ్యాలి' అన్నాను.

అతను వింతగా చూచాడు.

'ఎప్పుడో చెప్పండి?' అడిగాడు.

'ఎప్పుడో ఎందుకు.ఇప్పుడే చేద్దాం.అయితే మీరు సిద్ధమేనా మరి?' అన్నాను.

'సిద్ధమే' అన్నాడు.

'మళ్ళీ తర్వాత వెనక్కు పోకూడదు.' అన్నాను సీరియస్ గా.

'అది మా వంశం లోనే లేదు' అన్నాడు పౌరుషంగా.మాటమాటకూ వాళ్ళ వంశాన్ని గుర్తుచేసుకుని మీసాలు మేలేసే కులం వారిది.

'సరే.ఉండండి.' అని ఆయన చేతికి ఒక చాకూ బాటిలూ ఇచ్చాను.

'ఇదేంటి?' అంటూ అయోమయంగా చూస్తున్నాడు.

'కంటికి కన్ను పంటికి పన్ను అనేది ప్రకృతి నియమం.మీ అల్లుడికి జరుగబోయే ప్రమాదం తప్పించాలంటే మీరు దానికి బలి కావాలి.మీ త్యాగం మీ అల్లుణ్ణి రక్షిస్తుంది.ప్రకృతి నియమాన్ని తృప్తి పరుస్తుంది.' అన్నాను.

'ఏం చెయ్యాలి?' అన్నాడు.

'ఈ చాకుతో మీ కుడిచేతి మోచెయ్యి గుంతలో లోతుగా గుచ్చి కోసుకోండి.ఆ వచ్చే రక్తాన్ని ఈ బాటిల్లో పట్టి నా ముందు పెట్టండి' అన్నాను. 

అతను బిత్తరపోయాడు.

'ఇదేంటి? ఇదేం రెమెడీ? రెమెడీ అంటే మీరేదో పూజ చేయిస్తారనో,మొక్కులు మొక్కిస్తారనో అనుకున్నాను.ఇదేంటి ఘోరం?' అన్నాడు.

'ఘోరాన్ని ఆపడానికి ఘోరమే చెయ్యాలి.తప్పదు.ఇది పూజ కాదని ఎవరన్నారు?కమాన్ కానివ్వండి.' అన్నాను.

అతను నా ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.

'ఇది నేను చెయ్యలేను.'అన్నాడు.

'ఎందుకని?' అనడిగాను.

'సపోజ్ నేను ఇది చేశాననుకోండి.మా అల్లుడికి ఏమీ జరగదు కదా?' అన్నాడు.

'జరగదు.దానికి నేను హామీ ఇస్తున్నాను' అన్నాను.

'మరి ఏమీ జరక్క పోతే నాకు ఎలా తెలుస్తుంది?' అన్నాడు.

'అదే మరి ఇందాకటి నుంచీ నేను చెబుతున్నది.అంటే జరిగితేనే మీరు నమ్ముతారు.తప్పిపోతే మీరు నమ్మరు అంతే కదా?అయినా మీ అల్లుడి కోసం మీ రక్తాన్ని కొంత ఇవ్వలేరా?' అన్నాను.

'అలా కాదు.నేను చెప్పినట్లుగా,నాకు అర్ధమయ్యేటట్లుగా తప్పిపోవాలి. అదేగా నేనూ చెబుతున్నది.' అన్నాడు మొండిగా.

'అలాగే తప్పిపోతుంది.మీకు అర్ధమయ్యేటట్లే తప్పిపోతుంది.కానివ్వండి' అన్నాను.

అనుమానంగా చూచాడు.

'సారీ సార్.నేనిది చెయ్యలేను.' అన్నాడు చాకు పక్కన పెడుతూ.

'అంటే మీ అల్లుడు ఏమై పోయినా మీకు పరవాలేదా?' అన్నాను అతన్ని రివర్స్ లో ఉడికిస్తూ.

అతనికి చాలా కోపం వచ్చింది.

'మీరు కాకపోతే లక్షమంది జ్యోతిష్కులున్నారు.వాళ్ళను అడుగుతాను. ఇలాంటి రాక్షస రెమేడీలు నేను చెయ్యలేను.' అంటూ విసురుగా లేచాడు.

'అవును.రాక్షస రెమేడీలు చెయ్యలేరు.కానీ రాక్షసపు వృత్తి మాత్రం చెయ్యగలరు.అంతేగా?' అడిగాను ఇంకా తనని వెర్రెక్కిస్తూ.

అతను ఫైనాన్స్ బిజినెస్ (వడ్డీ వ్యాపారం) చేస్తూ ఉంటాడు.రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది.ఈ రెండు వ్యాపారాలలో జరిగేది పచ్చిమోసం చెయ్యడమూ,ఎదుటి మనిషి రక్తాన్ని జలగలా పీల్చడాలేగా?

అతను విసురుగా వెళ్ళిపోయాడు.

తర్వాత కొన్నాళ్ళకు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

వాళ్ళ అల్లుడు కారు డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళుతున్నాడు.విండో గ్లాస్ కిందకు దించి మోచేతిని అందులోనుంచి బయటకు పెట్టి ఒక చేతితో కారు డ్రైవ్ చేస్తున్నాడు.పక్కనుంచి ఒక లారీ పోతూ ఆ మోచేతిని కొట్టేసి వెళ్ళిపోయింది.ఎముక విరిగి బయటకు పొడుచుకుని వచ్చింది.కొన్నాళ్ళు అతన్ని ఆస్పత్రిలో ఉంచి కాంప్లికేషన్స్ పెరిగిపోతుంటే మోచెయ్యి వరకూ చేతిని తీసేశారు.

ఆ తర్వాత కూడా ఆ మామగారు కొన్ని సార్లు నాకు కనిపించేవాడు.కాని నాతో మాట్లాడేవాడు కాదు.కోపంగా చూస్తూ వెళ్ళిపోయేవాడు.నేను నవ్వుకుని ఊరుకునేవాడిని.

ఆయన కోపానికి అర్ధం ఏమిటంటే--'నాకు ఇంతకంటే సింపుల్ రెమెడీ ఏదో తెలుసనీ,అది తెలిసి కూడా నేను చేయించలేదనీ,కావాలనీ అలాంటి పరీక్ష పెట్టి ఆయన్ను ఉడికించాననీ,ఆయన చెయ్యలేని ఒక పనిని రెమెడీగా చెప్పి తప్పుకున్నాననీ,తత్ఫలితంగా వాళ్ళ అల్లుడికి చెయ్యి పోయిందనీ'--ఆయన అనుకునేవాడు.

ఎవరో జ్యోతిష్కులనడిగి రుద్రాభిషేకాలూ ఇంకా ఏవేవో రెమేడీలు ఆయన చేయించే ఉంటాడు.కాని అవేవీ పనిచెయ్యలేదు.వాటి దారి వాటిదే.కర్మ దారి కర్మదే.

ఈ మధ్యనే ఆయన చనిపోయాడని కొందరు మిత్రుల ద్వారా తెలిసింది.

రెమేడీలు ఎలా ఉండాలో మనం నిర్ణయించకూడదు.అవి ఎలా ఉన్నా సరే చేసే ధైర్యం మనలో ఉండాలి.అప్పుడే ప్రకృతిని ఎదుర్కోనగలుగుతాం.కర్మను మార్చగలుగుతాం.ఒక్కొక్కసారి ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఇంకొక ప్రాణాన్ని బలి చెయ్యవలసి వస్తుంది.అదే దానికి రెమెడీ.

ఉదాహరణకు నిన్న జరిగిన మలేషియా విమానం ప్రమాదంలో 298 మంది చనిపోయారు.వారిని రక్షించి ఉంటె బాగుండేది అని చాలామందికి అనిపిస్తుంది.అందులో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు.కనీసం వారినైనా రక్షించి ఉంటె బాగుండేది.పాపం చిన్నపిల్లలు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది.

కాని ప్రకృతి నియమాలు వేరుగా ఉంటాయి.కర్మరహస్యాలు చాలా గహనమైనవి.మనం ఇప్పుడు కనిపిస్తున్న సీన్ మాత్రమె చూస్తున్నాం. గతంలో ఏం జరిగిందో,దేని ప్రతిక్రియగా ఇది ఇప్పుడు జరిగిందో మనకున్న స్వల్పదృష్టితో మనం చూడలేం.

ప్రేక్షకుడికి ఇప్పుడు చూస్తున్న ఒక్క సీన్ మాత్రమే కనిపిస్తుంది.కాని దర్శకుడికి అన్ని సీన్లూ తెలుస్తాయి.జరిగినవీ జరగబోయేవీ కూడా తెలుస్తాయి.అందుకే ఏం జరిగినా అతను చలించడు.కానీ మొత్తం సీన్లు అన్నీ తెలియని ప్రేక్షకుడు ఆ ఒక్క సీన్ మాత్రమే నిజం అనుకుని చలించి పోతాడు.ఏడుస్తాడు.కానీ స్క్రిప్ట్ మొత్తం తెలిసినవాడు ఏడవడు. నవ్వడు. చలించడు.

ఒక పిల్లవాడి తల్లి ఆ పిల్లవాడిని స్కూలుకు తయారు చేస్తూ బూట్లు తొడిగింది.కాని ఒక షూలో తేలు ఉన్న విషయం ఆమె చూచుకోలేదు.ఆ తేలు ఆ పిల్లవాడిని కుట్టింది.అలా కుడుతూనే ఉంది.చివరకు ఆ పిల్లవాడు స్కూలులో స్పృహతప్పి పడిపోయాడు.చనిపోయాడు.తేలు కూడా చనిపోయింది.

పిల్లవాని తల్లి స్వామి చిన్మయానంద శిష్యురాలు.ఆమె ఆయనను ఈ ఘోరం విషయమై ప్రశ్నించింది.

ఆయన ఇలా అన్నారు.

'నీ పిల్లవాని ప్రాణం పోయిందని నీవు బాధపడుతున్నావు.మరి తేలు ప్రాణం కూడా పోయింది కదా? దానిగురించి నీవు బాధపడవెందుకు?ఏ జీవి ప్రాణమైనా ప్రాణమేగా?ఇందులో ఒకటి ఎక్కువా ఒకటి తక్కువా ఎలా అవుతుంది?'

పిల్లవాడు 'తన' కనుక తనకు బాధ కలిగింది.తేలు ప్రాణానికి మన దృష్టిలో ఏమాత్రం విలువ లేదు కనుక అది పనికిరాని జీవి అయింది.కాని ప్రకృతి దృష్టి మన దృష్టిలాగే ఉండాలని నియమం ఏమీ లేదు.ప్రకృతి దృష్టిలో రెండు ప్రాణాలూ సమానమే.ప్రకృతి ఇచ్చే తీర్పు విభిన్నంగా ఉంటుంది.అదే ఆ తేలు తల్లి అక్కడ ఉంటే, తన పిల్లతేలు ప్రాణం పోయిందని అదీ కంప్లెయింట్ చేసేది.దానికి పిల్లతేలు ప్రాణమే ముఖ్యం.పిల్లవాడి ప్రాణం ముఖ్యం కాదు.

మన దృష్టి సంకుచితంగా ఉన్నపుడు ఆ కొంచమే కనిపిస్తుంది.అదే దృష్టి విశాలం అయినప్పుడు సమస్తమూ దర్శనమిస్తుంది.మనం అర్ధం చేసుకోలేకపోతే ప్రకృతి నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి.అదే అర్ధం చేసుకుంటే వాటిల్లో విచిత్రం ఏమీ ఉండదు.సమన్యాయమే అక్కడ మనకు దర్శనమిస్తుంది.

ప్రమాదంలో పడి ప్రాణాలు పోగొట్టుకోబోయే వారిని రక్షించవచ్చు.కాని ప్రాణానికి ప్రాణం అర్పించాలి.అలా చెయ్యగలిగితే వారిని కాపాడవచ్చు.మరి నాకు మెయిల్స్ ఇచ్చేవారిలో ఎందరు ఆ పని చెయ్యడానికి ముందుకొస్తారు?

అయ్యోపాపం అని మీకంత జాలి ఉంటే,వారి ప్రాణానికి మీప్రాణం అడ్డు వెయ్యండి.అప్పుడు వారిని కాపాడవచ్చు.అది మాత్రం కుదరదు.మెయిల్ ఇవ్వడం తేలిక గనుకా,ఖర్చులేని పని గనుకా,ఏమీ తోచడం లేదు గనుకా, ఎన్నైనా ఇస్తారు.

జ్యోతిష్యజ్ఞానం సత్యమైనది.రెమెడీలు కూడా సత్యములే.కానీ మానవ స్వభావమే సంకుచితమైనది.మనకు తెలిసిన లాజిక్కే సర్వస్వం అని అనుకోవడం మానవుని అహంకారం.ప్రకృతి నియమాలను ధిక్కరించగలను అనుకోవడం కూడా అంతే.

ప్రాచీనమైన మానవ మనస్తత్వంలోని మోసకారితనాన్నీ స్వార్దాన్నీ అహాన్నీ ఎవరు మార్చగలరు?