“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, జులై 2014, ఆదివారం

విమానయాన రంగానికి అత్యంత చెడు వారం

జూలై 2014 లో ఒక్క వారంలో మూడు భయానకమైన విమాన ప్రమాదాలు జరిగాయి.అదే పోయినేడాది రెండు మిలియన్ల ఫ్లైట్స్ లో ఈ స్థాయి ప్రమాదాలు ఒకటి కంటే తక్కువ జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. 

కనుక ఇది కాకతాళీయం కాదు.వీటి వెనుక మనకు అంతుబట్టని కారణాలు ఉన్నాయని అర్ధం కావడం లేదూ?

మానవప్రయత్న పరంగా తీసుకునే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయంటే అది కూడా ఒక్క వారంలో మూడు ప్రయాణీకుల విమానాలు కూలిపోయాయంటే ఆ వారానికి ఏదో ప్రత్యేకత ఉండాలి.

జ్యోతిష్య పరంగా ఈ వారపు ప్రత్యేకత ఏమిటో చూడబోయే ముందు ప్రపంచ సమాజం ఉద్దేశ్యం ఏమిటో,ఈ సంఘటనలను అది ఎలా తీసుకుంటున్నదో చూద్దాం.

Less than one in 2 million flights last year ended in an accident in which the plane was damaged beyond repair, according to the International Air Transport Association. That includes accidents involving cargo and charter airlines as well as scheduled passenger flights.
"One of the things that makes me feel better when we look at these events is that if they all were the same type event or same root cause then you would say there's a systemic problem here, but each event is unique in its own way," said Jon Beatty, president and CEO of the Flight Safety Foundation, an airline industry-supported nonprofit in Alexandria, Virginia, that promotes global aviation safety.
(Courtesy: Yahoo News @ http://news.yahoo.com/very-bad-week-airline-disasters-come-cluster-203017512--finance.html)
అసలు విషయం వారికి తెలియదు గనుక,ఫ్లైట్ సర్వీసులు పెరిగే కొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతాయి అన్న నిశ్చయానికి వారు వచ్చారు.కాని అది నిజం కాదు.ఎన్ని సర్వీసులు పెరిగినా,వారు పాటించే సేఫ్టీ రూల్స్ ఏమాత్రం మారవు.వాటిలో తేడాలు రావు.ఒక్క ఫ్లైట్ నడిపినా వంద ఫ్లైట్స్ నడిపినా అవే జాగ్రత్తలు ప్రతిదానికీ తీసుకుంటారు.కనుక కారణం అది కాదు.
వారికి అర్ధం కాని కారణాలూ వారికి అంతు చిక్కని కారణాలూ ఏవో ఈ సంఘటనల వెనుక ఉన్నాయి.ఆ కారణాలు ఏమిటో గత నెలనుంచీ నేను సూచిస్తూనే ఉన్నాను.అయితే జ్యోతిష్య శాస్త్రాన్నీ మానవులపైన గ్రహాల ప్రభావాన్నీ నమ్మనివారు నా విశ్లేషణను ఎగతాళి చెయ్యవచ్చు.అది వారిష్టం.దానివల్ల నాకు వచ్చిన నష్టమూ లేదు.వాళ్ళ విమర్శల వల్ల నేను ఉడుక్కునేదీ లేదు.నేను చెబుతున్నది సత్యమే అని నాకు తెలుసు గనుక ఎవరేమనుకున్నా నేను లెక్కచెయ్యను.అలాంటివారితో వాదించి నా సమయం వృధా చేసుకోను.వారికి అసలు జవాబే చెప్పను.
ఇప్పుడు విషయంలోకి వద్దాం.
జూలై 18 న ఇదంతా మొదలైంది.
>>ఆ రోజున మలేషియా విమానం ఉక్రెయిన్ గగనతలం మీద ప్రయాణిస్తున్నపుడు కూల్చివెయ్యబడింది.ఇందులో 298 మంది చనిపోయారు.
>>జూలై 23 బుధవారం నాడు ట్రాన్స్ ఏషియా ఎయిర్ వేస్ విమానం ఒకటి తైవాన్ లో కూలిపోయింది.ఇందులో 48 మంది చనిపోయారు.20 మంది వరకూ గాయపడ్డారు.దీనిలో నేలమీద పోతూ ఉన్నవారు కూడా ఒక అయిదుగురు ఉన్నారు.
>>ఒక్కరోజు తర్వాత, అంటే జూలై 24 న అల్జీరియా విమానం కూలిపోయి 116 మందిని పరలోకానికి పంపింది.
అంటే జూలై 18 నుంచి 24 లోపు మూడు విమానాలు విచిత్రమైన పరిస్థితులలో కూలిపోయాయి.పైగా మూడూ ప్రయాణీకుల విమానాలే.
ఇదంతా గమనిస్తుంటే,దీనివెనుక మనకు కనిపించని శక్తుల బలీయమైన ప్రభావం ఉన్నట్లు తోచడం లేదూ?ఖచ్చితంగా అనిపిస్తుంది.ఏ విధమైన బయాస్ లేకుండా ఓపన్ మైండ్ తో ఆలోచించే వారికి ఈ సంఘటనల వెనుక ఏదో ఉన్నట్లే తోస్తుంది.అది నిజం కూడా.
ఆయా విమానాలు టేకాఫ్ అయిన సమయం తీసుకుని ఆ సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూడవచ్చు.అలా చూస్తె ఖచ్చితంగా ప్రమాద ఘంటికలు మ్రోగినట్లు కనిపిస్తుంది.అది మామూలుగా అందరూ చేసే పద్ధతి. ఈ సారి అలా చెయ్యబోవడం లేదు.
గోచారపరంగా ఖగోళపరంగా ఈ వారంలో ఏయే గ్రహస్థితులు ప్రబలంగా ఉన్నాయో మాత్రమే ఈ పోస్ట్ లో సూచిస్తాను.
ఇప్పుడు జ్యోతిష్యపరంగా ఈ వారపు ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
ఆషాఢమాసాన్ని మన సాంప్రదాయంలో శూన్యమాసం అంటారు.కనుక శూన్యం లేదా అంతం చేసే లక్షణం ఈ మాసానికి ఉంటుంది.ఈ మాసంలో పుట్టినవారు లౌకికంగా కంటే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు.దానికి కారణం కూడా ఇదే.వారు శూన్యత్వాన్ని(పూర్ణత్వాన్ని) కోరుకుంటారు. గురుపూర్ణిమ కూడా ఇదే మాసంలో వస్తుంది.
అలా అయితే ప్రతి ఏడాదీ వచ్చే ఆషాఢమాసంలో ఏవో ఒకటి ఇలాగే జరగాలి కదా?అని కొంతమందికి అనుమానం రావచ్చు.అది నిజమే.ప్రతి ఏడాదీ అలా ప్రమాదాలు జరగవు.మరి ఇప్పటి ప్రత్యేకత ఏమిటి?
ఇప్పుడు నడుస్తున్న శపితయోగమే ప్రత్యేకత.ఈ ఇంద్రజాలం అంతా రాహువు,శని,కుజులవల్ల నడుస్తున్నది.ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలన్నీ కూడా వీరు చేస్తున్న కర్మక్షాళనా విధానాలే.వారు ప్రతి ఏడాదీ ఆషాఢమాస సమయంలో ఇదే స్థితులలో ఉండరు.ప్రస్తుతం ఉన్నారు.అదే ప్రత్యేకత.
ఈ ఆషాఢ మాసంలో కూడా మళ్ళీ జూలై 18-24 వారానికి ఎలాంటి ప్రత్యేకత వచ్చిందో చూద్దాం.
ఇది 18-7-2014 గ్రహస్థితి.ఇక్కడ లగ్నాన్ని లెక్కించనవసరం లేదు. గ్రహస్థితులను మాత్రమే గమనిద్దాం. రాహువూ కుజుడూ శనీశ్వరుడూ పక్కపక్కనే ఉన్న రాశులలో వరుసగా ఉన్నారు.కుజుడు ఇప్పుడే రాహువును వదలి శనీశ్వరుని వైపు ప్రయాణిస్తున్నాడు.అంటే రాహువూ శనీశ్వరుల మధ్యన కుజుడు బందీ అయ్యాడు.ఇలాంటి స్థితినే పాపార్గలం అని జ్యోతిష్య శాస్త్రంలో అంటారు.ఈ స్థితి కుజుని వంటి పౌరుష గ్రహానికి చాలా చికాకును కలిగిస్తుంది.అందుకే ఎక్కడ చూచినా యాక్సిడెంట్లూ దుర్ఘటనలూ జరుగుతున్నాయి.కుజశనులు ఇద్దరూ వాయుతత్వరాశిలో ఉండటం వల్ల వాయుయానప్రమాదాలు జరుగుతున్నాయి.

శనీశ్వరుడు నవాంశలో నీచస్థితిలో ఉన్నాడు.అంటే కుజస్థానంలో ఉన్నాడు.కనుక ఆయనకూడా చాలా అసహనంగా చికాకుగా ఉన్నాడు. కుజశనులు ఇద్దరూ కలిస్తే ప్రమాదాలు జరుగుతాయని నేను కనీసం మూడేళ్ళక్రితం నుంచీ అనేక పోస్ట్ లలో వ్రాస్తూ ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలను ఉదాహరణలుగా చూపిస్తూ రుజువు చేస్తూ వస్తున్నాను.కావాలంటే పాత పోస్ట్ లు ఒకసారి చూడండి.

ఇప్పుడుకూడా వారిద్దరూ చాలా చికాకుగా అసహనంగా ఉన్నారు.పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లు రాహువు ప్రభావం వారికి తోడయ్యింది.అందుకే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇది 23-7-2014 కుండలి.ఇక్కడ కొచ్చేసరికి అమావాస్య దగ్గరకు వస్తున్నది.అదొక విపరీత ప్రభావం.కుజుడు తన గమనంలో శనికి దగ్గర అవుతున్నాడు.కానీ ఈ కుండలిలో శనీశ్వరుడు వక్రస్థితి నుంచి బయటకు వచ్చేశాడు. అందుకే ఈ రోజు జరిగిన ప్రమాదంలో గత ప్రమాదంలో జరిగినంత జననష్టం జరగలేదు.దీనిని చక్కగా గమనించాలి.

ఇది 24-7-2014 కుండలి.ఇందులో శుక్ర నెప్త్యూన్ల(వరుణగ్రహాల)మధ్యన ఖచ్చితమైన కోణదృష్టి ఉన్నది. అందుకే విమానం ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని ప్రమాదానికి గురయింది.
అదీగాక 28-6-2014 నుంచి యురేనస్ శనీశ్వరుల మధ్యన ఖచ్చితమైన షష్టాష్టక దృష్టి నెలకొని ఉన్నది.కనుక ఘోరమైన హటాత్ ప్రమాదాలు జరిగే అవకాశం బలంగా ఏర్పడింది.శనీశ్వరుడు వాయుతత్వ రాశిలోనూ యురేనస్ జలతత్వ రాశిలోనూ ఉండటం వల్ల ఈ రెండు మహాభూతాలకు చెందిన ప్రమాదాలే జరుగుతున్నాయి.ఈ యోగం వల్ల ప్రమాదాలలో పొగమంచు ఎదురుగా ఉండటమూ,వానల వల్ల ల్యాండింగ్ కుదరక పోవడమూ మొదలైన ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.తైవాన్ విమాన ప్రమాదంలో జరిగింది అదే.

యురేనస్ శనీశ్వరుల మధ్యన జూన్ 26 నుంచీ కొనసాగుతున్న ఖచ్చితమైన షష్టాష్టక స్థితి వీటన్నిటికీ అతి ముఖ్యమైన కారణం.ఆషాఢ మాసమూ,అమావాస్య ప్రభావమూ,శుక్ర నెప్ట్యూన్ల మధ్య ఖచ్చితమైన దృష్టీ,శనిరాహుకుజుల విచిత్ర శపితయోగమూ ఈ వారంలో జరిగిన అన్ని ప్రమాదాలకూ అసలైన కారణాలు.

ఒక గ్రహస్థితి వల్ల ఇదంతా జరగలేదు.అనేక యోగాలు ఆ సమయానికి కూడి వచ్చి ఒక compounding effect గా రూపుదిద్దుకున్నాయి.ఆ సామూహిక గ్రహప్రభావం వల్ల ఈ సామూహిక జనహననమూ దుర్ఘటనలూ జరిగాయి.చూచారా ఎంత విచిత్రంగా సరిపోయిందో?

మనల్ని గమనిస్తూ,మన కర్మలకు తగినట్లు ఫలితాలను ఇస్తున్న శక్తి ఒకటున్నదని ఇదంతా చూస్తుంటే అర్ధం కావడం లేదూ?అలా అర్ధమైతే జ్యోతిష్య శాస్త్రపు ప్రయోజనాల్లో ఒకటి నెరవేరినట్లే.

చాలామంది 'వీటిని ముందుగా తెలుసుకుంటే తప్పించుకోవచ్చు కదా!' అనుకుంటారు.

అలా సాధ్యం కాదు.తెలుసుకున్నంత మాత్రాన అన్నీ తప్పవు.కర్మలలో తేడాలున్నాయి.అన్ని కర్మలూ ఒకటి కావు.ధృఢకర్మ అయినప్పుడు అది తప్పదు.మిగిలిన కర్మలను మాత్రమే తప్పించగలం.

అందుకే కొన్ని జాతకాలలో -'నీకు ఎన్ని రెమెడీలు చేసినా ప్రయోజనం లేదు.అనుభవించక తప్పదు.కనీసం ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా కొత్తకర్మ పోగుచేసుకోకుండా ప్రస్తుతకర్మను శరణాగత భావంతో సమర్పణాభావంతో అనుభవించు' అని చెబుతూ ఉంటాను.

ఇంతకంటే ఆ జాతకాల్లో మార్గం ఉండదు.పూర్వకర్మ అతి బలీయంగా ఉన్నప్పుడు ఫలితం నుంచి తప్పుకుందామంటే అది సాధ్యమయ్యే పని కాదు.కొన్ని కర్మలను అనుభవించవలసిందే.చేసేటప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి చేసి,ఫలితం వచ్చే సమయానికి తప్పుకుంటాను అంటే ఊరుకోడానికి ప్రకృతి పిచ్చిది కాదు.

ప్రపంచం మారుమూలల్లో ఎక్కడ ఎలా దాక్కున్నా ధృఢకర్మను ఎవ్వరూ తప్పించుకోలేరు.అది వెంటాడి వేటాడుతుంది.అందుకే మన పెద్దవాళ్ళు అంటారు.

"కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి.ఎవరికీ హాని చెయ్యకండి.మనం ఏం చేసినా పరవాలేదు,ప్రస్తుతానికి మన పబ్బం గడిస్తే చాలు అని ఎప్పుడూ అనుకోకండి.మీ కర్మ పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కక్షణం ఆలోచించి కర్మ చెయ్యండి.మనల్ని గమనిస్తున్న శక్తి ఒకటున్నది.దాని నుంచి మీరు తప్పుకోలేరు" అని.

మన భారతీయ కర్మసిద్ధాంతం(ఈ పదం నాకు నచ్చకపోయినా ఇంతకంటే మంచి పదం దొరకక దీనిని వాడుతున్నాను) యొక్క మహత్యం ఇదే.

పై యోగాల వల్లా,గ్రహప్రభావాల వల్లా ఈ వారం భయానకమైన విమాన ప్రమాదాలు జరిగాయి అన్నది అసలైన సత్యం.