“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, ఫిబ్రవరి 2014, గురువారం

శివరాత్రి-శివుని ప్రత్యేకతలు-శివతత్త్వం

ఈ రోజు ఉదయమే ఒక అర్జెంట్ ఫోన్ కాల్ తో లేచాను.ఎక్కడో ఏదో అయింది అర్జంటుగా పరిగెట్టాలంటే,వెంటనే పది నిముషాలలో తయారై మావాళ్లకి ఫోన్ చేసి వాళ్ళనూ వెంటనే బయల్దేరమని చెప్పి ఉదయం ఆరింటికే బయల్దేరాము. ఊరిలో పరవాలేదు గాని ఊరు బయటకు వెళ్లేసరికి,ఇంకా సూర్యోదయం బాగా అవలేదేమో మంచుమంచుగా ఉండి ఇది గుంటూరేనా లేక సిమ్లానా అన్నట్లు దారే కనిపించడం లేదు.మొత్తానికి ఆ మంచులో పడి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చూడవలసిన పనిని పూర్తిచేసేసరికి ఉదయం పదిన్నరైంది.

మాటల్లో మా కొలీగ్ ఒకాయన ఇలా అన్నాడు.

'పొద్దున్నే లేచి స్నానం చేసి శివునికి పూజ చేసుకుందామని కూచున్నాను. ఈలోపల ఫోన్ కాల్ వచ్చింది.పరిగెత్తుకుంటూ వచ్చేశాను.శివరాత్రిరోజున కూడా ఇదేమిటి ప్రశాంతంగా లేకుండా?ఏమిటో మన ఉద్యోగాలు?' అన్నాడు.

'ఉద్యోగం ఏం చేసింది?ప్రశాంతత బయట ఉందా లోపలుందా?' అడిగాను.

అతను వింతగా చూచాడు.

'అదికాదు సార్.ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వకుండా ఇదెంటో ఈ రోజున కూడా మనకు ఈ ఎమర్జెంసీస్?' అన్నాడు.

'ఎమెర్జెన్సీ అంటేనే చెప్పకుండా ముంచుకొచ్చేది.చెప్పివస్తే అది అదెందుకౌతుంది?' అన్నాను.

మళ్ళీ అలాగే చూస్తున్నాడు.

'ముందు ప్రశాంతంగా పని చేసుకుంటే ఆ తర్వాత ఇంటికెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు' అన్నాను నవ్వుతూ.

నేనేమంటున్నానో ఆయనకర్ధం కాలేదు.

'మీరు కూడా నాలాగే పూజలోనుంచి లేచి వచ్చారా?' అడిగాడు.

'పూజా?నేనింకా స్నానమే చెయ్యలేదు' అని జవాబు చెప్పాను.

అతను అదోరకంగా చూచాడు.

ఇక నేను ఏమీ జవాబు ఇవ్వదలుచుకోలేదు.మౌనంగా ఉండిపోయాను.

చాలామంది ఇంతే.లౌకికం వేరు ఆధ్యాత్మికం వేరు అనుకుంటూ ఆ భ్రమలోనే జీవితమంతా వెళ్ళబుచ్చుతూ ఉంటారు.అందుకే చాలామంది సొ కాల్డ్ భక్తులూ ఆధ్యాత్మికులలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీలూ స్కిజోఫ్రేనిక్లూ ఉంటారు. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అదే ఆధ్యాత్మికమనీ దేవుని దయ మనమీద ఉన్నదనీ చాలామంది భ్రమపడుతూ ఉంటారు.మనం కోరిన కోరికలు తీరకపోతే దేవుని దయ మనమీద లేదనుకుంటారు.కోరికలు తీరడం ఆధ్యాత్మికత ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.అసలు కోరికలు అంటూ ఎప్పటికైనా పూర్తిగా తీరతాయా?వాటికి అంతూపొంతూ ఉంటుందా అనేది కూడా నాకేమీ పాలుపోదు.ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతూ ఉంటుంది.నిజమైన దేవుని దయ ఎలా ఉంటుందో,అసలదేమిటో,కోటిమందిలో ఒకరికైనా అర్ధమౌతుందో లేదో నాకైతే అనుమానమే.

కోరికలు తీరడమూ దయే,తీరకపోవడమూ దయే.అసలు కోరికలంటూ కోరని స్థితే అసలైన దయ అన్నవిషయం చాలామందికి అర్ధం కాదు.

పని పూర్తయింది.ఇంతలో ఇంకో కొలీగ్ వచ్చి'సార్.అందరం పొద్దున్నే బయల్దేరి వచ్చాంకదా.ఇప్పటిదాకా ఏమీ తిని ఉండరు.ఉప్మా చేయించాను. రండి తిందాం' అన్నాడు.

మొదటి కొలీగ్ ' నేను ఇంటికెళ్ళి మళ్ళీ స్నానంచేసి పూజ చేసుకుంటే గాని ఏమీ తినను తాగను.అందులో ఇవాళ శివరాత్రి కూడా కదా' అన్నాడు.

అతని వైపు జాలిగా చూచాను.అతను బయల్దేరి వెళ్ళిపోయాడు.

'సరే పదండి' అని ఆ ఉప్మా తిని టీ తాగి ఇక ఇంటికి బయలుదేరదామని అనుకుంటూ ఉండగా మావాళ్ళు 'సార్ దారిలోనే కాకాని శివాలయం ఉన్నది.దర్శనం చేసుకుని వెళదాం రండి' అన్నారు.

'సరే పదండి.అయితే ఒకటి.మన పరపతి ఏమీ ఉపయోగించవద్దు.హడావుడి చెయ్యవద్దు.మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం.ఒకవేళ దర్శనం కాకపోయినా మీరు బాధపడకండి' అన్నాను.

సరే అని అందరం తిరుగు ప్రయాణంలో బయలుదేరాము.

కాకాని శివాలయం దగ్గర కనీసం ఒక నాలుగు వేలమంది జనం ఉన్నట్లు కనిపించింది.గుడిచుట్టూ క్యూ నాలుగు రౌండ్లు తిరిగి ఉన్నది.ఆ క్యూలో నిలబడితే దర్శనం అయ్యేసరికి సాయంత్రం అయ్యేలా ఉన్నది.అందుకని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసాం.అక్కణ్ణించి కూడా ఆ జనం తలలు తప్ప లోపలున్న శివలింగం అసలేమీ కనబడటం లేదు.

మైకులో ఎవరో శివమహిమను గురించి వివరిస్తున్నాడు.ఏమిటా అని ఒక చెవి అటు వేశాను.'శివునికి చాలా ప్రత్యేకతలున్నాయి.ఆయన లయకారకుడు. భోలా శంకరుడు' అంటూ ఏమేమో చెబుతున్నాడు.

నాకు నవ్వొచ్చింది.మౌనంగా బయటకొచ్చి మా బైకులు తీసుకుని కొద్దిసేపట్లో గుంటూరు చేరుకున్నాము.

ఎక్కడైనా మంచి టీ తాగుదాం అని ఒక టీ స్టాల్ దగ్గర ఆగాము.

టీ తాగుతుండగా 'శివరాత్రి రోజున అనుకోకుండా శివదర్శనం అయింది.చాలా పుణ్యం కదా సార్.' అని మా ఇన్స్పెక్టర్ ఒకాయన అన్నాడు.

'అదేమీ లేదు.' అన్నాను.

ఆయనకూడా వింతగా చూచాడు.

'ఈరోజున శివదర్శనం అయితే ఎక్కువపుణ్యం అనీ ఇంకొకరోజున తక్కువపుణ్యం అనీ ఉండదు.ఏరోజున శివదర్శనం అవుతుందో అదే శుభదినం.అయితే మీరనుకుంటున్న శివదర్శనం గురించి నేను చెప్పడం లేదు.' అన్నాను.

మళ్ళీ అదే చూపు.

'ఇందాక మీరు గుడిలో మైకులో విన్నారో లేదో?శివుని ప్రత్యేకతల గురించి చెబుతున్నాడు ఒకాయన.నిజమేమిటో చెప్పనా?శివునికి ఏ ప్రత్యేకతలూ లేవు.ఏ ప్రత్యేకతలూ లేని సహజతత్త్వమే శివతత్త్వం.ఆయన నిర్వికారుడు. అంటే ఏ వికారమూ ఆయనలో ఉండదు.ఆయన నిశ్చలుడు. అంటే ఏ విధమైన చలనమూ ఆయనలో ఉండదు.ఆయన నిర్గుణుడు.అంటే మూడు గుణాలకూ అతీతుడు.ఆయన నిష్కళంకుడు.అంటే ఏ విధమైన కళంకమూ ఆయనలో ఉండదు.ఆయన నిరవద్యుడు,అంటే ఏ విధమైన చెడూ లేనివాడు.ఆయన నిరంజనుడు.అంటే ఏ విధమైన మాలిన్యమూ లేనివాడు.

ఏదీ తానుకాడు గనుక అన్నీ తానే.ఏదీ తనకు అంటదు కాని అన్నీ తనలో ఉన్నాయి.అన్నిట్లో ఉన్నాడు కనుక దేనికీ లోబడడు.ఇంద్రియములకు అతీతమై నిశ్చలమై అఖండ సచ్చిదానందమై నిత్యమూ వెలుగుతున్నదే శివతత్త్వం.దానిలో ఏ ప్రత్యేకతలూ లేవు.'

"తెలిసీ తెలియనివారు ఇలా మైకుల్లో టీవీలలో ఏవేవో చెబుతూ ఉంటారు. జనం వింటుంటారు.నిజమని భ్రమిస్తుంటారు.కోరికలు తీరితే దేవుని దయ ఉందనుకుంటారు.తీరకపోతే లేదనుకుంటారు.మతాలు మారిపోతుంటారు. దేవుళ్ళని మారుస్తూ ఉంటారు.ఇదంతా మామూలే.మాయాప్రభావం ఇలాగే ఉంటుంది.' అన్నాను.

టీ త్రాగటం అయింది.

'ఇక పదండి ఇళ్లకు పోదాం.'అన్నాను.

'ఇంటికెళ్ళి ప్రత్యెకపూజ ఏమైనా చేస్తారా ఈరోజు?' అడిగాడు.

'ఇప్పుడు చేస్తున్నది పూజ కాకపోతేగా?'అన్నాను.

ఎవరి ఇంటికి వారు బయలుదేరాం.