“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మోపిదేవి-హంసలదీవి

మొన్నొక రోజున అనుకోకుండా మోపిదేవి,హంసలదీవి పోయివచ్చే అవకాశం కలిగింది.రేపల్లె దగ్గర కృష్ణానదిమీద పులిగడ్డ వారధి వచ్చిన తర్వాత,కృష్ణా జిల్లాలో ఉన్న లంకలు అన్నీ రేపల్లెకు బాగా దగ్గరయ్యాయి.

రేపల్లె పొలిమేరలో ఉన్న పెనుమూడి-పులిగడ్డ వారధిమీదుగా కృష్ణానదిని దాటి కొంతదూరం వెళ్ళగానే మోపిదేవి వస్తుంది.చల్లపల్లి,అవనిగడ్డ అన్నీ అక్కడ దగ్గర దగ్గరగానే ఉంటాయి.మచిలీపట్నం కూడా ఈ దారిలో దగ్గరే.

మోపిదేవి సుబ్రహ్మణ్యక్షేత్రం.నాగదోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేయించుకుంటారు.నాగదోషం అనేది చాలామంది జాతకాలలో ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది.ఇది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బాధ పెడుతుంది.అమ్మాయిల జాతకాలలో వివాహపరమైన చిక్కులను ఇది కలిగిస్తుంది.అబ్బాయిల జాతకాలలో కూడా చాలామందికి ఇది ఏదో ఒక రూపంలో ఉంటుంది.

ఇష్టంలేని పెళ్ళి చేసుకోవలసి రావడం,పెళ్ళి కాకపోవడం,ఆలస్యం కావడం, పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకోవడం,గొడవలు జరిగి విడిపోవడం, లేదా ఇద్దరిలో ఒకరు మరణించడం మొదలైన అనేక పరిణామాలను కుజదోషం కలిగిస్తుంది.

సంతానపరమైన దోషాలకు కూడా ఇదే సర్పదోషం కారణం అవుతుంది.ఈ దోషాలు రకరకాలుగా ఉంటాయి.కొంతమందికి తరతరాలుగా మగపిల్లలు పుట్టరు.ఇంకొందరికి అసలు సంతానమే కలుగదు.కొందరికి సంతానం బాగా ఆలస్యమౌతుంది.కొందరికేమో పుట్టిన పిల్లలు చనిపోతుంటారు.ఇంకొందరికి బాగా పెద్దవారైన తర్వాత తల్లిదండ్రుల కళ్ళెదుట పిల్లలు పోతుంటారు.లేదా సంతానం మొండిగా తయారై పెద్దవాళ్ళ మాట వినకపోవడమూ ఎదురు తిరగడమూ వద్దన్న పనులు చెయ్యడమూ వద్దన్న పెళ్ళిళ్ళు చేసుకోవడమూ ఇలాంటి చర్యలవల్ల పెద్దలు మానసికబాధతో కుంగిపోయి ముసలితనంలో వ్యధతో చనిపోవడమూ ఇలాంటి దోషాలు అసంఖ్యాకమైన రూపాలలో మనుష్యుల జీవితాలలో పీడిస్తూ ఉంటాయి.

స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నవాళ్ళ జాతకాల్లో సర్పదోషం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం వాళ్ళ జాతకం చూడకుండానే చెప్పవచ్చు.మైక్రోస్కోప్ క్రింద పరిశీలిస్తే హ్యూమన్ స్పెర్మ్ లో చిన్నచిన్న పాముల వంటి స్పెర్మటోజోవా అసంఖ్యాకంగా కనిపిస్తాయి.నాగదోషం అనేది పాముపగలాగా తరతరాలు వెంటాడుతుంది అనేది ఖచ్చితమైన నిజం.ఆ దోషం ఉన్న జాతకాలు మూడు నాలుగు తరాలవి వరుసగా పరిశీలిస్తే ఈ సత్యం తేటతెల్లంగా కనిపిస్తుంది.

ఏతావాతా సర్పదోషం అనేది చాలా భయంకరమైన దోషం అనే చెప్పాలి.

అసలు మానవజాతికీ సర్పాలకూ అవినాభావ సంబంధం ఎప్పటినుంచో ఉన్నది.ఎన్నో జంతువులు మానవ జీవితంతో కలిసిమెలసి ఉన్నప్పటికీ సర్పాలకు ఒక ప్రత్యెక స్థానం ఉన్నది.ప్రతి మనిషిలోనూ వెన్నుపామూ మెదడూ కలిసిన వ్యవస్థ,పడగ విప్పిన పాము ఆకారంలోనే ఉంటుంది. సూర్యారాధన ఎంత ప్రాచీనమైనదో సర్పారాధన కూడా అంతే ప్రాచీనమైనది.

యోగసాధనకూ సర్పారాధనకూ కూడా అవినాభావ సంబంధం ఉన్నది. యోగుల జీవితాలలో సర్పాల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.చాలామంది యోగులను సర్పాలు వచ్చి దర్శిస్తూ ఉంటాయి.అవి చూచి పోవడానికి వచ్చాయన్న విషయం తెలియక పక్కన ఉన్నవారు వాటిని చంపేస్తూ ఉంటారు.ఆ దోషం ఆ చంపినవారికే కాక ఆ యోగులకు కూడా పట్టుకుంటుంది.

నాగదోషం ఉన్నవారి జీవితాలలో సూక్ష్మంగా గమనిస్తే ఎన్నో మార్మిక సంఘటనలు నిత్యమూ జరుగుతూ ఉంటాయి.అయితే వాటిని గ్రహించే సూక్ష్మదృష్టి చాలామందికి ఉండదు.అహంకారంతోనూ లెక్కలేనితనంతోనూ మనిషి ఎన్నో విలువైన విషయాలను ఈరకంగా చేజార్చుకుంటూ ఉంటాడు.

ఇంతలో మోపిదేవి ఆలయం రానే వచ్చింది.

ఆరోజున షష్టి కావడంతో గుడినిండా బాగా జనం ఉన్నారు.అయితే ఒక్కరిలోనూ క్రమశిక్షణ లేదు.చేపల మార్కెట్ కంటే అధ్వాన్నంగా అరుచుకుంటూ గోలగోలగా ఉన్నారు.ఒక దేవాలయానికి వచ్చాము మౌనంగా ఉండాలి అన్న భావమే ఒక్కరిలోనూ ఉండదు.మన హిందువులకు పట్టిన అనేక దౌర్భాగ్యాలలో ఇదొకటి.ఈ విషయంలో క్రైస్తవుల నుంచీ ముస్లిముల నుంచీ మనం నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది.వారి ప్రార్ధనాలయాలు ప్రశాంతంగా మౌనంగా ఉంటాయి.దానికి భిన్నంగా,మన దేవాలయాలు సంతకంటే అధ్వాన్నంగా ఉంటాయి.మన దేవాలయాలలో దైవత్వం తప్ప మిగిలిన అన్నీ కనిపిస్తాయి.

హిందువులు ముందుగా సివిక్ సెన్స్ నేర్చుకోవాలి.దేవాలయాలలో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి.అతివాగుడూ లోకాభిరామాయణమూ కట్టిపెట్టి కనీసం ఆ కాసేపైనా మౌనప్రార్ధనలో ఉండటం అభ్యాసం చెయ్యాలి.అలా చెయ్యమని నేటి గురువులు బోధించాలి.అప్పుడే కొంతలో కొంత మన దేవాలయాలలో ఉన్న దివ్యత్వాన్ని ఫీల్ అవడం వీలవుతుంది.

క్యూలో నిలబడి గర్భగుడి లోనికి వెళ్ళాము.అక్కడ కూడా ఎవరికి వారు అక్కడున్న లింగాన్ని చూడాలన్న ఆత్రుతలో మెడలు నిక్కించి పక్కవాడిని వెనక్కు తోసేసి మరీ తొంగితొంగి చూస్తున్నారు.ఇలాంటి ప్రవర్తన అంటే నాకు పరమ అసహ్యం.అందుకని నా అంతట నేనే ఒక మూలకు జరిగి కళ్ళు మూసుకుని నిలబడి మిగతావారికి ఒకరినొకరు తోసుకునే అవకాశం చక్కగా కల్పించాను.ఎవరి గోలలో వాళ్ళున్నారు.నా ధ్యానంలో నేనున్నాను.

ఇలాంటి సర్పక్షేత్రాలకు వచ్చినపుడు చెయ్యవలసిన కొన్ని అంతరిక క్రియలు ఉంటాయి.వాటిని చెయ్యడంవల్ల కొన్ని ఫలితాలు వెంటనే కనిపిస్తాయి. దానివల్ల ఆయా కర్మక్షాళణాలు జరిగాయా లేదా వెంటనే తెలిసిపోతుంది. చుట్టూ రణగొణధ్వనిగా ఉన్న కాకిగోలతో సంబంధం లేకుండా మౌనంగా గర్భగుడిలో ఒక మూలకు నిలబడి నా పనిని ముగించాను.

మంత్రపుష్పం చదివేటప్పుడు కూడా ఆ పూలకోసం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకుంటూ ఎగబడుతూ ఉన్నారు.నేనసలు ఆ పూలే తీసుకోలేదు.గుడిలో లోపలికి ఒక మూలకు నిలబడి ఉండటంతో జనం వెనుకగా ఉన్న నేను పూజారికి కనిపించే అవకాశమే లేదు.నాకు విగ్రహం కనిపించే అవకాశమూ లేదు.అయినా నా పనిలో నేనున్నాను గనుక ఇబ్బంది లేదు.పూజ అయిన తర్వాత బయటకు వచ్చాము.

అక్కడనుంచి వెనక్కు రేపల్లె వెళతామని అనుకున్నాను.ఇంతలో 'ఇక్కడ దాకా వచ్చాం కదా హంసలదీవి కూడా చూచి పోదాం' అని మా బృందంలోని ఒకాయన అనడమూ వెంటనే కార్లు హంసలదీవి వైపు తిరిగడమూ వెంటనే జరిగిపోయాయి.లోలోపల నవ్వుకున్నాను.దైవసంకల్పం ఇలాగే సంభవిస్తూ ఉంటుంది.దానికి ఎవరో ఒక వ్యక్తి కారకుడౌతూ ఉంటాడు.ఇలాంటి సంఘటనల వెనుక ఉన్న సూక్షమైన కారణాలూ లింకులూ అంత తేలికగా అర్ధం కావు.కానీ తరచి చూస్తె వాటిని గ్రహించడం కష్టం కాదు.

కృష్ణాజిల్లా లంకలన్నీ అంతా చెట్లూ నీళ్ళతో ఉంటాయి.వాతావరణం బాగుంటుంది.అడవి మధ్యలో ఇళ్ళున్నట్లుగా ఉంటాయి.కేరళ వాతావరణం లాగా ఉంటుంది.కొద్ది దూరం వెళ్ళగానే ఆ చెట్లమధ్యలో ఒక నిదర్శనం నాకు కనిపించింది.దానిని చూడటంతోనే నేను మోపిదేవి గుడిలో చేసిన రెమెడీ పనిచేసిందని,సుబ్రహ్మణ్యస్వామి సమాధానమిచ్చాడనీ వెంటనే నాకు అర్ధమై పోయింది.

దేవుడిని చూడటం కోసం మనం ఎగబడటం కాదు.మనల్ని దేవుడు చూచేలా మనం ఉండాలి.అదే నిజమైన ఆధ్యాత్మికత.అలా మనం ఉండగలిగితే మనం ఎక్కడున్నా దైవం మనల్ని చూస్తూనే ఉంటుంది.మనకు సమాధానం ఇస్తూనే ఉంటుంది.ఆ బంధం ఎప్పుడూ తెగిపోదు.అవసరం తీరాక మరచిపోయేది స్వార్ధపూరిత మానవసంబంధం.ఎన్నడూ మరచిపోనిదీ ఎప్పుడూ తెగిపోనిదీ దైవసంబంధం.మన దృష్టి దైవం మీద పడితే ఉపయోగం లేదు.దైవం దృష్టి మనమీద పడాలి.అట్లా పడే విధంగా మనం ఉండాలి.దైవం ఒక్క విగ్రహంలోనే ఉన్నదా?

మాటల్లోనే హంసలదీవి చేరుకున్నాము.కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం అక్కడకు చాలా దగ్గరలో అంటే నాలుగు కి.మీ దూరంలోనే ఉన్నది.దానిని సాగరసంగమం అనికూడా అంటారు.

మా బృందంలో  ఉన్న శ్రీకాంత్ గారి మామగారే హంసలదీవిలో ఉన్న శృంగేరి సత్రాన్ని చూచుకుంటూ ఉంటారని ఆయన చెప్పినారు.ఆయన మంచి వేదపండితుడు.ఆయనకు దాదాపు అరవైఐదు ఏళ్ల పైనే ఉంటాయి.మేము వెళ్ళగానే ఆయన గబగబా ఎదురొచ్చారు.

ఆయనను చూడగానే శుద్ధ శ్రోత్రియుడని కల్లాకపటం లేని వ్యక్తి అనీ తెలిసి పోతున్నది.వారి సతీమణి కూడా పాతకాలం మడిచీరలో ఉన్నారు.మూడు గదుల చిన్నఇల్లు అతి నిరాడంబరంగా ఉన్నది.ఆ ఇంటిలో మాకు కనిపించినవి కొన్ని వేదాంత గ్రంధాలూ,ఒక వ్యాసపీఠం,శృంగేరి స్వాముల ఫోటోలూ,చాపలూ మాత్రమే.సోఫాలూ కుర్చీలూ టీవీలూ ఏమీ లేవు.

వారు భోజనం చెయ్యమని బలవంతం చేసినారుగాని,మా బృందానికి వంట చేసేపని పెట్టి ఆ కుగ్రామంలో ఆ సాధ్వీమతల్లిని వేళగాని వేళలో ఎందుకు ఇబ్బంది పెట్టాలనిపించి భోజనం వద్దన్నాము.కాఫీ ఇమ్మని చెప్పినాము.భోజనం చెయ్యాల్సిందే అంటూ వారు ఎంతో బ్రతిమిలాడి,మేము వినకపోతే,చివరకు కాఫీ ఇచ్చినారు.

హంసలదీవిలో ఒక మూడొందల ఇళ్ళు ఉంటాయేమో.చాలా చిన్న ఊరు.ఏం కావాలన్నా అయిదారు కి.,మీ దూరంలో ఉన్న కోడూరు అనే ఊరినుంచి తెచ్చుకోవాల్సిందే.చీకటిపడితే ఆదారిలో వీధిదీపాలు కూడా లేవు.అంత కుగ్రామం అది.

'ఈ ఊరికి హంసలదీవి అని పేరెందుకు వచ్చిందో?'అని ఒకాయన కాఫీ తాగుతూ అడిగారు.

'ఇక్కడ హంసల్లాంటి అమ్మాయిలు ఉంటారేమో?' అని మా బృందంలోని ఒకాయన జోక్ గా అన్నారు.

నేను మౌనంగా గమనిస్తున్నాను.

అక్కడే ఉన్న గ్రామవాసి ఒకాయన ఇలా అన్నాడు.

'అనేకవందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక కాకి సముద్రస్నానం చేసి హంసగా మారిందని చెబుతారు.అందుకని ఆ పేరొచ్చింది.'

ఇంతలో మాకు కాఫీ గ్లాసులు అందిస్తున్న శ్రీకాంత్ గారి మామగారు ఇలా అన్నారు.

'హంస అంటే ఏముంది నాయనా?మనమందరమూ హంసలమే. 'హంసస్సోహం'-అని వేదాంతం అంటుంది.మనకు తెలీక కాకుల్లా బ్రతుకుతున్నాం.కాని నిజానికి మనమందరమూ హంసలమే.'తత్త్వమసి' అనే మహావాక్యాన్ని విన్నావా?' అడిగాడు.

ఆ వ్యక్తి అడ్డంగా తలాడించాడు.

'ఈ ప్రదేశంలో కొన్ని వందల ఏళ్లక్రితం పరమహంసలు ఉండేవారు.అంటే మహర్షులన్న మాట.అందుకే దీనికి హంసలదీవి అని పేరొచ్చింది.మా అల్లుడు గారైన శ్రీకాంత్ గారికి దాదాపు రెండుమూడువందల ఏళ్ల క్రితపు పూర్వీకులలో విష్ణ్వానందేంద్రసరస్వతి గారని ఒక స్వామి ఉండేవారు.ఆయన ఇక్కడ చాలాకాలం తపస్సు చేసినారు.అంతటి గొప్పవంశంలోని వాడు గాబట్టే ఈయనకు మా అమ్మాయిని ఇచ్చాను.'అన్నాడు పెద్దాయన.

'లేకపోతే మా శ్రీకాంత్ కి పిల్లనివ్వరా?' అని మా బృందంలోని ఒకాయన చనువుగా ప్రశ్నించాడు.

'మరి అంత మహర్షుల వంశంలోని వాడికి మా అమ్మాయిని ఇస్తే అంతకంటే గొప్ప ఏముంది నాయనా?' అని ఆయన జవాబిచ్చాడు.

ఎంతసేపూ డబ్బూ ఆస్తీ హోదా వగైరాలు చూచి సంబంధాలు కలుపుకునే నికృష్టులు ఉన్న నేటిలోకంలో అలాంటి మాట చెప్పిన వ్యక్తిని ఒక్కరినైనా చూచినందుకు నాకు చాలా ఆనందం కలిగింది.

ఒకే ప్రశ్నకు మూడు జవాబులు!!!

ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఇచ్చిన మూడు జవాబులు నాకు ఎంతో ముచ్చట గొలిపాయి.

మొదటి వ్యక్తి మామూలు సరదా మాటల్లో జవాబు చెప్పాడు.రెండో ఆయన ఆ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న కధను చెప్పాడు.మూడో ఆయన అద్భుతమైన శుద్ధ వేదాంతభావనను చెప్పాడు.ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వారి మాటలు వచ్చాయి.

ఏదేమైనా సరే,పద్ధతిగా జీవించే నిజమైన బ్రాహ్మణుల జీన్స్ లో ఏదో తెలీని ప్రత్యేకత ఉన్నదని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది.ఋషిరక్తం వారిలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నదనేది వాస్తవం.వారి ఆలోచనలు మామూలు మనుషుల ఆలోచనల కంటె ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి.

ఆ శ్రోత్రియ దంపతులకు నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరాము.

దారిలో ఇలా అన్నాను.'శ్రీకాంత్ గారు! మీ మామగారు సత్పురుషుడు.మన ఆర్షధర్మాన్ని ఇలాంటి వారే ఇంకా నిలబెడుతూ ఉన్నారు.'

'నిజమేనండి.ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు.ఆస్తి లేదు.అసలు వాటిమీద ఆయనకు ధ్యాసే లేదు.అయినా మనిషికి చీకూ చింతా లేదు.ఎంత ఆనందంగా నిబ్బరంగా ఉన్నాడో చూడండి.' అన్నారు శ్రీకాంత్.

'మరి ఆయన ఎక్కడ ఉంటారు?' అడిగాను.

'ఒకచోట అంటూ ఏమీ లేదు.కొడుకుల దగ్గర కొంతకాలం చొప్పున అలా ఉంటూ ఉంటాడు.కొన్ని నెలలు ఇక్కడే ఈ సత్రంలో ఉంటాడు.ఆయన లక్ష్యం ఒకటే.ఈ హంసలదీవిలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి.అంతే.అందుకోసం ఆయన తపన పడుతూ ఉంటాడు.ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఆ కృషి ఫలితమే. ఒక ఏభై ఏళ్లక్రితం ఇంత గుడి ఇక్కడ లేదు.ఆలయానికి ఒక ఇరవై ఎకరాలు ఉన్నది.ఈయన ఇంకొక ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఆవచ్చిన డబ్బుతో ఈ దేవాలయాన్ని వృద్ధిచేస్తూ వస్తున్నాడు.ఈ వయస్సులో కూడా ఇంత కష్టపడతాడు.వద్దంటే వినిపించుకోడు.'అని శ్రీకాంత్ అన్నారు.

కార్లు వేగంగా రేపల్లె వైపు దూసుకు పోతున్నాయి.దారిపక్కనే రాజకీయ భూబకాసురుల ఫ్లెక్సీలు కనిపించాయి.

'శ్రీకాంత్ గారు.మీ బ్రాహ్మణులు ఇక్కడే వెనుకబడి పోతున్నారు.ఎంతసేపూ ఆధ్యాత్మికం,దేవుడు,నీతి,నియమం,నిష్ఠా అంటూ డబ్బునూ ఆస్తిపాస్తులను పోగేసుకోవడం మర్చిపోతున్నారు.ఆ ఫ్లెక్సీ చూడండి.అందులోని వారికి ఎన్ని వేల ఎకరాలూ చాలడంలేదు.ఇంకా ఎక్కడైనా దొరికితే స్వాహా చేద్దామనే చూస్తున్నారు.ఇలాంటివారిని చూచి మీ మామగారు ఎంతో నేర్చుకోవాలి' అని నేను హాస్యంగా అన్నాను.

'వద్దులెండి శర్మగారు.ఇప్పుడు ఆ బుద్ధులన్నీ మనకెక్కడ వస్తాయి?అది రక్తంలో ఉండాలి.రక్తంలో లేనిది ఎలా వస్తుంది?మనం అలాంటి పనులు చెయ్యలేము.ఆస్తిపాస్తుల చింతే మా మామగారి వంటి వారికి ఉండదు.ఇలాంటి మాటలు చెబితే వాళ్ళు నవ్వుతారు' అన్నారు శ్రీకాంత్.

పాతకాలంలో ప్రతి బ్రాహ్మణకుటుంబంలోనూ ఇలాంటి ఋషితుల్యులైన మనుష్యులు ఉండేవారు.ఎదుటివ్యక్తిని మోసం చెయ్యాలనీ,ఆస్తులు కూడబెట్టాలనీ,అవసరమైతే దానికోసం నానా అబద్దాలు చెప్పాలనీ,నీతీ గీతీ గాలికొదిలేయ్యాలనీ,జీవితంలో డబ్బే సర్వస్వమనీ ఇలాంటి ఆలోచనలే వారికి ఉండేవికావు.అటువంటి బ్రతుకులను వారు అసహ్యించుకునేవారు. శాశ్వతంగా నిలిచి ఉండే విలువలే వారికి ప్రధానంగాని ఆస్తులూ డబ్బూ విలాసాలూ వారికి ముఖ్యంకాదు.ఆ శాశ్వతప్రయోజనం కోసం వాళ్ళు దేనినైనా త్యాగంచేసేవారు.నిరాడంబరంగా బ్రతికేవారు.చివరికి అలాగే పోయేవారు. అందుకే వారు ఒకమాట అంటే అది జరిగి తీరేది.అంతటి శక్తి వారిలో ఉండేది.

ఈనాటికీ ఇంతగా కుళ్ళిపోయిన సమాజంలో కూడా అక్కడక్కడా ఇలాంటి మనుషులు ఉండబట్టే వానలు పడుతున్నాయి.పీల్చడానికి గాలి దొరుకు తున్నది.ధర్మం ఏ కొద్దిగా అన్నా నిలబడి ఉన్నదంటే ఇలాంటి వ్యక్తులే కారణం.అంతేగాని ఎక్కడబడితే అక్కడ ఏ రంగంలో బడితే ఆ రంగంలో చెదలా వ్యాపించిన నీతిరహితులూ దొంగలూ కారణం కాదు.

'మన దేశపు నిజమైన బలం ఆధ్యాత్మికత మాత్రమే' అని వివేకానందస్వామి ఎన్నోసార్లు అనేవారు.అది జీవించి ఉన్నంతవరకూ మన దేశానికి నాశనం లేదు.ఈ దేశాన్ని నిలబెడుతున్నది ఆర్షధర్మమే గాని రాజకీయ నాయకులు కాదు.కానీ ఈసంగతి ఎవరికీ అంత త్వరగా అర్ధంకాదు.అర్ధం అయ్యేసరికి సమయం మించిపోతుంది.ఆపుడు అర్ధమయ్యీ ఉపయోగం ఉండదు.అదే విచిత్రం.

ఆలోచనలో ఉండగానే రేపల్లె వచ్చింది.అక్కడ పని ముగించుకుని అందరం గుంటూరు బయలుదేరాము.