“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, ఫిబ్రవరి 2014, సోమవారం

సాధనా సమ్మేళనం -కోటప్పకొండ -3ఉదయం మూడుకే ఏవో కేకలు అరుపులూ గోలగోలగా వినిపించాయి.ఎవరో యాత్రిక బృందం వచ్చినట్లుంది అనుకుంటూ మెలకువలోకి వచ్చేసాను. భారతీయులలో సివిక్ సెన్స్ చాలా తక్కువ అన్నది నగ్నసత్యం.సివిక్ సెన్స్ ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ స్వార్ధం ఎక్కువగా ఉంటుంది అన్నదీ సత్యమే. సోకాల్డ్ భక్తులలో అయితే ఈ స్వార్ధం మరీ ఎక్కువగా ఉంటుంది. గడ్డకట్టిన స్వార్ధాన్నే భక్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు.

బయటకెళ్ళి చూచాను.'సమైక్యాంధ్ర కోసం ఫలానా అసోసియేషన్ వారి తీర్ధయాత్రలు' అని ఒక బస్సుకు ఒక ఫ్లెక్సి కట్టి ఉన్నది.దానిలోనే వాళ్లందరూ వచ్చినట్లున్నారు.ఇదొక ఆత్మవంచన.


'గాలికి ఎగిరిపోయిన పేలాలు రామార్పణం'-అన్నట్లుగా ఉన్నది వీరి తంతు. వీరికి తీర్ధయాత్ర అంటే ఏమిటో తెలియదు.పిక్నిక్ కీ దీనికీ తేడా అసలె తెలియదు.పైగా సమైక్యాంధ్ర ఒకటి.ఈ గోలతో పక్కవారిని డిస్టర్బ్ చెయ్యడం.దానికి భక్తి అనేది ఒక ముసుగు.

మనుష్యుల అజ్ఞానం ఎన్ని వెర్రితలలు వేస్తుందో ఆ దేవుడికే తెలియాలి.రాన్రాను ఈ సోకాల్డ్ భక్తులనే వాళ్ళని చూస్తుంటే నాకు పిచ్చికోపం వస్తున్నది.సివిక్ సెన్స్ లేనివాడు భక్తి అనే కాన్సెప్ట్ ని అసలు ఎలా అర్ధం చేసుకోగలడు?ఈ మనుషుల అజ్ఞానాన్ని దేవుడు కూడా బాగుచెయ్య లేడనిపించింది.

ఈరోజు వేసిన ప్లాన్ ప్రకారం విష్ణుశిఖరానికి వెళ్ళి అక్కడ ఉన్న పాపనాశేశ్వర స్వామిని దర్శించుకుని రావాలి.

దానికోసం కొంతమందిని విచారించగా - 'ముందుగా కొండదిగి నరసరావుపేట దారిలో ఉన్న రెడ్లసత్రం దాటి కొంతదూరం వెళితే అక్కడ చింతతోపు ఒకటి వస్తుంది.ఆ చింతతోపునుంచి వెదికితే ఒక కాలిబాట వంటిది కనిపిస్తుంది.ఆ బాటలో మెట్లేమీ ఉండవు. రాళ్ళమీదుగా ఒక అరకిలోమీటరు దూరం కొండ ఎక్కితే అక్కడ ఒక చిన్న గుడీ దానిపక్కన ఒక కొలనూ ఉంటాయి' -అని చెప్పినారు.

అనుకున్న సమయానికే పొద్దున్నే బయలుదేరి కారులో కొండ దిగినాము. కారును యాదవసత్రం బయటగా పార్క్ చేసి అక్కడనుంచి దారి వెదకడం మొదలుపెట్టాము.అక్కడనుంచి చూస్తే విష్ణుశిఖరం అచ్చం హిమాలయాలోని కైలాసశిఖరంలా కనిపించింది.మంచు ఒక్కటే తక్కువ.అదికూడా ఉంటే కైలాసశిఖరానికీ దీనికీ పెద్ద తేడాలేదు.పెద్దగా కష్టపడకుండానే దారి కనబడింది.మెకన్నాస్ గోల్డ్ సినిమాలో కొండల మధ్య దారి ఉన్నట్టుండి కనిపించినట్లు మాకూ దారి కనిపించింది.దట్టమైన చెట్లపొదల మధ్యగా రాళ్ళమీదుగా దారి ఉన్నది.దానిగుండా కొండ ఎక్కాలి. చెట్లమధ్యలో ఒక్కమనిషి మాత్రమే నడవగలిగే ఇరుకుదారిలాగా ఉన్నది.

నిజానికి అది దారి కాదు.వర్షం పడినప్పుడు ఆ నీరు కొండమీదనుంచి కిందకు జారిన నీటివాలే ఆ దారిగా కనిపిస్తున్నది.నిన్న ఎక్కిన దారికంటే కూడా ఇదే కష్టమైన దారి.నిన్న కనీసం కొందరు పనివాళ్ళన్నా దారిలో అక్కడక్కడా కనిపించారు.ఇక్కడ దారి పొడుగునా ఎవరూ లేరు.పైగా దట్టమైన చెట్ల మధ్యలోనుంచి ఒంటరిగా ఎక్కాలి.నలుగురితో కాకుండా ఒంటరిగా వస్తే ఇంకా బాగుంటుంది.మౌనాన్నీ ప్రకృతినీ బాగా ఉపయోగించుకోవచ్చు.ఈసారి ఒక్కడినే రావాలి,ఒకరోజంతా ఈ కొండమీద చెట్లలో ఏకాంతంగా ఒక్కడినే ఉండాలి అని నిశ్చయించుకున్నాను.


సగం కొండను ఎక్కిన తర్వాత ఒక చోట రాళ్ళన్నీ అరుగుల మాదిరి సహజంగా అమరి ఉన్నాయి.అక్కడ చెట్లుకూడా గుబురుగా వంగి పైన మంచి నీడనిస్తూ ఉన్నాయి.అక్కడ కూచుంటే ఒక పందిరిలో కూచున్నట్లు ఉన్నది.అక్కడ కొంచంసేపు కూర్చుని సేదతీరాము. అక్కడ ఎవరో కూచోడానికి అరుగులలాగా రాళ్ళను పెర్చుకున్నట్లు తోచింది.బహుశా ఎవరైనా సాధువులు కొద్దిసేపు ఈ ప్రదేశంలో కూచోడానికి అలా ఏర్పాటు చేసుకున్నారేమో అనుకున్నాను.


ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉన్నది.చల్లనిగాలి వీస్తున్నది.మధ్యమధ్యలో పక్షులు చేసున్న శబ్దాలు తప్ప అంతా మౌనంగా ప్రశాంతంగా ఉన్నది.ఈ చెట్ల పందిరి క్రింద కూచుని ఎక్కడో క్రింద ఉన్న ఇళ్ళనూ ఊరినీ చూస్తుంటే ఉపనిషత్తులలోని'ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షం..'అన్న మంత్రం అకస్మాత్తుగా నా మదిలో మెదిలింది.సమస్త ప్రకృతి,పరమేశ్వరధ్యానంలో తన్మయమై ధ్యానమగ్నమై ఉన్నట్లు అనిపించ సాగింది.మనస్సు అప్రయత్నంగా ధ్యానస్తితిలోకి వెళ్ళసాగింది.

నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ 'జయజయ మహాదేవా...' అని  ఘంటసాల పాడిన సినిమా పాటను రామన్నగారు అందుకోబోయారు.

మెల్లగా ఆయన భుజం మీద తట్టి 'మౌనంగా ఉండండి.' అని సున్నితంగా చెప్పినాను.

'భగవన్నామమే కదా సార్.తప్పేముంది?' అని ఆయన అన్నారు.


'భగవన్నామం మనం చెయ్యకూడదు. సమస్త ప్రకృతీ భగవద్ధ్యానంలో ఇప్పటికే ఉన్నది. ఓంకారనాదంగా భగవన్నామం ప్రకృతిలో నిరంతరం మారు మ్రోగుతున్నది.మనం దానిని వినాలి. దానిలో మన మనస్సులు లీనం కావాలి.మనం చేసే శబ్దాలు ఆ ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయి.కనుక మౌనంగా ఉండి మీచుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి' అని చెప్పినాను.పాపం ఆయనేమనుకున్నారో గాని ఏమీ మాట్లాడలేదు.

యోగమార్గం ప్రశాంత నిశ్శబ్దమౌనం.మౌనంలోనే నిజమైన సాధన జరుగుతుంది.స్తోత్రాలూ భజనలూ పాటలూ పూజలూ చాలా తక్కువ స్థాయికి చెందిన మతప్రక్రియలు.అవన్నీ కూడా చివరకు మౌనానికే దారితీస్తాయి.అలా తీసినప్పుడే వాటికి నిజమైన సార్ధకత.


కాసేపు అక్కడ కూర్చుని మళ్ళీ నడక ప్రారంభించి నాము.ఆ విధంగా ఒక ముప్పావుగంట నడిచి కొండ మీదున్న గుడిదగ్గరకు చేరుకున్నాము.మదన్ అక్కడి కొలనులో స్నానం చేశాడు.మేము తలమీద నీళ్ళు చల్లుకుని కాళ్ళు చేతులు కడుక్కున్నాము. కొండలలో అలాంటి సరస్సుల దగ్గర మనస్సు అప్రయత్నంగా ధ్యానోన్ముఖం అవుతుంది.ఆదోని కొండమీద కూడా ఇలాంటి చెరువు ఒకటి ఉంటుంది.అక్కడి వాతావరణం కూడా నిశ్శబ్దంగా చాలా మనోహరంగా ఉంటుంది.ఇరవై అయిదేళ్ళ క్రితం నేను ఆదోనిలో ఉన్న రెండేళ్ళూ ఆ కొండనెక్కి ఒంటరిగా అక్కడకు పోయేవాడిని.ఆ చెరువు ఒడ్డున చాలాసేపు కూచుని చీకటి పడినాక కొండ దిగి వచ్చేవాడిని.

ఈ కొండమీద కూడా అలాంటిదే ఒక కొలనులాగా సహజంగా ఏర్పడి ఉన్నది.వర్షాకాలంలో పడిన వాననీటితో అక్కడ ఒక సహజసరస్సు వంటిది ఏర్పాటైంది.అది నిండి పొంగిపోయిన నీళ్ళు క్రిందకు ప్రవహించిన దారే మేము నడచి వచ్చిన రాళ్ళదారి.'విశాలమైన జలాశయాల సమీపంలో ధ్యానం చెయ్యండి' అని తమ శిష్యులకు శ్రీరామకృష్ణులు చెప్పేవారని మహేంద్రనాధగుప్త వ్రాస్తారు.ఎందుకంటే అనంతమైన ఆకాశం తనక్రింద ఉన్న నీటిలో ప్రతిఫలించినట్లుగా,అనంతమైన దివ్యత్వం నిమ్నమానవచేతస్సులో ప్రతిఫలిస్తుంది.నిశ్చలత్వాన్ని ఇస్తుంది. అలాంటి పరిసరాలు ధ్యానానికి ఇతోధికంగా దోహదం చేస్తాయి. అందుకే యోగులైనవారు కొండలనీ సరస్సులనీ ఏకాంత నిశ్శబ్ద ప్రదేశాలనీ అమితంగా ఇష్టపడతారు. 

గుడిలోనికి వెళ్ళి చూస్తే ఎప్పుడో ఎవరో పూజచేసిన ఆనవాళ్ళు కనిపించాయి.చిన్నచిన్న కవర్లూ చెత్తా చెదారమూ కొబ్బరి పీచులూ కాగితం ముక్కలూ ఇలా ఏవేవో లింగం చుట్టూ ఉన్నాయి. వాటినీ అనవసరమైన ప్లాస్టిక్ సీసాలనూ గట్రానూ అన్నీ ముందుగా బయటకు విసిరేసి గుడిలోపల అంతా శుభ్రం చేశాము.

రామన్నగారికి రుద్రం నోటికి వచ్చు.అందరం కలసి మేము తెచ్చుకున్న సీల్డ్ వాటర్ బాటిల్స్ లోని నీటితో రుద్రమూ పంచబ్రహ్మ మంత్రములూ చదువుతూ శివలింగానికి అభిషేకం చేశాము.అందరికీ ఆనందం కలిగింది.రామన్నగారు చాలాసేపు గుడిలో ధ్యానంలో కూచున్నారు.మేము లేచి బయటకు వచ్చినాము.

బయటకు వచ్చాక కొద్దిసేపు అక్కడ ఉన్న బండల మీద కూచున్నాము.ఎవరో అక్కడ రాళ్ళపొయ్యి పెట్టి వంట చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి.బహుశా ఎవరైనా సాధువులు అక్కడ రాత్రిళ్ళు ఉంటారేమో అనుకున్నాను.

అక్కడి ప్రశాంతప్రకృతినీ నిశ్శబ్దంలోని మాధుర్యాన్నీ ఆస్వాదిస్తూ ఆ బండలమీద కొద్దిసేపు కూచున్నాము. మానవ నివాసాలనూ భూమినీ వదలి ఆకాశంలోకి పోయేకొద్దీ మనస్సు తేలికగా ధ్యాన నిమగ్నమౌతుందని రజనీష్ అనేవాడు.అది నిజమే.దానికి మార్మికమైన కారణాలున్నాయి.ఎత్తులలో భూమి యొక్క ఆకర్షణ క్రమేణా తగ్గిపోతుంది.అప్పుడు భూసంబంధమైన నిమ్నవాంచలు మనస్సును తేలికగా వీడిపోతాయి. అందుకే యోగులూ ఋషులూ ఎత్తైన కొండల్లో నివాసం ఏర్పరచుకుంటారు. అది వారి సాధనకు ఎంతగానో దోహదం చేస్తుంది.టిబెట్లో అత్యున్నతమైన యోగమూ బౌద్ధతంత్రమూ విలసిల్లడానికి కారణం అదే.

ఈలోపల రామన్నగారు ధ్యానంలోనుంచి లేచి గుడి బయటకు వచ్చినారు.

'ఈ ప్రదేశం తపస్సుకు చాలా అనుకూలంగా ఉన్నది' అని రామన్నగారన్నారు.

'అవును.ఇప్పుడు మనమందరమూ తపస్సు చేద్దాం.అయితే ఇదొక రకమైన విలక్షణ తపస్సు'- అన్నాను.

ఏమిటి అన్నట్లు అందరూ చూచారు.

'ఒక్కసారి చుట్టూ చూడండి' అన్నాను.

అక్కడ చెట్లకొమ్మల మీద చినిగిపోయిన ప్యాంటులూ షర్టులూ వేలాడుతూ కనిపిస్తున్నాయి.చెట్లలో అస్తవ్యస్తంగా విసిరేసి ఉన్న చీరలూ పరికిణీలూ కనిపిస్తున్నాయి.ఎవరో అక్కడ స్నానాలు చేసి, విడిచిన బట్టలు చెట్లలోకి విసిరేసి వెళ్ళినట్లు కనిపిస్తున్నది.గుడి చుట్టూతా ప్లాస్టిక్ సీసాలూ, ప్లాస్టిక్ కవర్లూ,రకరకాల కాగితాలూ, వాడిపారేసిన పూజా సామగ్రీ అంతా కలసి దరిద్రంగా ఉన్నాయి.మన పూజ అయిపొయింది కదా ఇక చెత్తాచెదారాన్ని ఎలా పడేస్తే మనకెందుకు అనుకుని ఆయా భక్తులు ఇష్టం వచ్చినట్లుగా గుడి పరిసరాలను పాడుచేసి పారేశారు అన్న విషయం స్పష్టంగా దర్శనం ఇస్తున్నది.

ప్రకృతి మౌనంగా రోదిస్తున్నట్లు నాకనిపించింది.

'వీటన్నిటినీ మనం ఇప్పుడు శుభ్రంచేసి మూటకట్టి తీసుకుని పోయి కొండ కింద పడేద్దాం.ఇవన్నీ ఈ ప్రకృతికి ఫారెన్ మెటీరియల్స్.పనికిమాలిన భక్తులు ఇక్కడికి కూడా వచ్చి ప్రకృతిని ప్లాస్టిక్ తోనూ విడిచేసిన గుడ్డలతోనూ ఎలా పాడు చేశారో చూడండి.ఇదే మన హిందూమతానికి పట్టిన దరిద్రం.ఏ పుణ్యక్షేత్రం చూచినా ఘోరమైన లిట్టరింగ్ కనిపిస్తుంది.మినిమం శుభ్రత అనేది లేని వీళ్ళేం భక్తులో నాకెప్పుడూ అర్ధంకాదు.'

శివునికి అష్టరూపాలున్నాయని మన గ్రంధాలలో ఉన్నది. పంచభూతాలూ, మనస్సు,అహమూ,జీవుడూ ఈ ఎనిమిదీ ఆయన రూపాలే అని శైవం అంటుంది.అంటే ఏమిటి?భూమీ,నీరూ,గాలీ,నిప్పూ,ఆకాశమూ శివ స్వరూపాలే.వాటిని పాడుచేస్తే శివద్రోహం చేసినట్లే.మూర్ఖులైన భక్తులు ఇక్కడకు వచ్చి భక్తి పేరిట ఇక్కడి ప్రకృతినంతా పాడుచేసి పెడుతున్నారు.ఇది భక్తి కాదు.దైవద్రోహం'- అన్నాను.
   
రాజు ఆశ్చర్యంగా చూచాడు.

'కొత్త విషయం వింటున్నాను సార్.అంటే పంచభూతాలలో దేనిని పాడు చేసినా అది శివలింగాన్ని ధ్వంసం చేసినట్లేనా?' అన్నాడు.

'అవును రాజు.ముస్లిములు మన దేవాలయాలు ధ్వంసం చేశారని వారిని మనం ఇప్పటికీ ద్వేషిస్తూ ఉంటాము.వాళ్ళే కాదు.మనమూ శివద్రోహం చేస్తున్నాము.శివస్వరూపమైన ప్రకృతిని పాడుచెయ్యడమే మనం చేస్తున్న శివద్రోహం' అన్నాను.

'ఇంక వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఉపయోగం ఏముంటుంది సార్?' అడిగాడు రాజు.

'అదేగదా నేను చెప్పేది.ఉపయోగం ఉండదూ ఏమీ ఉండదు.భక్తి పేరుతో ఇదొక ఆత్మవంచన.సోకాల్డ్ ఆధ్యాత్మికలోకంలో చాలా అజ్ఞానం ఉన్నది రాజూ. విగ్రహానికి పూజచేయ్యడమే గొప్ప అనుకుంటారు మూర్ఖులు.వారికి అంతకంటే అర్ధం కాదు.' అన్నాను.

ఇంతలో రామన్న గారికి ఒక అనుమానం వచ్చింది.

'అదేంటి సార్.మనకే ఈ కొండ ఎక్కడానికి ఇంత కష్టం అయ్యింది.ఇక చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు ఇక్కడికి ఎక్కి వచ్చి స్నానాలు చేసి చీరలు విసిరి పారేశారంటే ఆశ్చర్యంగా ఉన్నది.' అన్నారు.

'రామన్నగారు.గుంటూరు కృష్ణాజిల్లాల ఆడవాళ్ళను తక్కువ అంచనా వెయ్యకండి.వాళ్ళు మనకంటే ఎందులోనూ ఏమీ తీసిపోరు.' అన్నాను.

ఇలా మాట్లాడుకుంటూ ఆ కొండరాళ్ళ మీదా చెట్లకొమ్మల్లోనూ చిక్కుకున్న విడిచేసిన గుడ్డలన్నీ ఏరి రెండు చీరలలో మూటలు కట్టినాము.ఆ క్రమంలో ముళ్ళు గీరుకున్నా లెక్కచెయ్యకుండా,చెట్లలోకి వెళ్ళి,కొండఅంచులకి వెళ్ళి మరీ చెత్తను సేకరించాము.కొన్ని చీరలైతే కొన్నినెలల క్రితం విసిరి పారవేసినట్లుగా వాటిమీద మట్టీ రాళ్ళూ పేరుకుని ఉన్నాయి.అక్కడ ఉన్న ప్లాస్టిక్ సీసాలూ చెత్త కాయితాలూ ప్లాస్టిక్ కవర్లూ ఏరి మొత్తం నాలుగు మూటలు చేసినాము.ఆ చెత్త అంతా ఏరిన తర్వాత చుట్టూ చూస్తే ప్రకృతి అంతా నవ్వుతూ మమ్మల్ని దీవిస్తున్నట్లు అనిపించింది.

ఇంతలో రాజు ఒక అనుమానం వెలిబుచ్చాడు.

'సార్.ఈ బట్టలు విసిరేసిన వాళ్ళు ఇక్కడకొచ్చి ఏఏ వెధవ పనులు చేశారో?ఆ చీడపీడలు మనకెందుకు?ఏవో వెధవపనులు చేసి,ఇక్కడ స్నానాలు చేసి, పాపాలు వదిలించుకుని,బట్టలు విడిచి పారేసి,కొత్తబట్టలు తొడుక్కుని వెళ్ళిపోయారేమో?ఆ పాపాలన్నీ మనం ఎందుకు తాకాలి?ఈ పీడా మనకు పట్టుకోవచ్చు కదా?' అన్నాడు.

అది నిజమే.ఆ గుడ్డలు పట్టుకుంటుంటే, కుళ్ళిపోయిన శవాన్ని తాకినప్పుడు వచ్చేలాంటి ఏదో దరిద్రపు ఫీలింగ్ వస్తున్నది.

'చూడు రాజు.కాళీమాత మనల్ని ప్రసన్నంగా చూస్తున్నది.మనల్ని అనుక్షణం రక్షిస్తున్నది.శివకటాక్షం మనకు పుష్కలంగా ఉన్నది.ఏ చీడాపీడా మనల్ని ఏమీ చెయ్యలేదు.కాళికాశక్తి ముందు ప్రపంచంలోని ఏశక్తి అయినా తోకముడిచి పారిపోవలసిందే.ఏం భయపడకు.ఆ చీడాపీడా సంగతి నాకొదిలెయ్యి.వాటి సంగతి నేను చూచుకుంటాను.దుష్టశక్తులు మనల్ని చూచి భయపడాలి.వాటిని చూచి మనం భయపడటం ఏమాత్రం జరగదు.

మనం ఒక మంచిపనిని చేసున్నాము.ఈశ్వరభావంతో ప్రకృతిని శుభ్రం చేస్తున్నాము.దీనివల్ల మనకు మంచే జరుగుతుంది కాని చెడు జరగదు. భయం లేదు.కానివ్వు.మనం చేస్తున్నది నిజమైన తపస్సు.' అన్నాను.

పాపం రామన్న గారు.ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఈ కొండల్లో గుట్టల్లో పడి తిరుగుతూ ఎవరో పనికిమాలిన వెధవభక్తులు విడిచి పారేసిన గుడ్డలు ఏరుతూ ప్రకృతిని శుభ్రం చెయ్యడం చూస్తుంటే,విచక్షణా రహితంగా ప్రకృతిని పాడుచేస్తున్న మన భారతీయులు సిగ్గుతో తలవంచుకోవాలనిపించింది.సివిక్ సెన్స్ అనేది మన ఇండియా వెధవలకు ఎప్పుడు వస్తుందో కదా అని బాధ కలిగింది.రామన్నగారి మాతృదేశప్రేమకు ఆశ్చర్యం వేసింది.

ఆ మూటలు మోసుకుని కొండదిగి కిందకు వచ్చి వాటిని కిందపడేశాము.ఒకచేతిలో మూటతో రాళ్ళలో కొండ దిగడంకదా.దారిలో రామన్నగారు ఊపుగా కిందకు దిగుతూ బొక్కబోర్లా ముందుకు పడబోయారు.ఆయనకంటే ముందుగా దిగుతూ అక్కడ ఉన్న మదన్ పట్టుకుని ఆపినాడు.నేనైతే కాలు స్లిప్ అయి కిందపడి రెండడుగులు జర్రున రాళ్ళమీద జారాను. సరే మొత్తంమీద ఒకగంట సేపు కష్టపడి కిందకు దిగినాము.అప్పుడు గనక మా వాలకాలు ఎవరైనా చూస్తే కాలవలో గుడ్డలు ఉతకడానికి మూటలు మోసుకుపోతున్న పల్లెటూరి చాకలివాళ్ళలా ఉన్నాము.బాగా చదువుకుని సమాజంలో ఉన్నతస్థానంలో మంచి ఉద్యోగాలలో ఉన్నామని ఆ క్షణంలో మమ్మల్ని చూచిన ఎవ్వరూ అనుకోరు.

'ఈ మూటలతో కొన్ని ఫోటోలు దిగుదాము.పాతకాలంలో పులిని కొట్టి తెచ్చినవారు దాని శవం ముందు నిలబడి ఫోటోలు దిగేవారు.మనం ఆ పని చెయ్యలేము.కాబట్టి ఈ చెత్తమూటలనే కాసేపు పులి అనుకుందాం.మనమే జిం కార్బెట్ అనుకుందాం కాసేపు.' అన్నాను.

అందరం నవ్వుకుంటూ ఫోటోలు దిగి, ఆ మూటలను రోడ్డుపక్కన ఉన్న ఒక డస్ట్ బిన్ దగ్గర పడేసి మా కారు తీసుకుని మళ్ళీ కొండపైకి(బ్రహ్మశిఖరం వైపు) బయల్దేరాము.

కార్ డ్రైవ్ చేస్తూ తలతిప్పి కొండవైపు చూచాను.శుభ్రపడిన విష్ణుశిఖరం ప్రసన్నంగా మమ్మల్ని దీవిస్తున్నట్లు అనిపించింది. 

(ఇంకా ఉంది)