“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, డిసెంబర్ 2012, గురువారం

21-12-2012 మహాప్రళయం

దాదాపుగా ఏడాది ముందునుంచే 21-12-2012 న యుగాంతం అనీ మహాప్రళయం ముంచుకోస్తున్నదనీ,ఇంకా ఏమేమో పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తాయి.భూమి మొత్తం బద్దలైపోతుందనీ, గ్రహాంతరవాసులు దండెత్తి వస్తారనీ,రేడియేషన్ కు భూమి గురౌతుందనీ ఇలా రకరకాలైన ఊహాగానాలు ఎవరిష్టమొచ్చినట్లు వారు చేసారు.మాయన్ కేలండర్ ఈ తేదీన అంతం అయిందనీ అందుకని సృష్టే అంతం అవుతుందనీ కొందరి వాదన.

ఒక జాతి సృష్టించుకున్న కేలండర్ అంతం అయినంత మాత్రాన సృష్టికి ఏమీ కాదు.నిజానికి ఇలాంటి తేదీలు ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి. 1962 లో అష్టగ్రహకూటమి వచ్చినపుడు కూడా యుగాంతం అని చాలామంది భయపడ్డారు.రమణాశ్రమంలో ఉన్న చలంగారైతే ప్రపంచం మునిగిపోతుందనీ ఒక్క అరుణాచలమే మునగకుండా మిగులుతుందనీ భావించి స్నేహితులను అందరినీ అరుణాచలం వచ్చి ప్రాణాలు కాపాడుకొమ్మని ఉత్తరాలు కూడా వ్రాశారు.ఆయన అలా నమ్మడానికి సౌరిస్ కూడా ఒక కారణం.మహాప్రళయం వస్తున్నదని ఆమెకూడా నమ్మింది. చలాన్ని కూడా నమ్మించింది. కానీ ఆరోజు వచ్చింది పోయింది.లోకానికి మాత్రం ఏమీ కాలేదు.ఇలాంటి ఒక మూఢనమ్మకాన్ని నమ్మి ఇలా మోసపోయానని చలం చాలా బాధపడి ఎందుకిలా చెప్పావని సౌరిస్ ను నిలదీశాడు కూడా. సరే అదొక కధ.

ప్రస్తుతానికి దానిని అలా ఉంచి,1999 కి వద్దాం.ఆ ఏడాది కలియుగాంతం కాబోతున్నదని వేదవ్యాస్ గారు ఒక సిద్ధాంతగ్రంధమే వ్రాసి జనం మీదకు వదిలాడు.అందులో భూమి ఇరుసు తల్లకిందులౌతుందనీ,దిక్కులు మారిపోతాయనీ, ధ్రువాల చోట్లు మారిపోతాయనీ,శుక్రగ్రహం వచ్చి భూమిని గుద్దుకుంటుందనీ ఏమేమో వ్రాసి పారేశాడు. అందులో ఒక్కటీ జరగలేదు. ఆ పుస్తకం మాత్రం తెగ అమ్ముడుపోయింది. ఈలోపల 1999 రానూ వచ్చింది పోనూ పోయింది.భూమి నిక్షేపంగా ఉంది.వేదవ్యాస్ గారు మాత్రం వెళ్ళిపోయాడు.

ప్రస్తుతం కూడా అదే జరగబోతున్నది. అన్ని రోజులలాగే రేపూ వస్తుంది. పోతుంది.భూమికి ఏమీ కాదు.ఏ విధమైన ప్రళయమూ రాదు.యుగాంతం అసలే కాదు.అంతా నిక్షేపంగా ఉంటుంది.

అసలు మనుషులకు ఇదొక జబ్బు అని నాఊహ.ఏదొ జరిగి అంతా సర్వనాశనం అవుతుంది అని అతి ప్రాచీనకాలం నుంచీ మానవజాతికి ఒక నమ్మకం అంతచ్చేతనలో పాతుకొని పోయింది. దీనికి కారణం మానవుల సమిష్టి అంతచ్చేతన(collective sub-conscious)లో ఉన్న తీవ్రమైన అపరాధభావన మాత్రమె.మనుషులకు తాము చేస్తున్న తప్పులు తెలుసు.వారు కళ్ళు మూసుకున్నా వారి అంతరాత్మ కళ్ళు మూసుకోదు. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ,రాత్రి పడుకోబోయేవరకూ,తప్పులు చెయ్యని మనిషంటూ ఈ భూమిమీద ఉండడని నా నమ్మకం. ఈ సంగతి ఎవరికీ వారికి వారి లోలోపల తెలుసు. 

కనుక తాము చేస్తున్న తప్పులకు తమకు ఏదో ఘోరమైన శిక్ష ఎప్పుడో పడుతుంది అని ప్రతివాడూ తన మనస్సు లోతుల్లో విశ్వసిస్తూనే ఉంటాడు. అంటే ప్రతివాడూ తీవ్రమైన అపరాధ భావనతో దొంగలాగా బతుకుతున్నాడు. కనుక ఏదో ప్రళయం ఎప్పుడో వస్తుందని,దేవుడో ప్రక్రుతో తమకు ఏదో భయంకరమైన శిక్ష విధిస్తుందని ప్రతివాడూ నమ్ముతూ ఉంటాడు.ఈ భావన ప్రాచీనకాలం నుంచీ మానవజాతిలో పెంచి పోషించబడుతూ ఉన్నది. ఈ అపరాధ భావన (guilt) లేకుండా పోయినప్పుడు ఈ భయమూ పోతుంది.  దానితోబాటు చావంటే భయమూ,నరకం అంటే భయమూ,ప్రళయం అంటే భయమూ కూడా పోతాయి.మనుషులు చేసే దొంగపూజలూ,దొంగదీక్షలూ, దేవుడికి వస్తువుల రూపంలో లంచాలివ్వడమూ కూడా ఈ అపరాధభావన ఫలితాలే.

అయితే అసలంటూ ఏమీ జరగదా? అంటే జరుగుతుంది అనే చెబుతాను.  అయితే లోకం అనుకుంటున్నట్లు జరగదు.1962 లో అష్టగ్రహకూటమి వల్ల ప్రళయం రాకపోయినా, ప్రళయాన్ని సృష్టించగల వికృతమనస్తత్వం ఉన్న జీవులు అనేకమంది ఆ తర్వాత ఈ భూమ్మీద జన్మ ఎత్తారు. ఆ తర్వాత పుట్టిన తరాన్ని ఒకసారి గమనిస్తే ఇది నిజం అని తెలుస్తుంది.2000 తర్వాత పుట్టిన తరం 1960 లలో పుట్టిన తరంకంటే చాలా విభిన్నమైనది.అలాగే ఇప్పుడూ జరుగుతుంది. ఇకముందు పుట్టబోయే తరం ఇంకా వికృత స్వభావాలతో ఉంటుంది. ప్రస్తుత తల్లిదండ్రులు ఎంత వికృత మనస్తత్వాలతో ఉన్నారో గమనిస్తే ఇది తేటతెల్లం అవుతుంది. ఒక ఘట్టం మారినపుడు ఈవిధంగా ప్రకృతిగతిలో మార్పు వస్తుంది. కాని దానిప్రభావం మనం అనుకున్న రీతిలో మహాప్రళయం లాగా కనిపించదు.ఆ మార్పులు సూక్ష్మంగా ఉంటాయి.ప్రకృతి అంతా ఒక కాస్మిక్ ప్లాన్ ప్రకారం నడుస్తున్నది.దానిని మనం అర్ధం చేసుకోవాలి.అంతేగాని మన భయాలను,మూఢ నమ్మకాలను ప్రకృతిమీద రుద్దితే ఆరుద్దుడు భరించాల్సిన ఖర్మ ప్రక్రుతికేమీ లేదు.ప్రకృతి మనం చెప్పినట్లు నడవదు.

భవిష్యత్తులో విధ్వంసం జరిగే పరిస్తితులకు ఇప్పుడు బీజాలు పడతాయి. కొన్నికొన్ని నిత్య నైమిత్తిక ప్రళయాలు జరుగుతాయి.జనహననం జరుగుతుంది.కాని అది యుగాంతమూ, ప్రళయమూ మాత్రం కానేకాదు.

ప్రస్తుతం నీచలో ఉన్న రాహుకేతువులు గత ఏడాదిన్నరగా సృష్టిస్తున్న విధ్వంసం ప్రళయం కాకపోతే మరేమిటి? ప్రళయాలలో నిత్య,నైమిత్తిక,మహా ప్రళయాలని తేడాలున్నాయి. మహాప్రళయం అప్పుడే రాదు.దానికి ఇంకా ఎంతో సమయం గడవాలి. కాని నిత్య,నైమిత్తిక ప్రళయాలు మాత్రం చక్కగా వస్తూనే ఉంటాయి.అక్కడక్కడా జనసమూహాలను తుడిచి పెడుతూనే ఉంటాయి.ఎంతోమందిని దుర్మరణం పాలు చేసి పరలోకానికి తీసుకుపోతూనే ఉంటాయి.ఇవి నిత్యమూ జరుగుతూనే ఉన్నాయి.కాకుంటే కొన్నికొన్ని గ్రహస్తితులలో ఎక్కువ వేగంగా జరుగుతాయి.ఆ స్తితులు మారినప్పుడు నిదానంగా జరుగుతాయి.

కనుక భూగోళానికి ఇప్పట్లో వచ్చిన భయం ఏమీలేదు.ఈ పుకార్లు నమ్మకండి.ప్రళయం రాదు.మానవజాతికి ఇప్పట్లో ఏమీకాదు.అన్ని రోజులలాగే రేపు కూడా వస్తుంది.పోతుంది. మనం మళ్ళీ ఇంకో ప్రళయడేట్ కోసం వెతుక్కుందాం.దాన్ని ఉపయోగించుకుని మళ్ళీ సినిమాలు తీద్దాం.పుస్తకాలు రాద్దాం.ప్రళయబూచిని చూపించి అర్జెంటుగా మతాలు మారుద్దాం.ఈ సాకును ఉపయోగించుకొని రకరకాల వ్యాపారాలు చేసి జనానికి బాగా టోపీలు వేసి సంపాదిద్దాం. మిలియన్ల డాలర్లు సర్కులేట్ చేద్దాం. 

అయినా మీపిచ్చిగాని,ప్రళయం వచ్చేటంతగా మనపాపం ఇంకా పండలేదు.ప్రళయాన్ని ఆహ్వానించడానికి మన పాపాల బలం ప్రస్తుతానికి చాలదు.కనుక అర్జెంటుగా మరిన్ని పాపాలు,కొత్తకొత్త వెరైటీ పాపాలు ఇంకాఇంకా చేసి భూభారం బాగా పెంచుదాం.అప్పుడుగాని ప్రకృతికి కోపం రాదు,అప్పుడుగాని ప్రళయం రాదు.ఇప్పట్లో ఆచాన్స్ లేదు కనుక, అప్పటిదాకా -- సర్వే ప్రాణినా స్సుఖినో భవంతు.