“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, డిసెంబర్ 2012, సోమవారం

ప్రణవనాదము సప్తస్వరములై బరగ

'త్యాగరాజ సాంస్కృతిక సంఘం' అని ఒకటి గుంటూరులో ఉన్నది.దాని కార్యవర్గ సభ్యులు అందరూ మంచి సంగీత ప్రియులు.నాకు మంచి మిత్రులు.దాని ఉపకార్యదర్శి గిరిజాశంకర్ గారు ఒక సంగీత నిధి.ఆయన దగ్గర ఉన్నంత క్లాసికల్ మ్యూజిక్ కలెక్షన్ ఆంధ్రదేశంలోనే అతి తక్కువమంది దగ్గర ఉంటుంది.శాస్త్రీయ సంగీతం గురించి ఆయన అనర్గళంగా గంటలు గంటలు మాట్లాడగలడు. ఆయన నాకు మంచి మిత్రుడు కావడంతో నిన్న ఆ సంస్థలో జరిగిన అయ్యగారి సత్యప్రసాద్ 'వీణ కచేరి'కి నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించాడు.

'అయ్యగారి' వంశం వీణ వాయించడంలో పేరుగాంచిన వంశం. సత్యప్రసాద్ గారి తండ్రి అయ్యగారి సోమేశ్వరరావు గారు, సోదరుడు అయ్యగారి శ్యామసుందర్ గారు,మేనమామ పప్పు చంద్రశేఖర్ గారు అందరూ వీణావాదనలో అఖండమైన ప్రజ్ఞ కలిగిన విద్వాంసులు.సంగీతం అలా కొన్ని కొన్ని వంశాలలో పరంపరగా వస్తూ ఉంటుంది.అది వారి రక్తంలోనే ఉన్నదా అనిపిస్తుంది.అలాంటి వంశంలో 'నల్లాన్ చక్రవర్తుల' వంశం కూడా ఒకటి. 

సత్యప్రసాద్ గారి కచేరి నేను ఎప్పుడూ వినలేదు. అద్భుతమైన వీణావాదన ప్రజ్ఞతో ముక్కోటి ఏకాదశి రోజున శ్రోతలను సంగీతప్రపంచంలో ఓలలాడించారు. కొంతమంది వీణను వారిపైన వేసుకుని,వారు వీణమీద పడిపోయి,నానా హైరానా అయిపోతారు. సత్యప్రసాద్ గారు అలాకాకుండా చాలా అనాయాసంగా సునాయాసంగా వీణను వీణగా వాయించి రక్తికట్టించారు.త్యాగరాజ కృతులను,అన్నమయ్య కీర్తనలను,శంకరుల భజగోవింద శ్లోకాలను వారు సునాయాసంగా వీణపైన వాయించిన తీరు అద్భుతంగా ఉన్నది.

మిత్రుడు గిరిజాశంకర్ మంచి హాస్యప్రియుడు. ఆయనిలా అన్నాడు.'కొందరు వీణ వాయిస్తారు.ఇంకొందరు వీణతో వాయిస్తారు.సత్యప్రసాద్ గారు మొదటి కోవకు చెందిన విద్వాంసుడు.' ఈ జోక్ కు చాలాసేపు నవ్వుకున్నాము.

కదనకుతూహల రాగంలో వినవచ్చే 'గిటార్ నోట్స్' ను వీణపైన పలికించిన తీరు శ్రోతలను మైమరపింప చేసింది.వీణ మీద గిటార్ నోట్స్ పలికించడం ఎంత కష్టమో,దానికి ఎంత సాధన కావాలో? అలాగే 'చారుకేశి' రాగాన్ని తీసుకుని రాగమాలికా పద్దతిలో ఏడెనిమిది రాగాలను స్పృశిస్తూ మళ్ళీ చివరికి 'చారుకేశి' రాగంలోనికి తీసుకువచ్చి ముగించిన అంకం వారి సంగీత ప్రజ్ఞకు నిదర్శనం.

వీణకు మన వాయిద్యాలలో ప్రత్యెక స్థానం ఉన్నది. నారదుడు,తుంబురుడు వంటి దేవర్షుల చేతిలో ఉండే ప్రత్యేకత దీని సొంతం.అంతేగాక చదువులతల్లి కరసీమను అలంకరించగల అదృష్టం కూడా వీణ సొంతం.కనుక ఇది దేవతా వాయిద్యం అని చెప్పవచ్చు.ఇదేగాక వీణకూ అంతరిక యోగసాధనకూ సంబంధం ఉన్నది.వెన్నెముకను కూడా వీణాదండం అంటారు.అందులోని సప్తచక్రాలలో ప్రాణసంచారం జరిపి సప్తస్వరాలను పలికిస్తూ ఆరోహణా అవరోహణాక్రమంలో సమస్త రాగాలనూ లోలోపల వినగలిగే విద్య నాదోపాసన.

శ్రీరామకృష్ణులు తమ సాధనాకాలంలో వీణానాదాన్ని లోలోపల విని సమాధి నిమగ్నులయ్యేవారు. తర్వాతి కాలంలో కూడా ఆయన సమక్షంలో వీణ వాయించబడితే వెంటనే ఆయనకు సమాధిస్తితి కలిగేది.అభినవగుప్తుడు కూడా వీణావాదన తత్పరుడే.యోగులకు వీణకు సంబంధం ఉన్నది.తెలిసినవారికి వీణావాదన మోక్షప్రసాదిని అయిన ఒక యోగం. తెలియని వారికి ఇతర వాయిద్యాలవలె అదికూడా ఒక వాయిద్యం. మహాభక్తుడూ సంగీతనిధి అయిన  త్యాగయ్య కూడా పరమేశ్వరుని వీణానాద లోలునిగా కీర్తిస్తాడు.  

ఇదే విషయాన్ని నా ప్రసంగంలో క్లుప్తంగా చెప్పాను.వెంటనే సత్యప్రసాద్ గారు 'సారమతీ'  రాగంలో సద్గురు త్యాగరాజ విరచితమైన 'మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు' అనే కీర్తనను అందుకొని అద్భుతంగా వీణపైన వాయించి వినిపించారు. మహానందం కలిగింది.

పల్లవి 
మోక్షము గలదా ? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు
అనుపల్లవి 
సాక్షాత్కార నీ సద్భక్తి - సంగీతజ్ఞాన విహీనులకు
చరణము 
ప్రాణానల సంయోగము వలన
ప్రణవ నాదము సప్తస్వరములై బరగ
వీణావాదన లోలుడౌ శివమనో
విధ మెఱుగరు, త్యాగరాజ వినుత!    

ఈ కీర్తనలో సద్గురుత్యాగరాజు నాదోపాసనకు-యోగసాధనకు-మోక్షప్రాప్తికి గల సంబంధాన్ని సూక్ష్మంగా వివరిస్తూ సాక్షాత్తూ పరమశివుని 'వీణావాదన లోలుడు' అంటాడు. నిజమే. అంతరిక వీణానాదమైన ప్రణవాన్ని వింటూ తన్మయ స్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటాడు యోగేశ్వరుడగు పరమేశ్వరుడు.

అసలు మన భారతీయ సంగీతంలోనే ఒక గొప్ప మహత్తు ఉన్నది.పాశ్చాత్య సంగీతంలాగా మనస్సును బహిర్ముఖం చేసి,ఇంద్రియ చాపల్యాన్నీ,మనో చంచలత్వాన్నీ పెంచేది కాదు భారతీయసంగీతం.తద్విరుద్ధంగా ఇంద్రియాలనూ మనస్సునూ అంతర్ముఖం చేసి భగవదనుభూతిని కలిగించ గలశక్తి మన సంగీతానికి ఉన్నది.అయితే దానిని యోగంగా అభ్యసించాలి. అప్పుడే ఆ స్థాయికి అది చేరుస్తుంది.అలాంటి దివ్యమైన సాధనను సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు,శ్యామశాస్త్రి,దీక్షితులు ఇంకెందరో మహనీయులు ఆచరించారు.జీవన్ముక్తిని పొంది నాదాకాశంలో ద్రువతారల వలె వారు వెలుగు తున్నారు.వారి సాహిత్యంలో వేదమూ,వేదాంతమూ,నాద యోగమూ,భక్తీ,వైరాగ్యమూ,జ్ఞానమూ మొదలైన ఎన్నో అమూల్యమైన నిధులు నిండి ఉంటాయి.ఆ కీర్తనలను శుద్ధంగా నేర్చుకుని త్రికరణశుద్ధిగా పాడేవారికి వ్యక్తిత్వమే ఉదాత్తంగా మారిపోతుంది.అలాంటి శక్తి మన సంగీతానికి ఉన్నది.ఇటువంటి వెలలేని నిధిని మనం విస్మరిస్తూ పిచ్చిదైన విదేశీసంగీతంవైపు వెర్రిగా పరిగెత్తుతున్నాం.విలువలూ వ్యక్తిత్వమూ ఏమాత్రంలేని సినీ క్షుద్రజీవులు సృష్టిస్తున్న రొచ్చుసంగీతం ఒకపక్క సమాజాన్ని సర్వనాశనం చేస్తూ తనపాత్ర తాను చక్కగా పోషిస్తున్నది.అమృతం అందుబాటులో ఉంచుకుని రోడ్డుపక్కన కుళ్ళుకాలువలో నీళ్ళు తాగుతున్న దౌర్భాగ్యుని వలె ఉన్నది మన స్తితి.

నాకు సంగీతంలో లోతుపాతులు తెలియవు.నేను సంగీత అజ్ఞుడనే గాని, సంగీతజ్ఞుడను కాను.కాని ఏమాత్రం సంగీతజ్ఞానం లేనప్పటికీ ఒక పసిబాలుడు తన తల్లి జోలపాటకు మైమరచి ఎలా నిద్రలోకి జారుకుంటాడో,ఆ రీతిలో సంగీతాన్ని ఆస్వాదించగలను.తెలిసినవారికి సంగీతం ధ్యానస్తితిని అందిస్తుంది.తెలియనివారికి కాసేపు కాలక్షేపంగా ఉంటుంది.ఒక ధ్యానిగా నేను నాదంలో నిమగ్నం కాగలను.ఒక రాగపు ఆత్మతో తాదాత్మ్యం చెందగలను.ఆ విధంగా నేను సంగీతాన్ని ఆనందించగలను.కాని సంగీతంలోని శాస్త్రీయపు లోతులు,దాని technicalities నాకు తెలియవు.

నాకు తెలిసినంతవరకూ,సంగీతంలో మూడు స్తాయిలున్నాయి.ఒకటి ఇంద్రియాలను రేగజేసి మనిషిని పశువుస్తాయికి తీసుకుపోయే సంగీతం.నేడు మనకు లభిస్తున్న పాశ్చాత్యసంగీతమూ,మన సినీరొచ్చు సంగీతమూ సమస్తమూ ఇలాంటిదే.ఇది పశుస్తాయి.రెండవది, మానవునిలో  ప్రేమ,దయ, కరుణవంటి ఉదాత్తమైన భావనలను రేకెత్తించగల సంగీతం. ఇది మానవస్థాయి.ఇదే స్థాయిలో ప్రకృతిశక్తులను కదిలించగల ప్రజ్ఞకూడా ఒక ఉన్నతభాగం.ఆలాపనతో కూడిన హిందూస్తానీ రాగాలకు ఈశక్తి ఉన్నది.తాన్సేన్ వంటి మహా విద్వాంసులకు మాత్రమె ఇదిసాధ్యం.ఇక మూడవది అయిన దివ్యసంగీతానికి మనిషి మనస్సును ఇంద్రియాతీత స్థితికి లేవనెత్తి సరాసరి దైవదర్శనాన్ని కలిగించగల శక్తి ఉన్నది. త్యాగయ్య వంటి పరమభక్తాగ్రేసరులకూ,నారదుడు,తుంబురుడు వంటి దేవర్షులకే ఈ స్థాయికి చెందిన సంగీతం సాధ్యం.ఇది మానవులకు చేతనయ్యే స్థాయి కాదు.

సంగీతపు పరమప్రయోజనం ధ్యానస్తితిని అలవోకగా అందించడమే.నిజంగా చెప్పాలంటే లయసిద్ధి నెరిగిన యోగులే సంగీతాన్ని శుద్ధంగా ఆస్వాదించ గలరు.నిజమైన సంగీతసాధకులు యోగులు అందుకునే స్తితినే అందుకుంటారు.అలా అందుకోలేకపోతే వారిది ఉత్త కాలక్షేపసంగీతమే కాని నాదయోగం కాలేదు.మానవ మనస్సును భగవదున్ముఖం గావించి  రససిద్ధిలో లయాన్ని సిద్ధింపజేయడమే సంగీతం యొక్క అంతిమలక్ష్యం.

సత్యప్రసాద్ గారిలో ఏళ్ళ తరబడి వీణను ఒక తపస్సుగా అభ్యసించిన దీక్ష కనిపించింది.కనుకనే ఆయన వీణను వాయించినప్పుడు కూడా తన్మయత్వంతో కళ్ళు మూసుకుని తానే ముందుగా ఆ నాదాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు.చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఎలాంటి పక్కదారులూ పట్టకుండా రెండున్నర గంటలు వినిపించి మాకు ఆనందాన్ని కలిగించారు.ఆయన ఇంకాఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని 'వీణావాదనలోలుడౌ శివుని' పరమకటాక్షానికి పాత్రుడవ్వాలనీ కోరుకుంటున్నాను.

మొత్తమ్మీద నిన్నటి ముక్కోటిఏకాదశి పర్వదినపు సాయంత్రం వీణానాదపు అద్భుతలోకంలో విహరింపచేసి దివ్యమైన భావలహరితో కూడిన ఆనందానుభూతిని మిగిల్చింది.ఈ అవకాశాన్ని నా స్నేహితుల రూపంలో నాదలోలుడైన ఆ పరమేశ్వరుడే నాకు అందించాడు.ఇదే విషయం మిత్రులకు చెప్పాను.