“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, ఆగస్టు 2009, గురువారం

ఒక విషాద కథ


మాకు తెలిసిన ఒక అమ్మాయికి 2003 లో పెళ్ళయింది. అప్పటికి అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి. జాతకం చూడమని నన్ను అడిగితే చూచాను. తనది ధనుర్లగ్నం. కుటుంబ స్థానంలో గురువు నీచలో ఉన్నాడు. సప్తమం, మాంగల్య స్థానం కూడా దెబ్బ తిన్నాయి. సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు. కనుక అప్పుడే పెళ్లి వద్దనీ, ముందు గురు, బుధ గ్రహాల దోష పరిహారం చేసుకొని, 24 ఏళ్ళు దాటిన తరువాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను.

కాని ఆ అమ్మాయి వినలేదు. మంచి సంబంధం వచ్చింది కాబట్టి చేసుకుంటానని మొండి పట్టు పట్టి మరీ పెళ్లి చేసుకుంది. ఇంతకంటే మంచి సంబంధాలు తెస్తామని ఒక పెళ్ళిళ్ళ పేరయ్య కూడా మొత్తుకున్నాడు. ఎంతమంది చెప్పినా వినలేదు. తర్వాత కొన్నేళ్ళు అంతా బాగానే ఉంది. వివాహ జీవితం బాగానే సంతోషంగా సాగుతున్నది. ఇల్లు కొనుక్కున్నారు. సామాన్లు సమకూర్చుకుంటున్నారు. నేను చెప్పినది అంతా తప్పని వాళ్ళలో వాళ్లు అనుకున్నారు. కొన్నాళ్ళు కనిపించేది. తరువాత కనిపించటం మానేసింది. కానీ వార్తలు తెలుస్తుందేవి.

కొన్నేళ్ళు బాగానే ఉన్న మొగుడు మెల్లగా చెడు సావాసాలు మరిగి, తాగుడు తందనాలు అలవాటు పడ్డాడు. క్రిమినల్ కేసులో ఇరుక్కొని బయట పడ్డాడు. సంసారంలో కష్టాలు మొదలయ్యాయి. ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇలా రెండు మూడేళ్లు గడిచింది. నిన్న షాకింగ్ న్యూస్ వచ్చింది. తాగుడు కు అలవాటు పడి, ఈ అమ్మాయిని కొట్టటం చేస్తుంటే, తను, తన అత్తగారు కలిసి ఎదురు తిరిగి గడ్డి పెట్టారు. గొడవ జరిగింది. ఆ కోపంలో కిరసనాయిలు మీద పోసుకొని అంటించుకున్నాడు. భగ్గున మంటలు రేగితే, వీళ్ళకు తెలీక చెరో బక్కేట్టూ నీళ్లు పోశారు. 80 % కాలిన గాయాలతో బొబ్బలతో రెండు మూడు ఆస్పత్రులు తిరిగి ఎవరూ చేర్చుకోక పోతే, చివరికి గుంటూరు జెనరల్ ఆస్పత్రిలో పది రోజుల క్రిందట చనిపోయాడు.

ఇప్పుడు ఈ అమ్మాయికి 24 ఏళ్ళు. ఇద్దరు ఆడ పిల్లలు. చదువు లేదు. ఇంకా అత్తగారు మంచిది కాబట్టి తనతోనే ఉండమని చెప్పింది. భవిష్యత్తు అంధకారం. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ మకరంలో గురువు నీచ స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడే ఈ సంఘటన జరగటం ఏమిటి? ఒకవేళ గ్రహ దోషం పరిహారం చేసుకొని, ఈ ఆరేళ్ళూ ఆగి గురువు రెండవ ఆవృత్తి అయిన తర్వాత పెళ్లి చేసుకొని ఉంటే ఇలా జరిగేది కాదా? అప్పుడు వివాహ జీవితం బాగుండేదేమో? 


ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. కర్మ బలీయంగా ఉన్నపుడు మంచి చెప్పినా వినాలని బుద్ధి పుట్టదు.తర్వాత బాధపడతారు.ఏం చేస్తాం?బుద్ధి కర్మానుసారిణి అన్న సామెత ఊరకే రాలేదు కదా.