“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, మే 2009, బుధవారం

కుండలినీ యోగం

దైవశక్తి ఊర్ధ్వస్తాయిలలోనుంచి అవరోహణాక్రమంలో క్రమేణా దిగివచ్చి స్థూలంగా మారి కుండలినీశక్తిగా మనిషి వెన్నెముక అడుగున నిద్రాణస్థితిలో ఉంటుంది.కనుక మనిషి ప్రకృతికి,పంచభూతాలకు దాసుడై జీవితం గడుపుతున్నాడు. శక్తిని ఊర్ధ్వగామినిగా చేసి శిరస్సుపైన ఉన్న సహస్రదళపద్మంలోకి తీసుకు వెళ్ళగలిగితే మనిషి ప్రకృతి దాస్యంనుండి విముక్తుడై దైవత్వాన్ని పొందుతాడు. ప్రక్రియనే కుండలినీయోగం అంటారు.

దీనికి కులంతో మతంతో పనిలేదు. శరీరం ఉన్న ప్రతి మానవునిలో ఈప్రక్రియ జరిగితేనే దైవత్వం కలుగుతుంది. మనుషులు కల్పించుకున్న కులమతాలతో దీనికి సంబంధంలేదు. ఏ మనిషైనా ఈ ప్రక్రియకు చెందిన నియమనిష్టలను పాటిస్తూ సాధన చెయ్యగలిగితే ఇది సాధ్యం అవుతుంది. ఏ మతానికి చెందిన ప్రవక్తలైనా, మహాత్ములైనా ఈ ప్రక్రియను తెలిసో తెలియకో ఆచరించి, అనుభూతి పొందినవారే. ఆ అనుభూతిని వారివారి భాషలలో, నమ్మకాలలో పొదిగి లోకానికి చెప్పినవారే.

చెప్పటానికి రెండు ముక్కలలో తేలికగా ఉన్నప్పటికీ దీనిని సాధించడానికి జన్మలు చాలవు.కాని నేడు కుండలినీయోగం ఒక ఫేషన్ అయిపోయింది. శక్తిపాతం చేస్తామని,స్పర్శతో కుండలినిని నిద్ర లేపుతామని చెప్పి వేలకు వేలు ఫీజులు వసూలు చేసే నకిలీగురువులు ఊరికొకరు తయారు అయ్యారు. నిజానికి వీరెవరూ కుండలినీయోగంలోని రహస్యాలు తెలిసినవారు కారు. వీరందరూ మోసగాళ్ళే అని నేను ఘంటాపధంగా చెప్పగలను.

కుండలినీ ప్రబోధం చేయటం చాలా కష్టమైన పని. ఎదుటి వ్యక్తిలో శక్తిపాతం ద్వారా ఈ పనిచేస్తామని ప్రచారం చేసుకోవటం పచ్చిబూటకం.నేడు గురువులమని, అవతారపురుషులమని చెప్పుకునే వారెవరికీ ఇది చెయ్యగల సామర్ధ్యం లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

కుండలినీ యోగసాధకునికి కొన్ని ప్రత్యెకఅర్హతలు ఉండాలి. అలాగే గురువుకూ కూడా.అలాంటి గురుశిష్యులు కోటికి ఒకరు కూడా ఉండరు. అటువంటివారి మధ్యనే ఈ అద్భుతం జరుగుతుంది. అంతేగాని నేడు ప్రచారంలో ఉన్న యోగాక్లాసులు,టీవీ బోధనలు,కోర్సులు,పార్టు టైము దీక్షలవల్ల ఇది జరుగదుగాక జరుగదు.ఎవరైనా అలా జరిగిందని జరుగుతుందని చెబితే అది భ్రమ మాత్రమె.ఈ క్లాసుల వల్ల ఆరోగ్యం కొంచెం బాగుపడుతుంది. అంతే.

ఎందుకంటే కుండలినీయోగసాధనలో ప్రతిమెట్టులో కొన్ని ఋజువులు కనిపిస్తాయి.శరీరంలో మనస్సులో అనేకమార్పులు కలుగుతాయి. హార్మోన్ సిస్టం ఊహించని మార్పులకు లోనవుతుంది.బాడీకెమిస్ట్రీ మొత్తం అతలా కుతలమై కొత్తరూపు దాలుస్తుంది.ఇవి యోగరహస్యాలు.ఎక్కడా పుస్తకాలలో కనిపించవు.గురుశిష్యపరంపరగా వస్తుంటాయి.ఒక సాధకుని చూచి అతనిలోని లక్షణాలను గమనించి అతను ఏ మెట్టుదాకా వచ్చాడో చెప్పవచ్చు.వారిలో కనిపించే లక్షణాలే వారిని పట్టిస్తాయి.ఇదొక అత్యంత రహస్య విజ్ఞానం.

ఎవరికైనా కుండలినీ ప్రబోధం కలిగింది అని చెబితే వారిలో ఆయా లక్షణాలు, ఋజువులు కనిపించాలి. అవి లేనపుడు వారు చెప్పేదంతా ఒట్టిబూటకం అని తెలుస్తూంది.99% కేసులలో కుండలినీ ప్రబోధం, షట్చక్రభేదనం మొదలైనవి self induced hallucinations మాత్రమె. జనాన్ని మోసం చెయ్యడానికి వారి పబ్బం గడుపుకోడానికి నకిలీగురువులు పన్నే పన్నాగాలు మాత్రమె అని లోకులు గ్రహిస్తే మంచిది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గురువులేవ్వరికే ఇతరులలో కుండలినీ ప్రబోధం చెయ్యగలిగే శక్తి లేదు అన్నది చేదునిజం.