“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, మే 2009, గురువారం

బుద్దుడు చూపిన మార్గం- ఉపోద్ఘాతం

రెండున్నర వేల సంవత్సరాల తరువాత తిరిగి భరతావనిలో బుద్దుని బోధనలు వెలుగు చూస్తున్నాయి. బౌద్ధ సంఘాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ విషయం బుద్దుడే స్వయంగా చెప్పినట్లు బౌద్ధ త్రిపిటకములలో ఉన్నది. బుద్ధుని నేడు పశ్చిమ దేశాల వారు అనుసరిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటులు చాలామంది బుద్ధుని బోధనలు ఆచరిస్తునారు. దీనికి కారణం కొంత వరకూ దలైలామా కాగా కొంత వరకూ షావోలిన్ కుంగ్ ఫూ సినిమాల ద్వారా ప్రపంచానికి నలుమూలలా బుద్ధుడు పరిచయం కావటం జరిగింది. సిక్ మాన్ అఫ్ ఏషియా అని అపఖ్యాతిని మూట గట్టుకున్న చైనా సూపర్ పవర్ కావటం, ఆటంబాంబు దెబ్బను కోలుకోని జపాన్ ఆర్ధిక సూపర్ పవర్ గా ఎదగటం ఆ రెండు దేశాలూ బుద్దుని తో అవినాభావ సంబంధంకలిగి ఉండటం కూడా దీనికి కారణాలు కావచ్చు.

Rhys Davids వంటి వారు బుద్ధుని బోధనలను పాత కాలం లోనే పశ్చిమ దేశాలకు పరిచయం చేసారు. D.T.Suzuki వంటి వారు జెన్ సాంప్రదాయాన్ని అమెరికా యూరోపులో బాగా ప్రాచుర్యం లోకి తీసుకొచ్చారు. దీనితో పశ్చిమ దేశాలలోబుద్ధుని మీద ఆరాధనా భావం బాగా పెరిగింది. సైన్సు దృక్పథం పెరిగే కొద్దీ క్రైస్తవం లోని మూఢ నమ్మకాలు ( ఉదా: భూమి బల్ల పరుపుగా ఉంది అనేది, క్రీస్తు ఒక్కడే దేవుని సంతానం అనేది, సైతాను అనబడే కల్పిత వ్యక్తి మీద భ్రమ, మానవ సృష్టి ఆడం ఈవ్ నుంచి వచ్చిందనే మూఢ విశ్వాసం, వారి పాపానికి మానవాళి మొత్తం రాబోయే తర తరాలకూబాధ్యులు అనే పనికి మాలిన వాదన) పాశ్చాత్యులకు అతార్కికం గా, అశాస్త్రీయం గా కనిపించి ఏవగింపు కలిగించసాగాయి.

దీనికి విరుద్ధం గా బుద్ధుని సూటి యైన, మూఢ నమ్మకాలకు తావు లేని సరళ మార్గం (no-nonsense approach) వారికి ఎంతో ఉన్నతం గా కనిపించింది. కనుకనే నేడు పాశ్చాత్య దేశాలలో క్రైస్తవం ఆదరణ కోల్పోతున్నది. చర్చిలు గోదౌన్లు గా మారుతున్నాయి. మతం అనేది ఒకరోజు తతంగం (mere Sunday affair) గా తయారైంది. అక్కడ కోల్పోతున్న ఆదరణ తిరిగి పొందడానికి, పేద మరియు అభివృద్ది చెందుతున్న దేశాలలోని సామాజిక, ఆర్ధిక కారణాలను, నిరక్షరాస్యతను, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని క్రైస్తవం వేల్లూనుతున్నది.

కాని ఆలోచనా పరులకు, జిజ్ఞాసువులకు బౌద్ధం మరియు అద్వైతం నచ్చినట్లు ఇంకేదీ నచ్చదు. కారణాలు ఏమిటి? వీటిలో విశ్వాసానికి తావులేదు. ముందే ఇది నమ్ము అని ఈ రెండూ చెప్పవు. మూర్ఖపు వాదనలు వీటిలో ఉండవు. కనిపించని దేవుళ్లను నమ్మమని పూజించమని ఇవి చెప్పవు. వీటిలో వ్యక్తి ఆరాధనకు తావు లేదు. మరణం తరువాతవచ్చే స్వర్గ నరకాల మీద ఇందులో ప్రాధాన్యత లేదు. ఇక్కడే బ్రతికి ఉండగానే నీవు సర్వ స్వతన్త్రుడవు కావచ్చు. పరమగమ్యాన్ని పొందవచ్చు అని రెండూ చెబుతాయి. అదృష్టం కన్నా స్వంత ప్రయత్నమే ముఖ్యం అని రెండూ చెబుతాయి. వ్యక్తి గత సాధనకు రెండూ పెద్ద పీట వేస్తాయి.

అన్నింటినీ మించి వీటి విధానం తార్కికమూ (logical), అనుసరనీయమూ(practical) మరియు పరీక్షకునిలబడగలది (verifiable). ముఖ్యం గా నేను పాపిని అనే ఆత్మ న్యూనతా భావాన్ని(self-pity) ని మనిషిలో చొప్పించేప్రయత్నం ఇవి చెయ్యవు. వీటిలో ఏ లక్షణమూ క్రైస్తవానికి లేదు. కనుకనే పాశ్చాత్యులకు బౌద్ధం, అద్వైతం నేడునచ్చుతున్నాయి. మతాలను తులనాత్మక అధ్యయనం చేసిన వారికి ఈ విషయాలు తెలుస్తాయి. గుడ్డిగా నమ్మే వారికిఅర్థం కావు. బహుశా ఇందుకేనేమో యూరోపు దేశాలు అంతగా తిరిగి క్రైస్తవం గురించి బాగా తెలిసిన అంబేద్కర్ కూడా బౌద్ధాన్ని స్వీకరించాడు.

ఎప్పుడైతే బుద్ధుని బోధనలు తిరిగి వెలుగు లోకి వస్తున్నాయో అప్పుడే పాశ్చాత్యులకు బౌద్ధం లోని వివిధ శాఖలలోజిజ్ఞాస కలగడం మొదలైంది. జెన్ మొదలైన సాంప్రదాయాలు, టిబెటన్ తాంత్రిక బౌద్ధం వంటి సాంప్రదాయాలూ ప్రపంచవ్యాప్తం గా ప్రజలకు తెలియటం మొదలైంది. బుద్ధ గయ ఒక ముఖ్యమైన యాత్రిక కేంద్రం అయింది.

ఇక మన సంగతి షరా మామూలే గదా. మనకు మన విలువ ఎవరో చెబితేనే గదా తెలిసేది. వివేకానందుడు అమెరికాలోజయభేరి మ్రోగించి తిరిగి వస్తే ఆయనకు మనం బ్రహ్మ రధం పట్టాము. అదే వివేకానందుడు అమెరికాకు పోక ముందుపన్నెండేళ్ళు బికారిగా దేశం అంతా తిరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో రోజులు తినటానికి నాలుగు మెతుకులు లేక ఆయన మన పవిత్ర భారతంలో పస్తులున్నాడు.

అప్పుడు ఆయన మహత్యం మనకు తెలియలేదు. అదే అమెరికా వాడు ఆయనపాదాలు పట్టుకుంటే అప్పుడు వివేకానందుడు మనకు ప్రవక్తగా తెలియ బడ్డాడు. ఇప్పటికీ ఆయన ఫోటో డ్రాయింగురూములో అలంకారప్రాయంగా పెట్టుకుంటాం గాని ఆయన చెప్పినవి ఆచరించము. ఈ వింత ప్రవర్తన మనకు యుగాలుగా అలవాటు కదా ఒక్క రోజులో ఎట్లా పోతుంది?

భారతీయ జ్యోతిషం గొప్పది అని ఒక డేవిడ్ ఫ్రాలే నో లేక ఒక డెన్నిస్ హార్నేస్సో లేక ఒక క్రిస్టినా కాలిన్స్ చెబితే మనంనమ్ముతాం. అలాగే భారతీయ వేదాంతము గొప్పది అని ఏ అమెరికానో చెబితెనెగదా మనకు తెలిసేది. అలాగే నేడుప్రపంచమంతా బుద్ధుని బోధనలు అధ్యయనం చేస్తుంటే మనకు గూడా ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లుందే అనిఅనిపిస్తున్నది. ఇందులో వింత లేదు. ఇది భారతీయులు గా మనకు అలవాటైన సహజ నిర్లక్ష్య ధోరణి. ఈ నిర్లక్ష్య ధోరణితో ఎంతటి అమూల్య రత్నాలను విస్మరించామో ఎలాంటి నిధులను చేజేతులా పోగొట్టుకున్నామో ఏనాటికి మనకు తెలుస్తుందో ? కనీసం ప్రపంచం మనవైన విద్యలను జ్ఞానాన్ని గుర్తించి, నేర్చుకొని, మనలను మన అజ్ఞానాన్ని చూసి హేళనగా నవ్వుతుంటే అప్పుడన్నా మనం కళ్లు తెరిచి మన వారసత్వాన్ని అంది పుచ్చు కుంటామా?

బుద్ధుని అసలైన బోధనలు ఏమిటో ముందు ముందు చూద్దాము.