Love the country you live in OR Live in the country you love

3, మే 2009, ఆదివారం

బోధి ధర్మ 3: తేనీరు



బోధి ధర్మ 3: తేనీరు

బోధిధర్మ షావోలిన్ పర్వతం పైన ఒక గుహలో తొమ్మిది సంవత్సరాలు ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఒక గోడను తదేకంగా చూస్తూ ధ్యానాభ్యాసం చేసేవాడు. ఆ సమయంలో ఆయనకు నిద్రమత్తు వచ్చి కనురెప్పలు మూసుకు పోయేవి. దీనిని నివారించ దానికి ఆయన కనురెప్పలను కోసి పారవేశాడు. అవి నేలపైన పడినచోట తేయాకు మొక్క పుట్టింది. అందువల్లనే తేనీరు త్రాగితే నిద్రరాదు. ఇది చైనాలో ప్రచారంలో ఉన్నటువంటి ఒక గాథ.

ఇందులోని నిజా నిజాలను ప్రక్కన ఉంచితే, ఈనాటికీ జెన్ ఆశ్రమాలలో సన్యాసులు ధ్యానంలో కలిగే నిద్రను ఆపుకోనడానికి తేనీరు సేవించటం ఒక ఆచారంగా వస్తున్నది.ఆశియా దేశాలలో దొరికే 'దామో' బొమ్మకు అందుకే కనురప్పలు ఉండవు. బోధిధర్మనే సంక్షిప్త రూపంలో 'దారుమ' అని 'దామో' అని జపాన్ లో పిలుస్తారు. ఆయనకు ఇంకొక పేరు 'ధర్మతిష్య'. దీనినే జపాన్ లో 'దారుమ తైషి' అని అంటారు. నిద్రను జయించి తదేకదృష్టితో తొమ్మిదిఏళ్ళు ధ్యానం లో ఉన్న కారణంచేత బోధిధర్మ చిత్రాలకు మిడిగుడ్లు ఉంటాయి. కనురెప్పలు ఉండవు.

ఇంకొక గాధ ప్రకారం, అన్ని ఏళ్ళు కదలకుండా కూర్చొనుట వల్ల ఆయన కాళ్ళకు పక్షవాతం వచ్చింది. కనుక ఆయన బొమ్మలకు కాళ్ళు కూడా ఉండవు. ఇది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన మరణం తర్వాత మూడేళ్ళకు
ఆయన మంచులో నడుస్తూ భారతదేశానికి పోవటం సరిహద్దు సేనాని చూస్తాడు.

కనుక ఈ గాధలను ప్రతీకాత్మకంగానే తీసుకోవాలి. తదేక ధ్యాననిష్ఠకు సూచకంగా కనురెప్పలు లేకపోవటం, తొమ్మిదేళ్ళు కదలకుండా కూచోవటం సూచనకు కాళ్ళు లేకపోవటం అనేవి ప్రతీకలుగా (symbols) తీసుకోవాలి. ఆయన కూర్చొని ఉన్న గుహలోని గోడమీద ఆయన నీడ ఏళ్ళ తరబడి పడి అది చాయాచిత్రంగా మారింది.

ఇది ఈనాటికీ షావోలిన్ ఆలయంలో గల బోధిధర్మ గుహలో గోడమీద చూడవచ్చు.తదేకధ్యాన నిష్ఠకు ప్రతీకగా బోధిధర్మ చరిత్ర పుటలలో నిలిచి పోయాడు.