“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

23, మార్చి 2009, సోమవారం

జెన్ కథలు- బుద్ధత్వం దూరంగా లేదు

ఒక క్రైస్తవ మినరీ జెన్ మాస్టర్ గాసన్ ను అప్పుడపుడు దర్శించేవాడు.

అతడు ఒక రోజు ఇలా అడిగాడు " మీరు బైబిల్ చదివారా?"

గాసన్ లేదన్నాడు.

'దానిలో ఏముందో చదివి వినిపించు' అడిగాడు గాసన్.

మిషనరీ బైబిల్ లోని సెయింట్ మాత్యూ అధ్యాయం నుంచి చదివాడు" మీరెందుకు మీ అన్నవస్త్రాల గురించి చింతిస్తారు?మైదానంలోని లిలీ పూలను చూడండి.అవి కష్టపడవు,బట్టలకోసం నేత నేయవు.కాని వాటి సౌందర్యంచూడండి.ఎంత ఆనందంగా ఉన్నాయో చూడండి.కింగ్ సాల్మన్ కూడా ఇంతటిస్థితిని పొందలేదని నేను మీకు చెబుతున్నాను.కనుక రేపటి చింత మానుకోండి.రేపు తన గురించి తాను చూచుకుంటుంది."

గాసన్ చెప్పాడు "ఈ మాటలు చెప్పినవాడు తప్పక ఒకజ్ఞాని అయి ఉంటాడు."


మిషనరీ ఇంకా చదివాడు "అడుగు నీకివ్వబడుతుంది. వెతుకు నీకు దొరుకుతుంది. తలుపు తట్టు, తెరుచుకుంటుంది"


గాసన్ చెప్పాడు "బాగుంది.ఇది చెప్పినవానికి బుద్దత్వం ఎంతో దూరంలో లేదు".

క్రైస్తవ మిషనరీలకు మతం మార్చటంలో పిచ్చి. కాని వారికి చైనా జపాన్ లలో వింత అనుభవాలు కలిగాయి. జెన్ భావజాలం వారికి పరిచయమైంది. జెన్ మాస్టర్లు అనుభవ జ్ఞానులు. ఈ కథలో మిషనరీ కూడా గాసన్కు జ్ఞాన బోధ చెయ్యబోయి నవ్వుల పాలయ్యాడు.

వేదాంతము అర్థమైతే ప్రపంచంలోని ఏ ఆధ్యాత్మిక భావజాలమైనా తేలికగా అర్థమైతుంది అన్నాడు స్వామి వివేకానంద. హిందువే బైబిల్ ను సరిగా అర్థం చేసుకోగలడు అనికూడా ఆయనే అమెరికాలో ఇచ్చిన ఉపన్యాసంలో విదేశీయుల ఎదుటనే ధైర్యంగా చెప్పాడు.జెన్ అనేది వేదశిఖరం.బౌద్ధ సాంప్రదాయమైనా దీనికీ అద్వైతచింతనకూ అతిదగ్గరి పోలికలున్నాయి. శంకరుని కూడా ప్రచ్చన్నబౌద్దుడన్నారు విమర్శకులు.

జెన్ అద్వైతజ్ఞానం.జెన్ మాస్టర్ కు బైబిలు నేర్పబోవటం హాస్యాస్పదం. మిషనరీలు ఇలాగే నవ్వుల పాలౌతుంటారు. పైకథలో రెండు విషయాలూ జీసస్ చెప్పినవే. కాని ఆయన రెండు వేర్వేరు సందర్భాలలో వాటిని చెప్పాడు.వినేవారి స్థాయిని బట్టి చెప్పే విషయం ఉంటుంది.

రేపటి చింతలేక వర్తమానంలో హాయిగా బతకటమే జెన్. జ్ఞాని అయినవాడే ఈ పని చెయ్యగలడు.లిలీపూల ఉపమానం జీసస్ జ్ఞాని స్థితిని వర్ణించాడు. నువ్వు అదృశ్యం అయితే ప్రపంచం అంతా బాగానే ఉంటుంది. ఈ 'నేను' అనేది అంతం కావటమే అద్వైతం.ఇదే నిర్వాణం.ఇదే జెన్.జీసస్ ఇట్టి అద్వైతస్థితిని గూర్చి లిలీపూల ఉపమానంలో చెప్పాడు.కనుక గాసన్ అతన్ని జ్ఞాని అన్నాడు.

రెండవ బోధలో జీసస్, మానవ ప్రయత్నాన్ని గురించి చెప్పాడు.'సాధన చెయ్యందే ఏదీ దొరకదు. కనుక సాధన చెయ్యి'- అనే సందేశం అందులో ఉంది.ఇది ఇంకా సాధకుని స్థితి.కాని సరియైన దారిలోనే ప్రయాణం సాగుతున్నది.ఇందులోఇంకా ద్వంద్వభావన ఉంది.ఇక్కడింకా అడిగేవాడు ఇచ్చేవాడు ఉన్నాడు. వెతికేవాడు దొరికే వస్తువు ఉన్నవి.ఇది ద్వైతం.కనుక ఈమాటలు చెప్పినవానికి బుద్ధత్వం ఎంతోదూరంలో లేదని గాసన్ చెప్పాడు.

క్రైస్తవమిషనరీకి ఈ లోతులు అర్థం అయి ఉండవు. వారిదృష్టి ఎంతసేపూ మతమార్పిడి మీదే ఉంటుంది. కనుక గాసన్ మాటలు పిచ్చివాగుడు అనుకోని మిషనరీ వెళ్లిపోయి ఉంటాడు. ఎందుకంటే, ఉత్త పుస్తకజ్ఞానానికీ, అనుభవజ్ఞానానికీ హస్తిమశకాంతరం ఉంటుంది.కాశీని మ్యాపులో చూడటానికి, అక్కడికి పోయి స్వయంగా చూడటానికి చాలా తేడా ఉంటుంది అంటారు శ్రీ రామకృష్ణులు.

రెండు బోధలూ జీసస్ చేసినవే కాని జెన్ మాస్టర్ లాంటివాడు దాని లోతులు చూడగలుగుతాడు.మిషనరీలకు ఊరకే చిలకపలుకుల్లా వల్లించటానికి పనికి వస్తాయి.అనుభవజ్ఞానం లేని ఉత్తపండితుల స్థితి కూడా ఇంతే.భజగోవింద శ్లోకాలు రోజూ వింటాము కాని అవి ఏమి చెబుతున్నాయో వాటిని మాత్రం చెయ్యము.చివరకు జ్ఞానగ్రంథమైన గీతని కూడా ఫలానా అధ్యాయం చదివితే ఫలానా ఫలితం వస్తుంది అంటేతప్ప చదవము.అదీ మన ఛండాలపు దుస్థితి.

ముందు జ్ఞానసాధనచేసి గమ్యాన్ని చేరాలి. తరువాత పుస్తకాలు చదివి అందులో చెప్పబడిన వాటితో తన అనుభవాలు పోల్చి చూచుకోవాలి. రమణ మహర్షి, రామకృష్ణుల వంటివారు ఇదే చేసారు. కాని ప్రపంచం తల్ల క్రిందుగా ఉంది.ప్రతివారూ మహనీయుల బోధలు చదివి అవి తమ సొత్తుగా భావించి ఇతరులకు బోధించబోతారు.గ్రంధాలు చదివి అందులోని జ్ఞానమంతా మనదే అనుకుంటే అంతకంటే భ్రమ ఉండదు.ఇతరుల బ్యాంక్ ఎకౌంట్ లో ఉన్న సొమ్ము మనదే అనుకోవడం వంటిదే ఇది.

ఉత్తశ్లోకాలు వల్లించడంవల్ల ఫలితంసున్నా.గ్రంథాలను అర్థం చేసుకోకుండా అందులోని మాటలు ఇతరులకు వల్లించి మతం మార్చాలనుకోవటం వెర్రితనం.ఇటువంటి అజ్ఞానమిషనరీలు మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తారు.

మాట్లాడే చిలుక " రాదాకృష్ణ రాదాకృష్ణ " అని యజమాని నేర్పిన మాటలు చెబుతుంది. కాని పిల్లి దానిని నోటకరుచుకున్నపుడు 'కీచు'మని అరుస్తుంది అంటారు శ్రీరామకృష్ణులు.బట్టీబట్టిన శ్లోకాలు,గ్రంథవాక్యాలు మనసొంత జ్ఞానం కాదు.అవి మరణ సమయంలో అక్కరకు రావు.మన స్వభావం ఏదో అదే ఆ సమయంలో బయటికి వస్తుంది.

ఆధ్యాత్మికలోకంలో అనుభవజ్ఞానం ప్రధానం అంతేకాని అరువుజ్ఞానం వృధా అన్నసంగతి చక్కగా గ్రహించాలి.