నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, మార్చి 2009, సోమవారం

నాడీ జ్యోతిషం- విశ్లేషణా విధానాలు

నాడీ జ్యోతిషంలో అనేక రకాల గ్రంథాలున్నాయని ఇంతకూ ముందే చూచాము.వాటిలోని కొన్ని విశ్లేషణా విధానాలను ఇప్పుడు పరిశీలిద్దాము. కొన్ని రహస్య విధానాలను నేను ఉద్దేశ పూర్వకంగా ఇక్కడ చర్చించడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు వ్రాసిన వాటికి వచ్చిన ప్రతిక్రియను బట్టి మార్మిక విషయాలలో గోప్యత అవసరం అన్నది నాకుఅర్థమైంది గనుక. చాలామంది బ్లాగర్లు వారిష్టం వచ్చినట్లు విమర్శిస్తూ నాకు మెయిల్స్ ఇచ్చారు. బహుశా నన్నొక చదువురాని చెట్టుకింది జ్యోతిష్కుడని వారు అనుకున్నారేమో నాకు తెలియదు.


కొన్ని నాడీ గ్రంథాలలో లగ్నానికి ఎట్టి ప్రాథాన్యతా లేదు. అంతా చంద్ర లగ్నాన్ని బట్టి విశ్లేషణ సాగుతుంది. ముఖ్యంగాగురు శనుల గమనాన్ని బట్టి జీవిత సంఘటనలు అంచనా వెయ్యటం జరుగుతుంది. ఎందుకంటే, గురువు జీవ కారకుడు. జీవితములోని ఏ సంఘటనా ఆయన అనుగ్రహం లేక జరుగదు. ఖగోళ రీత్యా కూడా గురు గ్రహం ఎన్నో తోకచుక్కల దాడినుంచి మన భూ గ్రహాన్ని ఇంతవరకూ ఎన్నియో మార్లు కాపాడి నట్లు రుజువులున్నవి.

తన బలమైన గురుత్వాకర్షణతో, భూమిని ఢీ కొట్టటానికి వస్తున్న తోక చుక్కలను తన మీదికి ఆకర్షించి, అనేకసార్లు భూమిని కాపాడింది గురుగ్రహం. కనుక అన్నిగ్రహములలోకి గురువు శుభగ్రహమని మన జ్యోతిష్యం చెబుతుంది. ఇక పొతే శని కర్మకారకుడు. మనం అనుభవించవలసిన కర్మను అనుభవింపజేయడం ఆయన వంతు. కనుక ఈ ఇద్దరు గ్రహాలకు మానవజీవితం మీద సర్వహక్కులున్నాయి.

చంద్ర లగ్నాత్ ఈ రెండుగ్రహాల దృష్టి, స్థితి మార్పులతో అనేక సంఘటనలు జరుగుతవి. వీరిద్దరిలో గురుగ్రహం ఏడాదికి ఒకరాశి మారుతుంది. శని గ్రహం రెండున్నరేళ్లకు ఒక రాసి మారుతుంది. మధ్యలో వీటికి శీఘ్ర, మంద, వక్ర, స్తంభన, సహజ గతులుంటవి. అదేగాక అస్తంగత, రాహుగ్రస్త, గ్రహయుద్ధ, అర్గలా స్తితులుంటవి. వీటిని పరిశీలించి జీవితసంఘటనలను కొన్ని నాడీగ్రంథములు అంచనా వేస్తవి.

ఇంకొన్ని నాడీగ్రంథములు, గ్రహముల సహజ కారకత్వములను ప్రథానముగా తీసుకొని సంఘటనలను అంచనావేయుట జరుగుతుంది. గ్రహముల మధ్య ఏర్పడే వివిధరకాలైన దృష్టులు, స్థితుల అనుగుణంగా సంఘటనలు అంచనావెయ్యవచ్చు. ఇవి గ్రహదశలను లెక్కలోకి తీసుకోనవు. దశావిధానం అనేది చాలా తరువాత వచ్చిన పద్దతిగా తోస్తుంది.

ఇంకొన్ని గ్రంథములు, వర్గచక్రములను కూడా విశ్లేషనలోకి తీసుకుంటాయి. కొన్ని పంచవర్గములను, కొన్ని షోడశవర్గములను ఇట్లా లేక్కిస్తాయి. దేవకేరలం అనబడే చంద్రకళానాడి షోడశ వర్గములను లెక్కిస్తుంది. చంద్రునికి పదహారుకళలున్నవి. కనుక పరాశరమహర్షి చెప్పిన షోడశ వర్గములను, నాడీ అంశలను లెక్కించి ఫలితములు చెబుతుంది దేవకేరళం. అందుకే దీనిని చంద్రకళానాడి అంటారు.

గ్రహములు ఏ ఏ నాడీ అంశలలో ఎక్కడెక్కడ జనన సమయంలో మరియు గోచార సమయంలో ఉన్నాయో చూచి ఆయాసమయాలలో ఆయా ఫలితములు జరుగునట్లు చెప్పునవి ఇంకొన్ని నాడీ గ్రంథములు.

ఇంకొక విధానములో లగ్నమును ఏడాదికొక్క రాశి చొప్పున పొడిగిస్తూ ఆయా సంవత్సరములో ఏర్పడే గోచార గ్రహస్తితులతో పోల్చి సంఘటనలు అంచనా వెయ్యటం జరుగుతుంది. ఇది ప్రాచీన భ్రుగువిధానం. దీనికి కూడా దశలతో సంబంధం లేదు. ఇది పరాశరమహర్షి ప్రణీత సుదర్శనచక్రపద్ధతిని పోలి ఉంటుంది. అయితే సుదర్శనచక్రపద్ధతిలో లగ్న, చంద్ర, రవులను ఇరుసులుగా తీసుకొనుట జరుగుతుంది. భ్రుగువిధానములో లగ్నమే ప్రథానం.

ఏ పద్ధతిలో చూచినప్పటికీ నాడీవిదానములోని ముఖ్య విషయం ఖచ్చితమైన ఫలితం చెప్పగలగటం. దీనికి స్ఫురణఅనబడే Intuition తో సంబంధం లేదు. లెక్కసరిగా ఉంటే ఫలితం సరిగా వస్తుంది. ఇది నాడీజ్యోతిష ప్రత్యేకత.