“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, మార్చి 2009, శనివారం

చువాంగ్ చు స్వప్నం


చువాంగ్ చు లావో జు శిష్యుడు.
ఒకరోజు అతడు విచారంగా కూర్చుని ఉన్నాడు.
అతని శిష్యులు కారణం అడిగారు.
చువాంగ్ చు చెప్పాడు.
నేను నిద్రించి కల గన్నాను. కలలో నేను సీతాకోక చిలుకగా మారి గాలిలో ఎగురుతూ ఆనందంగా ఉన్నాను. నెనుచువాంగ్ చును అని నాకు జ్ఞప్తికి రాలేదు. హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. సీతాకోక చిలుక జీవితం పోయి నేనుచువాంగ్ చు అయ్యాను. ఇప్పుడు నాకో పెద్ద సందేహం పట్టుకుంది. ఇప్పుడు సీతా కోక చిలుక చువాంగ్ చు గా కలగంటున్నదా?

--------------------------------------------------------------

తావోఇజం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం లో చైనాలో ఉన్న తాత్విక భావన. ముందు వీరిని జెన్ కథలలో తీసుకుందామనిఅనుకున్నాను. కాని తావోఇజం కు స్వతంత్ర ఉనికి ఉన్న కారణం చేత, భావ సారూప్యత ఉన్నప్పటికీ, రెంటినికలపటం సరి కాదనిపించింది. తావోఇస్టు మాస్టర్ అయిన 'ఝాన్ సాన్ ఫెంగ్' నుంచి 'తాయ్ఛి' అనే వీర విద్య పుట్టింది. ఈ విద్యలో నాకున్న ప్రవేశం దృష్ట్యా తావోఇష్టు సిద్ధాంతాలు నన్ను ఆకర్షించాయి. తర్వాత కొంతకాలానికి వేదాంతమూ,తంత్రమూ,సిద్ధసంప్రదాయమూ కలిసి తావోయిజంలో ఇమిడి ఉన్నాయని  నాకర్ధమైంది.

ప్రస్తుతానికి మన కథలోకి వస్తే, ప్రపంచంలోని తాత్విక చింతనలన్నీ నాలుగు భావనల క్రిందకు తేవచ్చు. ఫిలాసఫి మీదవందల కొలది గ్రంథములున్నవి. కాని ఇవి అన్నీ ఈ నాలుగు భావనల చుట్టూ నే పరిభ్రమిస్తవి.

1. దేవుడున్నాడా?
2. నేనెవరు?
3. ప్రపంచం సత్యమేనా?
4. పై మూడిటి సంబంధం ఏమిటి?



నాలుగు ప్రశ్నలు నాటివి కావు. మనిషికి బుద్ధి వికసించిన నాటి నుండి వేధిస్తున్న ప్రశ్నలు. వీటిలో రెండవప్రశ్నకు సంబంధించిన కథ ఇది. పై పై చూస్తె చువాంగ్ చు కొచ్చిన సందేహం పిచ్చి ఆలోచనగా కనిపిస్తుంది. డబ్బుసంపాదనే జీవిత గమ్యం, ప్రపంచ సుఖాలు వీలైనన్ని పొందటమే పరమావధి అనుకునే వారికి ఇది పనికిరాని పిచ్చి గాతోస్తుంది. కాని తాత్విక దృష్టి తో చూస్తె ఇందులోని మర్మం తెలుస్తూంది.

మనకు అందరకు మెలకువ స్వప్నం అలవాటైన స్థితులే. కాని మేలకువను మనం స్థిర ప్రాతిపదికగా తీసుకునిస్వప్నాన్ని తేలికగా చూస్తాం. ఎందుకు? స్వప్నం అస్తిరమని, ఊహా లోక విహారమని, కొంత సేపైన తరువాత మనందానినుంచి బయటకు రాక తప్పదని మనకు తెలుసు.

మన పునాది మెలకువలో ఉంటుంది. కనుక కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము. అలవాటైన మెలకువ స్థితితో పోల్చిచూసుకొని కలను భ్రమగా అనుకుంటాము. కాని కలనే నిజమైన స్వాభావిక స్థితిగా తీసుకుంటే, అప్పుడు మనముమెలకువ అని దేన్ని తలుస్తున్నామో అదే కల కావచ్చు. మనం చూచే తీరు మారితే అంతా మారిపోతుంది. దీన్నినేటివారు change of gestalt అంటున్నారు.

ఇలాకాక ఎవరైనా కలలలోనే నిరంతరం ఉంటూ ఉంటే వారికి మెలకువ స్థితి కలగా తోస్తుంది.అందుకే పగటి కలలుకనేవారికి ఈ ప్రపంచంతో పెద్ద సంబంధం ఉండదు.సాధనా పునాదిలేని ఒట్టి ఆలోచనా తాత్వికులు అనేకులు పిచ్చివారుగా మారటానికి కూడా ఇదే కారణం.ముఖ్యంగా ఇట్టి పరిస్తితి పాశ్చాత్య తాత్వికులలో కనిపిస్తుంది.మన రాష్ట్రపతి గొప్ప తాత్వికుడూ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరణానికి ముందు చివరి దశలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడానికి కారణం కూడా ఇదే.



వేదాంతానికి కథకు దగ్గర పోలికలున్నాయి. వేదాంతము, జాగ్రత్(మెలకువ), స్వప్న(కల), సుషుప్తి(గాఢ నిద్ర) అనేస్థితులను చెబుతుంది. ఇవి మూడూ మానవులకు తెలిసిన స్థితులే. వీనిని దాటిన తురీయము అనే స్థితిని మానవునినిజ స్థితిగా వేదాంతము వర్ణిస్తుంది. దీనినే జ్ఞాన యోగ సమాధి అని కూడా అంటారు.

కలలో ఉన్న కాసేపు కలే నిజం అని తోస్తుంది. అప్పుడు మెలకువ గుర్తుకు రాదు. గుర్తుకు వస్తే అది కల కాదు. కలలోదెయ్యాలు కనిపించి భయపడి కేకలు పెడతారు. ఆనందాన్నిచ్చే కలలు, ఏడిపించే కలలు, భయపెట్టే కలలు ఇట్లారకరకాల కలలు మనకు అనుభవం లో ఉంటవి.

జాగ్రత్ (మెలకువ) కూడా స్వప్నమే అంటుంది వేదాంతము. కాకపొతే దీర్ఘకాలం నిలిచి ఉంటుంది కనుక దీర్ఘ స్వప్నంఅంటుంది. ఏ స్థితి అయినా దానిలో ఉన్నంత సేపు అది నిజం అనిపిస్తుంది. దాని నుంచి బయటకు వచ్చినాక అదిఅసత్యమని తెలిస్తే తెలియవచ్చు. కాని అందులో ఉన్నంతవరకు అది సత్యమే.

ఇంకొక స్థితితో పోల్చినపుడే మనము ఇంతకు ముందు ఉన్నస్థితి యొక్క నిజం తెలుస్తూంది. తప్పు చేసిన వారుతరువాత పశ్చాత్తాప పడటానికి కారణం ఇదే. కాని ఆ పని చేస్తున్నపుడు అది తప్పు అని తోచదు. అదలా ఉంచితే, మెలకువ వచ్చిన తరువాత స్వప్నం భ్రమ అని తెలుస్తూంది. అలాగే, తురీయం అనే స్థితి అనుభవిస్తే మిగిలిన మూడుస్థితులూ, మనకు అలవాటైన మెలకువ స్థితితో సహా, భ్రమలుగా తెలుస్తాయి అని వేదాంతము అంటుంది.

అందుకే వేదాంతము ప్రపంచాన్ని మాయ అంటుంది. అంటే ప్రపంచం లేదని కాదు. ultimate reality కాదు అనిమాత్రమె అర్థం. ఏతావాతా తేలేదేమంటే మనకు అనుభవం లోకి వచ్చే ఏ స్థితీ నిరపేక్షం కాదు. సాపేక్షం మాత్రమె. అనగాఇంకొక దానితో పోల్చి చూచి గ్రహించ గలిగేది మాత్రమె.

ఇలా కాకుండా ఏ జ్ఞానమైనా సూటిగా, ఇంకొకదాని పోలిక లేకుండా, తనంత తానూ అనుభవం అవుతుందా? మనకుఅనుభవం లో ఉన్న ఏ స్థితీ అలా అనుభవం కాదు. కాని తురీయం అనే స్థితి అటువంటిది అని జ్ఞానులంటారు. కారణం? మనం మాట్లాదుతున్న ఏ జ్ఞానమైనా విషయ సంబంధమైనది (Objective knowledge). కాని విషయి (subject) నితెలుసుకొనే జ్ఞానం దీనికి భిన్నమైనది.


దేని వల్ల ఇదంతా తెలియబడుతున్నదో దానిని తెలుసుకోవడం ఎలా? ప్రశ్న అనేక ఉపనిషత్తులలో మనకుదర్శనమిస్తుంది. విషయి అనేదానిని తెలుసుకునే తెలివి లేక జ్ఞానం అనేదానిని వేదాంతము అపరోక్షానుభూతిఅంటుంది. అంటే ఇతరములతో పోల్చి చూడకుండా కలిగే సూటి జ్ఞానం (direct perception of subject) అన్నమాట. పరోక్షమైన జ్ఞానం కాదు గనుక ఇది అపరోక్షానుభవం అవుతుంది.

చువాంగ్ చు కథలోకి వస్తే, సామాన్యంగా జనులందరూ మేలకువను కొలబద్ద గా తీసుకొని కలను తేలికగా కొట్టివేస్తారు. కాని తాత్విక చింతన కలవారి పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంటుంది. కలనే స్థిరమైన కొలతగా తీసుకొని ఆ స్థితిలో నిలిచిమేలకువను దర్శిస్తే ఏమౌతుంది? మెలకువ స్థితి కలగా దర్శనమిస్తుంది. ఇట్టి స్థితిలో ఉండి చూస్తె ఏది స్థిరం ఏది అస్థిరంఏది సత్యం ఏది అసత్యం అనిపిస్తుంది. మనం ఏర్పరచుకున్న స్థిర అభిప్రాయాలు అన్నీ గల్లంతు అవుతాయి. ఏమీచెప్పలేని మాట్లాడలేని పరిస్తితి కలుగుతుంది.

ఒక్క కలనూ మెలకువనూ పోల్చి చూచినందుకే ఇంతటి గందరగోళం ఏర్పడింది. ఇక మూడు స్థితులనూ దాటి తురీయస్థితిని పొందిన వాని పరిస్థితి ఏమి కావచ్చు? ఏమైతుందో అది పొందిన వారికే తెలియాలి. దాన్ని మనం ఊహించలేము. 

రమణ మహర్షి వంటి జ్ఞానులు ప్రపంచాన్ని నిర్లిప్తతతో చూసారన్నా, నిస్పృహగా వ్యవహరించారన్నా ఇవే కారణాలు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి చేతిని నవాబు నరికినప్పుడు ఊడి పడిన చేయి తనది కాదు అని నిర్లిప్తంగా ఆయన ఎలా ముందుకు సాగిపోగలిగాడు? రమణ మహర్షి చేతికి కేన్సరు వచ్చినపుడు మందులు వాడమని శిష్యులు అడిగితె " మీలాగే వారూ వచ్చారు. ఉండనివ్వండి." అని మహర్షి నిర్లిప్తంగా జవాబివ్వడములో లోతు ఏమిటి? జిడ్డు కృష్ణ మూర్తి పాంక్రియాస్ కేన్సరు(?) వచ్చినపుడు నిర్లిప్తంగా ఎలా ఉండగలిగాడు? రామకృష్ణ పరమహంస గొంతు కేన్సరు వచ్చినపుడు " ఈ ఒక్క నోటితో తినలేక పోతేనేమి? మీ అందరి నోళ్ళతో తింటున్నాగా" అని వివేకానందాది శిష్యులను ఎలా ఒదార్చగలిగాడు?

ఇంతకు ముందు అనుకున్నట్లు మనం అనుభవించే ఏ స్థితీ నిరపేక్షం (absolute )కాదు. Every thing is relative in this world. మనం ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ( theory of relativity ) దగ్గరిగా ఒచ్చినట్లు అనిపిస్తుంది. ఆయనభౌతిక శాస్త్రంలో ఈ నిర్ణయానికి ఒచ్చాడు. ప్రాచీన జ్ఞానులు అంతా సాపెక్షమే అన్న స్పృహను ఎన్నో వేల ఏండ్ల నాడేపొంది ఉన్నారు. అంతే కాక వారు ఇంకొక అడుగు ముందుకేసి అనుభవాలు పొందేది ఏదైతే కలదో దానినితెలుసుకోవటమే అపరోక్షానుభూతి (absolute knowledge) అన్న నిశ్చయానికి వచ్చారు.

వేదాంత భావనలో ఈ విధమైన చింతన చెయ్యడాన్ని విచారణ అంటారు. మన అద్వైత వేదాంతానికి తావోఇజం కు కొన్ని దగ్గరిపోలికలున్నవి. నేను చువాంగ్ చును అన్న మేలకువను ప్రాతిపదిక గా తీసుకుంటే నేను సీతాకోక చిలుకను కాను. మరి కలలో నాకు కలిగిన అనుభవం కూడా కలలో ఉన్నంతవరకు సత్యమేగా. అంటె నేను మెలకువ అని భావిస్తున్న స్థితి నిజానికి స్వప్నమా? కొద్దిసేపు ఉండి మాయమైనంత మాత్రాన కల అబద్దం అని ఎలా కొట్టివేయటం? కనుక నేను సీతాకోక చిలుకను అనేదినిజమైతే నేను చువాంగ్ చును అనుకునేది అబద్దమా? అయితే నిజానికి నేనెవరు? నేను చువాంగ్ చునా లేక సీతాకోక చిలుకనా? నిజానికి నేనెవర్ని? ఈ "నేనుకు" స్థిర మైన ప్రాతిపదిక ఉందా లేదా? లేకుంటే నేను నాది అని ఏర్పరచుకున్న సామ్రాజ్యం అంతా అబద్దమా? ఇదంతా భ్రమేనా?



జ్ఞానవాసిష్టం అనే గ్రంథం ఒక వేదాంతనిధి.ప్రపంచములో ఇట్టి అద్భుత గ్రంధం ఇంతవరకు లేదని చెప్పవచ్చు.శ్రీరామునికి వారి గురువు వశిష్టుడు జ్ఞాన బోధచేసిన లక్ష శ్లోకాలు ఇందులో ఉన్నాయి.ఒకే విషయాన్ని ఇన్ని శ్లోకాలలోతిరిగి తిరిగి రకరకాలుగా చెప్పటం ఈ గ్రంథ ప్రత్యేకత. ఈ గ్రంథములో లవణరాజు కల అని ఒక కథ వస్తుంది. అదిదాదాపు ఈ కథ లాగానే ఉంటుంది. మనకు అనుభవంలో ఉన్న ఏస్థితీ పరిపూర్ణనిజం కాదు అనే తాత్విక చింతనను ఇటువంటి కథలు చూపుతాయి.వేదాంతము ఇట్టి చింతనను 'విచారణ' అనే భూమికగా భావిస్తుంది. ఇది జ్ఞానయోగసాధనలో ఒక మజిలీ. చువాంగ్ చు ఇట్టి స్థితిలోనే ఈ మాటను అని ఉండవచ్చు.