18, అక్టోబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 40 (Walks in the woods)


మిట్టమధ్యాన్నాం కూడా ఎండ పడనంత ఎత్తైన చెట్ల పందిరి
 








అడవిలో యాగశాల


గ్రెగరీతో అడవిలో నడుస్తూ. మేము ట్రెయిల్ వాక్ కు వెళుతుంటే తానూ వస్తానని మాతో వచ్చాడు గ్రెగరీ. ఈ అడవికి అతనికీ 15 ఏళ్ల సంబంధం ఉంది. తాపసానందగారితో కలసి మెలసి ఉండేవాడు. ఇక్కడనుంచి బయటకెళ్ళడం చాలా బాధ కలిగించిందని వాపోయాడు. భాష్యానంద గారి మరణమే ఇక్కడి స్వర్ణయుగానికి అంతం.




ట్రెయిల్ వాక్ మధ్యలో



ఈ చెట్ల దారి చివరలోనే రిట్రీట్ హోమ్ ఉంటుంది. రాత్రిళ్ళు వీస్తున్న గాలికి  హోరుమంటూ చెట్లు చేసే శబ్దం భయానకంగా ఉంటుంది. రాత్రిపూట ఒక్కరే ఈ దారిలో నడవాలంటే గుండెధైర్యం కావాలి. హర్రర్ సినిమాకు మంచి సెట్టింగ్.



ఈ మైదానమే ఒకప్పటి యాపిల్ పియర్స్ తోట ఉన్న ప్రదేశం. అవతలాగా కనిపిస్తున్న అడవిలోనే ట్రెయిల్ వాక్



అడవి మధ్యలో అమెరికన్ స్వామి తాపసానంద స్వయంగా కట్టుకున్న కుటీరం. ఈయన దీనిలోనే ఒక్కడే 15 ఏళ్ళపాటు నివసించాడు. మంచుపడే శీతాకాలంలో కూడా ఈ అడవి మధ్యలో ఈ కేబిన్ లో ఒక్కడే ఉండేవాడు. దీనికి కరెంట్ లేదు.


ఇందులో కాసేపు. కొన్నేళ్ల క్రితం స్వామి కోరిన కోరిక నెరవేరింది. లోపల పాములుండవచ్చు. మాకైతే కన్పించలేదు.


దానికి కొంచెం దూరంలో ఒక్క మనిషి మాత్రమే పట్టే ఇంకొక కేబిన్. స్వామి తాపసానంద మొదట్లో ఇందులో ఉండేవాడు.


పగలంతా రిట్రీట్ హోమ్ బిల్డింగ్ పనిలో పనిచేసి, రాత్రికి ఒక్కడే టార్చ్ లైట్ సాయంతో అడవిలో రెండుమైళ్ళు నడచి వచ్చి ఇందులో పడుకునేవాడు. ఈ విధంగా ఆరేళ్ళు చేశాడు. 



ఇంత దట్టమైన అడవి



తనకు తాయిచి వచ్చని గ్రెగరీ అన్నాడు. ఈ స్థలంలోనే, యాంగ్ స్టైల్ తాయిచి కొన్ని మూమెంట్స్ చేసి ఇవి ఏ స్టైలో చెప్పు? అన్నాను. తెల్లముఖం వేశాడు. తనకు తాయిచి రాదని నాకర్ధమైంది. నీదే స్టైల్? అంటే, ఫ్రీ స్టైల్ అని  పిచ్చిపిచ్చిగా చేతులూపాడు. భలే నవ్వొచ్చింది. కెంపో కరాటే కూడా వచ్చన్నాడు. ఎడ్ పార్కర్ పేరు చెబితే తెలీదన్నాడు. ఆంజనేయుడి ముందు కుప్పిగంతులా?


మధ్యమధ్యలో అన్ని మతాలకూ ప్రేయర్ ప్లేస్ లాగా కట్టారు. వాటిలో ఒకదాని దగ్గర


పంచవటి వృక్షం. ఇది దక్షిణేశ్వర్ పంచవటి మర్రిచెట్టు లాగా ఉంది. చుట్టూ ఒక అరుగు కట్టారు. అక్కడ కూర్చుని జపధ్యానాలు చేసుకోవచ్చు. రాత్రిళ్ళు మంత్రసాధనలకు ఇంకా బాగుంటుంది.



గాంజెస్ అడవిలోని పంచవటి వృక్షం క్రింద




హిందూమత ప్రార్థనా స్థలం


యాగశాల లోపల. 'మనం కూడా ఏదైనా హోమం చేద్దామా?' అని మా బృందంలో ఒకరడిగారు. 'మన విధానం అది కాదు. 'మనది అంతరికం, బాహ్యం కాదు' అని చెప్పాను.




అడవిలో ప్రదేశాలను వివరిస్తూ గ్రెగరీ



అడవి మధ్యలో ఒక కాలువ పైన. ప్రస్తుతం దానిలో నీళ్లు లేవు.



సూర్యకాంతి లోపలకు పడే అవకాశమే లేదు.


దారిలోని ఒక ప్రేయర్ ప్రదేశంలో


ఆ వెనుక కనిపించే అడవిలోనే ఇదంతా ఉంది


యూదుమత ప్రార్ధనా స్థలంలో




బౌద్ధ ప్రార్ధనా స్థలంలో


పంచవటి వృక్షం క్రింద





క్రైస్తవ ప్రార్ధనా స్థలంలో




పంచవటి వృక్షం క్రింద గ్రూప్ ఫోటో

read more " మూడవ అమెరికా యాత్ర - 40 (Walks in the woods) "

16, అక్టోబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 39 (నికోలస్ క్రూస్ జడ్జ్ మెంట్ - రుజువైన భారతీయ పురాణాలు)

నిన్నగాక మొన్న అమెరికాలో ఒక సంచలనాత్మకమైన తీర్పు వెలువడింది. అది 2018 లో జరిగిన ఒక మారణకాండకు సంబంధించినది.

2018 లో ఫ్లోరిడా రాష్ట్రంలో స్టోన్ హౌస్ డగ్లస్ హైస్కూల్లో ఒక 18 ఏళ్ల కుర్రవాడు 17 మంది విద్యార్థులను కాల్చి చంపేశాడు. ఇంకొక 17 మందిని తుపాకీ కాల్పులతో తీవ్రంగా గాయపరిచాడు. దీనిని పార్క్ ల్యాండ్ షూటింగ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ కేసులో నాలుగేళ్ల తర్వాత, మొన్న తీర్పు వెలువడింది.

అతని తల్లి ఒక త్రాగుబోతు కాబట్టి, తండ్రి ఎవరో తెలియదు కాబట్టి, అతని తప్పు లేదని, అతను పుట్టటమే అలా పుట్టాడని తీర్పునిచ్చి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా ఖాయం చేశారు.

వింతగా ఉందా? 

దీనికీ ఆధ్యాత్మికతకూ ఏంటి సంబంధం అనిపిస్తోందా?

దీనిపైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి. విషయం అర్ధమౌతుంది.

read more " మూడవ అమెరికా యాత్ర - 39 (నికోలస్ క్రూస్ జడ్జ్ మెంట్ - రుజువైన భారతీయ పురాణాలు) "

మూడవ అమెరికా యాత్ర - 38 ( గాంజెస్ మ్యూజియం)


గాంజెస్ లోని వివేకానంద రిట్రీట్ సెంటర్ లో ఒక పెద్ద మ్యూజియం ఉంది. అందులో చాలా విలువైన  వస్తువులు, భారతీయ దేవతా విగ్రహాల నమూనాలు, దేవాలయాల నమూనాలు, భద్రపరచబడి ఉన్నాయి.  ఆ ముఖ్యద్వారం పైన కనిపించే రామకృష్ణా మిషన్ సింబల్ ఇది.  దీనిని వివేకానందస్వామి  స్వయంగా తన చేతితో బొమ్మ వేశారు.


ఈ ద్వారం, న్యూయార్క్ లో జరిగిన ఇండియా కల్చరల్ ఫెస్టివల్ లో పెట్టిన ఇండియా గేట్. దీనిని ఒక అమెరికన్ కొని, వీరికి డొనేట్ చేశాడు. దీని నగిషీలకు పాలిష్ పెట్టడానికి ఆర్నెల్లు పట్టింది. అంత భారీ ద్వారం ఇది. 


వివేకానంద స్వామి ఇచ్చిన కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగ ఉపన్యాసాలు



వివేకానంద స్వామి ఉపయోగించిన టీ సెట్


వివేకానంద స్వామి వీరభక్తుడైన G. W. Hale డొనేట్ చేసిన వస్తువులు 




శ్రీ రామకృష్ణుల మహాసమాధి ఒరిజినల్ ఫోటో
(15-8-1886)




సెప్టెంబర్ 9, 1893. చికాగో రోడ్లపైన వివేకానందస్వామి దీనస్థితి. తన రిఫరల్ కాగితాలను పోగొట్టుకొని ఆకలితో, చలిలో చికాగోలోని డియర్ బార్న్  వీధిలో స్పృహతప్పే స్థితిలో ఉన్న వివేకానంద స్వామిని చూచి ఆదరించి, భోజనం పెట్టింది Mrs. G. W. Hale. ఈ ఒక్క చర్యతో ఆమె కోట్లాది భారతీయుల గౌరవాన్ని పొందింది. భగవంతుని పాదాలవద్ద సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. 


శారదామాతను సాక్షాత్తు జగజ్జననిగా శ్రీ రామకృష్ణులు ఆరాధించిన దృశ్యం



సెల్లార్ లో ఉన్న మీటింగ్ హాల్ కు పోయే మెట్ల దగ్గర ఉన్న గ్లాస్ పెయింటింగ్. 
ముండకోపనిషత్తులోని రెండు పక్షుల కధ. క్రిందిపక్షి జీవుడు, పైపక్షి బ్రహ్మము.


లాంజ్ లో ధ్యానసమావేశం
read more " మూడవ అమెరికా యాత్ర - 38 ( గాంజెస్ మ్యూజియం) "

13, అక్టోబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 37 (బాలామంత్రానికి అర్ధమడిగిన అమెరికన్)


తను వ్రాసిన కవితలను చూపిస్తూ గ్రెగరీ


ఆరుబయట కుర్చీలో కూచుని ట్రీ కటింగ్ పనిలో ఉన్న గ్రెగరీని మాతో భోజనం చెయ్యమని ఆహ్వానించాను


శ్రీనివాస్, గ్రెగరీలు, డైనింగ్ హాల్లో

మదర్స్ ట్రస్ట్ నుండి వెనక్కు వచ్చి కొద్దిసేపు లైబ్రరీలో కూర్చున్నాను.

రిట్రీట్ హోమ్ బయట ఉన్న పెద్ద ఆవరణలో చాలా చెట్లున్నాయి. అదంతా అడవి అయితే, కొన్ని చెట్లను కొట్టేసి ఇళ్ళు కట్టారు. మిగతా చెట్లను అలాగే ఉంచేశారు. వాటిలో కొన్ని విల్లో ట్రీస్ ఉన్నాయి. వాటిని వీపింగ్ విల్లోస్ అంటారు. రాత్రిళ్ళు చూస్తే, జడలు విరబోసుకున్న భూతాలలాగా ఉంటాయి. అందులో కొన్నింటిని కొట్టెయ్యమని పురమాయించారు లాగుంది, ఒక అమెరికన్ ఆ పనిమీదున్నాడు. ఒక వ్యాన్ లో టూల్స్ తెచ్చుకుని ఒక్కడే ఆ పనంతా చేస్తున్నాడు. 

ఇండియాలో అయితే పాతికమంది ఈ పనిని చేసేవాళ్ళు. లేదా చేస్తున్నట్టు నటించేవాళ్ళు. ముచ్చట్లు చెప్పుకుంటూ, టీలు తాగుతూ, అటూఇటూ తిరుగుతూ, రోజుకొక గంట మాత్రం పనిచేసి, డబ్బులు మాత్రం బాగా లాగుతారు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ పనంటే పనే. చాలా నిక్కచ్చిగా చేస్తారు. అదీ గాక, ఆటోమేషన్ వల్ల, ఇరవై మంది చేసే పనిని ఒక్కడే చేస్తాడు. లేబర్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు మెకనైజేషన్ వస్తుంది తప్పదు మరి.

ఈలోపల లంచ్ రెడీ అయింది. మా బృందంలోని శిష్యురాళ్లందరూ కలసి వంట చేసేశారు. ఆ అమెరికన్ ని కూడా లంచ్ కి పిలిచాము. లేకపోతే అక్కడేమీ లేదు. మళ్ళీ ఊళ్ళోకెక్కడికో పోయి తిని రావాలి.

ఇంత మారుమూల కూడా మనకొక అతిధి లభించాడని శ్రీనివాస్ ఎంతో సంతోషపడ్డాడు.

అతని పేరు గ్రెగరీ ట్రాయ్. మాతో చాలా త్వరగా కలిసిపోయాడు. గ్రాండ్ రాపిడ్స్ లో ఉంటానని అన్నాడు. తనకు 64 ఏళ్ళని చెప్పాడు. కానీ 35 ఏళ్ల యువకునిలో ఉండే చురుకుదనం ఉంది. అంతచలిలో కూడా రోజంతా కష్టపడి ఆరుబయట పనిచేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఆరుబయట వేసుకున్న కుర్చీలో కూర్చుని సిగరెట్ త్రాగుతూ, చెట్లతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు తోడుబోయిన ఇంకొక పిచ్చివాడు దొరికాడని అనిపించింది.

లంచ్ సమయంలో తన గురించి చెప్పుకొచ్చాడు.

ఈ ఆశ్రమం పెట్టిన దగ్గరనుంచీ 1996 లో భాష్యానందగారు చనిపోయేవరకూ గ్రెగరీ ఇక్కడే ఉన్నాడు.  ఈ హోమ్, లైబ్రరీ, ఇతర ఇళ్ళు ఇవన్నీ కట్టడంలో ఇతని పాత్ర కూడా ఉంది. భాష్యానందగారు చనిపోయాక, వీరిలో విభేదాలు వచ్చాయి. కొంతమంది విడిపోయి మదర్స్ ట్రస్ట్ పెట్టుకున్నారు. తరువాత ఇక్కడనుండి వెళ్ళిపోయాడు. ఆరోజులు స్వర్ణయుగమని మాతో అన్నాడు.

ఈ హోమ్, ఇక్కడున్న పదికి పైగా ఇళ్లన్నీ బాబా, స్వామి తపసానంద, ఇంకొక అమెరికన్ స్వామి ముగ్గురే కట్టారని చెప్పాడు.  ఆ అమెరికన్ స్వామికి ఇళ్ల కట్టుబడి,  ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అన్నీ వచ్చట. ఈ ముగ్గురే ఈ అడవిలో ఉంటూ కొన్నేళ్లపాటు ఇవన్నీ కట్టారని అన్నాడు. లైబ్రరీని డోమ్ లాగా కడుతుండగా, పైనుంచి అమెరికన్ స్వామి జారి క్రింద పడిపోయాడట. నిలువుగా కాళ్ళమీద పడటంతో, అతని రెండు పాదాలు గిలకల దగ్గర పగిలిపోయాయి. అలాగే నేలమీద పడిఉండి, మూలుగుతూ, కొన్ని గంటలున్నాడట. దగ్గరలో ఎవరూ లేరు. ఉన్నవాళ్లు కూడా ఆ అడవిలో ఎక్కడెక్కడో వాళ్ళ పనులలో ఉన్నారు. అరిచినా కూడా ఎవరికీ వినపడదు. ఎప్పుడో ఆ తర్వాత మిగతా వాళ్లొచ్చి చూసి, అతన్ని ఆస్పత్రిలో చేర్చారట. చాలా ఏళ్లపాటు నడవలేకపోయాడట. ఆ తరువాత కూడా వీల్ చైర్ లో కూచుని పనులను పర్యవేక్షిస్తూ ఉన్నాడట. విభేదాలొచ్చాక, వెళ్ళిపోయి, టెక్సాస్ ప్రాంతాలలో ఎక్కడో ఉండి చనిపోయాడని గ్రెగరీ అన్నాడు. ఈ సెంటర్ వెనుక ఎంతోమంది నిస్వార్ధంగా చేసిన 20 ఏళ్ల శ్రమ ఉంది. ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. ఈ విషయాలు కొత్తవాళ్లకు తెలియవు.

ఇక్కడ దగ్గరలో ఒక మెంటల్ ఆస్పత్రి ఉండేదట. ఫండ్స్ లేవని దానిని మూసేస్తే, ఆ అమెరికన్  పిచ్చివాళ్లందరినీ ఆదరించిన భాష్యానంద గారు, ఇక్కడి ఆపిల్, పియర్స్ తోటలో వారిని పనివాళ్లుగా పెట్టుకుని  ఇదే రిట్రీట్ హోమ్ లో వారిని ఉంచి, భోజనం పెట్టి, ఆదరించారట. సీజన్లో ఆపిల్, పియర్స్ పండ్లను కోయడం వాళ్ళ పని. బేబీ ఫుడ్ తయారుచేసే ఒక ప్రముఖ కంపెనీ వీరి తోటలోని పండన్నీ కొనేదట. భాష్యానందగారు ఇక్కడ చేసిన నిస్వార్ధ సేవ ఎంతో ఉంది. శ్రీ రామకృష్ణుల సేవలో తన జీవితాన్ని త్యాగం చేసిన పునీతుడు స్వామి భాష్యానంద గారు.

పండ్లను కోయడానికి నిచ్చెన వేసుకుని ఆపిల్ చెట్టుపైకి ఎక్కాలి. ఆ నిచ్చెన నేలమీద వెడల్పుగా ఉండి, పైకి పోయేకొద్దీ కోసుగా ఉంటుంది. ఆలాగైతేనే చెట్ల కొమ్మల మధ్యలోకి పోవడానికి వీలౌతుంది. నిచ్చెన చివరకేక్కేసరికి బేలెన్స్ ఉండటం లేదని, క్రిందపడతామేమోనని భయమేస్తోందని వాళ్లంతా భాష్యానంద గారికి చెబితే, 'ఓం నమశ్శివాయ, శివాయనమః ఓం' అని జపం చేస్తూ నిచ్చెనెక్కండి. ఏమీ కాదని వారికి చెప్పిన భాష్యానందగారు  ఆ అమెరికన్స్ చేత పంచాక్షరీజపం చేయించేవారట. వాళ్ళు అలాగే చేసేవారట. కానీ, నేలపైన ఉన్నపుడు ధాటిగా ఛాంటింగ్ చేసినవాళ్లు, చెట్టు చిటారుకొమ్మ దగ్గర మాత్రం వణుకుతున్న గొంతుతో జపం చేసేవారని యాక్టింగ్ చేసి మరీ నవ్వుతూ చూపించాడు గ్రెగరీ.

స్విట్జర్ ల్యాండ్ లో స్వామి ఓంకారానందగారి ఆశ్రమంలో కొన్నేళ్లపాటు  తానున్నానని, ఆయన తన గురువని గ్రెగరీ అన్నాడు. ఓంకారానందగారు, డివైన్ లైఫ్ సొసైటీ శివానంద గారి పరంపరలోని స్వామి. వాళ్ళది కూడా చాలా స్వచ్ఛమైన యోగవేదాంత పరంపర. అక్కడే తను చాలా శ్లోకాలు నేర్చుకున్నానని చెబుతూ, 'త్రయంబకం యజామహే' అనే మంత్రాన్ని  చదివి వినిపించాడు. ఆశ్చర్యమేసింది.

భోజనం అయిన తర్వాత, 'మీరు నాకొక్క సాయం చేయాలి' అని అడిగాడు.

'ఏంటది?' అన్నాను.

'ఈ మంత్రానికి అర్థమేంటి?' అంటూ, బాలా మహామంత్రాన్ని అమెరికన్ యాసలో పైకి గట్టిగా ఉచ్చరించాడతను. నాకు మళ్ళీ ఆశ్చర్యమేసింది.

బాలామంత్రాన్ని నేను చిన్నతనంలో ఎన్నో ఏళ్లపాటు ఉపాసన చేశాను. అందుకే ఇతనిప్పుడు ఈ విధంగా వచ్చి కలిశాడని అర్ధమైంది.

'మీ గురువుగారు చెప్పలేదా?' అడిగాను.

'లేదు. ఉపదేశం మాత్రం ఇచ్చారు. ఇదేంటో కూడా నాకు తెలియదు. కానీ, నేను ఏం చేస్తున్నా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను.  ట్రక్కు తోలుతున్నా, చెట్లు కటింగ్ చేస్తున్నా, ఏ పనిచేస్తున్నా ఈ మంత్రం నాలోలోపల నడుస్తూనే ఉంటుంది. కానీ నాకు దీని అర్ధం తెలియదు. ఇన్నేళ్ళుగా ఎవరినీ అడగలేదు కూడా. మిమ్మల్ని చూస్తే అడగాలనిపించింది. కెన్ యు ప్లీస్ ఎక్స్ప్లెయిన్ మి ఎబౌట్ దిస్ మంత్ర?' అన్నాడు.

చాలా సంతోషం కలిగింది. అమెరికా మారుమూల కంట్రీసైడ్ లో, ఒక అమెరికన్ నుండి ఈ ప్రశ్న రావడం చూచి జగన్మాత లీలకు చాలా ఆశ్చర్యపడ్డాను. దారీతెన్నూ లేకుండా పోతున్న మన ఇండియా యువతకూ, ఇలాంటి అమెరికన్స్ కూ ఎంత తేడా ఉందో కదా అనిపించింది.

అది బాలామహామంత్రమని, శ్రీవిద్యలో చాలా ముఖ్యమైన మంత్రమని అతనికి వివరించి, అక్కడికక్కడే ఆ బీజాక్షరాల అర్ధాలను అతనికి వివరించి చెప్పాను.

బాల అంటే జగన్మాత యొక్క చిన్నపిల్ల రూపమని, ఈ మంత్రంలో సిద్ధి పొందినవారు ఇండియాలో లక్షలాది మంది ఉన్నారని చెప్పాను. ఈ మంత్రసాధన చాలా సులభమని, అదే సమయంలో ఎన్నో అద్భుతమైన వరాలనిస్తుందని వివరించాను.

బీజాక్షరాల వివరణను అతను ఎంతో శ్రద్దగా వినడం చూచి మళ్ళీ నాకు చాలా ఆనందం కలిగింది. ఎన్నో ఏళ్ళక్రితం ఓంకారానంద స్వామి దగ్గర ఇతను తీసుకున్న దీక్ష నేటికి ఈ విధంగా పరిపూర్ణమైంది.

'ఈ మంత్రాన్ని వదలకు. ఇది నీదగ్గరున్నంతసేపూ జగజ్జనని నీ వెంటే ఉంటుంది. నిన్ను రక్షిస్తూ ఉంటుంది' అని చెప్పాను.

'ఆ విషయం నాకు చాలాసార్లు అనుభవమైంది. మొన్నటికి మొన్న, ఒక చెట్టును నరుకుతున్నాను.  చివరకొచ్చేసరికి ఒక పెద్ద గాలి వీచింది. ఆ చెట్టు విరిగి అవతలవైపు పడింది.  లేకపోతే అది నాపైన పడి ఉండేది. డివైన్ మదర్ నన్ను ఎప్పుడూ రక్షిస్తూనే ఉందని నాకు తెలుసు. ఇలాంటి ఎన్నో అనుభవాలు నాకున్నాయి' అన్నాడతను.

ఒక క్రిస్టియన్ నోట ఇలాంటి మాటలు విని ఎంతో ఆనందించాను.

అతనింకా ఇలా అన్నాడు.

'ఇక్కడున్న రోజులలో, భాష్యానంద గారు 'సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే' అనే శ్లోకాలను  ఎంతో రాగయుక్తంగా పాడేవారు. ఆ ట్యూన్ నాకెంతో ఇష్టం. ఆయన పాడిన పాట మీదగ్గర ఆడియో ఫైల్ ఉందా?' అన్నాడు.

'లేదు. మేమాయనను చూడలేదు. వినలేదు' అని చెప్పాము.

అతను కొంచం నిరాశగా ముఖం పెట్టాడు. 1980 నుండి 1996 వరకూ అక్కడ జరిగిన స్వర్ణయుగాన్ని అతను మరచిపోలేకపోతున్నాడని అర్ధమైంది.

'చాలా మంచిది. గుడ్ నైట్. మళ్ళీ రేప్పొద్దున కలుద్దాం' అని సెలవు తీసుకున్నాను.

read more " మూడవ అమెరికా యాత్ర - 37 (బాలామంత్రానికి అర్ధమడిగిన అమెరికన్) "

12, అక్టోబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 36 (మదర్స్ ట్రస్ట్ సందర్శన)


మదర్స్ ట్రస్ట్ ఆలయంలో



బాబాతో మాట్లాడుతూ



అయిదేళ్లక్రితం ఉపన్యాసం ఇచ్చిన హాల్లో


విండో టేబుల్ దగ్గర కాసేపు


గుడ్ బై మదర్స్ ట్రస్ట్

మర్నాడు యోగాభ్యాసం చేసి, బ్రేక్ ఫాస్ట్ కోసం మెయిన్ బిల్డింగ్ లోని కిచెన్ దగ్గరకు వచ్చాం. అక్కడ టిఫిన్ తయారు చేసుకుని తిని, మదర్స్ ట్రస్ట్ కు వెళ్లి బాబాను పలకరిద్దామని బయలుదేరాము. స్వామి ఆత్మలోకానంద గారిని ఇక్కడందరూ బాబా అని పిలుస్తారు.

మేమున్న కాటేజీల నుంచి మదర్స్ ట్రస్ట్ కు నడిచి వెళ్ళవచ్చు.  అంత దగ్గర. కానీ, బాగా చలిగా ఉండడంతో అందరం కార్లలోనే వెళ్ళాము. యధావిధిగా అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. లోపలికెళ్ళి ఆలయంలోని శ్రీయంత్రానికి, శ్రీరామకృష్ణులవారికి, శారదామాతకు నమస్కారం చేసుకుని కాసేపు ప్రశాంతంగా కూచున్నాము. వారి పాదాల దగ్గర గౌరీవ్రతమా ఫోటో పెట్టి ఉంది. పోయినసారి 2016, 2017 లలో మేమొచ్చినపుడు, అక్కడే గౌరీవ్రతమా తో మాట్లాడాము. ఇప్పుడామె ఫోటోగా మారిపోయింది. 

బాబాకు ఫోన్ చెయ్యమని ఆనంద్ కు చెప్పాను. బాబా ఫోనెత్తి, వస్తున్నానని అన్నారు.

మేమక్కడ కూచుని మౌనంగా వేచి యుండగా, బాబా వచ్చారు. ఇంతకుముందు గౌరీవ్రతమా ఉన్న  ఇంటివైపునుంచి ఆయనొచ్చారు. ఆమె జూన్ లో చనిపోయింది గనుక, అదే ఇంట్లో ఇప్పుడు ఆయనున్నారని అర్ధమైంది. జీన్స్ ప్యాంట్, షర్ట్ లో ఉన్నప్పటికీ, సన్యాసచిహ్నంగా భుజాలపైన ఒక కాషాయ శాలువా కప్పుకుని ఉన్నాడాయన.

మేము మర్యాదపూర్వకంగా లేచి ఆయనకు నమస్కారం చేశాము.

ఆనంద్ తనను, నన్ను పరిచయం చేసుకున్నారు. కానీ బాబా మమ్మల్ని గుర్తుపట్టలేదు. మర్యాదకోసం మేము గుర్తున్నట్లుగా మాట్లాడారు గాని, ఆయనకు మేము గుర్తులేమని అర్ధమైంది. బహుశా కోవిడ్ వల్ల ఆయనకు జ్ఞాపకశక్తి పోయిందని అనుకున్నాము.

'ఎలా ఉన్నారు?' అని ఆయనను అడిగాము.

'బాగానే ఉన్నాము, గౌరీవ్రతమా జూన్లో చనిపోయింది. ఆమె చివరి దశలో నేనే ఆమెకు సేవలు చేశాను.  నాకు ప్రస్తుతం 71 ఏళ్ళు. అదుగో ఆ ప్రక్కనే ఉన్న ఇంట్లో శక్తిమా ఉంటుంది.  ఆమెకు 70 ఏళ్ళు. ప్రస్తుతం మేమిద్దరమే ఇక్కడున్నాం. మాతాజీ కూతురు చికాగోలో  అటార్నీగా ఉంది. మా తరువాత ఆమె ఈ ట్రస్ట్ ని చూసుకోవాలి. రిట్రీట్ హోమ్ ను అమ్మేశాము. ఇంకో ఇంటిని కూడా అమ్మేశాము. అలా నడుస్తోంది' అన్నాడాయన.

ఫండ్స్ లేవని మాకర్థమైంది. అందుకే ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. ట్రస్టీలలో ఒకరైన  స్వామి తాపసానంద గారు చనిపోయారు. ఇప్పుడు గౌరీవ్రతమా కూడా పోయారు.  బాబా ఒక్కరున్నారు.

'మైకేల్, జూలియా ఎలా ఉన్నారు?' అడిగాము.

'మైకేల్ బాగున్నాడు. ఆ ప్రక్క ఇంట్లోనే ఉంటాడు. అతని సబ్జెక్ట్ పెర్మాకల్చర్. అతనికిక్కడ నూరెకరాల ఫామ్ ఉంది. అది చూసుకుంటూ ఇక్కడే ఉన్నాడు. జూలియా టెక్సాస్ వెళ్ళిపోయి తన కూతురు దగ్గరుంటోంది. వాళ్లిద్దరూ డైవర్స్ తీసుకోలేదు గాని, దూరంగా ఉంటున్నారు' అన్నాడు బాబా.

అయిదేళ్ల క్రితం ఇక్కడకొచ్చినపుడు మైకేల్, జూలియాలకు నేను దీక్షనిచ్చాను. వాళ్లిద్దరూ నా శిష్యులే. కనుక వాళ్ళ గురించి కనుక్కోవలసిన బాధ్యత నాపైన ఉంది.

'మనం ఉండేది ఈ లోకంలో కొన్నాళ్లే. మన తర్వాత ఇంకెవరో వస్తారు. చూసుకుంటారు. ఈ లోకంలో మనం చెయ్యగలిగింది మనం చేశాము. అంతే. ఉంటా మరి' అంటూ ఆయన నమస్కారం పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు.

చాలా నిరాశగా, చివరి ప్రయాణానికి సిద్ధమౌతున్నట్లుగా ఆయన కనిపించారు. భారమైన గుండెలతో మేమూ వెనక్కు  బయలుదేరాము.

బయటకొచ్చి చూస్తే, ఆరేళ్లక్రితం 2016 లో మేమొచ్చినపుడు ఉన్న రిట్రీట్ హోమ్ కనిపించింది. ప్రస్తుతం దానిలో ఎవరో ఫేమిలీ ఉంటున్నారు. వాళ్ళ కార్లు, ఒక బోటు అక్కడ కనిపించాయి. దగ్గర్లోనే లేక్ ఉంది కాబట్టి, అందులో బోటింగ్ కి వెళుతూ ఉంటారు ఇక్కడివాళ్ళు. ఎవరి పడవ వారికి ఉంటుంది.

మౌనంగా కార్లెక్కి మా కాటేజీకి బయలుదేరాము.

ఏ సంస్థ అయినా ఇంతే. కలకాలం నడవాలంటే రెండు ఉండాలి. ఒకటి డబ్బు, రెండు, నడిపించే మనుషులు.  లాభాలొచ్చే కంపెనీలైతే అవి రెండూ ఉంటాయి. ఇలాంటి ధార్మికసంస్థలతో ఇదే చిక్కు. ఇవి కొన్నాళ్లు వెలుగుతాయి. తరువాత అక్కడ ఎవరూ ఉండరు. పుట్టపర్తి ఎలా ఉంది ఇప్పుడు? జిల్లెళ్ళమూడి ఎలా ఉంది? అంతే. ఫండ్స్ చూసుకోవాలి, రెండవ తరాన్ని తయారు చెయ్యాలి.  అప్పుడే ఏ ధార్మికసంస్థ అయినా కొన్నాళ్ళు బ్రతుకుతుంది. ఒక్క మనిషిమీద ఆధారపడితే ఆ తరువాత ఆ సంస్థ కుప్పకూలుతుంది.

కార్లో వెనక్కు వస్తుంటే ఆనంద్ ఇలా ప్రశ్నించాడు.

'క్రైస్తవం రెండువేల ఏళ్ల నుంచీ, ఇస్లాం 1300 ఏళ్ల నుంచీ ఎలా కంటిన్యూ అవుతున్నాయి మరి?'

ఇలా చెప్పాను.

'అవి ధార్మికసంస్థలు కావు. మతాలు. క్రైస్తవమేమో మనుషుల మధ్యన విభేదాలు సృష్టించి, కాకమ్మకథలు చెప్పి, లంచాలు ఎరజూపి నెట్టుకొస్తోంది. ఇస్లామేమో మెడమీద కత్తిపెట్టి, దౌర్జన్యంతో, విధ్వంసంతో, భయోత్పాతాన్ని సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటోంది. ఆ విధంగా అవి కొనసాగుతున్నాయి. ధర్మంగా బ్రతకాలంటే అది కుదరదు. అసలైన ధర్మం ఎవరికి కావాలి?

మదర్స్ ట్రస్ట్ విషయం వేరు. చికాగో వేదాంతసొసైటీ పైన తిరుగుబాటు చేసి వీళ్ళు బయటకొచ్చారు.  దాని వెనుక వీళ్ళ స్వార్ధప్రయోజనాలు వీళ్లకున్నాయి. అది తప్పు, పైగా, వీళ్ళకొక  యాక్టివ్ అజెండా లేదు, పవర్ ఫుల్ స్పీకర్స్ లేరు. పిచ్చి జనానికి కూడా ఎప్పటికప్పుడు మహిమలు, మాయలతో కూడిన సెన్సేషనల్ క్రొత్తదనం కావాలి. వీళ్ళేమో అలాంటివి చెయ్యరు. పైగా వీళ్ళు రెండవతరాన్ని తయారు చెయ్యలేదు. కనుక వీళ్లకు టేకర్స్ లేరు. ఇంకేమౌతుంది? ఈసారి మనం వచ్చేసరికి ఇదీ ఉండదు. ఎవరో దీనిని కొనేస్తారు. ఒక హోటలో ఇంకేదోనో పెడతారు. అంతే.

ఈ పనిని మనం చెయ్యకూడదు. మొయ్యలేని బరువును మనం నెత్తికెత్తుకోకూడదు. పెద్ద బిల్డింగ్స్ కట్టేసి హడావుడి చెయ్యకూడదు. మన ఆశ్రమానికి ఇవన్నీ గుణపాఠాలు. మనం ప్రాక్టికల్ గా ఉండాలి. సింపుల్ గా ఉండటం, ఎక్కువమంది మనుషులని చేర్చుకోకుండా ఉండటం, మౌలికమైన సాధనాసిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, పూజలకు, గుళ్ళకు, సోషల్ సర్వీస్ కి దూరంగా ఉండటం, మనం చెయ్యాలి. మనది అసలైన ఆధ్యాత్మికమార్గం. కానీ ప్రపంచాన్ని మారుద్దామని మనం ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అప్పుడు, ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా  ఎవరున్నా, ఎవరు పోయినా మనమేమీ చలించం.

2017 లో రెండవసారి మనం వచ్చినపుడే వీళ్ళ ప్రవర్తనలో తేడా ఉంది. అప్పుడే నేననుకున్నా వీళ్ళు ఎక్కువకాలం నిలబడలేరని. అదే జరుగుతున్నది. మనం బాధపడకూడదు. ఎవరి ఖర్మను బట్టి వారికి జరుగుతుంది. అన్నింటినీ భగవంతుడే చూసుకుంటాడు. Don't worry. They deserve this' అన్నాను.

మౌనంగా తల పంకించాడు ఆనంద్.

మాటల్లోనే మేముండే కాటేజ్ వచ్చేసింది.
read more " మూడవ అమెరికా యాత్ర - 36 (మదర్స్ ట్రస్ట్ సందర్శన) "