'విశాఖపట్నం నుండి ఒకాయన ఫోన్ చేశాడు. అర్జెంట్ గా మిమ్మల్ని కలుస్తాడట' అన్నాడు మా సెక్రటరీ మూర్తి.
'ఎందుకు?' అడిగాను.
'సమాధిస్థితి కావాలట' అన్నాడు.
'ఎంత వయసు?' అడిగాను.
'చిన్నవాడే. ముప్పైకి అటూ ఇటూ ఉండచ్చు' అన్నాడు మూర్తి.
ఆశ్చర్యమేసింది.
'సరే రమ్మను. చూద్దాం' అనబోతున్నాను.
అంతలో ఒక బాంబు పేలింది.
'కానీ కొన్ని కండిషన్స్ పెట్టాడు' అన్నాడు మూర్తి.
'ఏంటవి?' అడిగాను.
'శుక్రవారం సాయంత్రం వస్తాట్ట. శనివారం, ఆదివారం మాత్రం ఆశ్రమంలో ఉండగలడట. మళ్ళీ సోమవారం పొద్దున్నే వెళ్ళిపోవాలట. అంతకు మించి కుదరదట. ఈలోపలే, గురువుగారిచ్చే సమాధో ఇంకోటో లేటు చెయ్యకుండా ఇచ్చెయ్యాలన్నాడు. లేటయితే తనకు నచ్చదట' అన్నాడు మూర్తి.
'ఏం లేటయితే పరలోకానికి ఫ్లయిటు మిస్సవుతుందా?' అడిగాను.
'ఏమో మరి?' అన్నాడు.
'సరే. ఒకపని చేద్దాం. 'సాధనా నివాస్' కోసం తెప్పించిన ఇటుకలు, సిమెంటు, ఐరను అన్నీ ఆశ్రమంలోనే ఉన్నాయి. వాటితో ఒక 4x4 సమాధి కట్టిద్దాం. వచ్చి శుక్రవారం సాయంత్రం అందులో కూచోమను. బయటనుంచి డోరు సీలు చెయ్యమంటే చేసేద్దాం. బయటకొచ్చే ఓపికుంటే, సోమవారం పొద్దున్నే తలుపు తీసుకుని బయటకురావచ్చు, లేదంటే, ఎప్పటికీ అందులోనే ఉండిపోవచ్చు' అన్నాను.
మూర్తి నవ్వి, 'ఇదే చెప్పమంటారా?' అన్నాడు.
'నిరభ్యంతరంగా చెప్పు . మరి సమాధి త్వరగా కావాలంటే అదే మార్గం' అన్నాను.
సోషల్ మీడియా ప్రభావంతో అన్నీ వెర్రితలలేసినట్లే ఆధ్యాత్మికం కూడా వేస్తోంది.
చక్రాలు, కుండలిని, సమాధి, ఆత్మసాక్షాత్కారం, జీవన్ముక్తి మొదలైనవన్నీ ఏవో నవ్వులాటల్లాగా తయారయ్యాయి. వారంరోజుల కోర్సుతో ఇవన్నీ వచ్చేస్తాయని భ్రమపడుతున్నారు పిచ్చిజనం !
ఇలాంటివాళ్ళకి నేను చెప్పిన సమాధే కరెక్టు.
అదేంటి? అప్పుడే పనివాళ్ళొచ్చేశారు. సమాధి కట్టేస్తున్నారు. బాబోయ్ ! మావాళ్లు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.
మరి ఆ కుర్రాడెప్పుడొస్తాడో ఏంటో?