తెల్లవారుఝాము.
చీకటి బాగా ఉంది.
మైలుదూరంలోని పల్లెమసీదు పొద్దున్నే నిద్రలేపింది.
ఇవాళ శివరాత్రి కదా? దాని సౌండు చాలా పెరిగింది.
'అల్లా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు' అని రోషంగా మైకు అరుస్తోంది.
'610 CE కి ముందు ఎవడున్నాడా?' అని నాకు డౌటొచ్చింది.
తెలతెలవారుతోంది.
ఫోన్లో ఏదో మెసేజి వచ్చింది.
'ఏంటా?' అని చూచాను.
'హ్యాపీ శివరాత్రి' అని ఒక స్నేహితుని నుంచి.
'శివుడికి రాత్రయితే నీకు హ్యాపీ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాను.
తెల్లవారింది
ఆదివారం కదా ! ఇంకొక ఊరినుంచి చర్చిమైకు చెవుల్లో మ్రోగుతోంది.
దాని సౌండు కూడా ఇవాళ బాగా ఎక్కువైంది.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - అంటూ అరిగిపోయిన రికార్డులాగా ఎవరో అరుస్తున్నారు.
ఏ స్తోత్రమో, ఎవరికి స్తోత్రమో అదిమాత్రం చెప్పడం లేదు.
బహుశా వాళ్ళక్కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు.
కొంచెం పొద్దెక్కింది.
గుడిమైకులు నిద్రలేచాయి.
శివుడి సినిమాపాటలు మార్మోగుతున్నాయి.
మళ్ళీ ఏడాదిదాకా వాటికి పనీ ఉండదు. శివుణ్ణి అనుకునేవారూ ఉండరు.
'పోన్లే ఇవాళన్నా మ్రోగనీ' అనుకున్నాను.
బారెడు పొద్దెక్కింది.
2008 లో నేను వ్రాసిన మొట్టమొదటి పోస్టును ఒక శిష్యుడు నాకే ఫార్వార్డ్ చేశాడు.
అందులో, ఆనాటి శివరాత్రినాడు కాళహస్తిలో నాకు కలిగిన ధ్యానానుభవాన్ని వర్ణించాను.
నా పోస్టును నాకే పంపడంలో అతని ఉద్దేశం నాకర్ధం కాలేదు.
బహుశా, 'అప్పుడలా ఉన్నారు.ఇప్పుడేంటి?' అని అతని ఉద్దేశం కావచ్చు.
'ఇవాళ కనీసం స్నానం కూడా చెయ్యను' అని అతనికి రిప్లై ఇచ్చాను.
సూర్యుడు బాగా పైకొచ్చాడు. అంతటా వెలుగు పరచుకుంది.
నాకు బాగా మెలకువొచ్చింది.