“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మార్చి 2023, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 52 (అమ్మ శతజయంతి ఉత్సవాలు - వక్తల ప్రసంగాలు)

అమ్మ శతజయంతి ఉత్సవాలు  జరుగుతున్నాయి. ఇవాళ మూడోరోజు. ఇంకా రెండ్రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజూ స్వామీజీలు మాట్లాడుతున్నారు. అమ్మ భక్తులు వ్రాసిన గ్రంధాలు రోజూ ఆవిష్కరింపబడుతున్నాయి.

సామాన్యులైన భక్తులు వ్రాసిన గ్రంధాలు బాగున్నాయి. ఎంతో  కృషితో వ్రాయబడుతున్నాయి. స్వామీజీల  ప్రసంగాలు మాత్రం బాలేవు. వారి వేషాలకు తగినట్లు లేవు. చాలా పేలవంగా నిరాశాజనకంగా ఉన్నాయి.

మొదటిరోజున కుర్తాళం స్వామీజీ, ఆయన తమ్ముడు ఇంకొక స్వామి, ఆయన శిష్యురాలు ఒక స్వామిని మాట్లాడారు. స్వామినికి సబ్జెక్ట్ లేదు. చక్కని భాషా, వ్యక్తీకరణా రెండూ లేవు. తమ్ముడుస్వామికి కంఠస్వరం లేదు. ఉచ్ఛారణా స్పష్టతా లేవు. ఆయనేం మాట్లాడాడో ముందు వరసవాళ్ళకే వినిపించలేదు. 

ఇకపోతే, కుర్తాళం స్వామీజీ ప్రసంగం చాలా నిరాశపరిచింది. ముప్పైఏళ్ల క్రితం, ఇరవైఏళ్ల క్రితం ఆయన ఏం మాట్లాడాడో అదే మళ్ళీ మాట్లాడాడు. భావపరిపక్వత లేదు. మంత్రాలని, తంత్రాలని, దేవతలని అదే ధోరణి. మొత్తమ్మీద ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడం, పక్కవాళ్ళ డప్పు కొట్టడం తప్ప, అమ్మ తత్త్వాన్ని స్పష్టంగా అర్ధం చేసుకుని,  అమ్మ జీవితం నుంచి చక్కని సంఘటనలతో హృద్యంగా దానిని ఆవిష్కరించడం ఈ ముగ్గురిలో ఒక్కరూ చేయలేదు. అమ్మ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చెయ్యలేదని స్పష్టంగా తెలుస్తోంది.

అమ్మ బ్రతికున్నపుడే ఆమెను స్తుతిస్తూ 'అంబికా సాహస్రి' అనే వెయ్యి పద్యాల పుస్తకాన్ని కుర్తాళం స్వామి వ్రాశారు. ఇదిలా ఉంటే, ఆమె పోయిన ఏడాదిన్నర తర్వాత 'అమ్మ ఎవరు?' అనేది తెలుసుకోవాలని జిజ్ఞాసతో 'ఆత్మావాహన విద్య' ద్వారా అమ్మ ఆత్మను ఆవాహన చేసి రప్పించి ప్రశ్నించానని ఆయన వేదికాముఖంగా చాలాసార్లు చెప్పారు. మొన్నకూడా జిల్లెళ్ళమూడిలో  మళ్లీ అదే చెప్పారు. వినడానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.

అంటే, అమ్మ ఎవరో తెలీకుండానే ఆమెను అంబికగా స్తుతిస్తూ 'అంబికా సాహస్రి' గ్రంధాన్ని ఈయన వ్రాశారని అనుకోవచ్చునా? ఆత్మావాహన విద్యకు ప్రేతాత్మలు వస్తాయేమో గాని సాక్షాత్ అంబికయే అయిన అమ్మ కట్టుబడుతుందని ఆయనెలా అనుకున్నారో? ఈనాటికీ వేదికల పైనుంచి ఎలా చెబుతున్నారో? వినే గొర్రెలు ఎలా వింటున్నారో? నాకు చాలా అసహ్యమేసింది.

గుంటూరు వాడైన తిక్కన సోమయాజి జిల్లెళ్ళమూడి ప్రాంతంలో ఒక యజ్ఞం చేశాడని, ఆ యజ్ఞశక్తి ఆకాశంలో మేఘం లాగా ఉండిపోయి ఎవరిని ఆవహిద్దామా అని చూస్తుంటే అమ్మ కనిపించిందని, అప్పుడా శక్తి అమ్మలోకి దిగి వచ్చిందని ఒకరన్నారట. వారాహీసంహిత అనే నాడీగ్రంథంలో నేమో, పై లోకాలలో ఉండే ఒక దేవత భూమిపైన జన్మిస్తుందని, ఆమే అమ్మ అని, అమ్మ తల్లిదండ్రుల పేర్లతో సహా ఆ గ్రంథంలో ఉన్నాయని ఆయనన్నారు.  ఇంకొంతమంది మరికొన్ని రకాలుగా అమ్మను దర్సించారట, ఇవన్నీ 1960, 70 లలో జరిగాయట. వీటన్నిటినీ అమ్మకు చెబితే, దేనిని కానీ అవుననీ కాదనీ అనకుండా, 'వాళ్ళు చూచినది వాళ్ళు చెప్పారు' అందిట అమ్మ.

ఒకటే సత్యం ఇందరికి ఇన్ని విధాలుగా ఎలా కనిపిస్తుంది? కనుక ఇవేవీ సత్యాలు కాకపోవచ్చు.

అసలు 'అమ్మ ఎవరు?' అనే విషయాన్ని జ్యోతిష్యం ద్వారా, మంత్రవిద్యల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించడం సమంజసమేనా? సాధ్యమేనా? ఎందుకీ ప్రయత్నం? 22 ఏళ్ల క్రితం నేను జ్యోతిష్యంలో MA చేశాను. కొన్ని వేల జాతకాలను ఇప్పటికి విశ్లేషణ చేశాను. మెడికల్ ఆస్ట్రాలజీ పైన సాధికారిక గ్రంధాలను వ్రాశాను. కానీ, ఈ రోజుకు కూడా అమ్మ జాతకాన్ని విశ్లేషించే సాహసాన్ని నేను చేయలేకపోతున్నాను. 

'నేను నేనైన నేను' అని అమ్మ చెప్పింది. 'ఈ సృష్టి నాది అనాది' అన్నది. 'సృష్టే  భగవంతుడు' అన్నది. తనెవరో చెప్పకనే చెప్పింది. ఇంకేం కావాలి? 

అమ్మ ఎవరో తెలుసుకుంటే మనకు ఒరిగేది ఏముంది? కావలసింది అమ్మ ఎవరో తెలుసుకోవడం కాదు. మనమెవరో ముందు తెలుసుకోవాలి. అమ్మ తత్వాన్ని అర్ధం చేసుకుని, దానిని జీవితంలోకి అనువదించుకుని, ఆచరించి ధన్యత్వాన్ని పొందటం కావాలి. అమ్మ ప్రేమలో ఓలలాడటం కావాలి. అమ్మకు ఇష్టులుగా అవడం కావాలి. పరమహంస పరివ్రాజకులకు ఇంత చిన్నవిషయం ఎలా అర్ధం కావడం లేదో మరి?

జిల్లెళ్ళమూడిలో అమ్మ ప్రారంభించి, ఇతరులను చెయ్యమని చెప్పిన కార్యక్రమాలను ఎన్నింటిని, అమ్మను దేవతగా వేదికలపైనుంచి అభివర్ణించే ఈ స్వాములు వారివారి పీఠాలలో చేస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. అమ్మ జగన్మాత అనే భావన వీరికి నిజంగా ఉంటే అమ్మ బాటలో వీరు ఎందుకు నడవడం లేదు? అనేది నా ప్రశ్న.

రెండో రోజున విశ్వంజీ మాట్లాడాడు. మొదటిరోజుకంటే ఇంకా నిరాశ పరచింది ఈయనగారి ప్రసంగం. అమ్మ గురించి కంటే, సందర్భం లేని ఇతర విషయాలు ఏవేవో ఈయన మాట్లాడాడు. పాతికేళ్ల క్రిందటికీ ఇప్పటికీ ఈయనలో కూడా భావపరిణతి నాకు కనిపించలేదు.  తను వ్రాసిన ఏదో పాటను పాడుతూ, హృదయగ్రంధి అంటూ గుండెను, బ్రహ్మగ్రంధి అంటూ తలనూ, రుద్రగ్రంధి అంటూ మెడ వెనుకను చేతితో చూపించాడాయన. ఆ గ్రంధుల స్థానాలు అవా? నాకు మతిపోయింది. అవున్లే. సత్యసాయి ప్రశాంతినిలయంలో ఇటుకరాయి బొటనవ్రేలి పైన పడి కుండలినీ ప్రబోధం కలిగింది కదా! ఆ దెబ్బకు గ్రంధుల స్థానాలు  అలా మారిపోయి ఉంటాయని సర్దుకున్నాను. చివరలో ఇండియా మాతకూ జై, అమెరికా మాతకూ జై అని సభికులచేత అనిపించాడు. మిగతా మాతలు ఏం పాపం చేశారో నాకైతే అర్ధం కాలేదు. ఈయన ప్రసంగాన్ని వినిన తర్వాత, మొదటి రోజున నాలో కలిగిన ప్రశ్నలే మళ్ళీ ఇంకా గట్టిగా కలిగాయి. నవ్వూ జాలీ ఒకేసారి కలిగాయి.

మూడో రోజైన  ఈరోజున గన్నవరం స్వామీజీ మాట్లాడాడు. ఈయనకూడా కుర్తాళంస్వామి శిష్యుడేనని ఆయనే చెప్పుకున్నాడు. రామాయణంలోని శబరి, ఇప్పుడు అమ్మగా పుట్టిందని ఈయనంటాడు. పాదయాత్రలు, సంఘసంస్కరణ అంటూ ఏదేదో మాట్లాడాడీయన.

కాకపోతే కొంతలో కొంత నయం. 'ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం' అంటూ శ్రీరామచంద్రుని స్మరిస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడీయన. ఇది నచ్చింది. ఇవాళ శ్రీరామనవమి. వక్టలలో కనీసం ఈయనకొక్కరికి గుర్తుంది. సంతోషం !

సమాజంలో రామభక్తి తగ్గిపోతూ, అయ్యలు, అప్పలు, బాబాలు, గురువులు దేవుళ్ళుగా చలామణీ అవడం ఎప్పుడైతే పెరిగిందో, అప్పుడే జనజీవనంలో   ధర్మం తగ్గిపోతూ వచ్చింది. ఇది సత్యం. రామభక్తి తగ్గడమే తెలుగునేలకు పట్టిన దరిద్రం. ఈ విషయాన్ని ఏ స్వామీజీలూ చెప్పడం లేదు. బాధాకరం. 

శ్రీరామునిగా అమ్మను కొందరు భక్తులు ఏ విధంగా దర్శించినది, రామతత్త్వాన్ని అమ్మ ఎలా వివరించింది అన్న విషయాన్ని,  సాక్షాత్తు శ్రీరామనవమి నాడు వక్తలెవరూ మాట్లాడలేదు. శోచనీయం !

హిమాలయాలలో మూడువేల ఏళ్ల క్రితం తాను తపస్సు చేశానని కుర్తాళంస్వామి తనతో చెప్పాడని ఈయనన్నాడు.  సందర్భోచితం కాని ఇలాంటి కాకమ్మకబుర్లను ఇలాంటి వేదికలపైనుంచి ఎందుకు చెబుతారో నాకైతే అర్ధం కాదు. అదే నిజమైతే, అమ్మ ఎవరో తెలుసుకోవడానికి వీరికి నాడీజ్యోతిష్యమూ, ఆత్మావాహన  మంత్రవిద్యలూ అవసరమా? అని నాకనిపించింది. వీరి అవగాహనా రాహిత్యానికి, కాకమ్మ కబుర్లకు చాలా  జాలేసింది.

రాజకీయుల ప్రసంగాలు వీరికంటే ఇంకా పేలవంగా నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రసంగించడానికి వచ్చిన రాజకీయ నాయకులలో ఒక్కరికి కూడా అమ్మ తత్త్వం ఏమిటో తెలియదు. అదికూడా అమ్మ పుట్టిన నూరేళ్ళ తర్వాత ఈనాటికి కూడా ! శోచనీయం !

విశ్వజననీ పరిషత్ చైర్మన్ నరసింహమూర్తిగారి ప్రసంగం ఒక్కటే నన్ను కదిలించింది. ఆయన తన హృదయం నుంచి మాట్లాడాడు. కదిలించింది. రావూరి ప్రసాద్ గారి ప్రసంగం మళ్ళీ కదిలించింది. వీళ్ళు అమ్మ భక్తులు. నిరంతరం అమ్మ ధ్యానంలో పండిపోయినవాళ్లు.  భక్తితో నిండిన హృదయం నుండి ఉప్పొంగి వచ్చిన వీళ్ళ ప్రసంగాల ముందు స్వామీజీల, రాజకీయుల పడికట్టుపదాల ఊకదంపుడు ఉపన్యాసాలు వెలాతెలా పోయాయి. కృత్రిమాలయ్యాయి.

ఈ మూడు రోజుల ప్రసంగాలు విన్న తర్వాత నాకు అమ్మ వాక్యం ఒకటి గుర్తొచ్చింది.

'వక్తలందరూ ప్రవక్తలూ కారు. ప్రవక్తలందఱూ వక్తలూ కారు'.

ఎంత గొప్ప సత్యం !

జయహో మాతా !