“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, ఏప్రిల్ 2023, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 53 (అచలం - అద్వైతం - పెద్దల బోధ)

ఒకరోజున పందిళ్ళలో టిఫిన్ చేసి, టీకోసం క్యూలో నిలబ miడి ఉన్నపుడు, శ్రీకాంత్ కనిపించాడు. తను విశ్వజననీ పరిషత్ ఆఫీసులో వీడియో సెక్షన్ చూసుకుంటూ ఉంటాడు. పదేళ్లనుంచీ నా బ్లాగు చదువుతూ ఉంటాడు. జిల్లెళ్ళమూడిలో ఎప్పుడు ఎదురైనా చాలా అభిమానంగా పలకరిస్తారు.

'ఎప్పుడొచ్చారు?' అడిగాడు.

'వారమైంది' అన్నాను.

'అయ్యో. నాకు తెలీదు. తెలిస్తే వచ్చి కలిసేవాణ్ని' అన్నాడు నొచ్చుకుంటూ. 

'నేనస్సలు బయటకు రావడం లేదు.  ఎవరితోనూ కలవడం లేదు. ఆఫీసు వైపు ఒక్కసారి కూడా రాలేదు ' అన్నాను.

టీ త్రాగుతూ ఒకవైపున నిలబడి మాట్లాడుకున్నాం. మూర్తి, అఖిల, శ్రీమతి, సంధ్య ఒకప్రక్కగా నిలబడి వింటున్నారు.

'మీ బ్లాగును నేను చాలా ఇష్టపడతాను, నిక్కచ్చిగా సూటిగా ఉండే మీ భావాలు నాకు చాలా నచ్చుతాయి' అన్నాడు.

నవ్వాను టీ సేవిస్తూ

'కానీ మీతో మాట్లాడాలంటే ఒకటే భయం బ్లాగులో రాసేస్తారేమో అని' అన్నాడు నవ్వుతూ.

'మంచిగా మాట్లాడితే మంచిగానే వ్రాస్తాను. వేషాలేస్తేనే, ఎలా వ్రాయాలో అలా వ్రాస్తాను. నీకా భయం అవసరం లేదులే' అన్నాను.

'మొదట్లో విశ్వాత్మ గారిని గురించి మీరు వ్రాసిన పోస్టులు చదివి అప్పటినుంచీ మీ బ్లాగు చదవడం మొదటుపెట్టాను.  విశ్వాత్మ గారితో నాకు బాగా పరిచయం ఉండేది. ఆయన నన్ను చాలా అభిమానించేవారు. ఫోన్లో రోజూ టచ్లో ఉండేవారు. ఎంతలా అంటే, నేను ఇక్కడ ఆయన్ను అనుకుంటే మరుక్షణం ఆయన నుంచి ఫోనొచ్చేది. 'మీకెలా తెలుస్తుంది? నేను మిమ్మల్ని తలుచుకున్నట్లు?' అని ఆయన్ను అడిగాను. దానికి ఆయన, 'నేను ఎవరితో మాట్లాడుతున్నానో వారి ముఖంలో నీ ముఖం కనిపిస్తుంది ఆ క్షణంలో. వెంటనే నీకు ఫోన్ చేస్తాను' అని చెప్పారు' అన్నాడు.

నేను మౌనంగా టీ త్రాగుతున్నాను.

గుడివాడ, బందరు, చల్లపల్లి ప్రాంతాలలో నేను కొంతకాలం పాటు ఉన్నాను. అక్కడున్న అచల సంప్రదాయంతో నాకు బాగా పరిచయం ఉంది' అన్నాడు

'అలాగా' అన్నాను

'అచల సాంప్రదాయం గురించి మీకు తెలుసా?' అడిగాడు

'తెలుసు. చల్లపల్లి బ్యాచ్ ఇక్కడ కూడా ఉన్నారు కదా కొంతమంది' అన్నాను నవ్వుతూ.

'అవును ఉన్నారు. అద్వైతం  కంటే అచలం గొప్పదని వాళ్లంటారు' అన్నాడు

'ఏ విధంగా?' అన్నాను

'అఖండమైన ఎరుకను అద్వైతం అంటారు కదా. ఆ ఎరుకను కూడా దాటినదే అచలమని వాళ్ళ భావన.  ఎరుకను కలిగించేవాడు సద్గురువు కాడు. ఎరుకనుండి విడిపించేవాడే సద్గురువని అచలం అంటుంది. మీరు సద్గురువును గురించి చెబుతూ, 'సత్ ను దర్శింపజేసేవాడే సద్గురువు' అన్నారు కదా ! ఆ మాట నాకు చాలా నచ్చింది' అన్నాడు సంతోషంతో ముఖం వెలిగిపోతూ.

'అవును అంతే కదా మరి !' అన్నాను.

'అచల సాంప్రదాయం గురించి తెలుసుకుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. అది మన దేశంలో పల్లెపల్లెల్లోనూ తత్త్వాల రూపంలో ఉంది. అసలు గురుభక్తి అనేదానిని వారినుంచి తెలుసుకోవాలి. గురు అనుగ్రహం కలిగే వరకూ ఎన్నేళ్ళైనా అలా గురువును సేవిస్తూ ఓపికగా ఎదురు చూస్తారు వాళ్ళు. ఈలోపల ప్రతిరోజూ గురువును దర్శిస్తూ, దేహం, ఇంద్రియములు, మనస్సు, ఎరుక మొదలైనవాటిగురించి తెలుసుకుంటూ ఉంటారు. సాంఖ్యం, అమనస్కం, తారకం మొదలైనవాటిని వారికి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అచలాన్ని అందుకున్న యోగి చాలా విలక్షణంగా ఉంటాడట. చాలా నిదానంగా, అడుగులో అడుగేసున్నట్లుగా అతను నడుస్తాడట. అతన్ని కనుక్కోవడం చాలా కష్టమంటారు' అన్నాడు.

'అడుగులో అడుగేసినంత మాత్రాన అచలాన్ని అందుకున్నట్లు ఏమీకాదు. ఒకవేళ అలాంటివాడు ఎదురైతే నిజంగా వాళ్ళు గుర్తించగలరా?' అడిగాను.

' ఏమో మరి' అన్నాడు.

'వాళ్ళ సాధనావిధానం ఏమిటి? ఎరుకను గురించి ఉత్తగా తెలుసుకున్నంత మాత్రాన అది ఎలా కలుగుతుంది? బుద్ధిపరమైన అవగాహన వేరు, అనుభవం వేరు కదా? ఉత్త భజనలతో, తత్వాలు పాడుకోవడంతో, చర్చలతో అది అందుతుందా? అఖండమైన అనంతమైన ఎరుక అనేది ముందు అందితే కదా, దానిని కూడా దాటి అచలం లోకి వెళ్ళేది? ఈ ఎరుక ఎలా అందుతుంది? దానిని అందుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు? ' అన్నాను

'పెద్దలబోధలో దీనికి మార్గాలున్నాయని విన్నాను. అద్వైతాన్ని మించినది అచలం అయితే, అచలాన్ని మించినది పెద్దల బోధ అంటారు. సాంఖ్యము, తారకము, అమనస్కము దానికి దారులు. ఎంతో పుణ్యాత్ములకు గానీ పెద్దలబోధ అందదని నేను విన్నాను. అందులో దర్పణదీక్ష మొదలైన దీక్షలుంటాయిట' అన్నాడు.

'ఏమౌతుంది దర్పణదీక్షలో?' అడిగాను

'అది రెండు విధాలుగా ఉంటుందని నేను విన్నాను. కన్నుకు కన్ను మనసుకు మనసు అని ఉపనిషత్తులు అన్నాయి కదా. బింబ ప్రతిబింబ న్యాయంతో, తానూ ఈ సృష్టీ ఇవన్నీ బ్రహ్మానికి ప్రతిబింబాలే అని అర్ధమౌతుంది.  ఇంకొక విధానంలో అయితే, సృష్టి మొత్తాన్నీ చూస్తున్న ఒక కన్ను వారికి కనిపిస్తుందట. దానినుంచి చూస్తే సృష్టి యొక్క నిజతత్వం వారికి దర్శనమౌతుందట. ఈ విధంగా నేను విన్నాను. రెండు విధాలుగానూ  దీనిని దర్శించినవారు ఉన్నారు' అన్నాడు.

'ఒకటి జ్ఞానదీక్ష , మరొకటి యోగదీక్ష. ఇంతేగా?' అన్నాను. 

'గతంలో మన తెలుగునేలలో ప్రతి పల్లెలోనూ అచల సాంప్రదాయం ఉండేది. అయితే కాలక్రమేణా అది పెడదారి పట్టిందట. గురుసాంగత్యం, గురుభక్తి అనేవి బాగా ముదిరిపోయి, గురువుతో శయనించడం అనేదాకా వచ్చిందట. ఇటువంటి పెడధోరణులను ఖండిస్తూ మలయాళ స్వాములవారు 'శుష్కవేదాంత తమో భాస్కరము' అనే గ్రంధాన్ని వ్రాశారు. అందులో ఈ భ్రష్ట సాంప్రదాయాలను చీల్చి చెండాడారు. పల్లెటూర్లలో ఉన్న అచలసంప్రదాయాలను అన్నింటినీ ఈ గ్రంధం తుడిచిపెట్టేసింది. అప్పట్లో ఆ గ్రంధం అంత శక్తివంతంగా పనిచేసిందట' అన్నాడుఆశ్చర్యంగా. 

'నేటి ఇంటర్ నెట్ లాగా అన్నమాట' అన్నాను.

'ఇటువంటి పెడపోకడలతో అచల సంప్రదాయం కాలక్రమేణా కనుమరుగైపోయింది' అన్నాడు. 

నవ్వాను.

'విను శ్రీకాంత్. ఏదీ కనుమరుగు కాలేదు. అన్నీ ఉన్నాయి. ఎవడికి అర్హతుందో, వాడికి అందుతాయి. ఆధ్యాత్మికమార్గంలో అర్హతే ప్రధానం.

గురువుతో శయనించడం అనేది కూడా తప్పేమీ కాదు. అది కూడా ఒక ఆమోదయోగ్యమైన తాంత్రిక సాధనావిధానమే. తాంత్రికబౌద్ధాన్ని అనుసరించే టిబెటన్ లామాలు చాలామంది ఈ సాధనను అభ్యసిస్తారు.  సాధనామార్గాన్ని, దాని విభిన్న విధానాలను, వాటి రహస్యాలను తెలుసుకోలేని, తెలిసీ తెలియని పిచ్చిలోకులు దానిగురించి ఏదేదో అనుకుంటూ ఉంటారు. కౌలాచారం, వామాచారాలలో అది సమ్మతమే. అయితే, అది దిగజారకూడదు. గురువుతో శారీరిక, ప్రాణిక, మానసిక ఏకత్వం ఏర్పడినపుడు అతనితో శయనించడం తప్పేమీ కాదు. సాధనామార్గపు రహస్యదారులలో నడిచేవాళ్లకు, లోకులు పెట్టుకున్న పిచ్చిరూల్స్ వర్తించవు. పుస్తకాలు చదువుతూ, నెట్ చూస్తూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, అదే పెద్ద గొప్పగా భావించే సామాన్యజనం, అంతరిక సాధనామార్గపు లోతుపాతులను ఏనాటికీ అర్ధం చేసుకోలేరు. అదంతే' అన్నాను.

'అవును. రామకృష్ణులవారు కూడా 'ఇంటికి అనేక దారులుంటాయి. అందులో అది దొడ్డిదారివంటిది' అన్నారు.  దీనిని నేను చదివాను. మీరు కూడా నిత్యానంద రంజితల ఉదంతాన్ని సమర్ధించారు ఒక పోస్టులో. అది కూడా నాకు నచ్చింది' అన్నాడు.

'అవును. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, విమర్శించడానికి మనమెవరం? వాళ్లిద్దరూ మేజర్లు. ఈ మధ్య వస్తున్న సుప్రీంకోర్టు తీర్పులు చూస్తున్నావా? అవికూడా ఇలాంటి ధోరణులను సమర్ధిస్తున్నాయి. పైగా, అవి తంత్రమార్గపు రహస్య సాధనలు. వాటివరకూ అవి వ్యాలిడ్ సాధనలే. అయితే సాధన సాధనగా ఉంటే పరవాలేదు. ఆ పేరుతో దిగజారుడుతనం మొదలైతే అది సమర్ధనీయం కాదు. సాధనకూ, ఆ పేరుతో ఎంజాయ్ చెయ్యడానికి మధ్య నున్న సున్నితమైన గీతను నువ్వు గుర్తించాలి. ఆ సాధన అందరికీ సరిపోదు. దీనిని కూడా స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.' అన్నాను.

'ఆ విధంగా అచలసంప్రదాయం కనుమరుగై పోయింది. అయితే పల్లెల్లో ఈనాటికీ సజీవంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలలో ఉంది. దీనిని పాటించేవారిలో కంసాలివారు ఎక్కువగా ఉంటారు' అన్నాడు.

'అవును. బ్రహ్మంగారి తత్వాలలో ఈ మూడు సాధనా విధానాలనూ నువ్వు చూడవచ్చు. లింగమూర్తి గురుమూర్తి పంతులుగారి 'సీతారామాంజనేయ సంవాదం' లో కూడా ఇవి కన్పిస్తాయి. ఇంకో విషయం విను. అచలం, అద్వైతం, పెద్దలబోధ ఈ మూడూ  మన పంచవటి సాధనావిధానంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. ఇవి మాకు తెలిసినవే. క్రొత్తవి కావు. శ్రీ రామకృష్ణులను దాటి ఏదీ లేదు' అన్నాను.

ఇంకా ఏదో చెప్పాలని చాలా ఉత్సాహంతో ఉన్నాడు శ్రీకాంత్. కానీ అవతల ఆఫీసులో పని ఉన్నట్లుందిఉత్సవాలు కదా! అదనపు బాధ్యతలున్నట్టున్నాయి. వెళ్ళాలి లాగా ఉంది. ఆ కాస్త సమయంలోనే తనలో ఉన్న భావాలన్నీ  నాతో చెప్పెయ్యాలని చాలా హడావుడి పడుతున్నాడు.

నేనది గమనించి, 'తొందరేమీ లేదు శ్రీకాంత్. హడావుడి పడకు. ముందు నీ పని చూసుకో. నువ్వు ఖాళీగా ఉన్నపుడు మా ఇంటికి రా. మాట్లాడుకుందాం. ఇది చాలా లోతైన, విశాలమైన సబ్జెక్ట్. కాసేపట్లో అయ్యేది కాదు. మాట్లాడుతూ పోతే రోజులు పడుతుంది' అన్నాను.

'సరేనండి. ఆఫీసులో చాలా పనుంది. ఈ ఈవెంట్ అంతా వీడియో కవరేజి చెయ్యాలి. బయటవాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, కొన్ని ఈవెంట్స్ నేనే కవర్ చెయ్యాలి. ఉంటామరి. నమస్తే' అని తన పని మీద వెళ్ళిపోయాడు.

తాపీగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాము.

కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యాక, 'ఈ సంప్రదాయాలన్నీ ఏమిటి గురువుగారు?' అడిగాడు మూర్తి.

మిగతావాళ్ళు శ్రద్దగా వింటున్నారు.

'ఏమీ లేదు. చెప్తా వినండి' అంటూ చెప్పడం సాగించాను.