“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, ఏప్రిల్ 2023, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 55 (స్పిరిట్యువల్ డెంటిస్ట్)

జిల్లెళ్ళమూడిలో ఉండగా ఒకరోజున అమ్మ ఆలయానికి వెళ్లే దారిలో శ్రీ కనిపించాడు.

'రండి కూర్చోండి'  అంటూ ఆహ్వానించి కుర్చీలు వేయించాడు.

'సరే, పిలిచినప్పుడు కాదనడం ఎందుకులే?' అని అందరం కూచున్నాం.

అదీ ఇదీ మాట్లాడుకుంటూ ఉండగా, ఇద్దరు వ్యక్తులు అమ్మ ఆలయం నుంచి వెనక్కు వస్తూ కనిపించారు. చూస్తే కొంచం పెద్దవాళ్లలాగే దర్పంగా ఉన్నారు.

వెంటనే 'శ్రీ' హడావుడిగా లేచి  గౌరవంగా వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు అక్కడ ముఖ్యవ్యక్తులని తెలిసిపోతోంది. నేను మాత్రం లేవకుండా అలాగే కూర్చుని వాళ్ళను చూస్తున్నాను.

దానికి వాళ్ళు హర్టయ్యారు. 

నాకు నవ్వొచ్చింది.

లోకంలో ప్రతివాడూ గౌరవాన్ని కోరుకునేవాడే, సమయమూ సందర్భమూ లేకుండా. ఎదుటివాడు ఏంటో తెలుసుకోకుండా.

శ్రీ ఇది గమనించి, వాళ్ళలో ఒకాయనను నాకు పరిచయం చేస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ డెంటిస్ట్. హైదరాబాద్ లో ఉంటారు' అన్నాడు.

ఈసారి నాకు చచ్చే నవ్వొచ్చింది.

'అంటే?' అన్నాను ఆశ్చర్యంగా.

'అంటే, 32 పళ్ళూ కనిపించేటట్లు నోరంతా తెరిచి మనస్ఫూర్తిగా నవ్వడమే అసలైన స్పిరిట్యువాలిటీ అనేది ఈయన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని కనుక్కున్నందుకు, తనను తాను 'స్పిరిట్యువల్ డెంటిస్ట్' అని పిలుచుకుంటాడు. అందరూ అలాగే పిలవాలని పట్టుబడుతూ ఉంటాడు' అన్నాడు.

'ఓహో. తమిళ సినిమాలో హీరో లాగా పళ్ళన్నీ చూపిస్తూ నవ్వడం ఈయన పిలాసపీ అన్నమాట' అన్నాను.

వాళ్ళు మళ్ళీ హర్టయ్యారు.

శ్రీ కూడా హర్టయ్యాడు నా మాటలకి.

ఈ హర్టులేంటో, చాలా చిరాకేసింది.

వీళ్లకు పిచ్చి ముదిరిందని అర్థమైంది.

ఇక ధర్మోపదేశం మొదలుపెట్టక తప్పదనిపించింది.

నా చుట్టూ ఉన్న శిష్యబృందంలో ఒకాయన్ని వాళ్ళకి చూపిస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ టెర్రరిస్ట్. స్వగ్రామం గుంటూరు' అన్నాను.

వాళ్ళు నోరెళ్లబెట్టారు.

'అంటే, నా భావజాలాన్ని అందరికీ ప్రచారం చేస్తూ అందరినీ టెర్రరైజ్ చేస్తూ ఉంటాడు. అందికని ఈ టైటిలొచ్చింది' అన్నాను.

అర్ధం అయ్యీ కానట్టుగా ముఖాలు పెట్టారు వాళ్ళు.

అక్కడే కూచుని ఉన్న ఇంకొక శిష్యుడిని చూపిస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ రేపిస్టు. స్వగ్రామం నెల్లూరు' అన్నాను.

రెండడుగులు వెనక్కు వేశారు వాళ్ళు.

'భయపడకండి. ఆయనకూ కొంత టేస్టుంది. రేప్ అంటే తెలుగులో 'బలవంతం చెయ్యడం' కదా. తన ప్రెండ్స్ కి, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ నా ఫిలాసఫీ బలవంతంగా చెబుతూ వాళ్ళని నా మతంలోకి మారుద్దామని బలవంతపు ప్రయత్నం చేస్తో ఉంటాడు, కాబట్టి ఈ టైటిల్' అన్నాను కూల్ గా.

'మీ మతమంటే?' అడిగాడు శ్రీ.

'రెటమతం' అన్నాను.

వాళ్ళు చాలా ఇబ్బందిగా ముఖాలు పెట్టారు. ఉండాలా అక్కడనుంచి కదలాలా అని తటపటాయిస్తున్నారు.

శ్రీ మాత్రం తెలివిగా, 'మరి మీ టైటిల్ ఏంటి?' అన్నాడు సరదాగా అన్నట్టు.

'స్పిరిట్యువల్ మర్డరిస్టు' అన్నాను స్పాంటేనియస్ గా.

షాకయ్యాడు నా మాటకి.

'అంటే, నన్ను ఫాలో  అయితే, మీ పాత వ్యక్తిత్వాన్ని చంపేసి కొత్త వ్యక్తిత్వాన్ని ఆ ప్లేసులో ఉంచుతానన్నమాట. అందుకే ఆ టైటిలు' అన్నాను.

'నాదొక అనుమానం అన్నయ్యా' అడిగాడు శ్రీ.

'చెప్పండి' అన్నాను నవ్వుతూ.

'ఈ టైటిల్సన్నీ ఎవరు పెట్టారన్నయ్య?' అడిగాడు

'నా శిష్యులకు నేనే పెడతాను. నాకు మాత్రం అమ్మ పెట్టింది' అన్నాను మళ్ళీ సీరియస్ గా.

'మీరు చెప్పేది నిజమేనా అన్నయ్యా?' అడిగాడు శ్రీ అనుమానంగా.

'ఆయన టైటిలు నిజమైతే మావీ నిజాలే' అన్నాను 32 పళ్ళూ కనిపించేలాగా ఇకిలిస్తూ.

ఏమనుకున్నారో ఏమో, 'ఉంటామండీ, పనులున్నాయి' అని గబగబా నడుస్తూ వాళ్లిద్దరూ మాయమైపోయారు.

నేనూ కుర్చీలోంచి లేచి, 'ఉంటాం మరి. మళ్ళీ కలుద్దాం' అని శ్రీ తో చెబుతూ. 'లేవండి పోదాం' అన్నా శిష్యులతో.

అందరం నవ్వుకుంటూ ఇంటికొచ్చేశాం.

ఆ తర్వాత స్పిరిట్యువల్ డెంటిస్ట్ గాని,  శ్రీ గాని మాకు మళ్ళీ కనిపిస్తే ఒట్టు !