“The gates of the winehouse are wide open. Come ye all who want to enjoy a good drink”

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఎవరికివారే యమునాతీరే

ఈ మధ్యన ఆశ్రమాలు చాలా చూస్తున్నారు కదా? వాటిపైన మీ అభిప్రాయం ఏమిటి? అని ఒక శిష్యుడు  అడిగాడు.

ఈ కవితను వినిపించాను. 

ఏ ఆశ్రమం చూచినా
ఏమున్నది గర్వకారణం?
ఆధ్యాత్మిక చరిత్ర మొత్తం
అతిచేష్టల అరాచకత్వం

సమాధి స్థితులు పోయాయి
సమాధులు మిగిలాయి 
మహనీయులు మొదలుపెట్టారు
మరమనుషులు నడుపుతున్నారు

పట్టుపురుగులు పోయాయి
చీడపురుగులు చేరాయి
ఆదర్శాలు వల్లె వేస్తున్నారు
ఆచరణలో చెల్లిపోతున్నారు

స్పిరిట్యువల్ జోకర్లు
ఫిలాసఫీ బ్రోకర్లు
కమెడియన్లు బపూన్లు
కస్టోడియన్లుగా తయారై
ఆశ్రమాల నిండా ఉన్నారు
అసహ్యపు గెంతులేస్తున్నారు

ఆరోవిలన్లు
అన్నాదురైలు
జిల్లేడుముళ్ళు
జిలేబి రాయుళ్లు

బొమ్మల కొలువులు
రమ్మని పిలుపులు
కమ్మని వ్యాపారాలు
ఝమ్మని  సాగుతున్నాయి

తంతుల తాళ్ళతో
తమను తాము కట్టేసుకుని
ఆశపోతు గొర్రెలను పోగేస్తున్న
వెఱ్ఱి వెంగళప్పలు

క్రొత్త దేవతలు
పాత ఆరాధనలు
మహిమల ప్రచారాలు
మనుషులకు గేలాలు

స్పిరిట్యువల్  మార్కెటింగు
కమర్షియల్ టార్గెటింగు
అబద్దాల రూఫింగు 
ఆధ్యాత్మిక డూపింగు

ఆలయాలన్నీ అక్రమాల నిలయాలే
ఆశ్రమాలన్నీ అనాధాశ్రమాలే
గురువులందరూ వ్యాపారస్తులే
శిష్యులందరూ వ్యవహారస్తులే

ఎక్కడ చూచినా డ్రామాలే 
ఫాలోయర్స్ కి నామాలే
ఎవరికివారే యమునాతీరే
చివరికి చూస్తే రైతుబజారే