నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

21, మార్చి 2023, మంగళవారం

పంచవటి

కొడిగట్టిన దీపాలకు

క్రొత్త వెలుగునిచ్చి

మసిపట్టిన మానవాళికి

మళ్ళీ జీవం పోసిన

మహోన్నత దైవత్వం

పాండిత్యపు పంజరాలలో బందీ అయింది


దైవాన్ని భూమిపైకి

దించి తీసుకొద్దామని

రాక్షసత్వ పట్టునుంచి

భూమిని విడిపిద్దామని

చెయ్యబడిన మహాప్రయత్నం

కనపడకుండా కనుమరుగై పోయింది


అమేయమైన ఆత్మతత్త్వాన్ని

ఆచరణలో ప్రదర్శించి

మహోన్నత శిఖరంగా

మానవాళి ముందు నిలిచిన

వేదోపనిషత్తుల సారం

ప్రదక్షిణాల సంత అయింది


అవధిలేని మాతృత్వాన్ని

అక్షరాలా నిరూపించి

గొప్పగొప్ప సత్యాలను

గోరుముద్దలుగా తినిపించిన

రూపుదాల్చిన వాత్సల్యం

సాంప్రదాయ సంకెళ్ళలో సద్దుమణిగింది


మాటను గ్రహించలేని

మానవజాతి మొద్దునిద్రను

ఒక్కసారిగా వదిలించాలని

మట్టిమనుషులను మేల్కొల్పాలని

సంకల్పించిన మహామౌనం

ఎవరికీ గుర్తులేని ఏకాకి అయింది  


అన్నింటినీ ఆకళింపు చేసుకున్న

అమేయమైన చైతన్యం

మానవసమూహాల రొచ్చుకు

అందనంత సుదూరతీరంలో

విశ్వపుటంచులను అన్వేషిస్తూ

తనలో తానై తదేకనిష్ఠలో నిలిచింది