“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, మార్చి 2023, సోమవారం

అరుణాచల యాత్ర - 2 (లోపలికెళ్ళొచ్చారా?)

పదకొండుకు ఆరోవిల్ లో బయల్దేరి మధ్యాన్నం రెండుగంటల ప్రాంతంలో తిరువణ్ణామలై చేరుకున్నాం. ఆంధ్రాశ్రమంలో లగేజి పడేసి, శేషాద్రిస్వామి ఆశ్రమ హోటల్లో భోజనం అయిందనిపించి, బసకెళ్లి విశ్రాంతి తీసుకున్నాం.

సాయంత్రం లేచి  ఆశ్రమానికెళ్లి చూస్తే బాగా జనం ఉన్నారు. పిచ్చిజనాన్ని మనం భరించలేం గనుక, పౌర్ణమిని తప్పించి, మరుసటిరోజున అరుణాచలం చేరుకున్నాం.  కానీ  ఆరోజు కూడా పౌర్ణమి ఘడియలున్నాయి. అందుకని తెలుగోళ్ల సంతలాగా ఉంది ఆశ్రమం. ఆ నేలబారు భక్తులని చూస్తే చీదరేసింది.

హాల్లోకెళ్ళకుండా ఆశ్రమం అంతా తిరిగి చూస్తుంటే ఒకచోట తమ్ముడు చంద్రశేఖర్ కనిపించాడు. పదేళ్ల క్రితం తను LIC లో ఆఫీసర్ గా చేస్తూ రిజైన్ చేసి, ఇన్ఫోసిస్ CSC లో మేనేజర్ గా చేరాడు. అక్కడ రెండేళ్లు చేసి చిన్న వయసులోనే ఉద్యోగానికి రిజైన్ చేసి 2017 నుంచి అరుణాచలంలోనే ఉంటున్నాడు. వైరాగ్య సంపన్నుడు. స్వామి తత్వవిదానందగారి దగ్గర ఉపనిషత్తులను శాస్త్రాలను అధ్యయనం చేశాడు. పెళ్ళి అనే పదాన్ని తన జీవితంలో నుంచి తీసేశాడు. ప్రస్తుతం అరుణాచల నివాసి. మా పరిచయం 1995 నాటిది. తనగురించి గతంలో కూడా వ్రాశాను.

'చాలాఏళ్లయింది అన్నగారు మనం కలుసుకుని. నేను 2019 లో గుంటూరులో మనింటికి వచ్చాను. మీరు హైద్రాబాద్ మారారని తెలిసింది, మళ్ళీ ఇన్నేళ్లకు ఇక్కడ కలుసుకున్నాం' అన్నాడు సంతోషంగా.

'అవును. హైద్రాబాద్ లో ఉద్యోగపర్వం ఆఖరయింది. ఇప్పుడు ఆశ్రమవాసపర్వం మొదలైంది' అన్నాను.

అక్కడే మెట్లమీద కూర్చుని పాత విషయాలు చాలా కలబోసుకున్నాం.

'లోపలికెళ్ళొచ్చారా?' అడిగాడు. 'లోపలికి' అంటే 'మహర్షి సమాధి ఉన్న హాల్లోకి' అని తనర్ధం. 

'లోపలే ఉన్నా' అన్నాను.

చీకటి పడటం మొదలైంది.

'చలంగారి సమాధి దగ్గరకు పోయొద్దాం పద' అన్నాను.

'హాల్లోకి వెళ్ళరా? ఆర్యూ ష్యూర్?' అన్నాడు,

'కాక్ ష్యూర్' అంటూ మెట్లమీదనుంచి లేచాను.

హాల్లోకెళ్ళకుండా చలంగారి సమాధి దగ్గరకు దారితీశాము.