“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 24 (మాంసం తింటున్న ఆవులు)

అమెరికాలో ఎక్కడ చూచినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధిమాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయా అని తెగ పరిశీలించా చాలాసార్లు. వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. అవి, 

1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్. అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. 

2. ఆహారదోషాలు. అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.

3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి వివరీతంగా తీసుకోవడం.

4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.

5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం. 

6.. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.

ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.

మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను.  వీగన్ నయ్యాను' అన్నాడు.

నేను షాకయ్యాను.

'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.

మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.

'సరే. అక్కడి పరిస్థితులేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకోని నేనూ ఊరుకున్నాను.  

ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది.  ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది.  మొదటిరోజునుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపించింది.  అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 

ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున  మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.

'డైరీ ప్రాడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.

సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు.

'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి. చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యేసరికి చేయి దాటిపోతుంది.'

నేను నిర్ఘాంతపోయాను.

'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.

తరువాత రీసెర్చి చేస్తే దిమ్మెరపోయే నిజాలు బయటపడ్డాయి.

ఇక్కడ స్టోర్స్ లో, 'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది. 

'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.

'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్  ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.

ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.

అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !

మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?

అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.

ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !

అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు.  వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు.

చావుకొస్తుంటే చస్తారా మరి?

ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను.

బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్  లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.

'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.

'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లిన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 

మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.

అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం  ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలైపోతున్నారు.

ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.

విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?

వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.

'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.

ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్నయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !