“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 17 (ఆకలి - ఆచారం)

నా శిష్యురాళ్ళలో చాలామంది సందేహ సుందరీమణులున్నారు. వాళ్లకు సహజంగానే బోలెడు సందేహాలొస్తుంటాయి. ఎవరైనా టీవీ గురువును అడిగితే వాళ్ళ సందేహాలు చక్కగా తీరుతాయి. నాబోటి వాణ్ణడిగితే వాళ్ళ డౌట్లు ఎలా తీరుతాయనేది నాకెప్పటినుంచో ఉన్న పెద్ద సందేహం. నా సందేహాన్ని ఎవరినడగాలా అని అమెరికాలో బెడ్ మీద పడుకొని నిన్న తెగ ఆలోచిస్తున్నా.

ఇంతలో ఇండియానుంచి ఫోనొచ్చింది.

'గురువుగారు నాదొక సందేహం' అందొక సందేహసుందరి.

'గో ఎహెడ్' అన్నా అమెరికన్ ఇంగ్లిష్ యాసలో.

'మనవాళ్ళు ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటారు కదా ! ప్రతిదానికీ అది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని ఎన్నో చెబుతూ ఉంటారు కదా !' అని ఇంకా ఏదో చెప్పబోతోంది.

'నా వాళ్ళు ఎవరూ అలా చెప్పరు. అలా చేప్పేవాళ్ళని నా దగ్గర రెండ్రోజులు కూడా ఉండనివ్వను. నీకు తెలుసుగా ఆ సంగతి?' అన్నాను.

'తెలుసనుకోండి. అలా చెప్పేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా తయారయ్యారు. ఇది టీవీ, యూట్యూబ్ పైత్యమని మీరు చాలాసార్లు చెప్పారు కూడా. అదికాదు నేనడిగేది' అంది.

'ప్రొసీడ్' అన్నా మళ్ళీ అదే యాసలో.

'అలా అది తినకూడదు, ఇది తినకూడదు అంటూ ఆచారాలు పాటించేవాళ్లే అవసరమైతే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఎగ్గు మొదలైనవి బాగా లాగిస్తూ ఉంటారు కూడా. అంతేకాదు, పాతకాలంలో బాలింతలకు బ్రాందీ పట్టించేవాళ్ళుట కదా? ఇది ఆచారవంతులు కూడా చేసేవాళ్ళట కదా? ఆఫ్ కోర్స్ ఇప్పుడు పబ్లిగ్గా చేస్తున్నారనుకోండి. మన హైదరాబాద్ లో అయితే, ఆడాళ్లే బార్లకొచ్చి సీసాలు కొనుక్కుపోతున్నారు. అదికూడా దాటేసి, కాలేజీ అమ్మాయిలే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఇదంతా ఏంటి?'అడిగింది.

'చూడమ్మా. నీ సందేహానికి నా సమాధానం విను' అంటూ ఒక పద్యం వినిపించా

ఆకటికి దొలగు ఆచారవిధులెల్ల
చీకటికి దొలగు సిగ్గులెల్ల
వేఁకటికి దొలగు వెనుకటి బిగువెల్ల
విశ్వదాభిరామ వినురవేమ

'ఇదేంటి ఇది వేమన్న పద్యమా?' అడిగింది అనుమానంగా.

'వేమన్న కాకపోతే ఇంకొక రామన్న ఎవడైతే ఏంటి? విషయం ముఖ్యం గాని. అర్థమైందా లేదా?' అడిగాను.

'అర్ధం కాలేదు. నేను తెలుగు పండితురాలిని కాను' అంది నీరసంగా.

'నేనూ కాను. ఏదో నోటికొచ్చింది చెప్పా' అన్నా.

'మరెలా?' అంది.

'ఏముంది. వెరీ సింపుల్. ఏదైనా తెలుగు డిక్షనరీ పట్టుకో. చూడు. అర్ధాలు తెలుస్తాయి. అప్పుడు నాక్కూడా కాస్త వివరించి చెప్పు' అన్నా ఐఐటీ ప్రొఫెషర్ లాగా ఫీలౌతూ.

'మరి ఈలోపల అమెరికాలో కూచుని మీరేం చేస్తారు?' అడిగింది కోపంగా.

'ఇక్కడ పనీపాటా లేకుండా కూర్చొని  ఏమీ లేను. బెడ్ మీద పడుకోని నీతో మాట్లాడుతున్నా. ఎంతపని చేస్తున్నానో చూడు. అన్నీ నేనే చెబితే ఇక మీరు చేసేదేముంది? కాస్త హోమ్ వర్క్ చెయ్యండమ్మా. ఎంతసేపూ యూట్యూబ్ చూడటమే జీవితం కాదు మరి' అన్నాను కోపంగా.

ఆమెక్కూడా కోపం వచ్చినట్టుంది. టక్కున ఫోన్ పెట్టేసింది.

నేను నవ్వుకుంటూ బెడ్ మీద వెనక్కు వాలా.

ఆకలి ఎదురైతే అచారాలన్నీ తప్పుకుంటాయి. చీకటి కమ్ముకున్నా తప్పుకుంటాయి. అవసరం ఆవురంటే కూడా  ఆచారాలు ఆవిరైపోతాయి. అన్నీ బాగున్నపుడే ఆచారాలు. అవసరం అన్నింటినీ నేర్పిస్తుంది, మార్పిస్తుంది.

రిలాక్స్ అవుతూ కళ్ళుమూసుకున్నాను.

'అన్నింటికంటే అవసరం గొప్పది నాన్నా' అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మాటలు నాలో ప్రతిధ్వనించాయి.