“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 13 (మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం - టెక్కీ షోడాన్ కటా)

ఇప్పుడు, ఆధ్యాత్మికప్రపంచంలో నుంచి  కొంచెం మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలోకి తొంగి చూద్దాం. ఆఫ్ కోర్స్ నా వరకూ రెండూ ఒకటే. కానీ మీరు ఇవి రెండూ వేర్వేరని అనుకుంటున్నారు గనుక మీకోసం ఇలా అంటున్నాను.

22 ఏళ్ళవయసులోనే నేను కరాటేలో మొదటి బ్లాక్ బెల్ట్ సాధించాను. ఇది 1985 లో జరిగింది. ఆ తర్వాత అనేక మార్షల్ ఆర్ట్ తో ప్రయోగాలు చేశాను. కానీ, సర్వీస్ లో ఉన్నపుడు ప్రతిరోజూ అభ్యాసం చేయడం కుదిరేది కాదు. కానీ రోజుమార్చి రోజైనా సరే, రోజుకు మూడుగంటల అభ్యాసం చేసేవాడిని. ఎందుకంటే రైల్వేలో నా ఉద్యోగం రాత్రీపగళ్ళతో, తిండీతిప్పలతో సంబంధం లేకుండా ఉండేది. అయితే, అలాంటి ఉద్యోగబాధ్యతలలో కూడా, అభ్యాసాన్ని మానకుండా చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూనే రెండు కరాటే స్కూళ్లను నడిపాను. దాదాపు రెండు వందల మంది శిష్యులకు ఉచితశిక్షణ నిచ్చాను. ఇదంతా 35 ఏళ్ల క్రితం జరిగింది.

ఇప్పుడు రిటైరయ్యాక నా అభ్యాసాలకు బోలెడంత సమయం దొరికింది.

ప్రస్తుతం అమెరికాలో -- ధ్యానసాధన, బ్లాగు పోస్టులు వ్రాయడం, పుస్తకరచన, బోధన, ఉత్తర ప్రత్యుత్తరాలు, శిష్యుల ఫోన్స్ చూసుకోవడం, వీడియోలు చెయ్యడం, ఈ పనుల మధ్యలో యోగా, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసాలు కూడా యధావిధిగా సాగుతున్నాయి.

అలా చేసినదే ఈ కటా అభ్యాసం.

'పదివేల టెక్నిక్స్ ను నేర్చుకున్న వాడంటే నాకు భయం లేదు. ఒకే ఒక్క టెక్నిక్ ను పదివేల సార్లు అభ్యాసం చేసినవాడంటే నేను భయపడతాను' అనేవాడు బ్రూస్ లీ.

కటా అభ్యాసాలు అలాంటివే. వీటిని కొన్నివేలసార్లు ప్రాక్టీస్ చెయ్యగా చెయ్యగా ఈ టెక్నిక్స్ మనలో ఇంకిపోతాయి. అప్పుడు అనుకోకుండా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, అసంకల్పితంగా అవే మూమెంట్స్ వచ్చేస్తాయి.

ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ కటాను షోటోకాన్ కరాటేలో 'టెక్కీ షోడాన్ కటా' అంటారు. ఒకినావా కరాటే స్టైల్స్ లో అయితే 'నైహాంచి కటా' అంటారు. ఎన్నో అఫెన్స్, డిఫెన్స్ టెక్నీక్స్ ఈ కటాలో ఇమిడి ఉంటాయి. పైపైన చూచేవారికి ఇది అర్ధం కాదు. దీని 'బుంకాయ్' (ప్రాక్టికల్ అప్లికేషన్) తెలిస్తేనే ఇందులో ఉన్న టెక్నీక్స్ అర్ధమౌతాయి. అవి ఎలా ఉంటాయో, ఎంత ప్రమాదకరమైనవో వేరే వీడియోలో చూపిస్తాను.

అయితే, అలా చూపించాలంటే నాకొక సహాయకుడు కావలసి వస్తుంది. ప్రస్తుతం నా మార్షల్ ఆర్ట్స్ శిష్యులెవరూ ఇక్కడ లేరు. అందరూ ఇండియాలో రకరకాల ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. నేను రిటైరయ్యాను. వాళ్ళు కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. ఇక్కడ సహాయకుడు ఎవరైనా దొరికాక ఈ కటా టెక్నీక్స్ ను ప్రాక్టికల్ గా ఎలా వాడాలో వివరించే వీడియో చేస్తాను.

ప్రస్తుతానికి నా కటా ప్రాక్టీస్ ను ఈ వీడియోలో ఇక్కడ చూడండి. వివరణను వినండి.