నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 25 (ఫణినారాయణ గారి వీణా కచేరి)








డెట్రాయిట్లో 'సంజీవని కల్చరల్ సొసైటీ' అనే ఒక సంస్థ ఉంది. ఇక్కడుంటున్న తెలుగువాళ్ళు ఈ సంస్థను పెట్టినట్లున్నారు. వాళ్ళు నిన్న రాత్రి ఒక కల్చరల్ ప్రోగ్రాం పెట్టారు. వడలి ఫణినారాయణ గారి వీణా కచేరి అది. మాకూ ఆహ్వానం అందింది గనుక మేమూ వెళ్లి వచ్చాం.

ఈ ప్రోగ్రాం, ట్రాయ్ సిటీలో ఉన్న HTC Global Services సంస్థ బిల్డింగ్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సాయంత్రం 6 గంటలకు మొదలైన కచేరి రాత్రి పది వరకూ జరిగింది. ఎక్కువమంది రాలేదు గాని, హాలు నిండింది.

ఫణినారాయణ గారి స్వగ్రామం కాకినాడ. వీణావిద్వాంసుల వంశంలో జన్మించారు. ఈయన పూర్వీకులు ఏడు తరాలనుంచీ వీణా విద్వాంసులు. ఈయనది ఏడవ తరం. కాలిఫోర్నియాలో ప్రోగ్రాం ఇచ్చి ఇక్కడకొచ్చారు. వయసులో చిన్నవాడైనా, వీణను ఒక ఆటవస్తువులాగా ఆడుకున్నాడాయన. సరస్వతీ అమ్మవారి కటాక్షం అమితంగా లేకపోతే అంతటి ప్రజ్ఞ అసాధ్యమౌతుంది. శాస్త్రీయ కీర్తను ఎంత సులువుగా వాయించారో, అంతే సులువుగా సినిమా పాటలను కూడా వీణపైన పలికించారు. అదే విధంగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, హాలీవుడ్ మెడ్లీస్ కూడా పలికించారు. వీణపైన చాలా అద్భుతమైన పట్టున్న కళాకారుడాయన. ప్రోగ్రాం చాలా బాగుంది. కాకపోతే టీమ్ లేరు. ఒక్కరే వచ్చినట్లున్నారు. ట్రాక్ ప్రోగ్రామ్ ఇచ్చారు.

ప్రోగ్రాం మధ్యలో వీణ గురించి కొంచం వివరించాడాయన. వీణ మెట్లకూ, తంతులకూ, మానవుని వెన్నెముకలోని మెట్లకూ, నాడులకూ ఉన్న సంబంధాన్ని పైపైన చెప్పాడాయన.  వీణావాదనం ఉపాసనే అని, దీనిని అభ్యాసం చెయ్యడమే పూర్వజన్మసుకృతమనీ అన్నాడు.  పాటల రాగాలను ఆయన ఇంప్రొవైజ్ చేసి వాయించిన తీరు, పలికించిన సంగతులు చాలా బాగున్నాయి. సంగీతమంటే  ఎంతో ప్రేమ, ఎన్నో ఏండ్ల కఠోరమైన సాధనలు ఉంటే తప్ప ఇలాంటి ప్రజ్ఞ రావడం కష్టం. సంతోషం కలిగింది.

ప్రోగ్రాం అయిపోయాక, ఆయనతో మాట్లాడుతూ  ఇలా అడిగాను.

'ఇందాక మీరు వీణకూ, యోగచక్రాలకూ ఉన్న సామ్యాన్ని గురించి చెప్పారు. ఆ విధమైన అంతరిక సాధనలో ప్రవేశం ఉన్నవారు ఎవరైనా మీకు  ప్రస్తుతం తెలుసా?'

ఆయన వినయంగా, 'ఉంటారండీ ఎక్కడో. ముత్తుస్వామి  దీక్షితులవారు ఉన్నారు కదా? మానవదేహంలో ఉన్న దేవతామూర్తులపైన ఆయన 'వీణాగాన వినోదిని, గానలోల కరుణాలవాల' మొదలైన కీర్తనలు వ్రాశారు కదా?' అన్నారు.

సంతోషం కలిగింది. నేటి కాలంలో కూడా, ఈ రహస్యాల గురించి అనుభవం లేకపోతే మానె, కనీసం సంగీత త్రిమూర్తుల గురించి, అందులోనూ దీక్షితులవారి శ్రీవిద్యోపాసన గురించి, ఆయన చేసిన అంతరిక నాదోపాసన గురించి, ఎకాడమిక్ గా అయినా అవగాహన ఉన్న కళాకారులు కనిపించడం సంతోషాన్ని కలిగించింది.

ఫణినారాయణ గారికి అందులో అనుభవం లేదని అర్ధం కావడంతో, ఇంక ఆ విషయం పైన నేనేమీ రెట్టించలేదు.

'హైద్రాబాద్ లో మీరెక్కడుంటారు?' అడిగాను.

'మణికొండ లో ఉంటానండి' అన్నాడాయన.

'మిమ్మల్ని హైద్రాబాద్ లో మళ్ళీ కలుస్తాను' అని చెప్పి సెలవు తీసుకున్నాను.

నిన్న జరిగిన రెండో సంఘటన, HTC CEO మాధవరెడ్డిగారిని కలుసుకోవడం. ఆయనకూడా ప్రోగ్రాం కొచ్చారు.  ప్రోగ్రాం స్పాన్సర్లలో ఆయన కూడా ఒకరని తెలిసింది. అరవైలలో ఉన్న ఆయన ఆరా చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా సరళమైన స్వభావం ఉన్న వ్యక్తిలాగా అనిపించారు. 1983 లో అమెరికా వచ్చిన ఆయన 1989 లో HTC సంస్థను పెట్టి 33 ఏళ్లలో దానిని మల్టీనేషనల్ కంపెనీ చేశారు. డెట్రాయిట్ బిలియనీర్లలో ఆయనొకరు.

నన్నెవరికీ గొప్పగా పరిచయం చెయ్యొద్దని, మన సంస్థ గురించి దాని కార్యకలాపాలగురించి చెప్పద్దని, నేను అతి మామూలుగా ఉంటానని, అలాగే ఉండనివ్వమని మావాళ్లకు ముందే హెచ్చరించి ఉన్నాను.

అందుకే నన్నాయనకు పరిచయం చేసినవారు, 'ఈయనకూడా ఆధ్యాత్మికమార్గంలో ఉన్నారు' అని మాత్రమే చెప్పారు.

'మీరేం చేస్తారు? అన్నారాయన.

నేను ఇండియన్ రైల్వేలో ట్రాఫిక్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యానని IRTS అనీ చెప్పాను. 

ఆయన వెంటనే 'మేమూ ఇక్కడ ఒక స్పిరిట్యువల్ సెంటర్ నడుపుతున్నాం, ఈ హాల్లోనే మేము మెడిటేషన్ చేస్తూ ఉంటాం' అన్నారు.

ఒక బిలియనీర్ అయిన వ్యక్తికి ఆధ్యాత్మికంగా అంత ఇంట్రెస్ట్ ఉండటం, పైగా ఆయనలో అహంకారం లేకపోవడం, సౌమ్యస్వభావం కలిగివుండటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

'మీరు రామచంద్రా మిషన్ ఫాలోయర్ కదా?' అడిగాను.

దానికాయన ' అవును, ప్రస్తుతం హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్'  అంటున్నాం దానిని. మీకు పరిచయం ఉందా?' అన్నారు.

'తెలుసు, 35 ఏళ్ళనుంచీ ఆ మార్గం నాకు పరిచయమే. 1990లలో నా స్నేహితులు కొంతమంది అందులో ఉండేవారు. ఆ పుస్తకాలన్నీ చదివాను. మీరిక్కడ ప్రిసెప్టరా' అన్నాను. 

'అవును.  ఇదుగో వీరుకూడా' అంటూ ఇంకో జంటను పరిచయం చేశారాయన.

'మీరు రామచంద్రాజీ గారిని చూచారా?' అడిగాను.

'అవును. చూచాను. బాబూజీ గారిని దర్శించాను' అన్నారాయన.

మొదటి రామచంద్రాజీని లాలాజీ అని ఆయన శిష్యుడైన రెండవ రామచంద్రాజీని బాబూజీ అని ఆ మార్గంలో వాళ్ళు పిలుస్తారు. అది నాకు తెలుసుగనుక నవ్వి ఊరుకున్నాను.

'బుధవారం నాడు ఇదే బిల్డింగ్ మూడో ఫ్లోర్ లో మా మెడిటేషన్ సెషన్ ఉంది. రండి. తెలుసుకోవచ్చు' అన్నారాయన.

నవ్వొచ్చింది.

లాలాజీ, బాబూజీలంటే నాకు చాలా గౌరవం ఉన్నప్పటికీ, ప్రస్తుతం రామచంద్రామిషన్ పైన, ఈ ప్రిసెప్టార్ల పైన నాకంత సదభిప్రాయం లేకపోవడంతో మర్యాదపూర్వకంగా నవ్వి ఊరుకున్నాను. 30 ఏళ్ల క్రితమే ఈ మార్గాలన్నీ నేను తరచి చూచినవే. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎవరిదగ్గరైనా నేర్చుకునేది ఏముంది గనుక?

కూర్చుని మౌనంగా ప్రోగ్రాం చూస్తున్న నాకు రామచంద్రాజీ జీవితం నుండి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. 

ఒక సమయంలో ఆయన మద్రాస్ రామకృష్ణ మఠానికి వెళ్లారు. అప్పటికే ఆయనకు రామకృష్ణులవారి దర్శనం కలిగి ఉండటం, ఆయన అనుగ్రహాన్ని పొంది ఉండటం జరిగింది. 'నీవు అవతారుని స్థాయిని అందుకున్నావు' అని శ్రీరామకృష్ణులవారే ఆయనతో అన్నట్లుగా చెబుతారు. కానీ రామకృష్ణ మఠంలో ఉన్న అప్పటి ఇంచార్జ్ స్వామి ఆయన యొక్క ఆధ్యాత్మికస్థాయిని గుర్తించలేదని, ఒక మామూలు మనిషిగా ఆయన్ను ట్రీట్ చేశాడని రామచంద్రాజీ (బాబూజీ) వ్రాసుకున్నారు. మహనీయుల స్థాయి, ఆయన సంస్థలో తర్వాత్తర్వాత వచ్చే అనుచరులకు ఉండదని కూడా ఆయనన్నారు. ఈ సంఘటన ఆయన జీవితచరిత్రలో ఉంది.

నవ్వొచ్చింది.

ఒకవేళ రామచంద్రాజీ మళ్ళీ పుట్టి వీరి ఎదురుగా వస్తే, వీరు కూడా ఆయన్ను గుర్తించలేరు. 'మా  మెడిటేషన్ నేర్పిస్తాం. ఇనీషియేషన్ ఇస్తాం రమ్మ'ని ఆయన్నే ఆహ్వానిస్తారు. ఒకవేళ జీసస్ వస్తే క్రిస్టియన్లూ అదే చేస్తారు. బుద్ధుడొస్తే బౌద్ధులూ అదే చేస్తారు. రామకృష్ణుడొస్తే ఆయన భక్తులూ అదే చేస్తారు. 

మానవులందరూ ఇంతే. పుస్తకాలు వేరు. నిజజీవితం వేరు. చెప్పేమాటలు వేరు.  అంతరికస్థాయిలు వేరు. యోగదృష్టి లేనిదే ఒక మనిషిలోని ఆధ్యాత్మికశక్తిని, ఔన్నత్యాన్ని ఎవరూ గుర్తించలేరు. అదంతే. అందులోనూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉంటే, మరీ పప్పులో కాలేస్తారు. UG గారిని ఎంతమంది గుర్తించగలిగారు?

మనుషులిచ్చే గౌరవాలన్నీ డబ్బుకు, పదవులకు, డ్రస్సుకు, హంగులకే. వీటిని దాటిన సత్యమైన దృష్టి ఎందరిలో ఉంది? సోకాల్డ్ ఆధ్యాత్మికులలో కూడా అది కనిపించడం లేదు.

'హార్ట్ ఫుల్ నెస్' మెడిటేషన్ మీద వీరు ప్రచురించిన ఒక పుస్తకం కాపీలను అందరికీ పంచారు. ఒక చిన్నపాప కొన్ని పుస్తకాలను  తీసుకుని అందరి దగ్గరకి వచ్చి పంచుతున్నది. నాకూ ఇవ్వబోయింది. నేను తీసుకోకుండా, ఆ పాపను మౌనంగా ఆశీర్వదించి నవ్వి ఊరుకున్నాను.

మూడవ సంఘటన, నారాయణస్వామి, డా | సావిత్రి దంపతులను కలవడం. వీరు నాకు చిరపరిచితులే.  నారాయణస్వామి ప్రముఖ బ్లాగరు, రచయిత, హిందూ ఐక్యతావాది కూడా. డెట్రాయిట్ లోని హిందూ సంఘాలను కూడగట్టి, ఇతర మతస్తులనుండి, ముఖ్యంగా పాకిస్తానీ ముస్లిముల నుండి ఎదురౌతున్న దాడులను ఎదుర్కోవడానికి ఎన్నారై హిందువులను సంఘటిత పరచడంలో ధైర్యంగా కృషి చేస్తున్నాడాయన. ఆయన చేస్తున్న కృషికి అభినందించాను.

ఆయనిలా అన్నారు.

'మన లోపలి శత్రువులే మనకు ఎక్కువయ్యారు. బయటవాళ్ళనుంచి కంటే లోపలివాళ్లనుంచే మనకు ఇబ్బంది ఎక్కువగా ఉంది'

దానితో ఏకీభవిస్తూ, 'రాజులందరూ తమలో తాము కొట్టుకుంటూ, బయటనుండి వచ్చిన ముస్లిములకు ఉప్పందిస్తూ సరిహద్దులను పట్టించుకోకుండా, ఐకమత్యం లేకుండా ఉండబట్టే మనం ఎనిమిదొందల ఏళ్లపాటు ఇస్లామిక్ దొంగల పరిపాలనలో ఉండవలసి వచ్చింది. నేటికీ హిందూసమాజం అలాగే ఉంది. నిజమే' అన్నాను.

'అవునండి. ఈ మధ్యనే జరిగిన ఒక పెద్ద విగ్రహప్రతిష్టాపనా కార్యక్రమానికి నేనూ హైదరాబాద్ వచ్చాను. మాట్లాడబోయేముందు  అక్కడి కార్యకర్తలు, 'హిందూ' అనే పదం వాడకండి, వాడకుండా మీ ఉపన్యాసం ఇవ్వండి' అని నాకు సూచన చేశారు. మన స్వామీజీలు, మత నాయకులూ ఇలా ఉన్నారు. ఏం చెయ్యాలి?' అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇంతదూరం వచ్చి, ఇన్నేళ్ళుగా ఇక్కడుంటూ కూడా, మన దేశం గురించి ఆలోచిస్తూ, కరెంట్ ఎఫైర్స్ తో టచ్ లో ఉంటూ, హిందూమత ఐక్యతకు పాటుపడుతూ, ఇక్కడి ముస్లిం వర్గాల దాడులనుండి హిందువులను సంఘటితపరుద్దామని ప్రయత్నం చేస్తున్న ఆయనను మనస్ఫూర్తిగా అభినందించాను.   

రాత్రి పదింటికి ప్రోగ్రాం అయిపోయాక అందరి దగ్గరా సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశాము.