“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, ఏప్రిల్ 2022, గురువారం

భగవంతుడు అలా రాస్తే మనమేం చేస్తాం?

శనీశ్వరుని రాశిమార్పు వల్ల అనేకమార్పులు మీమీ జీవితాలలో ఇప్పటికే కనిపిస్తూ ఉంటాయి. దాని ఫలితంగా పాత పరిచయస్తులు కనిపించడం మాట్లాడటం మొదలైన  సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

వీటిలో భాగంగా నిన్నొకాయన నా ఆఫీస్ చేంబర్ కు వచ్చి కలిశాడు. 2017 లో ఆయన నా తక్షణ పై అధికారిగా గుంటూరులో పనిచేశాడు. రిటైరై అయిదేళ్లవుతోంది. అప్పట్లో నాతో బానే ఉండేవాడు. నా సర్వీసు మొత్తం మీద నాతో గొడవపడకుండా, నన్ను అణగదొక్కకుండా ఉన్న అతితక్కువమంది నా పై అధికారులలో ఈయననొకడు. అందుకని ఈయన్ని మర్చిపోయాను. కానీ చూడగానే గుర్తుపట్టాను. శత్రువులు గుర్తున్నంతగా, మంచిగా ఉన్నవాళ్లు గుర్తుండరు కదా !

ఏదో పనుండి రైల్ నిలయానికొచ్చి, నా పేరు చూచి, పలకరించి పోదామని లోపలకొచ్చాడు. కూచోబెట్టి, కాసేపు మాట్లాడి, కనీసమర్యాద చేసి పంపాను.

రిటైరయినాక ఖాళీగా ఊరుకోకుండా, ఏదో ఒకచోట పనిచేస్తూ, అరవై డెబ్భైవేలు సంపాదించుకునే కొలీగ్ ఆఫీసర్స్ నాకు చాలామంది  తెలుసు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తూ ఉంటుంది. వాళ్లకు ఉన్నదాంతో హాయిగా బ్రతకొచ్చు. ఏదో  ఒక ఉన్నతమైన దారిలో నడవొచ్చు. కానీ అలా చెయ్యరు. కారూ, ఫ్యూనూ, ఏసీ రూమూ ఇలాంటి చీప్ హోదాల కోసం ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు.

మనిషిగా పుట్టాక, మనిషి జన్మకొక సార్ధకత అంటూ ఉండాలి. అంతేగాని, మనిషిగా పుట్టి జంతువుగా చావకూడదు. చావబోయేవరకూ 'డబ్బు డబ్బు' అంటూ చస్తూ ఉంటే, చివరకు కుక్కచావే అవుతుంది. కుక్కకూడా చివరిక్షణం వరకూ తిండికోసమే బ్రతికి చనిపోతుంది. దానికి తిండి ఉంటే చాలు. మనిషికో? అదొక్కటే చాలదు. ఇంకా చాలా కావాలి. ఎంతున్నా సరిపోక, 70  వచ్చినా 80 వచ్చినా 'ఇంకా ఇంకా' అని అలమటిస్తూ చస్తాడు మనిషి. అలాంటి మనిషి బ్రతుకు, చాలా హీనమని నేను భావిస్తాను. కనీసం పెద్దవయసులో నైనా ఉన్నతమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపకపోతే మనిషి జీవితానికి అర్థమేముంటుంది?

సరే ఈ గోల అలా ఉంచి విషయంలోకొద్దాం.

అదీ ఇదీ మాట్లాడాక, తను ఎంతమంది పై అధికారుల దగ్గర పనిచేసిందీ, వారిలో కొందరు  తననెలా హింసపెట్టిందీ అంతా చెప్పుకొచ్చాడాయన. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఐడెంటిటీ క్రైసిసే కాబట్టి, అందులోనూ రిటైరైన అధికారులను ఎవరూ లెక్కచేయరు కాబట్టి, వాళ్లకి శ్రోతలు ఉండరు కాబట్టి, వాళ్లలో ఈ పోకడ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఓపికగా ఆయన చెప్పినదంతా విన్నాను.

అన్నీ చెప్పి చివరకు, 'భగవంతుడు మన నుదుట అలా రాస్తే, అంతకంటే తేడాగా ఎలా జరుగుతుంది చెప్పండి? దేవుడే మనకలా రాసినప్పుడు, మనల్ని బాధపెట్టిన వాళ్లను అనుకోవడం ఎందుకు? వాళ్ళూ నిమిత్తమాత్రులే?' అన్నాడు వేదాంతధోరణిలో.

అప్పటిదాకా ఆయన గతస్మృతులను మౌనంగా వింటున్న నేను, 'దేవుడెందుకు ఒకరి నుదుట అలా రాస్తాడు?  ఆయనకేమైనా మనమంటే కోపమా?' అన్నాను నవ్వుతూ.

ఆయన వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఎంతైనా ఒక సివిల్ సర్వెంట్ గా రిటైరైనవాడు కదా ! తెలివితేటలు బానే ఉంటాయి.

'అవుననుకోండి. మనం చేసుకున్నదే మనం అనుభవిస్తుంటాం. అంతే' అన్నాడాయన.

మనుషులెప్పుడూ ఇంతే. ఎక్కడో చదివి, లేదా ఏ టీవీలోనో విని చిలకపలుకులు పలుకుతూ ఉంటారు. లాజికల్ గా ఆలోచిస్తే అరువు తెచ్చుకున్న ఆ అభిప్రాయాలేవీ ఒక్క క్షణంపాటు కూడా నిలబడవు. కాసేపు దేవుడంటారు, కాసేపు మన ఖర్మ అంటారు. ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధాలని వాళ్లకు అర్ధం కాదు.

'దానికీ గ్యారంటీ లేదుకదా.  చాలామంది, వాళ్ళు  సంపాదించినది కూడా వాళ్ళు తినలేరు. మరికొంతమంది వాళ్ళేమీ చెయ్యకపోయినా ఇతరులమీద పడి బ్రతికేస్తూ ఉంటారు. అలాంటప్పుడు, మనం చేసుకున్నదే మనం అనుభవిస్తామని గ్యారంటీగా ఎలా చెప్పగలం?' అన్నాను నవ్వుతూ.

ఆయన ఇరకాటంలో పడ్డాడు. ఆయన టీవీలలో విన్నది అంతే మరి !

'మరేంటంటారు?' అన్నాడు అయోమయంగా.

'ఏమో నాకేం తెలుసు? విషయాన్ని నేను సిద్ధాంతీకరించలేదు. మీరు చెబుతున్నదానికి లాజికల్  గా నాకు తోచినది చెప్పాను' అన్నాను. 

పాపం ఆయనదగ్గర జవాబు లేదు.

సీట్లోంచి లేచాడు.

'ఉంటానండి. మీ బోర్డు కనిపిస్తే పలకరిద్దామని వచ్చాను. ఉంటామరి' అన్నాడు.

'మంచిదండి. ఆరోగ్యం జాగ్రత్త' అన్నాను.

ఆయన నిష్క్రమించాడు.

జీవితం ఎంత కామెడీనో?

మనిషి తనలోకి తను తొంగి చూచుకుంటే, అక్కడ భరించలేనంత వెలితీ శూన్యమూ ఉంటాయి. అందుకని వాటిని పూడ్చుకోడానికి, గతాన్ని జస్టిఫై చేసుకోడానికి, ఎక్కడో చదివినవీ విన్నవీ నలుగురికీ చెప్పబోతూ, తద్వారా తాము కరెక్ట్ అని అనుక్షణం తమని తాము మభ్యపెట్టుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. లేకపోతే ఆ వెలితి వాళ్ళను మింగేస్తుంది. ఇది ప్రతివాడి జీవితంలోనూ జరుగుతుంది. కాకపోతే  రిటైరైన ముసలాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

అలా మభ్యపెట్టుకోకుండా, ఆ వెలితిని డైరెక్ట్ గా ఎదుర్కొని, దానిని పూడ్చడమే అసలైన ఆధ్యాత్మిక జీవితమని, దాన్ని ముసలితనంలో కాకుండా, వయసులో ఉన్నపుడే చెయ్యాలని, నేనంటాను. అయితే, దీనినందరూ చెయ్యలేరు. జనాభాలో 99.99% మనుషులకి, పుట్టిననాటి నుండి, పోయేవరకూ ఈ లోపలి వెలితి అలాగే ఉంటుంది. దానిని అలా మోస్తూనే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ అంతరిక వెలితిని కప్పిపెట్టుకోడానికి వేసే వేషాలే జీవితమంటే.

ఎక్కడో చాలా తక్కువమంది మాత్రం దీనిని గ్రహించి, అర్ధం చేసుకుని, ప్రయత్నించి, దానిని పూడ్చుకోగలుగుతారు. అందరికీ ఇది సాధ్యం కాదు.

అయినా, నా  పిచ్చిగాని, భగవంతుడు మన నుదుట అలా రాస్తే మనమేం చెయ్యగలం చెప్పండి? అయినా ఆయనకు మనమంటే ఎందుకంత కోపమో? ఎందుకలా రాసేస్తాడో? ఏ ఇంకుతో రాస్తాడో మన నుదుట?'

ఏంటో అంతా అయోమయంగా ఉంది !

కదూ???