“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2018, బుధవారం

జగ్జీత్ సింగ్ జాతకం - విశ్లేషణ

ప్రఖ్యాత ఘజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జాతకాన్ని గమనిద్దాం. 'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అన్నట్లుగా, మనం మంచివాళ్ల జాతకాలే చూస్తాం గనుకా, అలాగే చూడాలి గనుకా, ఇప్పుడు ఈయన జాతకం చూస్తున్నామన్న మాట !

ఈయన 8-2-1941 న ప్రస్తుతం రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జన్మించాడు. జనన సమయం తెలియదు గనుక ఇతర లగ్నాలనుంచి గమనిద్దాం.

చంద్రుడు ఆరోజున ఆర్ద్రా నక్షత్రం 1,2,3 పాదాలలో సంచరించాడు. ఇవి నవాంశలో అయితే ధనుస్సు, మకరం, కుంభం అవుతాయి. వీటిలో ఈయనది మకర నవాంశ అని నా అభిప్రాయం. అంటే ఈయన మధ్యాన్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిదిలోపుగా పుట్టి ఉండాలి. అలా ఎందుకు? అనేది ముందుముందు విశ్లేషణలో చెబుతాను.

చంద్రలగ్నం నుంచి చూస్తే - నాలుగింట రాహువు ఉచ్ఛబుధుడిని సూచిస్తూ వీరి కుటుంబంలో ఉన్న సంగీత, సాహిత్య పరంపరను తెలుపుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు సంగీతంలో నిష్ణాతులు కానప్పటికీ, వీరి పూర్వీకులలో ఈ జీన్స్ ఖచ్చితంగా ఉండి ఉండాలి.

కారకాంశ సింహం అయింది. అక్కణ్ణించి ఉచ్చబుధుడు రెండింటిలో ఉంటూ ప్రసిద్ధ గాయకుడిని సూచిస్తున్నాడు. నవమంలో బలీయమైన పూర్వకర్మను సూచించే నీచశని గురువుల డిగ్రీ సంయోగం ఉన్నది. ఇది మంచి యోగం కాదు. అందుకే, సంగీతంలో తన మొదటి గురువుగా చగన్ లాల్ శర్మ అనే గ్రుడ్డి గురువు దగ్గర చేరి విద్యను నేర్చుకున్నాడు. చంద్ర లగ్నం నుంచి కూడా నవమంలో బుధుడు అర్గల గ్రస్తుడై ఉండటం చూడవచ్చు.

సప్తమంలో కుజుని స్థితివల్ల వచ్చిన కుజదోషంతో డైవోర్సీ అయిన చిత్రా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. కుజునికి దారా కారకత్వం రావడమూ ఆయన సున్నా డిగ్రీలలో బలహీనుడుగా ఉండటమూ గమనించాలి. పుత్రకారకుడైన గురువు నీచ శనితో కలసి ఉండటంతో జగ్జీత్ - చిత్ర లకు పుట్టిన వివేక్ అనే అబ్బాయి తన 18 ఏట ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచీ జగ్జీత్ బాగా కృంగిపోయాడు. ఆ తర్వాత, తన మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురు కూడా 2009 లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో చిత్రా సింగ్ కూడా మానసికంగా చాలా క్రుంగిపోయింది.

అక్కడనుంచీ వారిద్దరూ పాటలు పాడటం తగ్గించారు. చిత్రా సింగ్ పూర్తిగా పాడటం మానేసింది. జగ్జీత్ మాత్రం కొన్నేళ్ళ డిప్రెషన్ తర్వాత నిదానంగా మళ్ళీ పాడటం మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత కూడా అతను ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేదని, చాలా విరక్తికి లోనయ్యాడని ఆయన పాడిన పాటలు, వాటి రాగాలు గమనిస్తే మనకు తెలుస్తుంది. ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఎవార్డులు, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా,  చివరకు నిరాశతోనే 10-10-2011 తేదీన ముంబాయిలో ఈయన చనిపోయాడు.

ఆ రోజున --

జననకాల సూర్యునితో, గోచార శని కేంద్ర దృష్టిలోనూ, జననకాల చంద్రుడు, గోచార గురువుతో అర్ధకోణ దృష్టిలోనూ, ముఖ్యంగా గోచార గురువు మళ్ళీ అదే జననకాల స్థానంలోనూ, గోచార ప్లూటో (యముడు) జననకాల రాహువుతో కేంద్రదృష్టి లోనూ ఉండటం గమనించవచ్చు.

కుజదోషం వివాహభావాన్ని ఖచ్చితంగా చెడగొడుతుంది. ఈ చెడిపోవడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా చెడిపోవడం వల్ల వారిలో ఇద్దరికీ గానీ ఒక్కరికి గానీ మంచి జరుగుతుంది కూడా. మనిషి జీవితం చాలా విచిత్రమైనది. ఇందులో ఎన్నెన్నో కోణాలుంటాయి. ఏ ఇద్దరి జీవితాలూ ఒకే విధంగా ఉండవు. మంచిలో చెడుంటుంది. చెడులో మంచీ ఉంటుంది. జీవితంలోని ఈ విభిన్న కోణాలను సూచిస్తూ జాతకంలోని గ్రహయోగాలు కూడా రకరకాలుగా ఉంటాయి.

బలీయమైన పూర్వకర్మను సూచించే శనిగురువుల సంయోగమూ అందులోనూ శని నీచలో ఉన్నప్పుడు ఆ జాతకంలో ఎన్ని ఉన్నా ఏమీ లేని స్థితి మానసికంగా ఉంటుందని ఈ జాతకం నిరూపిస్తుంది.

అయితే, రాశి చక్రంలో ఉచ్చబుధుడిని సూచిస్తున్న రాహువూ, నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడూ ఈయనకు సినిమా రంగంలోనూ, ఘజల్స్ పాడటంలోనూ, ట్యూన్స్ కట్టడంలోనూ మంచి అంతర్జాతీయ సక్సెస్ ను ఇచ్చారు. ఆ శుక్రుడు కూడా మకర చంద్రుని నుంచి తృతీయస్థానంలో ఉండటంతో మంచి స్వరాన్ని ఇచ్చాడు.

ఈ విధంగా జాతకంలో యోగాలనేవి జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటి ప్రకారమే మనిషి జీవితం నడుస్తుందనడానికీ, సామాన్యులైనా అసామాన్యులైనా ఎవ్వరూ గ్రహప్రభావానికి అతీతులు కారని  చెప్పడానికీ ఈయన జాతకం ఒక ఉదాహరణ.