“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, మార్చి 2015, మంగళవారం

స్వామీజీ మిమ్మల్ని రమ్మన్నారు

నిన్నొక ప్రముఖ స్వామీజీ శిష్యుని నుంచి ఫోనొచ్చింది.

ఆయనెవరో చెప్పడం భావ్యంకాదు గనుకా,చెప్పి ఇంకా కొత్త గొడవలకు శ్రీకారం చుట్టడం నా ఉద్దేశ్యం కాదుగనుకా, ఆయన పేరును ఇక్కడ చెప్పడం లేదు.

విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను.

'నా పేరు ఫలానా.నేను ఫలానా స్వామీజీ దగ్గర ఉంటాను.' అన్నాడు.

'మంచిది చెప్పండి.ఎందుకు ఫోన్ చేశారు?' అడిగాను.

'మీ 'శ్రీవిద్యారహస్యం' పుస్తకాన్ని మా స్వామీజీ చదివారు.మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు' అన్నాడు.

'మంచిదే.అలాగే మాట్లాడవచ్చు.వారు పక్కనే ఉన్నారా?' అడిగాను.

'ఇక్కడ లేరు.లోపల ఉన్నారు.ఫోన్లో మాట్లాడటం సభ్యత కాదు.మీరు ఇక్కడకు వస్తే స్వామివారు మాట్లాడతారట' అన్నాడు.

'ఎవరికి సభ్యత కాదు?' అడిగాను.

'స్వామివారితో అలా ఫోన్లో మాట్లాడటం సభ్యత కాదు కదా?' అన్నాడు.

'మీరు నాతో ఫోన్లో మాట్లాడటం సభ్యత అయినప్పుడు, నేను ఆయనతో ఫోన్లో మాట్లాడితే సభ్యత కాకుండా ఎలా పోతుంది?' అడిగాను.

అవతల వైపు నుంచి కాసేపు నిశ్శబ్దం.

నేనూ మౌనం వహించాను.

కాసేపాగి అటువైపునుంచి 'హలో' అన్నాడు.

'చెప్పండి.వింటూనే ఉన్నాను' అన్నాను.

'మీరు మా ఆశ్రమానికి ఒకసారి రండి.స్వామివారు మీతో చెప్పమన్నారు.' అన్నాడు.

'ఎందుకు?' అడిగాను.

'మీతో మాట్లాడాలట'

'ఏ విషయం మీద మాట్లాడాలి?' అడిగాను.

'మీ పుస్తకం గురించి మాట్లాడతారట' అన్నాడు.

'అంటే వారికేమైనా సందేహాలున్నవా ఈ విషయంలో?' అడిగాను.

అతనికి కోపం వచ్చినట్లుంది.

'వారికి సందేహాలున్నాయో,లేక మీ సందేహాలే మా స్వామి తీరుస్తారో మీరే వచ్చి చూడండి' అన్నాడు.

'పిలిచి కయ్యం పెట్టుకోవడం అంటే ఇదేనేమో? మనకందరూ ఇలాంటి కేసులే తగులుతారు.ఇదేం ఖర్మరా దేవుడా?'- అనుకుంటూ-'మీ స్వామీజీనే ఇక్కడకు రమ్మనండి.నేను రాను.నాకేమీ అంత తీరని సందేహాలు లేవు.మీ స్వామీజీకి ఉంటే నా దగ్గరకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చు.'- అన్నాను.

'మీరు ఒక గొప్ప అవకాశం చేజార్చుకుంటున్నారు.మీకు సన్మానం చేద్దామని మా ఉద్దేశ్యం' అన్నాడు.

నాకు విషయం అర్ధమైంది.

సన్మానం అనగానే ఎగురుకుంటూ అక్కడకు వెళతానని ఆయన ఉద్దేశ్యం.

'నాకు సన్మానాలు అవసరం లేదు.సన్మానాలు చేయించుకునేటంత గొప్పపని నేనేమీ చెయ్యలేదు.మనుషుల దృష్టిలో గొప్ప కావాల్సిన పనిలేదు.దైవం దృష్టిలో శభాష్ అనిపించుకుంటే చాలు.

ఒకవేళ మీకు సన్మానాలు చెయ్యాలని అంతగా ఉంటే, ఎదురు డబ్బులిచ్చి చేయించుకునే వారు చాలామంది ఉన్నారు.వారిని కాంటాక్ట్ చెయ్యండి.' అని చెప్పాను.

సమాధానం లేకుండా ఫోన్ కట్ అయిపొయింది.

కాషాయవస్త్రాలు కట్టుకున్నంత మాత్రానో,అజ్ఞానపు జనం కొంతమంది చుట్టూ చేరి భజన చేస్తున్నంత మాత్రానో,ఎవరికి వారే 'పరమహంస పరివ్రాజకాచార్య' అంటూ బిరుదులు తగిలించుకున్నంత మాత్రానో- ఎవరూ 'స్వామీజీలు' కాలేరు.

సాధనాపరమైన అనుభవజ్ఞానం లేనివారిని-కాషాయవస్త్రాలు ధరించినంత మాత్రాన- నేను స్వాములుగా గుర్తించను.

ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద మాయ నడుస్తున్నది.చిన్నచిన్న హస్తలాఘవ క్రియలు (magic tricks) రెండు నేర్చుకోవడం,ఆశ్రమాలు పెట్టడం,రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకోవడం,హవాలా కార్యక్రమాలు మొదలుపెట్టడం,ఆ విషయాలు బయటపడకుండా 'సమాజ సేవ'అంటూ కొన్ని కంటితుడుపు సేవాకార్యక్రమాలు చెయ్యడం,దానికి మళ్ళీ పెద్ద ప్రచారం చేసుకోవడం-ఇలాంటి అనైతిక సుడిగుండాలు సమాజంలో నేడు చాలా కనిపిస్తున్నాయి.

ఆశ్రమాలు కూడా రకరకాల 'మార్కెటింగ్' లు మొదలు పెడుతున్నాయి. సమాజంలో కొన్ని రంగాలలో ప్రముఖవ్యక్తులను వారి ఆశ్రమాలకు ఆస్థాన సిద్ధాంతులుగా,ఆస్థాన పూజారులుగా,ఆస్థాన పండితులుగా నియమించు కోవడం,తద్వారా ఇద్దరూ లాభపడటం,వెరసి ఇద్దరూ కలసి భక్తులను వెర్రివాళ్ళను చెయ్యడం -- ఇదంతా ఒక పెద్ద ప్రహసనం.

ఇలాంటి ప్రహసనాలు నేడు లోకంలో చాలా నడుస్తున్నాయి.అసలు ఆస్థానాలూ సంస్థానాలూ ఎప్పుడో రద్దై పోయాయి.ఇంకా వీటి గోలేమిటి?

నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు.

ఏడాదికి రెండుసార్లో మూడుసార్లో  అతను ఒక పెద్ద ఫంక్షన్ చేస్తాడు.అందులో చాలామందికి శాలువాలు కప్పి,దండలేసి,బిరుదులు ప్రదానం చేస్తాడు. దానికోసం మూడునెలల ముందునుంచే దేశంమీద పడి విరాళాలు సేకరించడం మొదలుపెడతాడు.ఆ డబ్బులో చాలాభాగం తనే నొక్కేస్తాడని అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు.అతనికేమీ ఉద్యోగం సద్యోగం లేదు. ఏడాదికి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు రెండో మూడో చేస్తాడు.మిగతా టైములో హాయిగా బ్రతికేస్తూ ఉంటాడు.

పోనీ- అతనంటే కళారంగంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాడు.ఇప్పుడు స్వామీజీలూ ఆశ్రమాలూ కూడా ఇదే వరసలో నడుస్తున్నారన్నమాట.అంటే సన్మానవైరస్ ఇప్పుడు ఆశ్రమాలకూ స్వామీజీలకూ కూడా సోకిందన్న మాట.పిలిచి సన్మానాలు చేసే స్థాయికి స్వామీజీలు దిగజారారంటే వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతటిదో తేలికగా ఊహించవచ్చు.సమాజంలో పేరు ప్రతిష్టలే మనిషికి ముఖ్యం అయినప్పుడు ఇంక ఆధ్యాత్మికత ఎక్కడుంటుంది నా ముఖం కాకపోతే?

ఈ గోలలో పడి అసలైన ఆధ్యాత్మికత అనేది ఏమూలకు మాయమై పోతున్నదో ఆ దేవునికే తెలియాలి.

హతవిధీ !!

ప్రస్తుత సమాజంలో అన్నీ కల్తీ అయినట్లే,ఆధ్యాత్మికత కూడా కల్తీగా మారిపోవడం,అదికూడా ఒక బడా వ్యాపారంగా మారిపోవడం కలియుగ మాయలలో ఒక మాయేమో?