“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

16, అక్టోబర్ 2014, గురువారం

దయ్యాలు లేవూ?-1

కాలేజి సెలవలిచ్చారు.మా అమ్మాయి బ్యాగు సర్దుకొని తుఫాన్ వాతావరణంలోనుంచి అతికష్టం మీద బయటపడి ఇంటికొచ్చింది.

యధావిధిగా సబ్జెక్టు మీద తనని కొన్ని ప్రశ్నలడిగాను.తను చెప్పిన జవాబులు విని సంతోషం కలిగింది.సబ్జెక్టు తనకు బాగా వంటపడుతున్నది. తను మంచి డాక్టరౌతుందన్న నా నమ్మకం రోజురోజుకీ బలపడుతున్నది.

స్నానపానాలు కానిచ్చి తీరికగా కూర్చున్నాక తను సంభాషణ మొదలుపెట్టింది.

'నాన్నా.ఈ మధ్యన హాస్టల్లో ఏమైందో తెలుసా?'

తనేదో సెన్సేషనల్ న్యూస్ గురించే చెప్పబోతున్నదని నాకు తెలుసు కనుక ఉత్సాహం చూపిస్తూ 'చెప్పమ్మా' అన్నాను.

'మా సీనియర్ ఒకమ్మాయికి నెత్తిన కాకి తన్నింది' అన్నది.

నాకు నవ్వొచ్చింది.

'అది వింతేమున్నది తల్లీ? చాలామందికి అది జరుగుతుంది.' అన్నాను.

'అదికాదు నాన్నా.అక్కడే అసలు కధ మొదలైంది.విను.సరేగాని ఇది మంచి సూచనా చెడు సూచనా?' అడిగింది.

తను అప్పుడప్పుడూ నన్ను పరీక్షిస్తూ ఉంటుంది.

'ఖచ్చితంగా చెడు సూచనే.ఆ అమ్మాయికి ఏదో చెడు జరగబోతున్నది. ఎందుకంటే కాకి శనీశ్వరుడి వాహనం కదా.అంటే ఆయన మీడియం అన్నమాట.కనుక ఆ అమ్మాయికి శనిసంబంధ దోషం ఏదో చుట్టుకోబోతున్నది.కాకి తన్నిన చాలామందికి ఆ తర్వాత ఏదో ఒకచెడు తప్పకుండా జరుగుతుంది.ఇది శకునశాస్త్రంలో అందరికీ తెలిసిన విషయమే.' అన్నాను ఇంకొక పదిహేను రోజులలో జరుగబోయే శనీశ్వరుడి ట్రాన్సిట్ తలచుకుంటూ.

మా అమ్మాయి చాలా కూల్ గా-'కదా! ఇప్పుడు నేను చెప్పేది విను.' అన్నది.

'ఊ చెప్పు' అన్నాను.

'కాకి తన్నటంతో ఆ అమ్మాయి కూడా భయపడింది.ఇదేదో మంచి శకునం కాదనుకొని వెంటనే దర్గాకి వెళ్లి తాయెత్తు కట్టించుకొని వచ్చింది.' అన్నది.

'అదేంటి దర్గాకి వెళ్ళిందా?ఏం అక్కడ మన దేవాలయాలు లేవా?' అడిగాను.

'ఉన్నాయి నాన్నా.ఖర్మ నెత్తిన కూచున్నపుడు ఇలాగే జరుగుతుందని నీవేగా చాలాసార్లు అంటావు' అన్నది.

'ఊ.సరే తర్వాతేమైంది' అన్నాను.

'ఆ తాయెత్తు ఒంటిమీద ఉన్నంతసేపూ బాగానే ఉంది నాన్నా.ఆ తర్వాత మొదలైంది అసలు కధ'-అన్నది.

మౌనంగా చూస్తున్నాను.

'కొన్ని రోజులకి ఆ తాయెత్తు ఊడిపోయింది.ఆ రోజునుంచీ ఆ అమ్మాయికి ఏవేవో నీడలు కనిపించడం,ఎవరో తనని వెంటాడుతున్నట్లు అనిపించడం ఇలాంటి భ్రమలు మొదలయ్యాయి నాన్నా.అదీగాక ఆ అమ్మాయి ఉండేది ఒక హాంటెడ్ రూమ్.' అన్నది.

'అదేంటి? అలాంటి రూములు హాస్టల్లో ఉన్నాయా?' అడిగాను అమాయకంగా.

'అంత నటించకు నాన్నా.నీకు తెలీదా?పాతకాలపు బిల్డింగులు హాస్టళ్ళలో అలాంటి రూములు ఉంటాయి' అన్నది తను.

తనచేత అలా ముద్దుగా తిట్టించుకోవాలనే అప్పుడప్పుడు అలా చేస్తుంటాను.

'సర్లేమ్మా.తర్వాతేమైందో చెప్పు.' అన్నాను నవ్వుతూ.

'అది హాంటెడ్ రూమ్ అని హాస్టల్లో చాలామందికి తెలుసు.ఆ తర్వాత ఆ అమ్మాయి రూము తలుపేసుకుని మూడురోజుల పాటు లోపలే ఉండిపోయింది.మీల్స్ కి తప్ప బయటకు వచ్చేదికాదు.' అన్నది.

'ఊ' అన్నాను కొనసాగించమని చూస్తూ.

'ఒక రోజున మా రూమ్మేట్ ఆ అమ్మాయి గదికి వెళ్ళింది.' అంటూ ' మా రూమ్మేట్ గురించి ఇక్కడ నీకు కొంతచెప్పాలి.తనకూ నాలాగే కొన్ని విషయాలు తెలుస్తాయి.ఏదైనా బ్యాడ్ వైబ్రేషన్ చుట్టుపక్కల ఉంటే తనూ ఫీల్ అవగలదు.అయితే అది నెగటివ్ ఎబిలిటీ.అది వాళ్ళ నాన్నగారి నుంచి దీనికి జీన్స్ లో వచ్చింది.వాళ్ళ నాన్నగారేం చేసేవారో తెలుసా?ఆయన ఇలాంటివి అస్సలు నమ్మడు.కొబ్బరి కాయ దిష్టి తీశారు దానిని తాకకూడదంటే ఎందుకు తాకకూడదని దానిని పగలగొట్టి చక్కెర వేసుకుని తినేసేవాడు.రోడ్డుమీద దిష్టి కోడిగుడ్డు అని అందరూ పక్కకు తప్పుకుంటే దానిని తీసుకుని పగలగొట్టి తాగేసేవాడు.ఆ చెట్టుమీద దయ్యం ఉన్నదట అని పల్లెటూళ్ళో అంటే దయ్యమా!ఎక్కడుంది? అని ఆ చెట్టెక్కి చూచేవాడట చిన్నప్పుడు.అలా వాళ్ళ నాన్నగారి దగ్గరనుంచి దీనికి కూడా ఆ ధైర్యం వచ్చింది.' అన్నది.

'నీకెక్కడనుంచి వచ్చింది?' అడిగాను నవ్వుతూ.

'నీ దగ్గర్నించేమీ రాలేదు.నా ఉపాసన వల్ల నాకొచ్చింది.' అంది తనూ నవ్వుతూ.

'అలా వాళ్ళ నాన్నగారిలాగా చెయ్యడం వల్ల మంచిదేనా నాన్నా?' అడిగింది.

'లేదమ్మా.దానివల్ల వాళ్ళకు తెలియని దోషాలు చుట్టుకుంటాయి.దిష్టి తీసి పడేసిన వస్తువులలో ఏమీ లేదని అనుకోకూడదు.వాటిలో బ్యాడ్ వైబ్స్ ఉంటాయి.వాటిని తాకితేనే మంచిది కాదని మనం అంటుంటే,ఇక వాటిని తినేస్తే ఇంకేముంది?సరాసరి మన సిస్టంలోకి వాటిని స్వీకరించినట్లే.దానివల్ల చాలా చెడు జరుగుతుంది.మొండితనం మీద అప్పుడు తెలియకపోవచ్చు. కాని అలాంటివాళ్ళ ఇళ్ళలో చెడు సంఘటనలు తప్పకుండా జరుగుతాయి.' అన్నాను.

'ఊ.ఆ తర్వాతేమైందో తెలుసా?మా రూమ్మేట్ హాంటెడ్ రూమ్ కెళ్ళి అక్కడ దయ్యాన్ని తరిమేసింది' అన్నది.

'ఇంతకీ అక్కడ ఏముంది? ఈ అమ్మాయి దానిని ఎలా తరిమేసింది?' అన్నాను.

'ఏముందా?ఆ రూంలో కాకితన్నిన అమ్మాయి ఉంది కదా.ఆ అమ్మాయి పడుకుంటే కళ్ళు ముయ్యగానే రూంలో ఎవరో తిరుగుతున్నట్లు,మంచం పక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుందిట.రాత్రంతా ఏవేవో నీడలు రూంలో కనిపిస్తాయట.అది తన భ్రమేమో అని అలాగే నిద్రపోతుంటే వీపుమీద చెళ్ళున కొట్టి 'లే.లేచి మందులేసుకో.' అని ఎవరో చెప్పినట్లు అనిపిస్తుందిట. సరే మా రూమ్మేటు అక్కడకెళ్ళి ఆ రూమంతా శుభ్రం చేసి అక్కడ ఉన్న కొన్ని హాంటెడ్ వస్తువులు పారేసి ధూపం వెలిగించి వచ్చింది.ఆ తర్వాతేమైందో తెలుసా నాన్నా?ఆ దయ్యం మా రూమ్ కి వచ్చేసింది.'

'పగబట్టిన పాంచాలి అని దానికి పేరు పెట్టుకోండి.సరిపోతుంది.'-అన్నాను నవ్వుతూ.

'ఎదుటివాళ్ళు ఏం చెప్పినా నీకు జోక్ గానే ఉంటుంది నాన్నా.నువ్వు చెప్పేది మాత్రం మేం సీరియస్ గా తీసుకోవాలి.' అంది తను నిష్టూరంగా.

'సారీసారీ.అదేం లేదులే.నమ్ముతున్నాగా.మా బంగారుతల్లివిగా.చెప్పుచెప్పు 'అన్నాను బతిమాలుతూ.

'ఆ టైంలో నేను అక్కడ లేను.ఇంటినుంచి హాస్టల్ కి వెళుతూ దారిలో ఉన్నాను.సరే మా రూమ్మేట్ మా రూంకి వచ్చేసాక దీనికి కూడా నీడలు కనపడటం మొదలైంది.ఇది నిద్రపోతుంటే ఎవరో మంచం పక్కన నిలబడినట్లు,రూంలో తిరుగుతున్నట్లు అనిపించి కలత నిద్రగా ఉంది.లైట్ వేసుకుంటే ట్యూబ్ లైట్ దానంతట అదే ఆరిపోవడం అవుతున్నది.పక్క రూముల్లో కరెంట్ బాగానే ఉందిట.ఈ లోపల నేను హాస్టల్ కి చేరాను.రాత్రంతా ప్రయాణం కదా ఆరోజు కాలేజీకి వెళ్ళలేక రూంలోనే నిద్రపోయాను.తను మామూలుగా కాలేజీకి వెళ్ళిపోయింది.ఇక నాకు మొదలైంది నాన్నా.' అన్నది.

'నీ జోలిక్కూడా వచ్చిందా' అన్నాను కుతూహలంగా.

'అవున్నాన్నా.అలసిపోయానేమో స్నానం చేసి పడుకోగానే నాకు బాగా నిద్రపట్టేసింది.ఇంతలో మంచం పక్కనే ఎవరో ఒక అమ్మాయి నిలబడి ఉంది నాన్నా.కొద్దిసేపు రూంలో అటూఇటూ తిరుగుతూ ఉంటుంది.కొద్దిసేపు మంచం పక్కనే నిలబడి నావైపు చూస్తూ ఉంటుంది' అన్నది.

'నిద్రలో ఉన్న నీకెలా తెలిసింది.అనిపించిందా?కనిపించిందా?' అడిగాను.

'రెండూ.ముందు అనిపించింది.తర్వాత కనిపించింది.లేచి చూచాను.అప్పటికి సాయంత్రం ఆరవుతోంది.చీకటి పడిపోయింది.లేచి చూస్తే రూంలో ఒక మూలగా ఒకమ్మాయి గోడవైపు తిరిగి నిలబడి ఉంది నాన్నా.ఆ అమ్మాయికి జుట్టు మోకాళ్ళవరకూ ఉన్నది.'

'ఏదీ మనం చూచే ఇంగ్లీషు హర్రర్ సినిమాల లాగానా?' అడిగాను నవ్వుతూ.తనూ నేనూ కలసి అప్పుడప్పుడూ హాలీవుడ్ హర్రర్ సినిమాలు నెట్లో చూస్తూ ఉంటాం.

'ఉండు నాన్నా నీకు ప్రతిదీ ఎగతాళే.నువ్వు చెప్పేవేమో నిజాలు.మేము చెబితే అబద్దాలా?' అడిగింది ఉక్రోషంగా.

'లేదులేమ్మా ఉడుక్కోకు.సరదాగా అన్నాను.ఆ సినిమాలు చూచీచూచీ అవే దృశ్యాలు నీకు కనిపించాయేమో అని నా అనుమానం.' అన్నాను.

'అబ్బా!అన్నీ నీకొక్కడికే తెలుసనుకోకు.విను.నాకు భలే చిరాకేసింది." అలసిపోయి నిద్రపోతుంటే ఏంటీ దయ్యాల గోల?" అనుకుంటూ కోపంగా లేచి లైటేశాను.వెనక్కు చూస్తే రూంలో ఆ అమ్మాయి లేదు'- అన్నది.

'ఒక్కోసారి మసకచీకటిలో కిటికీలోంచి పడే చెట్లనీడల వల్ల కూడా అలాంటి భ్రమలు కలుగుతాయమ్మా.' అన్నాను నవ్వుతూ.

'ఆహా! నేనూ సైన్స్ స్టూడెంట్ నే అన్న విషయం మర్చిపోకు నాన్నా.సరే నాది భ్రమే అనుకుందాం.ఇంతలో మా రూమ్మేట్ కాలేజీనుంచి వచ్చింది.

"ఏంటో కలత నిద్రగా ఉందే" అని తనకు చెప్పాను.

"ఏం ఆ పొడుగుజుట్టు అమ్మాయి నీకూ కనిపించిందా?"అని తనడిగింది. ఇది భ్రమెలా అవుతుంది నాన్నా?ఇద్దరికీ ఒకే భ్రమ కలుగుతుందా?' -ప్రశ్నించింది.

తనకు సైకిక్ ఎబిలిటీస్ పుట్టుకతోనే ఉన్న సంగతి నాకు తెలుసు.అవి తన జాతకంలో కూడా ప్రతిఫలిస్తూనే ఉంటాయి.కలకత్తా వెళ్ళినప్పుడు దక్షిణేశ్వర కాళీసమక్షంలో తనకు నేను మంత్రోపదేశం చేసినప్పటినుంచీ ఆ శక్తి తనకు ఇంకా ఎక్కువైంది.ఆ సంగతి తను ఎప్పటికప్పుడు నాకు చెబుతున్న అనుభవాల వల్ల నాకు తెలుసు.అయినా సరే తన సైంటిఫిక్ రీజనింగ్ ని వృద్ధి చెయ్యాలని తనతో అలా వాదిస్తూ ఉంటాను.

'విను నాన్నా.మా సీనియర్ని కాకి తన్నిన దగ్గరనుంచీ ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ మా రూమ్మేట్ నాకప్పుడు వివరించింది.నేను అప్పుడు హాస్టల్లో లేనుకదా.' అన్నది.

'అప్పుడు మీరేం చేశారు?'అడిగాను.

'ఏముంది? ఇద్దరం కలసి దాన్ని రూంలోనుంచి తరిమేశాం' అన్నది.

"ఎలా చేశారు?"అడిగాను కుతూహలంగా.

మా అమ్మాయి చెప్పడం కొనసాగించింది.

(ఇంకా ఉన్నది)