“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, సెప్టెంబర్ 2014, గురువారం

షష్టి-సప్తమి-యోగజాతకుల జనన సమయం

ఒక స్నేహితురాలు అమెరికానుంచి మొన్న మాట్లాడుతూ షష్టి సప్తమి రోజులలో బాగా డిస్టర్బ్ అయ్యాననీ ఎందుకో తెలియడం లేదనీ చెప్పింది.తనకు సైకిక్ ఎబిలిటీస్ ఉన్నాయి గనుక విశ్వంలో ఒక మార్పు జరిగినప్పుడూ కొన్ని ప్రత్యెక సందర్భాలు ఖగోళంలో ఏర్పడినప్పుడూ ఇటువంటి వ్యక్తులకు అలా ఏదో తెలియని మానసిక అలజడి కలగడం సహజమే.అదే విషయం తనకు చెప్పాను.

మొన్న 14-9-14 న షష్టి రోజున ఖగోళంలో ఒక మంచి యోగసమయం వచ్చింది.అదే పరిస్థితి 15-9-2014 సప్తమి రోజున కూడా ఉన్నది.ఈ రెండురోజుల్లో మంచి యోగజాతకులు కొందరు ఈ భూమి మీద జన్మించారు.వారు ఇంతకు ముందు జన్మలలోనే ఆధ్యాత్మికంగా మంచి స్థాయిని అందుకున్న ఆత్మలు.ప్రస్తుతం ఈ జన్మలో వారికీ లోకంతో ఉన్న ఋణానుబంధాన్ని తీర్చుకోడానికి మళ్ళీ జన్మ ఎత్తారు.

గురువూ శనీశ్వరుడూ ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఖగోళంలో ఉన్నారు.ఆ రెండురోజుల్లో చంద్రుడు కూడా ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.సూర్యుడు స్వక్షేత్రం లో ఉన్నాడు.కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు.కనుక నాలుగుగ్రహాలు ఉచ్ఛస్థితిలోనూ రెండు గ్రహాలు స్వక్షేత్రం లోనూ ఉన్న స్థితి ఈ రెండురోజుల్లో ఉన్నది.కనుక యోగజాతకులైనవారు భూమిపైన జన్మించడానికి ఇది చాలా మంచి సమయం.

జూలైలో గురువుగారు కర్కాటక రాశిలో ప్రవేశించారు.శనీశ్వరుడు నవంబర్లో తులారాశినుంచి పక్కకు వెళ్ళిపోతాడు.కనుక మధ్యలోని నాలుగు నెలల కాలం మాత్రమె వారిద్దరూ ఉచ్చస్థితిలో ఉంటారు.

ఈ నాలుగు నెలల్లో చంద్రుడు నాలుగుసార్లు ఉచ్చస్తితిలోకి వస్తాడు.కానీ సూర్యుడు ఆగస్ట్-సెప్టెంబర్ మధ్యలోనే సింహరాశిలో స్వక్షేత్రంలో ఉంటాడు. అలాంటి ఒక యోగకారక కాలం మొన్న ఈ రెండురోజుల్లో ఖగోళంలో వచ్చింది.

ఆ రెండు రోజులలో శనివర్గ రాశులైన మకర,వృషభ,మిధున,తులా రాశులలో జన్మించిన శిశువులు పెరిగి పెద్దవారైనప్పుడు మంచి యోగజీవితాన్ని (అంటే ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని) గడుపుతారు.రాహుకేతువులు ప్రస్తుతం అనుకూల స్థితులలో లేరు గనుక వీరిది ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైన జీవితాలే అవుతాయి గాని లౌకిక పరమైన జీవితాలు కావు. 

పైగా ఇక్కడ ఒక మర్మం ఉన్నది.

గురువూ శనీశ్వరుడూ ఇద్దరూ ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు గురువుగారి దృష్టి శనీశ్వరుని మీద ఉండదు.కానీ శనీశ్వరుని దృష్టి గురువుగారి మీద ఉంటుంది.పైగా వీరిద్దరి మధ్యన కేంద్ర దృష్టి ఉంటుంది.

కనుక అలాంటి సమయంలో పుట్టే జాతకులు లోకంతో ఆధ్యాత్మికపరమైన కర్మఋణాన్ని కలిగిఉంటారు.భోగపరమైన ఋణాన్ని కాదు.ఆ ఋణాన్ని తీర్చుకోడానికే ఈ సమయంలో వారు పుడతారు.పెద్దవారైనాక వారు ఆధ్యాత్మికంగా మంచి స్థాయులు అందుకుంటారు.లోకానికి ధర్మబోధను ఆధ్యాత్మిక బోధను గావిస్తారు.

ఈ అవకాశం గురువర్గాలలో పుట్టినవారికి లేదు.శనివర్గాలలో పుట్టినవారికే ఈ యోగాలు పడుతున్నాయి.కనుక వీరివి కర్మజాతకాలని చెప్పక తప్పదు. అంటే లౌకిక సుఖాలు అనుభవించే జాతకాలు వీరివి కావు.లోకంతో ఉన్న ఆధ్యాత్మిక ఋణాన్ని తీర్చుకోవడానికి ఈ సమయంలో ఆ జీవులు భూమిమీదకు వచ్చారు.

పైగా ప్రస్తుతం పితృదేవతలకు చెందిన మహాలయ పక్షాలు నడుస్తున్నవి. కనుక పితృలోకాలనుంచి ఈ జీవులు ఇప్పుడు భూమిమీదకు వచ్చారని నేను చెబుతున్నాను.

మొన్న ఆ రెండురోజుల్లోనూ భాద్రపద బహుళ షష్టి మరియు సప్తమి తిధులు నడిచాయి.వీరిలో మళ్ళీ షష్టినాడు పుట్టిన వారికంటే సప్తమినాడు పుట్టినవారి జాతకాలు ఎక్కువ ఆధ్యాత్మికమైన బలంతో ఉంటాయి.నేను చెప్పిన లగ్నాలలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులను గమనించండి.వారిలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీన్స్ ఉంటాయి.వారివారి వంశాలలో పాతకాలంలో మహనీయులైన వ్యక్తులు ఖచ్చితంగా ఉండి ఉంటారు.

ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదంటే,అలా చెబితే,ఆశపోతులూ ఆత్రగాళ్లైన కొందరు తల్లితండ్రులు ఆయా సమయాలకు ఆపరేషన్లు చేయించి మరీ వారివారి శిశువులను ముందే బయటకు తీయించే ప్రయత్నం కూడా చేస్తారు.నేటి ఆశపోతు ప్రజలకు ఇది సహజమే.అందుకే ఈ విషయాన్ని ముందుగా నేను వ్రాయలేదు.

సృష్టిలోని కర్మవలయాన్నీ,గ్రహప్రభావాన్నీ,మనమీద మన కంటికి కనిపించని సూక్ష్మశక్తుల ప్రభావాలనూ  గమనిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.

ఆ సమయాలలో ఆపరేషన్ ద్వారా కాకుండా సహజంగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇప్పుడు పుట్టిన మీమీ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచండి.ఎందుకంటే,వాళ్ళు ముందుముందు మహనీయ వ్యక్తులుగా రూపుదిద్దుకోబోతున్నారు.వాళ్ళు ఎవరో కాదు.మీ పితృదేవతలలోని మహనీయులే ఇప్పుడు మీ పిల్లలుగా జన్మించారు.వారిని జాగ్రత్తగా పెంచండి.అందుకోసం ముందుగా మీమీ జీవితాలను చక్కదిద్దుకోండి.మీ పిల్లలకు చెప్పాలంటే ముందు మీరు సక్రమంగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి.

వారి జీవితగమనంలో మీ పాత్రను సరిగ్గా పోషించి మీ జీవితాలకు కూడా సార్ధకతను తెచ్చుకోండి.

మరొక్కసారి ఆ శిశువుల తల్లిదండ్రులకు నా అభినందనలు.