“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

రోహిణీ శకట భేదనం-2 (శనిగ్రహ దృష్టులు-మరికొన్ని నివ్వెరపరచే నిజాలు)

ఇప్పుడొక విప్లవాత్మకమైన వ్యాఖ్య మీ ముందుకు రాబోతున్నది.

శనీశ్వరుని స్థితే కాదు దృష్టి కూడా మంచిదే.

ఇదేంటి లోకమంతా 'చెడు' అంటే ఈయన 'మంచి' అంటాడేమిటి?అనుకోకండి.లోకానికి మంచి అయినది యోగులకు చెడు.లోకులకు చెడు అయినది యోగులకు మంచీ అవుతుంది.లోకాన్నీ వ్యక్తులనూ వారు చూచే దృష్టికోణం విభిన్నంగా ఉంటుంది.

భగవద్గీతయే దీనికి ప్రమాణం.

శ్లో||యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే

(సమస్త జీవులకూ ఏది రాత్రియో ఆ సమయంలో సంయమి ఐనవాడు మేలుకుని ఉంటాడు.ఎందులో సమస్త జీవులూ మేలుకొని ఉంటాయో అది ముని అయిన వాడికి రాత్రిగా కనిపిస్తుంది)

ఆ||ఎల్ల భూతతతుల కేది రాత్రిగ దోచు
దమికి దోచు నదియె దివము గాగ
దేనియందు జనులు దెలివి మీరుచు నుందు
రదియె రాత్రి జూడ నతని కిచట   

(భగవద్గీత 2:69)

లోకమంతా శనీశ్వరుని ప్రభావాన్ని 'చెడు' అనుకుంటుంది.కానీ లోకానికి తెలియని విషయం ఏమంటే శనిప్రభావం చాలా మంచిది.అది మనిషి కర్మను అతని చేత అనుభవింప చేస్తుంది.కర్మక్షాళనం గావిస్తుంది.మన నెత్తిన ఉన్న కర్మబరువును వేగంగా తగ్గిస్తుంది.మనిషిచేత అతని పూర్వకర్మను అనుభవింపచేసి అతని పాపాన్ని ప్రక్షాళనం గావిస్తుంది.అతడిని పరిశుద్ధుడి ని చేస్తుంది.అందుకే శని ప్రభావం చాలా మంచిదని నేనంటాను.

It is a great purifier.

శనైశ్చరుని ప్రభావం లేకుంటే జీవితం చాలా త్వరగా బోరు కొడుతుంది. అంతే కాదు దారీతెన్నూ లేకుండా అయిపోతుంది.పాశ్చాత్యదేశాలలో ఉండే చాలామందికి జీవితం అతిత్వరగా బోరు కొట్టడానికీ వారు తరచూ డిప్రెషన్ లో పడటానికీ కారణం వారిమీద ఉండే తీవ్రమైన శనిప్రభావమే.

ఈ మాట కొంచం అర్ధం కానిదిగా ఉండవచ్చు.కొద్దిగా వివరిస్తాను.అప్పుడు బాగా అర్ధం అవుతుంది.

శనీశ్వరునకు రెండు ప్రభావాలుంటాయి.ఆ మాటకొస్తే ఏ గ్రహానికైనా రెండు ప్రభావాలుంటాయి.ఒకటి పాజిటివ్.ఒకటి నెగటివ్.వీటిలో ఏది ఎక్కువైనా ఇబ్బందే.ఏదైనా సమంగా ఉన్నపుడే జీవితం కూడా సమంగా నడుస్తూ ఉంటుంది.

శనీశ్వరుని దృష్టి ఒకనిమీద అస్సలు లేకుంటే వాడు రోజురోజుకూ లోక వ్యవహారంలో తీవ్రంగా కూరుకుపోతాడు.వాడికి వైరాగ్యం అనేది అస్సలు రాదు.ఊపిరి సలపనంతగా లోకపు పనులలో వ్యామోహాలలో వాడు ఇరుక్కుపోతాడు.అదే శనీశ్వరుని దృష్టి ఒకనిపైన బాగా ఎక్కువగా ఉంటే కూడా అదీ ప్రమాదమే.అటువంటి వాడు తీవ్రమైన నైరాశ్యంలో,డిప్రెషన్ లో కూరుకుపోతాడు.సమత్వం తప్పితే రెండూ ప్రమాదకారులే.

అయితే ఇంద్రియదాసులైన లోకులకు జీవితంలో కష్టాలు వస్తే చాలా బాధగా ఉంటుంది.కానీ ఆ కష్టాలు తమ పూర్వపు చెడు కర్మ వల్లనే వస్తున్నాయన్న జ్ఞానం వారికి ఉండదు.ఒకవేళ ఎవరైనా ఈ నిజాన్ని చెప్పినా వారంత తేలికగా ఒప్పుకోరు.

వారికి అర్జంట్ గా కావలసింది ఆ కష్టం తేరగా పోవడమూ అప్పనంగా సుఖాలు వచ్చి ముంగిట్లో వాలడమూ.ఆ సుఖాలు ఎల్లకాలమూ అలాగే ఉండటమూ.అంతే.వీరి మూలపురుషుడు యయాతి మహారాజు.

ఒకసారి నేనొక గుడికి వెళ్లాను.

అక్కడ పూజారి నాకు తెలుసు.అతను పూజ చెయ్యబోతూ అక్కడ ఉన్న భక్తులను వారి వారి గోత్రాలు అడుగుతున్నాడు.

నా దగ్గరికి వచ్చినపుడు ఇలా చెప్పాను.

'ఎందుకలా అందరివీ గోత్రాలు అడుగుతావు? అందరిదీ ఒకటే గోత్రం. యయాతి గోత్రం.పూజలో అలా చెప్పు సరిపోతుంది.'

అతనికి మన ధోరణి తెలుసు గనుక నవ్వేసి మామూలుగా పూజ ముగించాడు.

తర్వాత ఇలా అన్నాడు.

'శర్మగారు.మీరు అన్నది నిజమే.వారివారి కోరికలు తీరడం తప్ప ఈ పిచ్చి జనానికి ఇంకేం కావాలి?కానీ మీరు చెప్పినట్లు నేనిక్కడ చెయ్యకూడదు. ఎవరి గోత్రాలు వారివి నేను చెప్పే సంకల్పంలో సరిగ్గా చెప్పాలి'

దానికి నేనిలా అన్నాను.

'నిజమే.నేనూ సరదాగానే అన్నాను.సంకల్పంలో 'యయాతి గోత్రం' అని చెప్పమని కాదు నా ఉద్దేశ్యం.లోకం తీరు అలా ఉందని నేను అన్నాను. దానిని సీరియస్ గా తీసుకోకు.మనం చెప్పినా చెప్పకపోయినా లోకుల గోత్రం యయాతి గోత్రమే.ఆ సంగతి నీకూ నాకే కాదు దైవానికి కూడా మనకంటే ముందే తెలుసు.'

ఎవరైనా నన్ను 'శనిదోషం పోవడానికి ఏం చెయ్యాలి?' అనడిగితే నాకు భలే నవ్వొస్తుంది.అదెలా పోతుంది? అది పొయ్యేది కాదు.అది పోతే నీ జీవితమే సమాప్తం అవుతుంది.ఈ లోకంతో నీ ఋణం తీరిపోతుంది.శనిదోషం పోతే దానిని అనుభవించే నీవే పోతావు.ఇది చాలామందికి తెలియదు.

అదీ సంగతి.

శనిదోషం పోవడానికి లోకమంతా ఏవేవో పూజలు పరిహారాలు చేస్తుంది.కానీ అవి అసలైన పరిహారాలు కావు.అసలైన శనిదోష పరిహారాలను కోటికి ఒక్కరు కూడా చెయ్యలేరు.శనిదోషాన్ని నిజంగా నివృత్తి చేసుకోడానికి తమ జీవితాలలో వచ్చిన అవకాశాలను అందరూ కాలదన్నుకునే వారేగాని, అలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పుడు వాటిని సక్రమంగా ఉపయోగించుకునే వారు ఒక్కరుకూడా నాకు ఇంతవరకూ కనపడలేదు.

అసలు 'శనిదోషం' అనే మాటే తప్పు.అది దోషం కాదు.నీవు చేసుకున్న పూర్వకర్మ.ఆ కర్మ చేసేటప్పుడు అది దోషాన్ని కలిగిస్తుందని నీకు తెలీదా?పోనీ నీకు తెలియకపోయినా,వద్దని చెప్పేవారు చెప్పినప్పుడు నీవు విన్నావా?అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుని,ఇప్పుడు దాని ఫలితం అనుభవించే సమయంలో 'శనిదోషం' అంటావేమిటి?దోషం శనిది కాదు.నీది.నీవు చేసిన తప్పును శనైశ్చరుడి మీదకు నెట్టాలని చూడటం ఇంకో పెద్దతప్పు.

లోకం అంతా ఇలా అజ్ఞానంలో బ్రతకవలసిందే.వేరే మార్గం దానికి లేదు. ఒకవేళ దారి చూపేవారు దానికి ఎదురైనా ఆ దారిని అది స్వీకరించలేదు.ప్రపంచం మీద అజ్ఞానపు పట్టు చాలా గట్టిది.ఇదొక అనుల్లంఘనీయమైన కర్మ నియమం.దానిని బ్రేక్ చెయ్యడం ముందు హెర్క్యూలియన్ టాస్క్ లు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి.

ఈ "యోగిక్ ఉపోద్ఘాతాన్ని" అలా ఉంచి,ప్రస్తుతం విషయంలోకి వద్దాం.

రోహిణీ నక్షత్రంలో శనీశ్చరుని స్థితిని మనం గమనించాం.ఇప్పుడు ఆయన దృష్టిని గమనిద్దాం.

సింహరాశి 17 డిగ్రీల మీదకు వచ్చినపుడు ఆయన వృషభం 17 వ డిగ్రీని తన దశమ దృష్టితో వీక్షిస్తాడు.ఖగోళంలో అలా జరిగిన ప్రతిసారీ అది కూడా ఒక రకమైన రోహిణీ శకట భేదనమే అవుతుంది.అలా జరిగిన ప్రతిసారీ ఏమైందో క్లుప్తంగా పరికిద్దాం.

1) 2007-08 లో శనీశ్చరుడు సింహరాశి 17 డిగ్రీల మీద సంచరించాడు.

ఆ సమయంలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది.1930 లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ తర్వాత మళ్ళీ అంత భయంకరమైన ఆర్ధిక దుస్థితి ఇదే అని ప్రపంచ ఆర్ధిక వేత్తల అభిప్రాయం.

2) అంతకు ముందు 1977-78 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో పశ్చిమ న్యూయార్క్ ని "బ్లిజర్డ్ ఆఫ్ 1977" ఊపి పారేసింది.ఎక్కడ చూచినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.ఎన్నో మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.

అదే సమయంలో ఆంద్రప్రదేశ్ లో దివిసీమ తుఫాను చెలరేగింది.దాదాపు 50,000 మంది ఆ తుఫాన్లో చనిపోయారని ఒక అంచనా.అలాగే 500 మిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం వాటిల్లింది.

3) అంతకు ముందు 1948-49 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

దాదాపుగా అదే సమయంలో జరిగిన భారతదేశ విభజనలో సరిహద్దు దగ్గర ఇటునుంచి పాకిస్తాన్ కూ అటునుంచి ఇండియాకూ జనాలు మారేటప్పుడు జరిగిన గొడవలలో దాదాపు 5 లక్షల మంది చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులూ రవాణా ప్రమాదాలూ ఎన్నో జరిగాయి.

4) అంతకు ముందు 1918-19 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో ప్రపంచంలోనే అతి భయంకరమైన "ఫ్లూ" పాండెమిక్ విజ్రుమ్భించి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మందిని ఎటాక్ చేసింది.దీనికి H1N1 ఫ్లూ వైరస్ కారణం.వారిలో 50-100 మిలియన్ల మంది చనిపోయారు.

ఇది ఎపిడెమిక్ కాదు.పాండెమిక్.అంటే అతివేగంగా వ్యాపిస్తూ అనేక దేశాలనూ ఖండాలనూ ఒకేసారి ఎటాక్ చేసే వ్యాధి అన్నమాట.

అప్పుడే మన దేశంలో 'జలియన్ వాలాబాగ్' హత్యాకాండ జరిగింది.

ఇక ఆ సమయంలో వచ్చిన భూకంపాలూ వరదలూ ఇతర ప్రమాదాల గురించి నేను వ్రాయదలచుకోలేదు.

5) అంతకు ముందు 1889-1890 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో "ద గ్రేట్ సియాటిల్ ఫైర్" అనే భయంకర అగ్నిప్రమాదం జరిగింది.ఆ ప్రమాదంలో సియాటిల్ చాలావరకూ నాశనం అయింది.

అదే సమయంలో 'ద గ్రేట్ బేకర్స్ ఫీల్డ్ ఫైర్' అనే ప్రమాదం జరిగి ఆ టౌన్ మొత్తాన్నీ కాల్చేసింది.మొత్తం 196 బిల్డింగులు కాలిపోయాయి.

అదే సమయంలో కాలిఫోర్నియా సమీపంలో 'సాంటియాగో కేన్యన్ ఫైర్' అనే అగ్ని ప్రమాదం జరిగి ఆరంజ్ కౌంటీ, సాన్ డీగో కౌంటీ లను తగలబెట్టింది.

యధావిధిగా భూకంపాలూ వరదలూ వ్రాయదలుచు కోలేదు.

6) అంతకు ముందు 1859-1860 లలో శనీశ్చరుడు సింహరాశిలో సంచరించాడు.

ఆ సమయంలో "సూర్యతుఫాను" అనబడే భూఅయస్కాంత తుఫాన్ వచ్చింది.దానిని "సోలార్ స్టార్మ్ ఆఫ్ 1859" లేదా 'కేరింగ్టన్ ఈవెంట్' అంటారు.

అదే సమయంలో ఐరిష్ సముద్రంలో "రాయల్ చార్టర్ స్టార్మ్" అనబడే భయంకర తుఫాన్ వచ్చింది.

ఇంకా వెనక్కు పోయి చూడనవసరం లేదు.ఎందుకంటే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది గనుక.

కనుక ఇప్పుడు అర్ధమైన ఇంకొక విషయం ఏమంటే--

శనీశ్చరుడు సింహరాశిలో సంచారం చేసే సమయంలో కూడా ఉపద్రవాలు కలుగుతాయి.ఎందుకంటే ఆయన దశమ దృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షిస్తాడు గనుక.

అయితే,వృషభరాశిలో సంచారం చేసేటప్పుడు జరిగినన్ని ఎక్కువ ఘోరాలు అప్పుడు జరగడం లేదు.అంటే, ఆయనయొక్క స్థితికంటే దృష్టి బలహీనమైనది అన్న విషయం కనిపించింది కదా.

ఇక ఆయనకు మిగిలిన దృష్టుల ప్రభావాన్ని వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉన్నది)