“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, అక్టోబర్ 2014, బుధవారం

తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-2

అన్నయ్యా.'జీవితంలో ఏది జరిగినా అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నీవేం బాధపడకు.' అని అమ్మ చెప్పింది కదా? అడిగాడు సుబ్బు.

'అవును.'

'మరి అదే నిజమైతే,ఆకలితో ఉన్నవాళ్ళకు అన్నం పెట్టాలన్న ఒక్కదానిమీద అమ్మ అంత శ్రద్ధ ఎందుకు పెట్టింది?వాడి ఆకలి వాడి ఖర్మ అని వదిలెయ్య వచ్సుకదా?తను చెప్పినదానికి ఇది విరుద్ధంగా లేదూ?' అడిగాడు.

'ఇదేనా నీ సందేహం? అడిగాను.

'అవును' అన్నాడు.

చెప్తా విను.మహనీయుల మాటలను అర్ధం చేసుకోవడం కష్టం.వారి భావాన్ని సరిగ్గా గ్రహించాలంటే కూడా కష్టమే.చాలామంది,మహనీయులనూ వారి అసలైన భావాలనూ సరిగ్గా అర్ధం చేసుకోలేరు.వారి మాటలను తమకర్ధమైన రీతిలో మాత్రమే వారు అర్ధం చేసుకుంటారు.అంటే వారు గ్రహించేది వారి మనస్సులు చెప్పే భాష్యాలను మాత్రమేగాని ఆ మహనీయులు చెప్పిన అసలైన విషయాన్ని కాదు.మెజారిటీ భక్తులకూ అనుచరులకూ ఇదే జరుగుతుంది.

ఇక్కడ రెండు విషయాలున్నాయి.జాగ్రత్తగా గమనించు.

ఒకటి-ఏం జరిగినా మన ఖర్మ అని ఊరుకోవడం ఒక విధానం.నీవు నిజంగా అలా ఊరుకోగలిగితే అంతకంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు.కాని అలా ఊరుకోలేం కదా.బలవంతాన మనం ఊరుకున్నా మనస్సు ఊరుకోదు.అది పోరుపెడుతూనే ఉంటుంది.

కనుక రెండవ విధానం ఏమంటే-నీ ప్రయత్నం నీవు చెయ్యి.కానీ ప్రయత్నం చేసినా కొన్ని కావు.అప్పుడు ఇక ఊరుకోక చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు.ఒక రోగం వచ్చిందనుకో.ఎంతమంది డాక్టర్లకు చూపించినా అది తగ్గడం లేదు.ఇక నీవు చేసేదేమున్నది?మన ఖర్మ అని ఊరుకోవడమే.జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు.కొన్నికొన్నైతే ఎంత ప్రయత్నించినా మనిష్టప్రకారం జరగవు.అలాంటప్పుడు పూర్వకర్మప్రభావం బలంగా ఉన్నదని గ్రహించాలి.

ప్రయత్నం చేసినంత మాత్రాన,అదెందుకు కాదు అని గింజుకోవడమూ, హైరానా పడిపోవడమూ,దానికోసం కుట్రలూ కుతంత్రాలూ చెయ్యడమూ, మోసాలు చెయ్యడమూ ఇలాంటి పనులు చెయ్యవద్దని అమ్మ చెప్పింది.మన ప్రయత్నం మనం తప్పకుండా చెయ్యాలి.ప్రయత్నం కూడా కర్మేకదా. పాతకర్మని కొత్తకర్మతో జయిస్తాం.కనుక ప్రయత్నం మానరాదు.ప్రయత్నం చేసినంత మాత్రాన విజయం రావాలని కూడా కోరుకోకూడదు.ఒకవేళ విజయం దక్కకపోయినా బాధపడకుండా ఉండాలి.

ఎందుకంటే -- 'అమ్మ ఏమన్నది? విజయం దేవుడిస్తుంటే అపజయం ఎవరిస్తున్నారూ? అన్నదా లేదా? మరి అపజయం కూడా వాడిస్తున్న వరమే అయినప్పుడు ఇంక బాధకు తావెక్కడున్నది?

పైగా ఇక్కడ ఇంకొక కోణం ఉన్నది.అమ్మ మనల్ని ఆచరించమని చెప్పిన విషయాలు మనకే వర్తిస్తాయి.ఆమెకు కూడా అవే వర్తిస్తాయనీ వర్తించాలనీ అనుకోవడం తప్పు.మన స్థాయి వేరు.అమ్మ స్థాయి వేరు.స్థాయీ భేదం ఉన్నది.కనుక మనకు చెప్పిన విషయాలు మనం చెయ్యాలి.అంతేగాని అమ్మ చర్యలను మనం తీర్పు తీర్చకూడదు.

పైగా,అసలు విషయం ఏమంటే,అమ్మ అన్నపూర్ణాదేవి అవతారమని నా నమ్మకం.అన్నం పెట్టడం అమ్మ సహజలక్షణం.కనుక తనకు సహజమైన పనిని తాను చేసింది.మనం చెయ్యవలసిన పనిని మనల్ని చెయ్యమన్నది. అది మనం చెయ్యకుండా 'నువ్వెందుకు అలా చేస్తున్నావు?' అని ఆమెనే ప్రశ్నించడం కరెక్ట్ కాదు.' అన్నాను.

'ఇంకో ప్రశ్న అడగనా?' అన్నాడు.

'ఊ.అడుగు'

'కాలాన్నీ కర్మనీ ఒకటిగా తీసుకోవచ్చా?అంటే ఈ రెండు పదాలనూ పర్యాయ పదాలుగా తీసుకోవచ్చా?' అడిగాడు.

'ఈ అనుమానం నీకెందుకు వచ్చింది?' అన్నాను.

డ్రైవింగ్ చేసున్న డా|| సాంబశివరావు జవాబు చెప్పాడు.

'అంటే-'దేనికైనా కాలం ఖర్మం కలిసి రావాలి' అంటారు కదా? అదేనా నీ ప్రశ్న?' అన్నాడాయన.

'అవును' అన్నాడు సుబ్బు.

'అవి రెండూ ఒకటి కావు.కాలం అనేది ఒక విశాలమైన framework.అందులో కర్మ అనేది జరుగుతుంది.కాలం అనేది ఒక రంగస్థలం అనుకుంటే కర్మ అనేది దానిమీద జరిగే నాటకం అనుకో.అలా అన్నమాట.కాలపరిపక్వతలో మన పూర్వకర్మ ఫలితానికి వస్తుంది.అందుకే ఆ మాట వచ్చింది' అన్నాను.

'అన్నయ్యా.అమ్మ చెప్పిన ఒక మాట ఈ మధ్యనే చదివాను.నాకు బాగా నచ్చింది.'అన్నాడు సుబ్బు.

'ఏంటది?' అడిగాను.

'సహనానికీ సహజ సహనానికీ తేడాను అమ్మ భలే చెప్పింది' అన్నాడు.

'ఏమని చెప్పింది?' అడిగాను నాకు తెలిసినా కూడా.

'ఏదైనా కష్టం వచ్చినప్పుడు బలవంతాన దానిని సహించడం సహనం.కానీ అసలది కష్టమనీ,దానిని నేను సహిస్తున్నానన్న భావనే మనస్సులో తలెత్తకుండా దానిని సహించడం సహజసహనం అని అమ్మ చెప్పింది' అన్నాడు.

'అవును.శ్రీ రామకృష్ణులు కూడా ఒక మాట అనేవారు.బెంగాలీ అక్షరమాలలో 'స' అనే అక్షరం మూడుసార్లు వస్తుంది.మనం 'శ',ష' 'స' అనే మూడింటినీ బెంగాలీలు 'స' అనే పలుకుతారు.దానిమీద శ్రీరామకృష్ణులు చమత్కరిస్తూ ఈ 'స' అనే అక్షరం సహనాన్ని సూచిస్తుందనీ,జీవితంలో సహనం యొక్క విలువను నొక్కి చెప్పడానికే అక్షరమాలలో ఆ అక్షరం మూడుసార్లు వస్తుందనీ ఆయననేవారు.శారదామాత జీవితం అనంతమైన సహనానికీ అతి స్వచ్చమైన ప్రేమకూ ప్రతిరూపం.అలాగే జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా. ఆమెకూడా సహనానికి ప్రతిరూపమే.తన జీవితంలో ఎన్ని బాధలను అమ్మ మౌనంగా సహజంగా సహించిందో మన ఊహకు అందదు.అమ్మ సహనదేవత.ఈ సంగతి ఆమె జీవితాన్ని చదివితే అర్ధమౌతుంది.వాళ్ళంతా మనలాంటి మనుషులు కాదు సుబ్బూ.దేవతలు.'- అన్నాను.

ఈ లోపల కారు ఉయ్యూరు దాటి మచిలీపట్నం వైపు పోతున్నది.కృష్ణాజిల్లా వాతావరణం మొదలైంది.నాకు కృష్ణా జిల్లా అంటే చాలా ఇష్టం.బహుశా అక్కడ చెట్లూ పచ్చటి పొలాలూ మంచి నీటివసతీ ఉండటం వల్ల అనుకుంటాను.నేను కృష్ణా జిల్లాకు వెళ్ళిన ప్రతిసారీ నాకు కోనసీమా కేరళా గుర్తొస్తాయి.

ఈలోపల మబ్బులు ముసురుకొచ్చి వాన మొదలైంది.వాతావరణం ఎంతో అద్భుతంగా మారిపోయింది.మాట్లాడుతున్న టాపిక్ మీద ఒక్కసారిగా నాకు ఇంటరెస్ట్ పూర్తిగా పోయింది.మూడ్ మారిపోయింది.అలాంటప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని నాకు అనిపించదు.మౌనంగా కారు కిటికీ లోనుంచి బయట ప్రకృతినీ వాననూ చూస్తూ ఉండిపోయాను.అలాంటి వాతావరణంలో గంటల తరబడి మౌనంగా అలా ఉండటం నాకలవాటే.

సుబ్బు నా పరిస్థితి గమనించాడల్లే ఉంది.అందుకే తనూ చాలాసేపు నన్ను కదిలించకుండా మౌనంగా ఉన్నాడు.కాలం భారంగా చాలాసేపు అలా గడిచింది.

కాసేపైన తర్వాత -' అన్నయ్యా.ఇంకో ప్రశ్న అడగనా?' అన్నాడు.

'ఊ' అన్నాను అంతరిక ప్రపంచంలోనుంచి తేరుకుంటూ.

'దుర్గాదేవీ నరసింహస్వామీ ఒక్కటే అని నా ఊహ.నీవేమంటావు' అడిగాడు.

'వాళ్ళు ఒక్కటి కాదు.వేర్వేరు.కానీ నీ ఆలోచనలో కూడా కొంత సత్యం ఉన్నది.దుర్గాదేవినే వైష్ణవీదుర్గ అనికూడా అంటారు.దుర్గా కాళీ మొదలైన దేవతలు తాంత్రిక దేవతలు.వాళ్ళు గ్రామదేవతలుగా ఊరూరా ప్రాచుర్యం పొందారు.మధ్యయుగంలో శైవం సామాన్యుల ఇళ్ళల్లో తిష్ట వేసుకుంది.వైష్ణవం కొంచం క్లాస్ మతం.తంత్రంలో శివశక్తులే మూలం.గ్రామాలలో వచ్చే సాంక్రామిక సమస్యలను నివారించే అమ్మతల్లులుగా,శక్తులుగా శైవతాంత్రిక దేవతలు బాగా ప్రాబల్యంలోకి వచ్చారు.దానికి సమానంగా వైష్ణవంలో ఏ దేవతా లేదు.విష్ణువూ,ఆయన అవతారాలైన రాముడూ కృష్ణుడూ సాత్విక దేవతలు.ఉగ్రదేవతల ఆరాధనలో సహజంగానే కొంత ఆకర్షణ ఉంటుంది. భయంలోకూడా మంచి ధ్రిల్ ఉంటుంది.భయపడుతూ కూడా హర్రర్ సినిమాలు చూస్తాం చూడు.అలాగన్నమాట.

సమాజంలో వ్యాపిస్తున్న తంత్రపుధాటినీ దుర్గా కాళీ వంటి ఉగ్రదేవతల ధాటినీ తట్టుకోవడానికి వైష్ణవంలో నరసింహస్వామిని బాగా పాపులర్ చేశారు. చీడపీడలను వదిలించే దేవతగా గ్రహబాధలను నివారించే దేవతగా ఆయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు.క్రమేణా శైవ తాంత్రికదేవతల ఆరాధన సమాజంలో తగ్గిపోయింది.ఎందుకంటే వాళ్ళు సహజంగానే భయం గొలిపే ఆకారంతో ఉంటారు.వారి దేవాలయ పరిసరాలు కూడా కొంచం భయం గొలిపేటట్లే ఉంటాయి.నరసింహస్వామి కూడా భయంకరుడే.కానీ ప్రహ్లాదునికి ఆయన సౌమ్యమూర్తే.పైగా డబ్బూ రాజుల ప్రాపకమూ ఉన్న వైష్ణవులు ఆయన్ను బాగా ప్రచారం లోకి తెచ్చారు.ఆ విధంగా ఆయన బాగా పాపులర్ అయ్యాడు.

నరసింహస్వామి యొక్క ధాటిని తట్టుకోవడానికి శైవంలో గండభేరుండం అనీ శరభసాళువం అనీ కొన్ని పోకడలు పుట్టుకొచ్చాయి.కాని అవి క్రమేణా కనుమరుగయ్యాయి.ఈ లోపల ముస్లిం దండయాత్రలు మొదలయ్యాయి. అంతటితో మనవాళ్ళ క్రియేటివిటీకి అడ్డుకట్ట పడింది.అదీ సంగతి.'- అన్నాను.

మాటల్లోనే మచిలీపట్నం వచ్చేసింది.ఆ ఊరు బ్రిటిష్ వారు కట్టినది కదా విశాలమైన ప్లానింగ్ తో చాలా బాగుంటుంది.అదొక స్లీపింగ్ టౌన్.కాకినాడా బాపట్లా కూడా ఇలాగే స్లీపింగ్ టౌన్స్.జనాభా తక్కువ ఉండి,విశాలంగా ఉండే ఊళ్లు నాకు బాగా నచ్చుతాయి.అలాంటిచోట్ల,వేరే మనుషులతో సంబంధం లేకుండా నెలల తరబడి నాలోకంలో నేను మౌనంగా ఉండగలను.

వాణీ హోటల్లో భోజనానికి కూచున్నాము.

భోజనం చేసే సమయంలోనే సుబ్రహ్మణ్యం 'అన్నయ్యా.డాక్టరు గారి జాతకం నీవు కూడా కొంచం చూడు.' అనడిగాడు.

అడగనిదే నేను ఎవరి జాతకాలూ నా అంతట నేను కల్పించుకుని చూడను. పదేపదే అడిగినా కూడా కొందరివి చూడను.ఇదంతా ఒక మార్మికలోకం.అలా నేను చెయ్యడానికి మార్మికమైన కారణాలుంటాయి.సరే,సుబ్బు అడిగాడు కదా అని ఆయన జననవివరాలు అడిగి నా ఫోన్ లో ఉన్న సాఫ్ట్ వేర్లో చూచాను.విషయాలు అర్ధమయ్యాయి.సోమశేఖర్ జాతకం నాకు తెలుసు.డాక్టర్ గారి జాతకం చూచాక ఆయన అంతదూరం నుంచి సోమశేఖర్ను వెదుక్కుంటూ ఎందుకు వచ్చాడో అర్ధమైంది.చూచాయగా కొన్ని విషయాలను అక్కడికక్కడే ఆయనకు చెప్పాను.ఈ లోపల ఆర్డర్ చేసిన భోజనం వచ్చింది.

భోజనం అయ్యాక గొడుగుపేటలో ఉన్న సోమశేఖర్ ఇంటికి వెతుక్కుంటూ చేరుకున్నాము.కుశలప్రశ్నలు అయ్యాక డాక్టర్ గారి జాతకవిశ్లేషణ మొదలైంది.

'మా గురువుగారి ఎదుట నేను మీ జాతకం చూచే సాహసం చేస్తున్నాను.' అని డాక్టర్ గారితో అంటూ సోమశేఖర్ నావైపు చూచాడు.

'దానిదేముంది?తన జాతకాన్ని నీకు చూపాలని ఆయనింత దూరం వచ్చాడు. చూడు.నేను పక్కనే ఉండి ఊరకే చూస్తుంటాను.అదీగాక ఆయన జాతకాన్ని ఒక్కసారి చూచావంటే మీకిద్దరికీ ఉన్న లింక్ ఏమిటో నీకు వెంటనే అర్ధమౌతుంది.' అన్నాను.

సోమశేఖర్ తన లాప్టాప్ లో డాక్టర్ గారి జాతకాన్ని వేసి చూచాడు.

'ఏముంది?నాకూ లగ్నంలో కేతువున్నాడు.డాక్టర్ గారికీ అంతే.అదేగా మా ఇద్దరి లింక్?' అన్నాడు నవ్వుతూ.

'అవును.వారిద్దరి మధ్యనా పంచమ శుభదృష్టిని కూడా గమనించు.'-వెంటనే దానిని పట్టేసినందుకు మెచ్చుకోలుగా అన్నాను.

సోమశేఖర్ తన స్టైల్లో విశ్లేషణ మొదలుపెట్టాడు.నేను కొంచం దూరంగా కూచుని కళ్ళు మూసుకుని మౌనంగా వింటున్నాను.

'మీ జాతకంలో కాలసర్పదోషం ఉన్నది.అందుకే మీ జాతక విశ్లేషణ కొంచం కష్టం.ఇప్పుడు మీరు నాదగ్గరికి వచ్చిన విషయం తెలుసుకోవడం కూడా కొంచం కష్టమే.' అన్నాడు సోమశేఖర్.

వింటున్న నేను కల్పించుకుని -'ఏమీ కష్టంలేదు సోమశేఖర్.ప్రస్తుతం ఏ దశ జరుగుతున్నదో చూడు.' అన్నాను.

'కేతువులో బుధుడు'- అన్నాడు.

'కాలసర్ప దోష కేతువు లగ్నంలో ఉన్నాడు.అంటే సప్తమంలో రాహువున్నట్లే కదా.ఇకపోతే బుధుడు కేంద్రాదిపత్య దోషి.చతుర్దంలో నీచలో ఉన్నాడు. అదీగాక అస్తంగతుడై ఉన్నాడు.లగ్నాదిపతితో కలసి ఉన్నాడు.ఆ బుధుడు సప్తమ దశమ భావాల అధిపతి.ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆయన నీ దగ్గరికి ఎందుకొచ్చాడో ఊహించు.' కళ్ళుమూసుకునే అన్నాను.

సోమశేఖర్ తెలివైనవాడు.వెంటనే ఆ పాయింట్స్ పట్టుకుని- 'మీరు ఫలానా విషయం అడగటానికి నా దగ్గరికి వచ్చారని'- కరెక్ట్ గా చెప్పేశాడు.

డాక్టర్ గారి ముఖం చూస్తే ఆయన ఇంప్రెస్ అయినట్లే అనిపించింది.

జాతక విశ్లేషణలో సోమశేఖర్ శైలి వేరు.ఇష్టకష్ట ఫలాలు,షడ్బలాలు,వింశోపక బలం,అష్టకవర్గు,అంశచక్రాల మీద గ్రహచారం ఇత్యాదులు చూచి సోమశేఖర్ విశ్లేషణ చేస్తాడు.

నా విధానం అదికాదు.

పరాశరవిధానం,జైమినిపద్ధతి,నాడీజ్యోతిష్యవిధానం,దశలు,గోచారం,ప్రశ్నవిధానం,చరస్థిరకారకత్వాలు,భావాద్భావం,శకునశాస్త్రం,శరీరలక్షణశాస్త్రం, జాతకుని హస్తరేఖలు,స్ఫురణ,నా అనుభవంలో నిగ్గుదేలిన కొన్ని రహస్య విధానాలు,తాంత్రిక జ్యోతిష్యసూత్రాలను కలగలిపి నేను ఉపయోగిస్తాను.ఇది నా వ్యక్తిగత విధానం.అనేక సంవత్సరాల నిరంతర పరిశోధన మీదట నేను ఈ స్టైల్ ను తయారు చేసుకోగలిగాను.

కొద్దిసేపు డాక్టర్ గారి జాతకాన్ని సోమశేఖర్ వివరించాడు.నేను కొంచం దూరంగా కూచుని కళ్ళుమూసుకుని మౌనంగా వింటున్నాను.ఇక మనం రంగంలోకి దిగక తప్పదనిపించింది.అప్పుడు నేను కల్పించుకుని,ఆయన జాతకంవైపు చూడకుండానే,ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలనూ వాటి సంవత్సరాలనూ చెప్పాను.అవి నిజమే అని ఆయన ఒప్పుకున్నాడు.కొన్నింటిని ఆయన మర్చిపోయి ఆ సంవత్సరాలలో ఏమీ జరగలేదని అన్నాడు.కొద్దిసేపటి తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుని 'అవును.జరిగాయి' అని అన్నాడు.

చివరిగా ఒక్క విషయాన్ని చెప్పాను.

'మీ మేనమామ గారిది కూడా మీ జాతకం వంటిదే.మీరు పడిన బాధలు ఆయనకూడా పడ్డాడు.ఈ చార మీ మేనమామగారి దగ్గరనుంచే మీకొచ్చింది.' అని చెప్పాను.


'అవును మా మేనమామ కూడా ఇవే బాధలు పడ్డాడు.ఆయన పడిన బాధల ముందు నా బాధలు తక్కువే' అన్నాడాయన ఆశ్చర్యంగా.

కళ్ళుమూసుకుని,ఆయన జాతకం చూడకుండానే ఇదంతా చెప్పాను.నా విశ్లేషణలో నేను కొన్నిలోతుల్లోకి వెళతాను.పూర్వజన్మలు,అప్పుడు చేసుకున్న ఖర్మలు,వంశపారంపర్యంగా కొన్ని కొన్ని కుటుంబాలలో వెంటాడే శాపాలు,దోషాలు వీటిని నేను చూస్తాను.అంటే ప్రస్తుత సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయో నేను గమనిస్తాను.అప్పుడే వాటిని ఎలా పరిష్కరించాలో మనకు తెలుస్తుంది.గతం మీదే వర్తమానమూ భవిష్యత్తూ కూడా నిర్మితమై ఉంటాయి.

ఒక జాతకాన్ని మనం చూచినప్పుడు,ఆ జాతకుని జీవితమేగాక,అతని తల్లిదండ్రులూ,దగ్గరి బంధువులూ వాళ్ళ జీవితాలూ కూడా మనకు తెలుస్తాయి.

ఈ లోపల ఆయనేదో పర్సనల్ గా సోమశేఖర్ తో మాట్లాడేలా అనిపించాడు. అందుకని నేనూ సుబ్బూ శ్రీనివాసరావూ బయటకు వెళ్లి అరుగుమీద కూచున్నాము.కాసేపట్లో జాతక విశ్లేషణ అయిపోయింది.అందరం కలసి సునీల్ ఆర్కేష్ట్రా ఎక్కడుందో వెదుకుతూ బయల్దేరాము.

'ఇంగ్లీష్ చర్చ్' ఏరియాలో సునీల్ గారుండే ఇల్లు దొరికింది.కాసేపు మాటలయ్యాక మాకు కావలసిన ఒక ఏభై పాత తెలుగుపాటల ట్రాక్స్ తీసుకుని గుంటూరుకు బయల్దేరాము.ఆయన దగ్గర తెలుగు హిందీ అన్నీ కలిపి మూడు వేల పైగానే పాటల ట్రాక్స్ ఉన్నాయి.ఒక మనిషి అంత సంగీతసేవ చెయ్యాలంటే అతని జాతకంలో శుక్రబుధుల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. సరస్వతీ కటాక్షం అలాంటివాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది.దానికి మనమనుకునే కులంతోనూ మతంతోనూ సంబంధం ఉండదు.


అక్కడ ఉన్న కాసేపట్లో సునీల్ గారి శరీర నిర్మాణాన్ని బట్టి,ఆయన మాట్లాడే తీరును బట్టి ఆయన జాతకం నాకర్ధమైపోయింది.

ట్రాక్స్ తీసుకుని గుంటూరుకు బయల్దేరాము.