నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

14, ఆగస్టు 2014, గురువారం

అశ్వత్థామ -- పరశురామ దర్శనం

ఆ ఘట్టం అలా ముగిసింది.

శాపగ్రస్తుడైన అశ్వత్థామను అక్కడే వదలి పాండవులూ కృష్ణుడూ వెళ్ళిపోయారు.

మహోగ్రమైన కృష్ణశాపానికి గురియై అశ్వత్థామ నిలువునా కృంగిపోయాడు. శాపప్రభావంతో అతని శరీరంలోని దెబ్బలనుంచి తత్క్షణమే చీమూ నెత్తురూ కారడం ప్రారంభించింది.ఈగలూ దోమలూ రకరకాల పురుగులూ అతన్ని చుట్టుముట్టి తెనేతుట్టెలా అతని దేహాన్ని ఆక్రమించి కుట్టడం మొదలు పెట్టాయి.ఎంతగా తోలినా అవి వదల పోవడం లేదు.

అశ్వత్థామకు అమితమైన బాధ కలిగింది.

అతన్ని రక్షించబూనుకున్న వ్యాసమునీంద్రునికి అది ఒక పెద్ద బాధ్యత అయిపోయింది.అతన్ని ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి నిరంతరమూ కొందరు మునిబాలురను అతనికి సేవకోసం నియమించవలసి వచ్చింది.

వారు కూడా అతని దరిదాపుల్లోకి వెళ్ళలేకపోతున్నారు.చీమూ నెత్తురూ కలసి కారుతున్న భయంకరమైన దుర్వాసనతో అతనున్న కుటీరమంతా నిండి చుట్టుపక్కలవారు కూడా నిలవలేనంత అసహ్యంగా తయారైంది. అతన్ని సంరక్షించడం వ్యాసమహర్షికి రోజురోజుకూ ఇబ్బంది కాసాగింది. ఆయన దైనందిన వ్యాపకాలకు అశ్వత్థామ ఒక అడ్డంకిగా మారసాగాడు.

దానికి తోడుగా రోజుకొక వ్యాధి అతని శరీరంలో కనిపిస్తూ ప్రతిరోజూ ఒక కొత్త రకమైన బాధను అతని శరీరంలో కలుగజేయడం మొదలుపెట్టింది. ఒకరోజున్న బాధ ఇంకోరోజు ఉండేది కాదు.ఎన్ని ఔషధాలు వాడినా ఎన్ని మూలికలు ఉపయోగించినా ఆ బాధలు తగ్గేవి కావు.రాత్రులలో నిద్రపట్టేది కాదు.శరీరంలో వస్తున్న మంటలు నొప్పులూ తట్టుకోలేక రాత్రంతా పెద్దగా అరుస్తూ ఉండేవాడు.

దానితో మున్యాశ్రమం అంతా చాలా ఇబ్బందికరంగా మారింది.అక్కడి ఋషుల నిత్యానుష్టానాలకూ సాధనలకూ ఈయనవల్ల ఎంతో ఆటంకం కలుగసాగింది.ఇక తాను ఎంతమాత్రమూ అక్కడ ఉండటం భావ్యం కాదన్న విషయం ఆయనకు అర్ధమైంది.

అతను వ్యాసాశ్రమంలో ఉండలేకపోయాడు.ఆ విషయాన్ని వ్యాసమహర్షికి విన్నవించాడు.

'మహాత్మా! మీరు ఎంతో కరుణతో నన్నిక్కడ ఉంచుకున్నారు.కానీ నా పరిస్థితి చూచారు కదా.రోజురోజుకూ నా శరీరం భయంకరమైన రోగాల పుట్టగా మారిపోతున్నది.ఈ గాయాలు మానడం లేదు.నా శరీరం నుంచి వస్తున్న దుర్వాసనకు పరిచారకులు నా సమీపానికే రాలేకపోతున్నారు.మీ అందరికీ కూడా నా వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది.కనుక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను.ఉండటం భావ్యం కూడా కాదు.ఇక్కడ ఉండి, నా శాపంలో మిమ్ములను కూడా భాగస్వాములను చెయ్యలేను.అది ధర్మం కాదు.కనుక నా దారిన నేను వెళ్ళిపోతాను.' అన్నాడు అశ్వత్థామ.

వ్యాసమహర్షి అందుకు ఒప్పుకోలేదు

'ఈ స్థితిలో ఎక్కడకు వెళతావు నాయనా?' కరుణాపూరితములైన చూపులతో చూస్తూ ప్రశ్నించాడు వ్యాసమహర్షి.

'మహాత్మా! నాకు ఇల్లంటూ ఎక్కడున్నది?నేను ప్రస్తుతం దిక్కులేని వాడిని. ఒక అనాధను.శాపగ్రస్తుడను.నాకంటూ ఎవరూ లేరు.మనుష్యులు ఎవ్వరూ నన్ను దగ్గరకు రానివ్వరు.కనీసం మరణం కూడా నన్ను కనికరించదు.నా వరమే నా శాపంగా మారింది.

ఇక రాబోయే మూడువేల ఏండ్ల వరకూ నాకు నిష్కృతి లేదు.ఏదో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోతాను.ఒంటరిగా ఏదో ఒక అరణ్యమధ్యంలో ఉంటూ కాలం వెళ్ళదీస్తాను.నా పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తాను.' అన్నాడు అశ్వత్థామ.

అతని స్థితికి ఎంతో బాధపడ్డాడు వ్యాసమునీంద్రుడు.

'వద్దు నాయనా.నీకు తగిలిన శాపం భయానకమైనదే.కాని నిన్ను ప్రస్తుతం ఒంటరిగా వదలడమూ సమంజసం కాదు.నీకు ఒక ఉపాయం చెబుతాను విను.

కృష్ణుడు భగవంతుని అవతారం.ఈ విషయం మనలో ఎవరికీ తెలియదు.కనీసం ఆయన దగ్గర బంధువులకు కూడా ఈ విషయం తెలియదు.ఆయన శాపం అమోఘం.అయినప్పటికీ కృష్ణశాపానికి ఒక్కటే విరుగుడు ఉన్నది.దానికి విరుగుడు చెయ్యాలంటే అలాంటి ఇంకొక భగవద్ అవతారమూర్తియే చెయ్యగలడు.నాకంతటి శక్తి లేదు.' అన్నాడు వ్యాసుడు.

'మీరే కాదంటే ఇంక మీ అంతటి మహనీయుడు ఈ లోకంలో ఇంకెవ్వరున్నారు మహాత్మా! అంటే నాకు నరకమే గతి అన్నమాట!' విలపిస్తూ బదులిచ్చాడు అశ్వత్థామ.

'లేదు నాయనా! రోదించకు.ఈ ప్రపంచం మొత్తమ్మీద నిన్ను కాపాడగలిగేవాడు ఒకేఒక్క మహోన్నతుడున్నాడు.ఆయన కూడా విష్ణు అంశసంభూతుడే.అంతేకాదు ఆయన నీకు పరమగురువు కూడాను.ఆయనే పరశురాముడు.' అన్నాడు వ్యాసమహర్షి.

అశ్వత్థామ ముఖంలో వెలుగు కనిపించింది.

కానీ అంతలోనే ఆయనను నిరాశ ఆవహించింది.

'మహర్షీ! ఇది జరిగే పనియేనా? ఆయన నన్ను కరుణిస్తాడా? నాకధ అంతా తెలిస్తే ఆయన దగ్గరకే నన్ను రానివ్వడు.నేను చేసిన పని ఆయనకు చెబితే కోపంతో ఇంకేదో శాపం ఇచ్చినా ఇస్తాడు.ఇది జరిగే పని కాదు' అన్నాడు నిరాశగా.


'నిరాశ చెందకు నాయనా! భార్గవరాముడు పరమ దయామయుడు.ఆయన హృదయం వెన్న.తండ్రి ఆజ్ఞానుసారం తన తల్లినే వధించి తిరిగి వరంగా ఆ తల్లినే బ్రతికించుకున్న ఘనుడాయన.తండ్రిని క్షత్రియులు వధించినప్పుడు తన తల్లి పడిన బాధ చూడలేక,ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుడనేవాడు లేకుండా అందరినీ ఒక్కడే సంహరించిన మహోగ్రమూర్తి గానూ మహత్తర దివ్యాస్త్రశక్తి సంపన్నునిగానూ మాత్రమే ఆయన గురించి లోకానికి తెలుసు.కానీ ఆయన హృదయం లోకానికి తెలియదు.

విను నాయనా!ఋషి హృదయాన్ని ఇంకొక్క ఋషి మాత్రమే గ్రహించగలడు. సంసార లంపటులైన సామాన్యులు దానిని గ్రహించలేరు.మీరిద్దరూ దాదాపుగా ఒకే పనిని చేశారు.ఆయనా ఎంతో క్షత్రియరక్తాన్ని చిందించాడు. నీవూ అదే చేశావు.మీరిద్దరూ భూభారాన్ని తగ్గించి అధర్మాన్ని అంతమొందించదానికి అవతరించినవారు.ఆయనకా సంగతి తెలుసు.నీకు తెలియదు.

పైగా ఆయనలాగే నీవూ శివభక్తుడవు.ఆయన సాక్షాత్తూ పరమశివుని శిష్యుడు. ఆయన శస్త్రాస్త్రవిద్యలన్నీ ఆ పరమేశ్వరుని వద్దనే గ్రహించాడు.నీవో పరమేశ్వరుని వరంతో పుట్టినవాడవు.పుట్టుకతోనే ఆయనవలె నొసట మూడవకన్ను వంటి మణిని కలిగినవాడవు.

పైగా ఆయన తన ఆయుధాలన్నింటినీ నీ తండ్రి అయిన ద్రోణాచార్యునికి ఇచ్చాడు.మహత్తర అస్త్రవిద్యలను ఆయనవద్దనే మీ తండ్రి నేర్చుకున్నాడు. మీ తండ్రి అంటే ఆయనకు అత్యంత వాత్సల్యం.నీవాయన పరమశిష్యుడవు. శిష్యుని బిడ్డ తన బిడ్డ వంటివాడే.కనుక నిన్ను తప్పక ఆదరిస్తాడు.నా మాట విను.కారడవుల లోనికి వెళ్ళకు.

ఈ భూమండలాన్ని సమస్తాన్నీ జయించి,దానిని తృణప్రాయంగా దానం చేసివేసిన ఆ మహనీయుడు ప్రస్తుతం మహేంద్రగిరిమీద తపస్సులో ఉన్నాడు.

ఆయన వద్దకు వెళ్ళు.ఆయన పాదాలను పట్టుకో.వదలకు.నీ కధను ఆసాంతం ఆయనకు వినిపించు.

ఆయన సామాన్యుడు కాదు.భగవంతుడైన విష్ణువే ఆయనరూపంలో ఉన్నాడు.అంతేకాదు ఆయనకూడా మనవలెనే చిరంజీవి.సామాన్య ఋషులు నీకు సహాయం చెయ్యలేరు నాయనా! పరశురాముని వంటి అవతారపురుషుని శరణు నీవు పొందినావంటే అప్పుడు మాత్రమే కృష్ణశాపాన్నించి నీవు తప్పించుకోగలవు.ప్రస్తుతం నీకు వేరే మార్గం లేదు.' అని మెల్లగా బోధించాడు వ్యాసమహర్షి.

వ్యాసమహర్షి ఆజ్ఞను తలదాల్చి అశ్వత్థామ బయలుదేరాడు.

తోడుగా వస్తానని బయలుదేరిన కృపాచార్యుని వలదని వారించాడు.తన కర్మను తానే ప్రక్షాళనం చేసుకుంటానని చెప్పి వారిని వారించి,ఒక్కడే మహేంద్రపర్వతపు దిక్కుగా బయలుదేరినాడు.

దారిలోని జనపదాలలో ఎక్కడా ఎవరూ ఆయనకు సహాయం చేసేవారు కారు. తినడానికి తిండీ నీరూ కూడా ఇచ్చేవారు కారు.ఆయన్ను చూస్తూనే భయంకరమైన రాక్షసుడిని చూచినట్లుగా భయంతో దూరంగా పారిపోయేవారు.

అందుకని ఊళ్లలో ప్రవేశించకుండా పొలిమేరల్లోనే ప్రయాణిస్తూ దారిలో దొరికిన దుంపలూ కాయలూ ఆకులూ తింటూ,సెలయేళ్ళలో నీరు త్రాగుతూ ప్రయాణం సాగించాడు.

కొన్ని రోజుల అతికష్టమైన ప్రయాణం తర్వాత మహేంద్రగిరివద్దకు చేరుకున్నాడు.ఆ పర్వతాన్ని చూస్తూనే ఆయనకు కళ్ళు గిర్రున తిరిగి పోయాయి.అది మేఘాలను అంటుతూ కనిపిస్తున్నది.ఇంతకు ముందు అయితే దానిని అధిరోహించడం తనకు ఒక లెక్క కాదు.కానీ ప్రస్తుతస్థితిలో, రోగభూయిష్టమైన ఈ దేహంతో, ఇంతదూరం రావడమే అతికష్టం అయింది. ఇక ఆ పర్వతాన్ని ఇప్పుడు ఎలా ఎక్కాలా? అని ఒక్కక్షణం ఆలోచించాడు.

'ఏది ఏమైనా కానీ' తాను తన పరమగురువైన పరశురాముని దర్శించాలి. ఎందుకంటే ఆయన తప్ప ఈ ప్రపంచంలో తనను రక్షించే నాధుడు లేడు.తనకు చావెలాగూ రాదు.బాధపడటం తనకు ఎలాగూ నిత్యకృత్యం అయిపోయింది.ఇక్కడవరకూ వచ్చి ఇలా సంశయించడం తగదని తనకు తాను నచ్చచెప్పుకున్నాడు.

అతికష్టం మీద ఆ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాడు. 

భగవంతుడు తనను పరీక్షిస్తున్నాడా అన్నట్లు అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ పర్వతపు రాళ్ళు కోసుకుని అడుగడుగుకూ పాదాలు తెగడం మొదలు పెట్టినాయి.రక్తపు పాదముద్రలు ఆ రాళ్ళమీద పడటం మొదలైనాయి.

వాటిని చూచాడు అశ్వత్థామ.

'అవును.నేను ఎంతో రక్తం చిందించాను.ఎందరినో వధించాను.ఇప్పుడు దానికి ప్రతిగా నా రక్తాన్ని భూమాత స్వీకరిస్తున్నది.ఇదీ మంచిదే.ఈ శకునం నాకు ఇంకా ఆనందాన్ని కలిగిస్తున్నది.నా ఆశ నెరవేరేటట్లు కనిపిస్తున్నది.మహోన్నతుడైన దివ్యపురుషుడు పరశురాముని దర్శనం నాకు తప్పక కలుగుతుంది.ఆయన నన్ను కరుణిస్తాడు.' ఇలా భావించుకుంటూ పర్వతం సగం దూరం ఎక్కాడు అశ్వత్థామ.

సగం పర్వతాన్ని ఎక్కగానే ఇన్నాళ్ళ ప్రయాణపు నిస్సత్తువతో కళ్ళు తిరిగి పడిపోయాడు.చాలాసేపటి తర్వాత ఆయనకు మెలకువ వచ్చింది.పర్వతం సగం మాత్రమే ఎక్కి ఉన్నట్లు గ్రహించాడు.అక్కడనుంచి లేచి నడిచే శక్తి కూడా అతనికి లేదు.

పర్వత పైభాగానికి తన చేతులతో పాకడం మొదలుపెట్టాడు.

కాసేపటికి ఆ చేతులను కూడా బండలు కోసివెయ్యడం ప్రారంభించాయి. అయినా అశ్వత్థామ వెనుదిరగలేదు.రక్తమోడుతున్న చేతులతో అలాగే మొండిగా పాకుతూ పర్వతశిఖరానికి చేరుకున్నాడు.ఆ పర్వతమంతా అతని కాళ్ళూ చేతుల రక్తపు ముద్రలు పడ్డాయి.నీరసం ఆవహించగా అక్కడ సమతలమైన ప్రదేశంలో ఎంతసేపు అలా తెలివికోల్పోయి పడి ఉన్నాడో ఆయనకే తెలియదు.

మెలకువ వచ్చేసరికి చీకటి పడిపోయింది.అరణ్యంలో అడవి జంతువుల అరుపులు మొదలయ్యాయి.భయంకరమైన చలి వెయ్యడం ప్రారంభించింది.ఆ చలికి ఆయన శరీరంలో ఉన్న గాయాలన్నీ సలపడం మొదలు పెట్టసాగాయి.ఆహారం ఇచ్చేవారు లేరు.దాహంతో గొంతు ఎండిపోతున్నది. మంచినీరు ఇచ్చేవారు కూడా లేరు.

దానికి తోడు,అడవిదోమలు గుంపులు గుంపులుగా వచ్చి అతనిదేహాన్ని ఆక్రమించి రక్తాన్ని పీలుస్తూ కుట్టసాగాయి.వాటిని తోలుకునే శక్తికూడా ఆయనకు లేదు.

ఆ నిర్జనప్రదేశంలో అరణ్యమధ్యంలో అంత ఎత్తైన పర్వతశిఖరం మీద విపరీతమైన చలిలో ఆకలిదప్పులతో బాధపడుతూ ఒక్కడే రాత్రంతా గడిపాడు అశ్వత్థామ. సగం తెలివిలోనూ సగం తెలివిలేని పరిస్థితిలోనూ రాత్రంతా గడచింది.ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో ఆ రాత్రి ఆయన రుచి చూచాడు.

తెల్లవారింది.

అతికష్టం మీద లేచి అక్కడ అంతా వెదకడం ప్రారంభించాడు అశ్వత్థామ.

కానీ ఎక్కడా పరశురామ మహర్షి దర్శనం కావడం లేదు.అసలు ఆ పర్వతం మీద ఎవరూ ఉన్న చాయలే కనపడటం లేదు.

రోజంతా వెదికాడు.కానీ ఆయనకు ఎక్కడా పరశురామ మహర్షి దర్శనం కాలేదు.

చూస్తూ ఉండగానే సూర్యభగవానుడు అస్తాద్రిని చేరి అంతర్హితుడు కావడం ప్రారంభించాడు.మళ్ళీ చీకటి పడింది.

క్రిందటి రాత్రి పడిన నరకయాతన మళ్ళీ మొదలైంది.

ఆ విధంగా మూడు పగళ్ళూ మూడు రాత్రులూ ఆ పర్వతంమీద ఒంటరిగా నిరాహారంగా ఉండి వెదకడం సాగించాడు.అయినా ఆయన కోరిక నెరవేరలేదు.భగవంతుడైన పరశురాముని దర్శనం కాలేదు.

నాలుగో రోజు ఉదయం తెల్లవారింది.

ఆయనకు విషయం అర్ధమైపోయింది.

భగవంతుని అవతారం అయిన కృష్ణుడు తనను శపించాడు.ఇంకొక అవతారం అయిన పరశురాముడు తనను ఎందుకు కరుణిస్తాడు? అది అసంభవం.అందుకే ఆయన అక్కడే ఉండి కూడా తనను అదృశ్య రూపంలో పరీక్షిస్తున్నాడు.ఈ విధంగా పని జరగదు.ఆయన దర్శనం తనకు కాదు.

ఈ పరిస్థితిలో ఈ పర్వతాన్ని దిగడం తనకు సాధ్యం కాదు.అంత శక్తి తనకు లేదు.కనుక ఇక్కడనుంచి దూకడమే శరణ్యం అన్న నిశ్చయానికి వచ్చాడు.

పాకుతూ ఒక కొండకొమ్ముకు చేరుకున్నాడు.ఆయన పాకిన దారి అంతా చీమూ నెత్తురూ ఆయనవెంట ధార కట్టింది.ఆ కొండకొమ్ముకు చేరి కొంతసేపు సేదదీరాడు.మెల్లిగా అక్కడ కూచుని కాసేపు క్రింద దూరంగా కనిపిస్తున్న భూమిని చూస్తూ ఉండిపోయాడు.గతం అంతా ఆయన కళ్ళముందు గిర్రున తిరిగింది.

తాను చిన్నపిల్లవానిగా ఉన్నప్పటి నుంచి జరిగిన దృశ్యాలు ఆయనకు గుర్తొచ్చాయి.ఎవరికైనా కూడా మరణానికి ముందు అలాగే అవుతుందని అంటారు.

పాలకోసం తాను ఏడుస్తుంటే,చూడలేక,ఆవులను యాచించడానికి నిరుపేద యైన తన తండ్రి ద్రోణుడు ఒకప్పటి తన సహాధ్యాయి అయిన ద్రుపద మహారాజు వద్దకు పోవడమూ,ఆ రాజు గర్వంతో హీనంగా చూచి ఈసడించుకోవడమూ,ఒక ఆవును కూడా సంపాదించలేని తన హీన దుస్థితికి కుమిలిపోతూ తన తండ్రి ఏడుస్తూ ఇంటికి తిరిగి రావడమూ,ఆ తర్వాత తమ మేనమామ కృపాచార్యుడు తాము పడుతున్న బాధలు చూడలేక తాను తప్పుకొని తన స్థానంలో ద్రోణుని నియమించమని భీష్ముని వేడుకోనడమూ దానికి ఆయన అంగీకరించడమూ వెంటవెంటనే ఆయన కనులముందు కదిలాయి.

అక్కడనుంచి రాజాశ్రయంతో మారిన తమ జీవితాలూ,తమపైన సుయోధనుడు చూపిన ఔదార్యమూ,ఆ తర్వాతి సంఘటనలూ,కురుక్షేత్ర యుద్ధమూ,మిత్రధర్మం కోసం తాను రుద్రావేశ పూరితుడై చేసిన విలయమూ రక్తతర్పణమూ తత్ఫలితంగా పొందిన భయంకర శాపమూ అన్నీ ఆయన స్మృతిపధంలో వరుసగా మెదిలాయి.

ఇంత జీవితాన్ని చూచాడు.ఇన్ని శక్తులు సంపాదించాడు.మహనీయుడైన ద్రోణుని పుత్రుడు తాను.చివరకు ఈ నిస్సహాయ స్థితిలో ఒక పర్వతం మీద నుంచి దూకబోతున్నాడు.ఏమిటి ఈ జీవితం? ఏమిటి ఈ కాలప్రభావం?ఈ యుద్ధం వల్ల తాము సాధించినది ఏమిటి?

అశ్వత్థామకు ఆ క్షణంలో ప్రపంచం మీద పూర్తిగా విరక్తి కలిగింది.

మెల్లిగా లేచి నిలబడ్డాడు.క్రిందకు చూచాడు.భూమాత ఆహ్వానిస్తున్నది.

తాను చిరంజీవినన్న విషయం ఆ క్షణంలో ఆయన మరచిపోయాడు.

కళ్ళుమూసుకుని తన తండ్రీ గురువూ అయిన ద్రోణాచార్యుని స్మరించాడు.తన తల్లిని స్మరించాడు.తనకు పరమ గురువైన పరశురాముని స్మరించాడు.

'ప్రభూ! అవతారపురుషా!భార్గవరామా!ఇప్పుడు ప్రపంచంలో నాకు నీవు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు.సద్బ్రాహ్మణ ఋషివంశంలో జన్మించినప్పటికీ విధివశాత్తూ నిస్సహాయుడను.దౌర్భాగ్యుడను అయ్యాను.క్షత్రియధర్మాన్ని పాటించి ఎన్నో ఘోరాలు చేశాను.ఎందఱో అమాయకుల రక్తాన్ని ఈ భూమిపైన చిందించాను.తత్ఫలితంగా ఘోరమైన కర్మను శాపం రూపంలో తలకెత్తుకున్నాను.దుర్భరమైన అవస్థను అనుభవిస్తున్నాను.

నీ పవిత్రపాదాల మీద పడి నా పాపాన్ని కడుక్కోవాలన్న ఆశతో ఇంతదూరం కొనప్రాణంతో నా ఈ దేహాన్ని ఈడ్చుకుంటూ వచ్చాను.కానీ నీవూ నన్ను కరుణించడం లేదు.

మూడుపగళ్ళు మూడురాత్రులు నిన్ను ప్రార్ధిస్తూ నిరాహారినై ఈ పర్వతం మీద ఉన్నాను.నీ దయ రాలేదు.నీ పరమశిష్యుడను నీవే కరుణించకపోతే ఇంకా నేను బ్రతికి ఉండి ఏమి లాభం? ఈ జీవితం నిరర్ధకం.ఈ దేహాన్ని ఇంతటితో చాలిస్తున్నాను.మరుజన్మలో నైనా నీ దర్శనం కలిగే వరాన్ని నాకు ప్రసాదించు మహానుభావా.' అని పరశురాముని స్మరిస్తూ శరీరంలోని శక్తిని అంతటినీ కూడగట్టుకుని అమాంతం ఆ కొండకొమ్ము మీద నుంచి క్రిందకు దూకబోయాడు.

'ఆగు నాయనా! అంతపని చెయ్యకు. ఆగు!!' అన్న మేఘగంభీర స్వరం వెనుక నుంచి వినవచ్చింది.

దూకబోతున్న అశ్వత్థామ ఆ స్వరం విని అక్కడే బిగుసుకు పోయాడు.అతని కాళ్ళు నేలకు అంటుకుపోయి అతని ప్రయత్నాన్ని వ్యర్ధం గావించాయి.


వెనక్కు తిరిగిన అశ్వత్థామకు మహాతేజస్వీ,మహా మహిమాన్వితుడూ,ధీర గంభీర స్వభావుడూ, సమస్త వేదసారమునూ తంత్రసారమునూ ఆమూలాగ్రమూ తెలిసిన వాడూ,శ్రీవిద్యాతంత్రపు రహస్యజ్ఞానమును తన చేత పరశువుగా ధరించినవాడూ, దివ్యశస్త్రాస్త్ర జ్ఞాననిధీ, స్ఫురద్రూపీ, పరమ దయాళువూ,భృగువంశ దీపకుడూ,ఆద్యాశక్తియొక్క మనుష్యావతారమైన రేణుకామాత ముద్దుల తనయుడూ అయిన పరశురాముడు తనవెనుకే కొద్దిదూరంలో నిలబడి కోటిసూర్యుల తేజస్సుతో వెలుగుతూ దర్శన మిచ్చాడు.

ఆయనను చూస్తూనే అప్పటివరకూ తాను పడిన కష్టం అంతా శరీరంలో నుంచి తీసివేసినట్లుగా మాయం అయ్యింది అశ్వత్థామకు.ఆయన దేహం పడుతున్న బాధలనుంచి తత్క్షణమే ఆయనకు విముక్తి లభించింది.ఆకలి దప్పులు మాయమయ్యాయి.ఏదో తెలియని శక్తితో శరీరమంతా నిండగా అది భార్గవరాముని దర్శన కటాక్షఫలమని అర్ధం చేసుకున్నాడు.

ఒక్క గంతులో ఆయనను చేరి ఆయన పాదాలమీద వాలిపోయాడు.

కన్నీళ్ళతో ఆయన పాదాలను కడుగుతూ --

'యన్నామ గ్రహణాన్ జంతు: ప్రాప్నుయాత్ర భవాపదం
యస్య పాదార్చనాత్ సిద్ధి: స్వోప్సితం నౌమి భార్గవమ్

నిస్పృహోయ సదా దేవో భూమ్యాం వసతి మాధవ:
ఆత్మబోధోదధిం స్వచ్ఛమ్ యోగినమ్ నౌమి భార్గవమ్

యస్మాదేతద్ జగత్సర్వం జాయతే యాత్ర లీలయా
స్థితిం ప్రాప్నోతి దేవేశమ్ జామదగ్న్యం నమామ్యహమ్

యస్య భ్రూభంగ మాత్రేణ బ్రహ్మాద్యా: సకలా: సురా:
శతవారం భవంత్యత్ర భవంతి నభవంతి చ

తపోగ్రం చచారాదౌ యముద్ధిస్య చ రేణుకా
ఆద్యాశక్తిర్మహాదేవీ రామం తం ప్రణమామ్యహమ్

హరి: పరశుధారీచ రామశ్చ భృగునందన:
ఏకవీరాత్మజో విష్ణుర్ జామదగ్న్య: ప్రతాపవాన్
సహ్యాద్రివాసీ వీరశ్చ క్షత్రజిత్ పృధివీపతి:"

అని పరశురామస్తోత్రాన్ని గద్గదకంఠంతో చదువుతూ ఏడుస్తూ ఆయన పాదాలను వదలకుండా నిశ్చలంగా ఉండిపోయాడు.

(ఇంకా ఉన్నది)