“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, జులై 2014, శనివారం

లెవల్ క్రాసింగ్ గేట్ల ప్రమాదాలకు బాధ్యత రైల్వే శాఖదా? వాహన డ్రైవర్లదా?

UMLCG (unmanned level crossing gates) వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇవి ఇప్పటివి కావు.ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతూనే ఉన్నాయి.నేను గత 15 ఏళ్ళుగా వీటిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. ఎన్నో యాక్సిడెంట్ స్పాట్స్ ను నేను ప్రత్యక్షంగా చూచాను.అక్కడ ఏమి జరిగిందో గమనించే అవకాశం నాకు కలిగింది.ఆ పరిశీలన నుంచి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను.

ప్రమాదం జరిగిన ప్రతిసారీ పత్రికలు తప్పు ప్రచారం చేస్తున్నాయి.రైల్వేశాఖ నిర్లక్ష్యం అంటూ పెద్దపెద్ద టైటిల్స్ పెట్టి అదే నిజం అని జనాన్ని నమ్మిస్తున్నాయి.

ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం.

"రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్" అనేదానిని మన మీడియా నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నేను రైల్వేశాఖలో ఉన్నందువల్ల దానిని సమర్ధించడం లేదు.ఒక పౌరుడిగానూ ఒక ఉద్యోగి గానూ ఈ ప్రమాదాలను రెండు కోణాలనుంచీ స్పష్టంగా పరిశీలించే అవకాశం నాకు ఉన్నది.ఆ పరిశీలన నుంచి కొన్ని విషయాలు చెబుతున్నాను.

ఇటువంటి ప్రమాదాలు జరగడానికి కారణాలయ్యే కొన్ని విషయాలను ఇప్పుడు చెప్తాను.నేను చెబుతున్నవి ఊహించి వ్రాస్తున్నవి కావు.

ప్రతి కేసునూ నా అనుభవంలో చూచి వ్రాస్తున్నానని మర్చిపోకండి.

అనవసరమైన తొందర

మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఒక విచిత్రాన్ని గమనించవచ్చు. అదేమంటే 'అనవసరమైన తొందర'.

ఇది ప్రతివాడినీ ఆవహించి నడిపిస్తున్నది.పక్కవాడు ఏదో పనిమీద పోతూ మనల్ని దాటి వెళతాడు. 'వాడిపనిమీద వాడు పోతున్నాడులే' అని మనం ఊరుకోం.పక్కవాడు మనల్ని ఓవర్ టేక్ చెయ్యడం మనకొక ఈగో సమస్య అవుతుంది.ఇక రోడ్ రేస్ మొదలౌతుంది.దీనిని నేను అనేకసార్లు ప్రత్యక్షంగా గమనించాను.

ప్రతివాడూ ఏదో కొంప మునిగిపోతున్నట్లు పరుగులే.తీరా చూస్తె హడావుడిగా డ్రైవ్ చేసి గమ్యం చేరినదానికీ హడావుడి లేకుండా ప్రశాంతంగా గమ్యం చేరినదానికీ ఒక అయిదు నిముషాలో లేక పది నిముషాలో మాత్రమే తేడా ఉంటుంది.అంతే.

ఈ అయిదు నిముషాలలో ఆ ముందు చేరినవాడు చేసేది ఏమీ ఉండదు.కానీ ఈలోపల 'పానిక్ డ్రైవింగ్' లో ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చేరే 'గమ్యమే' మారిపోతుంది.అది ఆస్పత్రి కావచ్చు లేదా యమలోకమే కావచ్చు.

డ్రైవింగ్ లోనే కాదు.ప్రతిదానిలోనూ ఈ ర్యాట్ రేస్ పెరిగిపోయింది.ఇదే కొంప ముంచుతున్నది.నేను ఎన్నో పాత పోస్ట్ లలో వ్రాశాను.రైల్వే గేట్ల దగ్గర ప్రమాదాలు ఎలా జరుగుతాయో స్పష్టంగా వివరించాను.అతి తొందరపాటూ నిర్లక్ష్యాలే ప్రమాదాలకు కారణాలని ఎన్నోసార్లు చెప్పాను.

వాహనాల అహంకారం

కొన్నిసార్లు ఇంకో వింతను గమనించవచ్చు.వాహనాలకు అహంకారం ఉండకపోయినా వాటి ఓనర్లకూ డ్రైవర్లకూ ఉంటుంది.దీనివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి.

ముందు మారుతీ పోతూ ఉంటుంది.వెనుక వోక్స్ వాగెన్ వస్తూ ఉంటుంది.ఆ యజమాని "రెస్పాన్సిబుల్ డ్రైవింగ్" చేస్తున్నప్పటికీ అతని భార్యో కూతురో కొడుకో వెక్కిరిస్తారు.

"ఏంటి? ఇంత చేతగానితనం?ముందు మారుతీ పోతుంటే దాన్ని ఓవర్ టేక్ చెయ్యలేవా? ఇంత నెమ్మదిగా పోయేవాడివి ఇన్ని లక్షలు పోసి ఇదెందుకు కొన్నావ్?కమాన్ తొక్కు" అంటారు.

రోడ్ రేస్ మొదలౌతుంది.

ఆ క్రమంలో ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది.మన అవసరం కొద్దీ మనం స్పీడ్ పోవాలా?లేక ఎదుటి వాడిని చూచి అవసరం ఉన్నా లేకున్నా వాత పెట్టుకోవాలా? అన్న విచక్షణ లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది.

ప్రభావితం చేస్తున్న సినిమాలు టీవీలు

ఈ ప్రమాదాలలో ఎవరు చనిపోయినా కూడా,కారకులు మాత్రం రోడ్డు వాహనం నడుపుతున్న డ్రైవర్లే.ఆ డ్రైవర్లు అందరూ ఎక్కువగా 20 నుంచి 30 లోపల వయస్సు వాళ్ళే ఉంటున్నారు.ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేటి సినిమాలనుంచి తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు.

అదేదో సినిమాలో హీరో ఇలాగే చేస్తూ,రైలు స్పీడుగా వస్తున్నపుడు ఆ ట్రాక్ ను ఒక్క సెకన్ తేడాతో దాటి అవతలకి పోతాడట.అదొక ఘనకార్యం!!అది చూచి మన కుర్రకారు చాలామంది అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.ఇది నమ్మలేని నిజం.కాని నేను విన్నాను.

పల్లెల్లో పనిలేని సమయాలలో వాళ్ళు ఆడే ఆటలు కాసుకునే పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి.పేకాట వంటి ఆటలు సరే.అవి పాతతరం వాళ్ళు ఆడుకునే అమాయకపు ఆటలు.ఇప్పటి కుర్రకారు ఆడే ఆటలు వేరుగా ఉంటున్నాయి.

రైలు వస్తున్నపుడు దానిని అతి దగ్గరనుంచి తప్పుకొని అవతలకు పోవాలి.ఇదొక ఆట.చాలా పల్లెల్లో ఈ ఆటను కుర్రకారు ఆడుతున్నారంటే అది కూడా పందేలు కాసుకుని మరీ ఆడుతున్నారంటే మీరు నమ్మగలరా?నమ్మలేరు.కాని ఇది నిజం.చేతిలో ఆడుతున్న డబ్బూ,చూస్తున్న సినిమాలూ,ఇంటర్ నెట్ వీడియోలూ యువత ఆలోచనలను వెర్రితలలు వేయిస్తున్నాయి.

ట్రాక్టర్లో కూలి జనాన్ని తీసుకుని ఒక డ్రైవరు పోతుంటాడు.లెవల్ క్రాసింగ్ గేట్ దగ్గర రైలు రావడం దూరంనుంచి కనిపిస్తూనే ఉంటుంది.అది చెవులు చిల్లులు పడేలా కూత పెడుతూనే ఉంటుంది.ఇంతలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కన ఒకడు కూచుని ఉంటాడు.మన ఆటో డ్రైవర్లకూ ట్రాక్టర్ డ్రైవర్లకూ డ్రైవింగ్ సీట్లో అటూఇటూ ద్వారపాలకుల లాగా ఇద్దరు కూచుని ఉంటారు.అంటే డ్రైవింగ్ చేస్తున్నది ఒక్కడు కాదు.ముగ్గురు.

ఆ ఇద్దరూ పందాలు కాస్తారు.రైలు వచ్చేలోపు మనం దాటి పోగలం అని ఒకరూ,పోలేం అని ఒకరూ.ఇంకేముంది మన డ్రైవర్ హీరోకి సినిమాహీరో ఆవేశిస్తాడు.వీరావేశంతో యాక్సిలరేటర్ గట్టిగా తొక్కుతాడు.కాని తనకు వర్టికల్ గా వస్తున్న రైలు స్పీడునూ  అక్కడి ట్రాక్ గ్రేడియంట్ నూ అతను అంచనా వెయ్యలేడు.

అతను అనుకున్న సమయం కంటే ముందే రైలు వచ్చి విరుచుకు పడుతుంది.ఈలోపల ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న కూలిజనం హాహాకారాలు చేస్తుంటారు.చివరిక్షణంలో తన జడ్జ్ మెంట్ తప్పు అని గ్రహించి ట్రాక్టర్ నుంచి దూకేసి ప్రాణం కాపాడుకుంటాడు డ్రైవర్.కూలిజనం అందరూ ఆహుతి అయిపోతారు.లేదా తను కూడా వారితో బాటు ముక్కలై పోతాడు.

ఇది కల్పన కాదు.నిజంగా జరిగిన ఒక సంఘటన.ఆ ప్రమాదంలో బయట పడిన ఒకడు ఆస్పత్రి బెడ్ లో ఏడుస్తూ నాకే చెప్పిన నిజమైన సంఘటన.

కళ్ళు చెవులు మూసుకుని వాదిస్తూ పాటలు పాడుకుంటూ డ్రైవ్ చెయ్యడం

ఏసి కార్లో ఒక కుటుంబం పోతూ ఉంటుంది.రాత్రి సమయం.చీకటిగా ఉంటుంది.పల్లెల మధ్యన ఒక రైల్వే గేటు వస్తుంది.దగ్గరకు వస్తున్న రైలు హెడ్ లైట్ కాంతి ఒక అరకిలోమీటరు దూరం పడుతూ ఉంటుంది.రైలు డ్రైవరు కొడుతున్న హారన్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరం వరకూ ఉన్న పల్లెలను నిద్ర లేపుతూ ఉంటుంది.కాని ఇవేవీ ఆ కారు తోలుతున్న యజమానికి వినిపించవు.కనిపించవు.కారణం?

ఏసీ కోసం కారు అద్దాలు వేసుకుని ఉంటారు.స్టీరియోలో క్రేజీ ఐటం సాంగ్స్ ఫుల్ సౌండ్ లో వినిపిస్తూ ఉంటాయి.దానికి తోడు పక్కనే ఉన్న భార్యతో వాదన నడుస్తూ ఉంటుంది.అంత హోరులో అతనికి రైలు డ్రైవర్ కిలోమీటర్ దూరంనుంచీ కొడుతూ వస్తున్న హారన్ ఎలా వినిపిస్తుంది?మనస్సు యాజిటేటెడ్ మూడ్ లో ఉంటుంది.వెనక సీట్లో ఉన్న పిల్లలు బిక్కుబిక్కు మంటూ ఇదంతా చూస్తూ ఉంటారు.కారు పూర్తిగా గేట్లోకి ఎక్కిన తర్వాత మీదకొచ్చిన రైలు కనిపిస్తుంది.అప్పుడు ఇంక చెయ్యడానికి ఏమీ ఉండదు.చూస్తున్న రైలు డ్రైవరూ అసిస్టెంట్ డ్రైవరుకూ మాత్రం పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతుంది.

ఇదీ కల్పన కాదు.నిజంగా జరిగిన సంఘటనే.

రూల్స్ ను పట్టించుకోక పోవడం

రైలు గేట్లు పెట్టలేదు అంటారు.కాని పెట్టినచోట ఎంతమంది అక్కడ ఆగుతున్నారు? రైలు రావడం కనిపిస్తున్నప్పటికీ గేటుకింద నుంచి దూరి అవతలకు పోయే మోటార్ సైక్లిష్టులూ స్కూటరిష్టులూ సైకిళ్ళవారూ నడిచి దూరేవారూ ఎంతోమంది ప్రతిచోటా ఉన్నారు.ఈ విషయాన్ని ప్రతివారూ ప్రతిచోటా కళ్ళారా చూడవచ్చు.ఎందుకంత తొందర?ఈ తొందరే ప్రాణాలు తీస్తుందని ఎప్పుడు గ్రహిస్తారు?

ఎక్కువసేపు గేటు మూసి ఉంచిన చోట్ల జనం తిరగబడి రైలు వస్తున్నా సరే గేటు తియ్యమని గేట్ కాపలాదారు మీద దౌర్జన్యం చేసిన సంఘటనలు ఉన్నాయి.గేటు కిందనుంచి దూరి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించినందుకు అతన్ని కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి.

మన దేశంలో రూల్స్ ను పాటించకపోవడం ఒక దినచర్య అయిపోయింది. తనంతట తానుగా వాటిని పాటించేవాడు ఒక పిచ్చివాడుగా చూడబడే స్థాయికి జనాల మనస్తత్వాలు దిగజారిపోయాయి. 

అలవాటైన దారి

ఆటో డ్రైవర్లూ ట్రాక్టర్ డ్రైవర్లే ఎక్కువగా లెవల్ క్రాసింగ్ గేట్లలో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు.దానికి కారణం అలవాటైన గేటు కావడం.రోజూ ఆ గేట్లోంచి ఒక యాభైసార్లు అటూఇటూ తిరిగే ఆటోలూ ట్రాక్టర్ల డ్రైవర్లకు అది మామూలు విషయం అయిపోతుంది.కనుక గేట్ దగ్గరకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండరు.ప్రమాదం అనేది రోజుకు పదిసార్లు జరగదు.ఎప్పుడో ఒకసారే జరుగుతుంది.ఎన్నోసార్లు అది తప్పిపోయి ఉంటుంది.కాని ఆ డ్రైవర్లకు బుద్ధి రాదు.చివరకు అదే గేటులో ప్రాణం పోగొట్టుకుంటారు.

అలవాటైన దారేగా అనుకొని కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే ఆ దారే యమలోకానికి దారి చూపుతుంది.

యమవాహనాలు

వేలం వెర్రిగా నేడు అమ్ముడౌతున్న 350 CC బైకులూ 500  CC బైకులూ స్పోర్ట్స్ మోడల్సూ మన ఇండియా రోడ్లకు అస్సలు పనికిరావు. అడుగడుగునా గుంటలతో నిండిన రోడ్లూ,ట్రాఫిక్ రూల్సు అస్సలు పాటించని మూర్ఖులైన మనుషులూ ఉన్న దేశంలో ఇలాంటి హైస్పీడ్ బైకులు అవసరమా?

దీనికి కారణాలు మళ్ళీ మన సినిమాలూ ఆయా ప్రోడక్ట్స్ ను కొనమని ప్రోత్సహించే యాడ్ లే.

యాడ్ లో హీరో ఒక స్పోర్ట్స్ బైకు నడుపుతూ,వెనుక తన వీపుమీద ఉప్పెక్కినట్లుగా కూచుని ఉన్న హీరోయిన్ను మోసుకుంటూ,ఏ అమెరికా రోడ్లమీదో యూరప్ కొండలలోనో న్యూజిలాండ్ లోయల్లోనో రయ్యిమని పోతూ ఉంటాడు.

మన కుర్రకారు అది చూస్తారు.

ఇంకేముంది??

ఆ బైకు తనకూ కావాలి.తన కాలేజి గర్ల్ ఫ్రెండ్ ను అలా వెనుక కూచోబెట్టుకుని గుంతరోడ్లతో నిండిన తన సిటీలోనో టౌన్ లోనో తనుకూడా అలా రయ్యిమని దూసుకుపోవాలి అన్న దుగ్ధ మొదలౌతుంది.తల్లిదండ్రులు కూడా దానికి వంత పాడుతారు.

'అబ్బాయి టెన్త్ పాసయ్యాడుగా పాపం కొనిపెట్టండీ'- అని ముద్దుగా అడిగే భార్య.గారం చేసే కొడుకు.ఆ తండ్రి ఇంకేం చేస్తాడు.వెంటనే ఆ బైక్ ఇంటిముందు ప్రత్యక్షం అవుతుంది.

ఒక వారంలోపల పత్రికలో వార్తగా ఆ అబ్బాయి మిగిలిపోతాడు.ఇలాంటి బైక్స్ ని నేను 'యమవాహనాలు' అంటాను.వాటి డిజైన్ కూడా యముని దున్నపోతు లాగే భయంకరంగా ఉంటుంది.దానిమీద ఎక్కి పోతుంటే యముడి దున్నపోతు మీద ఎక్కికూచున్నట్లే ఉంటుంది.సినిమా ఫీల్డ్ తో సహా ఎన్నో రంగాలలో ఈ బైక్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నేను చెప్పక్కర్లేదు.అందరికీ తెలుసు.

ఇలాంటి స్పోర్ట్స్ బైక్ లు పిల్లలకు కొనిపెడుతున్న తల్లిదండ్రులు ఒక్క విషయం గుర్తుంచుకోండి.మీ పిల్లలకు మీరే యమలోకానికి టికెట్ కొని ఇస్తున్నారు.ఇది మర్చిపోకండి.

సెల్ ఫోన్ డ్రైవింగ్

సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యడం ఇంకొక కారణం.

చాలామంది కారు డ్రైవర్లూ బైక్ నడిపేవారూ  ఇలా చేస్తూ ఉంటారు.మొన్న జరిగిన మూసాయిపేట గేట్ ప్రమాదంలో కూడా బస్సు డ్రైవరు సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు.

స్కూలు పిల్లలు పెద్దగా అరుస్తూ - 'అంకుల్ రైలు వస్తున్నది,రైలు వస్తున్నది'- అంటూ ఎంత హెచ్చరించినా పట్టించుకోలేదు.

ఈ సమయంలో నేను ప్రత్యక్షంగా చూచిన ఒక సంఘటన  గుర్తుకు వస్తున్నది.

నా కళ్ళముందే గుంటూరులో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది.ఒక కాలేజీ స్టూడెంట్ ఇలాంటి బైక్ ఒకటి నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఇంకొక బైక్ ను గుద్ది కిందపడిపోయాడు.కాని కిందపడినా కూడా సెల్ ఫోన్ ను వదలలేదు. అలా మాట్లాడుతూనే లేచి నిలబడి దెబ్బలు సవరించుకుంటూ ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు.

రోడ్డు మీద పోతున్న వారు బైక్ ను లేపి నిలబెడితే అప్పుడు దానిమీద కెక్కి,వాళ్ళవైపు తిరిగి 'థాంక్స్' అని చెప్పి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూనే బైక్ స్టార్ట్ చేసుకుని అదొక హీరోయిజం అన్నట్లుగా వెళ్ళిపోయాడు.ఆ మాట్లాడే వాలకాన్ని బట్టి అవతల ఉన్న వ్యక్తి ఎవరో చూస్తున్న మాకందరికీ అర్ధం అయిపోయింది.అది అతని గరల్ ఫ్రెండ్.ఆ మైకంలో తనకు యాక్సిడెంట్ అయిన సంగతి కూడా వాడికి పట్టడం లేదు.

ఇంజనీరింగ్ చదివే అబ్బాయిలు స్త్రీల మెడలలో బంగారు గొలుసులు దొంగిలించే చెయిన్ స్నాచర్స్ గా ఎందుకు మారుతున్నారు?తమ తమ గరల్ ఫ్రెండ్స్ ను హోటల్స్ కు తిప్పడానికీ వారికి ఖరీదైన గిఫ్ట్ లు కొనడానికీ ఇతర సరదాల కోసమూ వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు.కాలేజీ అమ్మాయిలు కొంతమంది కాల్ గరల్స్ గా ఎందుకు మారుతున్నారు?ఫాస్ట్ లైఫ్ కు అలవాటు పడి ఆ ఖర్చులకోసం డబ్బు కోసం అలా మారుతున్నారు.ఇవి నమ్మలేని నిజాలు.కాని నిజాలే.

రోడ్ ఇండికేషన్స్ ను పట్టించుకోక పోవడం.

రైల్వే లెవల్ క్రాసింగ్ గెట్ వస్తున్న అరకిలోమీటరు ముందుగానే గేట్ ఇండికేషన్ బోర్డులు ఉంటాయి.స్పీడ్ బ్రేకర్ ఇండికేషన్ బోర్డులు ఉంటాయి.గేట్ ముందు స్పీడ్ బ్రేకర్లూ ఉంటాయి.రాత్రి పూట అయితే రెట్రో రిఫ్లెక్టివ్ బోర్డులు మెరుస్తూ ఉంటాయి.రైలు ఇంజను హెడ్ లైట్ రాత్రి పూట ఒక అరకిలోమీటరు దూరం వరకూ ఫోకస్ అవుతూ ఉంటుంది.ఇంజన్ హారన్ అయితే చుట్టుపక్కల అయిదు కిలోమీటర్ల వరకూ అన్ని పల్లెలనూ నిద్రలేపుతూ ఉంటుంది.

ఇన్ని కనిపిస్తున్నా కూడా వేటినీ లెక్క చెయ్యకుండా నేనొచ్చి చావు నోట్లో పడతాను.దానికి రైల్వేవారిదే బాధ్యత అంటే అది వినడానికి ఎంత విడ్డూరంగా ఉంటుంది?

నేను ప్రత్యక్షంగా చూచిన ఒక సంఘటన

ఒకసారి సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా నేను ఇంజన్ లో ప్రయాణం చేస్తూ ఉన్నాను.అది పగటి పూటే.100 కిమీ వేగంతో రైలు పోతున్నది.డ్రైవరూ అసిస్టెంట్ డ్రైవరూ గుడ్లప్పగించి ట్రాక్ నూ సిగ్నల్స్ నూ చూస్తూ రైలును పోనిస్తున్నారు.ఆ సమయంలో వాళ్ళు ధ్యానంలో ఉన్న ఒక తపస్విలాగా ఉంటారు.అంత ఏకాగ్రత వారికి ఉంటుంది.

ఇంతలో వారి దగ్గర ఉన్న చార్ట్ ప్రకారం ఇంకొక రెండు కి.మీ దూరంలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్ ఒకటి రాబోతున్నదని వాళ్ళు గమనించారు.జాగ్రత్తగా స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ,హారన్ మోగిస్తూ గేట్ ను అప్రోచ్ అవుతున్నారు.

ఇంతలో పక్కనే ఉన్న పల్లెలనుంచి ఒక ట్రాక్టర్ గేట్ లోకి వస్తూ మాకు కనిపించింది.ఆ డ్రైవర్ మా రైలును గమనించాడు.కానీ స్పీడ్ ఏమాత్రం తగ్గించకుండా వస్తూనే ఉన్నాడు.బహుశా రైలు వచ్చే లోపల ట్రాక్ దాటి పోవచ్చులే అని అనుకొని ఉంటాడు.చాలామంది అలాగే అనుకుంటారు.

ఒక రోడ్డుమీద మనకు ఎదురుగా వస్తున్న లేదా మనముందు అదే దారిలో పోతున్న వాహనం స్పీడ్ మనం తేలికగా అంచనా వెయ్యవచ్చు.కాని మన దారికి టాంజెంషియల్ గా వేగంగా వస్తున్న వాహనం స్పీడ్ ను మనం అంచనా వెయ్యలేం.ఎందుకంటే, 'టాంజెంషియల్ రిలేటివ్ స్పీడ్' అంచనా వెయ్యడం కష్టం.అలా అంచనా వెయ్యడానికి మన మెదడు అలవాటు పడి ఉండదు.ఆ ట్రాక్టర్ డ్రైవర్ కూడా అలాగే అనుకొని ఉంటాడు.

మా ఇంజన్ డ్రైవర్ ఆపకుండా హారన్ మోగిస్తూనే ఉన్నాడు.సరిగ్గా మేం గేట్లోకి వచ్చేసరికి ఆ ట్రాక్టర్ కూడా గేట్లోకి వచ్చింది.ఇంజన్లోంచి చూస్తున్న నేను యాక్సిడెంట్ అయిపోయిందనే అనుకున్నాను.

'సార్.ట్రాక్టర్ ను కొట్టేశాం!?!' 

అంటూ మా డ్రైవర్ పెద్దగా కేకపెట్టి సీట్లోంచి లేచి నిలబడ్డాడు.అసిస్టెంట్ డ్రైవర్ కూడా పెద్దగా కేకపెట్టాడు.ఒక్కక్షణంపాటు నాకూ ఊపిరి ఆగినంత పని అయింది.తీరా కిటికీ లోంచి చూస్తె,ఇంజన్ను రాసుకుంటూ ట్రాక్టర్ ట్రాలీ వెళ్లి పోయింది.ఇంజన్లో ఉన్న మాకు ప్రాణాలు పోయినంత పని అయింది.కాని ఆ ట్రాక్టర్ ను డ్రైవ్ చేసున్న కుర్రవాడు మాత్రం ఏమీ జరగనట్లు మాకు టాటా చెబుతూ నవ్వుకుంటూ పోతున్నాడు.ఆ ట్రాక్టర్ కున్న మైకులో నుంచి పెద్దగా సినిమా పాటలు వినిపిస్తున్నాయి.

మా ఇంజన్ డ్రైవర్ అయితే ఒక పావుగంట సేపు ఘోరమైన బూతుల్లో ఆ ట్రాక్టర్ వాడిని తిడుతూనే ఉన్నాడు.అప్పటికి గాని అతని దడ తగ్గలేదు.

ఇలా ఉంటాయి వాస్తవ సంఘటనలు.

ఇలాంటివి నేను ఎన్నో చూచాను.

ఏం చెయ్యాలి?

కాపలా లేని లెవల్ క్రాసింగ్ వచ్చినపుడు ఇలా చెయ్యాలి.

1.ముందుగా వాహనాన్ని ఆపి కిందకు దిగాలి.

2.ట్రాక్ దగ్గరకు వచ్చి రెండు వైపులా చూచి ఏ రైలూ రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత వాహనాన్ని ట్రాక్ దాటించాలి.

3.ఒకవేళ ఏ రైలూ దూరం నుంచి కనిపించక పోయినా కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి.అపుడు ఏ ప్రమాదమూ జరగదు.

అలా కాకుండా కిలో మీటర్ దూరం నుంచీ ఎదురుగా వస్తున్న రైలు కనిపిస్తున్నప్పటికీ,ఆపకుండా మోగుతున్న దాని హారన్ వినిపిస్తున్నప్పటికీ,మనం సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ,లేదా యియర్ ఫోన్ లో పాటలు వింటూ,లేదా పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ, లేదా గొడవ పడుతూ,లేదా తాగి డ్రైవ్ చేస్తూ ఉంటె ప్రమాదాలు జరగక ఏమౌతాయి?

దానికి రైల్వేశాఖ ఎలా జవాబుదారీ అవుతుంది?

మంచి చెప్పినా వినకుండా ఎగతాళిగా తీసుకునే మనస్తత్వం

రైల్వే సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా మేం ఇలాంటి గేట్ల దగ్గరలో ఉన్న పల్లెలకు కూడా వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి 'ఎవేర్ నెస్ క్యాంప్' లు పెడుతూ ఉంటాం.వాటిల్లో మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతూ ఉంటాయి.పల్లెల్లో మునుపటి లాగా అమాయకులూ తెలివిలేని పల్లెటూరి బైతులూ ఉన్నారని అనుకోకండి.ప్రస్తుత పల్లెటూళ్ళు పట్నాల కంటే ఘోరంగా కుళ్ళిపోయి ఉన్నాయి.

ఇప్పుడు పల్లెల్లో ఉన్నన్ని సౌకర్యాలూ దురలవాట్లూ వెర్రి వేషాలూ సిటీలలో కూడాలేవు.అక్కడ వారినుంచి పోకిరీ ప్రశ్నలూ,ఎగతాళి మాటలూ, అతి తెలివితో కూడిన ఎత్తిపొడుపులూ మాకు అతి మామూలుగా ఎదురౌతూ ఉంటాయి.

మంచి చెబుతుంటే కూడా వినకుండా ఎగతాళి మాటలతో అదేదో కాలక్షేపంగా తీసుకునే వారికి ఎవరు మాత్రం చెప్పగలరు? తర్వాత కొంతకాలానికి అదే పల్లెదగ్గర అదే గేటులో ఒక ఘోరమైన ప్రమాదం జరుగుతుంది.ఇలా కొన్ని సార్లు జరిగింది.

ఆ ఊరి ప్రెసిడెంటో ఇంకే పెద్దమనిషో అప్పుడు ఇలా అంటాడు.

'సార్.మీరు ఆరోజున వచ్చి మాకు జాగ్రత్తలు చెప్పారు.వీళ్ళు వినలేదు.ఇప్పుడు అదే జరిగింది.' 

ఇలా కొన్ని ఊర్లలో జరిగింది.

మన దురుసుతనమూ,తొందరపాటూ,మూర్ఖత్వమూ,పొగరూ,ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతాయి.

రవాణాశాఖ వారి నిర్లక్ష్యం

నిన్న మూసాయిపేట ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డు రవాణాశాఖ వారు హడావుడిగా తనిఖీలు చేసి దాదాపు 700 డొక్కు స్కూలు బస్సులనూ మినీ వ్యానులనూ స్వాధీనం చేసుకున్నారు.ఈపని ముందే ఎందుకు చేసి ఉండకూడదు?

తమిళనాడులో కొన్నేళ్ళపాటు వాడి పారేసిన డొక్కు బస్సులూ మినీ వ్యానులనూ స్కూలు యాజమాన్యాలు ఇరవైవేలకూ ముప్పైవేలకూ కొనుక్కొస్తారు.వాటి ఇంజన్లు ఎప్పుడో బోరుకు వచ్చి ఉంటాయి.వాటికి బ్రేక్ పవర్ సరిగ్గా ఉండదు.అవి ఇక్కడ మన స్కూలు పిల్లలకు యమవాహనాలై కూచుంటాయి.

వాటికి డ్రైవర్లుగా ట్రాక్టరు నడిపేవాళ్ళూ ఆటోలు నడిపేవాళ్ళూ కుదురుతారు. వాళ్ళు తాగి ఆ బస్సులు నడుపుతూ ఉంటారు.లేకపోతే సెల్ లో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు.లేదా ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు.

ఒక్కొక్కసారి ఆ వ్యానులూ బస్సులూ సరిగ్గా ట్రాక్ మధ్యలోకి వచ్చి అక్కడ కదలకుండా మొరాయిస్తాయి.లేదా వాటి ఇంజన్ అక్కడ ఆఫ్ అయిపోతుంది.ఇలా జరగడం నేను చాలాసార్లు చూచాను.ఇక ప్రమాదాలు జరగక ఏమౌతాయి?

కార్పోరేట్ స్కూల్ ర్యాట్ రేస్

తమ తమ పిల్లల్ని ఇలాంటి స్కూళ్ళలో చేర్చే తల్లి దండ్రులకు అంత శ్రద్ధ ఎలాగూ ఉండదు.ఆ స్కూళ్ళు ఎలాంటి బస్సులు నడుపుతున్నాయి?ఎలాంటి డ్రైవర్లను హైర్ చేస్తున్నాయి? అన్న విషయాలు వాళ్ళు పట్టించుకోరు.అంత తీరిక వారికి ఉండదు.

లక్షలు డొనేషన్లు కట్టి వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చేర్చడమే గాని ఇలాంటి విషయాలు వాళ్ళు పట్టించుకోరు.ఒకవేళ తల్లిదండ్రులు అడిగినా స్కూలు యాజమాన్యం వారికి జవాబు చెప్పదు.అంతటి బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవరు.

ఇవీ అసలైన కారణాలు

రోడ్డు వాహనాలు కండిషన్లో ఉండవు.

రోడ్లు సరిగ్గా ఉండవు.

డ్రైవర్లకు క్వాలిఫికేషన్లు ఉండవు.

వారిని తనిఖీ చేసే నాధుడూ ఉండడు.

తాగి బండి నడిపినా అడిగేవారు ఉండరు.

రోడ్డు సేఫ్టీ రూల్స్ ఎవరూ పాటించరు.

మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చెయ్యొద్దంటే వినరు.హెల్మెట్ పెట్టుకొమ్మంటే బాధపడతారు.సీట్ బెల్ట్ కట్టుకొమ్మంటే చికాకు పడతారు.

అందరికీ త్వరత్వరగా ఎదుటివాడిని దాటేసి ఎక్కడికో వెళ్లిపోవాలనే ఆత్రుత.అదెక్కడికో మాత్రం తెలియదు.

కుడీఎడమా ఏమీ చూచుకోరు.ఎటో ఒక వైపునుంచి దూరిపోయి ఎక్కడికో వెళ్ళిపోదామనే ఆత్రం.

రైల్వేగేటు దగ్గర ఒక్కక్షణం పాటు ఆగి,చూచి,తర్వాత దాటుదామని ఎవ్వరికీ తోచదు.రైలు డ్రైవరు చెవులు చిల్లులు పడేలా కొడుతున్న హారన్ సెల్ ఫోన్ పాటల మధ్యలో అస్సలు వినిపించదు.

ఇన్ని కోణాలు ఇందులో ఉన్నపుడు ప్రమాదాలు జరగకపోతే వింత గాని,ఘోరమైన ప్రమాదాలు రోజూ జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.

నాయకుల జవాబుదారీ రాహిత్యం-ప్లానింగ్ లోపం

ఇకపోతే నాయకుల విషయం చూద్దాం.ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్లకు 'దిగ్భ్రాంతి' కలుగుతూ ఉంటుంది.అది ఎందుకు కలుగుతుందో నాకైతే అర్ధం కాదు.చెయ్యవలసిన పనులు చెయ్యకుండా ఏళ్ళ తరబడి వ్యవహారాన్ని నానబెట్టి,ఏదైనా జరిగినప్పుడు 'దిగ్భ్రాంతి' కలగడం ఏమిటో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.

నిధుల కొరత-ఓటు బ్యాంక్ రాజకీయాలు- It happens only in India

గత పదేళ్ళ నుంచీ రైల్వే ఫేర్స్ పెరగని దేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే అది మన దేశమే.కాని ప్రతి ఏడాదీ అన్ని ధరలూ పెరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నది.కానీ రైల్వే ఫేర్స్ మాత్రం పెరగకూడదు.పైగా ప్రతి ఏడాదీ ఒక్కొక్క రూపాయి చొప్పున తగ్గుతూ రావాలి.ఇదేమి వింతో నాకైతే అర్ధం కాదు.

రేట్లు పెంచకపోతే ఉన్న ఎస్సెట్స్ ఎలా మెయిన్టెయిన్ అవుతాయి?కొత్త ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి?గేట్లలో కాపలా దారులను నియమించడం ఎలా సాధ్యం అవుతుంది?వారికి జీతాలు ఎలా ఇవ్వాలి?

ఒక పక్కన జెనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ కు సహాయం ప్రతి ఏడాదీ తగ్గిపోతున్నది.తమ తమ అంతర్గతమూలాల నుంచి నిధులు సమకూర్చుకొమ్మని(fund generation from internal resources) పార్లమెంట్ రైల్వేలకు చెబుతున్నది.

అక్కడ ఉన్నది మనం ఎన్నుకున్న ఘనత వహించిన ప్రతినిధులే.మొన్న మొన్నటి వరకూ వారు అభివృద్ధిని పక్కన పెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలే నడిపారు.ప్రతి ఏడాదీ ఒక్క రూపాయి చొప్పున ఏడేళ్ళ పాటు రేట్లు తగ్గిస్తూ వచ్చారు.వారి ఓట్ల కోసం ప్రజల భద్రతను గాలికొదిలేశారు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి.వాస్తవిక దృక్పధంలో ఇప్పుడిప్పుడే నడవడం మొదలైంది.ఇన్నాళ్ళూ జరిగిన డామేజి సరిదిద్ద బడటానికి కొంతకాలం తప్పకుండా పడుతుంది.

ఇన్నాళ్ళూ ఓటుబ్యాంకు రాజకీయాలకు అన్ని శాఖల్లాగే రైల్వేశాఖకూడా బలయింది.ఇప్పుడే దానినుంచి బయటకు వస్తున్నది.

సరిపోయినన్ని నిధులు ఇస్తే అన్ని సమస్యలనూ సరిదిద్ది ప్రపంచంలోని ఏ రైల్వేతోనైనా పోటీపడేలా నడిపే సమర్ధులైన అధికారులు ఎందఱో రైల్వేలలో ఉన్నారు.కాని వారి చేతులను రాజకీయులు కట్టేస్తున్నారు.

పాలసీ నిర్ణయాధికారం నిజాయితీ లేని రాజకీయుల వద్ద ఉంటే,ఎంత సమర్ధత ఉన్నా అధికారులు ఏం చెయ్యగలరు?రైల్వేలలో బ్రహ్మాండమైన ఆధునికీకరణ జరగాలంటే ఇప్పటికిప్పుడు వేలకోట్లు కావాలి.రేట్లు పెంచకుండా,జెనరల్ బడ్జెట్ నుంచి సహాయం లేకుండా,అవెక్కడనుంచి వస్తాయి?

రేట్లు మాత్రం పెరగకూడదు,వ్యవస్థ మాత్రం అల్ట్రా మోడరన్ గా మారిపోవాలి అంటే ఎలా సాధ్యం?నిధులివ్వకుండా అభివృద్ధి కావాలంటే ఎలా?

'అవ్వా కావాలి బువ్వా కావాలి'-అంటే ఎలా సాధ్యమౌతుంది?

అస్థిరమైన ప్రజాభిప్రాయం

అసలే మన దేశంలో ప్రజలకు 'షార్ట్ మెమరీ' చాలా ఎక్కువ.

ఈరోజు జరిగినది రేపటికి మర్చిపోవడం మన అలవాటు.

మళ్ళీ కొత్తన్యూస్ కోసం ఎదురు చూడటం ఇంకో పాడు అలవాటు.

పాత సంఘటనల నుంచి ఏమీ నేర్చుకోకపోవడం ఇంకో మహాచెడ్డ అలవాటు.

నాయకులు ప్రజలకు జవాబుదారీ కాకపోవడం ఇక్కడ రివాజు.

లంచాలు మరిగిన అధికారులు ఎక్కడా తనిఖీలు చెయ్యకుండా అన్నింటినీ చూస్తూ ఊరుకోవడం ఇంకొక అలవాటు.

ఏదైనా జరిగినప్పుడు ఎవరిమీదో ఒకరి మీద బురద చల్లేసి అసలు సమస్య ఎక్కడుంది? దానిని ఎలా పరిష్కరించాలి? అన్నవి వదిలేసి దానిని ఒక సెన్సేషన్ గా వాడుకోవడం మన మీడియాకు అలవాటు.

ఇన్ని మంచి అలవాట్లున్న సమాజం ఎలా బాగుపడుతుంది?

అలా బాగుపడాలని ఆశించడమే అసలు తప్పేమో?