“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, జూన్ 2013, ఆదివారం

శ్రీ విద్యోపాసకులు వడ్లమూడి వెంకటేశ్వరరావుగారితో సంభాషణ - వనదుర్గా మహావిద్య

'తమ్ముడూ' అని ప్రేమగా నేను పిలిచే వ్యక్తులలో సాయికిరణ్ ఒకరు. బ్లాగర్ కొండముది సాయికిరణ్ గురించి చాలామందికి చాలా కొద్దిగానే తెలుసు.అతనికి www.newaavakaaya.com అనే సైట్ ఉన్నదనీ ఈ మధ్యనే 'అంతర్యానం' అని భావకవితల సంపుటిని ప్రచురించాడనీ,మంచి బ్లాగర్ అనీ కొంతమందికి తెలుసు.కాని అతనిలో దాగిఉన్న దేవీఉపాసకుడు చాలామందికి తెలియడు.అతను శ్రీవిద్యాదీక్షాపరుడనీ, ఉగ్రదేవతల రహస్య ఉపాసకుడనీ, అవసరం అయితే ప్రయోగం చెయ్యగల శక్తి ఉన్నవాడనీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

సాయికిరణ్ మామగారే వడ్లమూడి వెంకటేశ్వరరావుగారు.ఆయన గుంటూరు నివాసి.హిందూకాలేజీలో గణితశాస్త్ర ఆచార్యునిగా పనిచేసి రిటైరై ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్న విశిష్టవ్యక్తి. ఆయనొక శ్రీవిద్యా జ్ఞానసాగరం అని చెప్పవచ్చు.జిజ్ఞాసువులు కదిలించాలేగాని శ్రీవిద్యోపాసన మీద ఆయన నుంచి ఎంతైనా విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఆయన 'లలితా నామార్ధ మంజూష' అని ఒక పుస్తకం వ్రాశారు.లలితా సహస్ర నామాలలో రహస్యంగా దాగిఉన్న అనేక నిగూఢమైన మంత్రాలను వెలికి తీసి ఆయన ఆ పుస్తకంలో వివరించారు.ఆ పుస్తకాన్ని నేను గుంతకల్ లో ఉన్నపుడు నాకు సాయికిరణ్ పంపించాడు.ఒక్క పూటలో ఏకబిగిన ఆ పుస్తకాన్ని మొత్తం చదివాను.చాలా ఆనందం కలిగింది.ఎంతో ఇంట్యూషన్ పవర్ ఉంటె గాని ఇలాంటి ఫ్లాషెస్ రావు.గూడార్ధాలు అంతుబట్టవు. 

ఉదయాన్నే త్వరగా నా అనుష్టానం ముగించుకుని వారిని కలిసి కాసేపు మాట్లాడుదామని వారింటికి వెళ్లాను.ఆయన అనుష్టానంలో ఉండటంతో మేం ముందుగదిలో కూచుని ఉన్నాం.మా సంభాషణ వనదుర్గా మహావిద్య వైపు మళ్ళింది.ప్రస్తుతం హైదరాబాద్ లో వనదుర్గా ఆలయం నిర్మించాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సాయి కిరణ్ చెప్పాడు.

'ఈవిద్య ప్రాధమికంగా అటవీప్రాంతాలలో ఉండే గిరిజనులలో పుట్టి ఉండవచ్చు.క్రూర మృగాల నుంచి,అడవులలో గూడేలలో వచ్చే సాంక్రామిక వ్యాధుల నుంచీ రక్షణనిచ్చే దేవతగా ప్రాచీన కాలంలో ఈ దేవతను ప్రజలు ఆరాధించి ఉండవచ్చు.తర్వాత ఒక కల్పంగా ఈవిద్య రూపు దిద్దుకొని ఉండవచ్చు' అని నేనన్నాను.  

ఈ విద్యలో ఎన్నో ప్రయోగ ఉపసంహారాదులు ఉన్నాయని,దేవీ ఉపాసకులకు రక్షాదేవతగా ఈమె ముఖ్యంగా ఉపయోగిస్తుందనీ సాయికిరణ్  అన్నాడు.ఇది మహావిద్య కనుక మోక్షదాయిని అని కూడా అనుకున్నాం.

ఇంతలో వెంకటేశ్వరరావుగారు అనుష్టానం ముగించుకుని బయటకు వచ్చారు.ఆయనకు ప్రస్తుతం దాదాపు ఎనభై ఏళ్ళు ఉండవచ్చు.కాసేపు పిచ్చాపాటీ కబుర్లు అయిన తర్వాత చర్చ మొదలైంది.చర్చ అనడంకంటే ఆయన చెబుతుంటే మేము వినడమే జరిగింది అనడం సబబు.

వనదుర్గా మహావిద్య గురించి కొంత చెప్పమని సాయికిరణ్ ఆయన్ను వినమ్రంగా అడిగాడు.ఆయన్ను మామగారిగా కంటే గురువుగా అతను ఎక్కువగా గౌరవిస్తాడు. అటువంటి విశిష్టవ్యక్తి గురువుగా దొరికే అదృష్టం లభించినందుకు సాయిని నేను ఎప్పుడూ అభినందిస్తూ ఉంటాను.

వెంకటేశ్వరరావుగారు ఒక్కక్షణం మావైపు చూచి చెప్పడం మొదలు పెట్టారు.

'ఈమె ముఖ్యంగా defensive deity.బాధలనుంచి,ప్రమాదాలనుంచి, దాడుల నుంచి బ్రహ్మాండంగా రక్షిస్తుంది.ఈమెకు వ్యతిరేకం ప్రత్యంగిర.ఈమె ప్రయోగ దేవత.ఇతరుల ప్రయోగాలను తిప్పి కొట్టాలంటే ప్రత్యంగిర చాలా బాగా పనిచేస్తుంది.ప్రత్యంగిర అఫెన్స్ కు బాగా ఉపయోగిస్తుంది.వనదుర్గా విద్యలో రక్షించమని కోరే మంత్రాలు ఎక్కువగా ఉంటాయి.ఇది పంచశతి.అంటే 500 మంత్రాలుంటాయి.వాటిలో అనేక దిగ్బంధనాలూ వివిధ అంగ దేవతల మంత్రాలూ వస్తాయి.కాని ప్రాధమికంగా ఈమె రక్షాదేవత.

ప్రత్యంగిర అలా కాదు.నిద్రలెమ్మని ఉద్దేశించే 'ఉత్తిష్ఠ' మొదలైన అనేక మంత్రాలు అందులో ఉన్నాయి.బహుశా కుండలినిని నిద్రలెమ్మని ఆదేశించే ప్రక్రియ ఇందులో నిగూడంగా ఉండి ఉండవచ్చు.అలాగే 'వెళ్ళు నిన్ను ప్రయోగించినవాని వద్దకే తిరిగి వెళ్ళు'అనే అర్ధాన్నిచ్చే మంత్రాలూ ఇందులో ఉన్నాయి.

ఆహార భయ నిద్రా మైధునములు ప్రతి జీవికి ఉన్నాయి.అందులో 'భయం' అనే దానిమీద వనదుర్గావిద్య ప్రధానంగా స్పెషలైజ్ చేసింది అని చెప్పవచ్చు. భయాన్ని పోగొట్టడంలో ఈ విద్యను మించినది లేదు.  

నాకు తెలిసిన ఒకాయన ఉండేవారు.ఆయన అద్వైత వేదాంతం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు.కాని వ్యక్తిగతంగా వనదుర్గను ఉపాసించేవారు. ఇదంతా చూచి ఆయనను ఒక వ్యక్తి ప్రశ్నించారు.

'అయ్యా.మీరు అద్వైతాన్ని చెబుతున్నారు.మరి చేసేదేమో తంత్రాన్ని చేస్తున్నారు.{వనదుర్గా మహావిద్య తాన్త్రికమే}.ఇదేమిటి? మీరు చెప్పేదానికీ చేసేదానికీ పొంతన లేదే? అన్నాడు.

దానికి ఆయన ఇలా బదులిచ్చారు.

"అద్వయం బ్రహ్మేతి" అని ఉపనిషత్తులన్నాయి కదా.అంటే రెండు లేనిది పరబ్రహ్మము.ఒకటిగా ఉండటమే అద్వైతము.భయం ఎప్పుడు కలుగుతుంది? రెండుగా ఉన్నపుడే ఆ ఎదుటి వస్తువును చూచి మనకు భయం కలుగుతుంది.కనుక భయం లేకపోవడం ఎప్పుడు సిద్ధిస్తుంది? రెండవదిగా ఏ వస్తువూ తోచనప్పుడు భయం అనేది ఉండదు.అదే అద్వైత స్తితి.వనదుర్గ భయాన్ని పోగొడుతుంది.అంటే ద్వైతాన్ని నిర్మూలించి అద్వైతాన్ని చేరుస్తుంది.కనుక ఆమెను ఉపాసిస్తున్నాను".అని ఆయన యుక్తియుక్తంగా జవాబు చెప్పారు.

'ఇది చాలా చక్కని భావన.చాలా బాగుంది.తంత్రానికీ అద్వైతానికీ చక్కని సమన్వయం కుదిరింది.' అన్నాను నేను.

అవును.ఇలాగే చాలా జరిగాయి. ఆ సమయానికి ఏదో స్ఫురిస్తుంది. శ్రీవిద్యాహోమం చేసేటప్పుడు అపసవ్యంగా (యాంటి క్లాక్ వైస్) ద్రవ్యాలను ఉంచుతాం కదా.ఒకసారి ఒకాయన ప్రశ్నించాడు.ఇలా అపసవ్యంగా చెయ్యడానికి ఏమిటి రేషనేల్? అని.ఒక్క క్షణం ఆలోచించాను.ఏదో తట్టింది.ఇలా చెప్పాను.'విశ్వంలో అన్ని గ్రహాలూ,గెలాక్సీలూ అన్నీ అపసవ్యం గానే తిరుగుతున్నాయి.విశ్వంలో స్పిన్ అనేది యాంటి క్లాక్ వైస్ గానే ఉన్నది.కనుక దానికి సింక్రనైజ్ చేస్తూ ఇక్కడకూడా యాంటి క్లాక్ వైస్ గా చెయ్యమని చెప్పి ఉంటారు.కాని అతి ప్రాచీనకాలంలో వారికి విశ్వంలో అన్ని గోళాలూ యాంటి క్లాక్ వైజ్ గా తిరుగుతున్నాయి అని ఎలా తెలుసు? అనేదే అసలు ప్రశ్న.అదే మనకు అంతు బట్టదు.ఇలాంటివి మనకు అర్ధం కానివి మన సాంప్రదాయంలో చాలా ఉన్నాయి.

ఇంకో సారి ఇంకో సంఘటన జరిగింది.ఎక్కడో ఊరిలో ఉన్నాను.ఉదయాన్నే లేచి 'జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే' అని స్మరిస్తున్నాను. పక్కనే ఒకాయన ఉన్నాడు.ఆయన ఇలా ప్రశ్నించాడు.

'జ్ఞానానందమయం దేవం బాగుంది. నిర్మల స్ఫటికాకృతిం కూడా చాలా బాగుంది.ఆధారం సర్వవిద్యానాం కూడా బాగుంది.కాని ఈ గుర్రం ముఖం ఏమిటండీ దేవునికి? ఈ గుర్రంముఖం ఎలా వచ్చింది? దీని అర్ధం ఏమిటి?' అని అడిగాడు.

ఒక్క క్షణం ఆలోచించాను. చటుక్కున ఏదో స్ఫురించింది.ఇలా చెప్పాను.

'లలితా సహస్ర నామాలలో శాకిని రాకిణి డాకిని యాకిని హాకిని మొదలైన శక్తుల నామాలున్నాయి కదా.వాటిలో మూలాధారం నుంచి ఆజ్ఞా వరకూ ప్రయాణం గురువు దగ్గరుండి చెయ్యి పట్టుకుని చేయిస్తాడు.కాని ఆ తర్వాత శిష్యుడే స్వంతంగా ప్రయాణం చెయ్యాలి.మూలాధారం నుంచి ఇన్ని చక్రాలు దాటుతూ వచ్చిన దూరం కంటే ఆజ్ఞ నుంచి సహస్రారం వరకు దూరం చాలా ఎక్కువ.అక్కడి వరకూ గురువు తోడుంటాడు.ప్రతి స్టేజిలో ఎలా ఉంది? ఇప్పుడు నీ అనుభవం ఏమిటి? అని అడుగుతూ సరిచేస్తూ తోడుగా వస్తాడు.కాని ఆజ్ఞాచక్రం తర్వాత ఒంటరి ప్రయాణమే.అక్కడ అధిదేవతలు హాకిని యాకిని.అంటే 'హ','య' అనే శబ్దాలు.అదే 'హయ' అయ్యి ఉండవచ్చు.'హయగ్రీవం' అంటే అదే. దీని రహస్యార్ధం ఏమిటంటే, ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకూ ప్రయాణం చెయ్యగలిగిన సాధకునికి జ్ఞానం,ఆనందం,నిర్మలమైన స్పటికం వంటి వర్చస్సూ,అంతేగాక సర్వవిద్యలూ కలతలామలకములు అవుతాయి.అతని ముఖం గుండా, అంటే నోటిగుండా ఈ విద్యలు లోకానికి ప్రసరిస్తాయి. అదే హయముఖం లేదా హయగ్రీవం (గుర్రం ముఖం) అని రహస్యార్ధం లో చెప్పబడింది.' అని అతనికి చెప్పాను.

'ఈవిధంగా అప్పటికప్పుడు నాకు విషయాలు స్పురిస్తాయి.నిజాలోకాదో నాకూ  తెలియదు. నాకు తోచినది చెబుతున్నాను.'అన్నారు.

(మిగతాది రెండోభాగంలో)