Love the country you live in OR Live in the country you love

9, జూన్ 2013, ఆదివారం

త్రిశంకు స్వర్గం

ఎన్నో జన్మల ఆరాటంలో
కనిపించిందొక స్వర్గం 
ఎన్నో ఏళ్ళ సంఘర్షణలో 
అందిందొక పుంజం  

ఎన్నో దారుల వెతుకులాటలో 
ఎదురైందొక గమ్యం 
ఎన్నో తరాల తపోఫలంగా 
ఎగసిందొక హర్మ్యం 

అందరికీ అందని ఈ స్వర్గం 
కొందరికైనా అందించే సంకల్పం 
వద్దని వారించారు సహచరులు 
వృధా ప్రయాసన్నారు ఖేచరులు 

ఒక ప్రయత్నం చేద్దామనుకున్నా 
ఒక వెలుగుల తెర తీద్దామనుకున్నా
ప్రాణజలాల కాంతి సరస్సుకు
నలుగురినైనా నడుపుదామన్నా 

నా వంతు ప్రయత్నం చేస్తే 
నాతో వచ్చేవారికోసం చూస్తే
కనిపించిందొక విచిత్రం 

కొందరి కళ్ళకు గంతల్లు
కొందరి కాళ్ళకు సంకెళ్ళు  
కొందరి చేతుల బంధాలు 
కొందరి చెవులకు బిరడాలు 

కొందరు మనుషుల మంటారు
కొందరి మనసులు వ్యగ్రాలు 
కొందరు కొమ్ముల జీవాలు 
అమ్ముల పొదిలో ఆవాలు

కొందరికి లేవడమే అయిష్టం
కొందరి నడకే అతికష్టం
కొందరు మత్తున జోగారు
కొందరు నిద్రను మునిగారు

కొందరు కోరల సింహాలు 
కొందరు పాకెడి సర్పాలు
కొందరు ఆశల అగచాట్లు 
కొందరు మబ్బుల ఖగరాట్లు 

కొందరమాయక కుందేళ్ళు 
కొందరు బందీ పెంగ్విన్లు
కొలనున ఎగిరే పెలికాన్లు
కోపపు మాటల టైఫూన్లు

ఎత్తులు మరిగిన పాండాలు
ఏళ్ళు వచ్చినా పసివాళ్ళు
జిత్తులు నేర్చిన జంబుకులు 
మెత్తగ కోసెడి కత్తెరలు

కొందరు కోపపు తోడేళ్ళు 
గడ్డలు కట్టిన సెలయేళ్ళు 
ఎన్నోజన్మల ఎండలలోన 
ఎన్నడు ఉతకని మేజోళ్ళు 

నడకలు మరచిన తాబేళ్లు 
వెలుగును కోరని రాత్రిళ్ళు 
కర్మల బడిలో గుంజిళ్ళు 
కట్లు ఊడని మెడతాళ్ళు

ఆశలు అతిగా ఉన్నప్పటికీ
అడుగులు పడబోవెవ్వరికీ
ఆత్మవంచనల ముసుగులలోని
చీకటి నచ్చును అందరికీ

రెక్కలున్నా మరచి
ఎగరలేనీ నరులు 
వేళ్ళను విడచి వెలుగును
చేరలేనీ తరులు

ఆకాశాన ననుచూచి 
నవ్వుతూ నావాళ్ళు 
నేలనున్న నావారిని 
వీడలేని ఈ నేను...