“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జూన్ 2013, మంగళవారం

నరేంద్ర మోడీ జాతకం- 1

నిన్న నరేంద్రమోడీ మీద ఉంచబడిన బాధ్యతను గమనిస్తే ఆయన జాతకం ఒకసారి చూద్దామనిపించింది.

ఎందుకోగాని,చాలాసార్లు చాలా మంది ప్రముఖులవి అసలైన జాతక వివరాలు దొరకవు.ఒకవేళ దొరికినా అవి సరియైనవో కావో తెలియదు. కనుక తప్పు వివరాలతో జాతకాలు వెయ్యడం సరికాదు గనుకా ఒకవేళ వేసినా అవి ఎలాగూ సరిపోవు గనుకా ఆ ప్రయత్నం చెయ్యడం సాహసమే అవుతుంది.అయినా సరే కొంత ప్రయత్నం చేసి చూద్దాం.

మోడీ జనన వివరాల కోసం వెదికితే  మూడు రకాలైన సమాచారం దొరుకుతున్నది.

జననతేదీ 17-9-1950;వాద్ నగర్;మెహసాన జిల్లా;గుజరాత్.ఇంతవరకూ  కొంత క్లారిటీ ఉన్నట్లు కన్పిస్తుంది.ఆరోజున భాద్రపద శుక్లషష్టి, ఆదివారం,అనూరాధా నక్షత్రం అయింది.

జ్యోతిష్యవిద్య బాగా పట్టుబడితే కొన్ని సులువులు సూత్రాలు అర్ధమౌతాయి. వాటివల్ల, జాతకం వెయ్యకుండానే జననతేదీ నుంచి,తిధి వార నక్షత్రాలనుంచే జాతకుడి జీవితం చాలావరకు స్థూలంగా తెలిసిపోతుంది. అతని జీవితగమనం ఎలా ఉంటుంది,గమ్యం ఏమిటి అనే విషయాలు తెలిసిపోతాయి.

పై స్వల్ప పంచాంగ వివరాలను బట్టి ఈయనకు లోకంతో చాలా గట్టి రుణానుబంధం ఉందని తెలిసిపోతున్నది.అంతేగాక ఈయనది కష్టజాతకం అన్న విషయమూ తెలిసిపోతున్నది.

సరదాగా సంఖ్యాశాస్త్ర సాయం తీసుకుందాం.ఈయన జనన తేదీలోని శని, చంద్రుడు,కుజుడు,బుధుల ప్రభావం వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి.

ఈయన జీవితం నల్లేరు మీద నడకకాదు.చాలా కష్టం తర్వాతే ఫలం దక్కుతుంది.ముఖ్యంగా బాల్యం కష్టాలతో గడుస్తుంది.ఆధ్యాత్మిక కోణంలో జీవితాన్ని చూస్తాడు.చాలా పట్టుదల ఉన్న వ్యక్తి.తెలివైనవాడు అని ఈ స్వల్ప వివరాలవల్ల తెలుస్తున్నది.ఇవన్నీ నిజాలే అని ఈయన జీవితం చదివితే తెలుస్తుంది.

ఇంకొంచం లోతుగా జాతకాన్ని పరిశీలించాలంటే జనన సమయం కావాలి.అవి మాత్రం మూడు కనిపిస్తున్నాయి.ఇందులో ఏది సరియైన జనన సమయమో ముందుగా తేల్చిన తర్వాత, జాతకంలోని సూక్ష్మవివరాల జోలికి,భవిష్యత్తు జోలికి వెళ్ళాలి.దానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలను ఉపయోగిస్తాను.

10.11 hours -- ఈ సమయానికి చంద్రహోర నడుస్తున్నది. 
11.00 hours -- ఈ సమయానికి శనిహోర.
12.21 hours -- ఈ సమయానికి గురుహోర.

వీటిలో మొదటిది తులా లగ్నాన్ని ఇస్తున్నది.మిగిలిన రెండూ వృశ్చిక లగ్నాన్ని ఇస్తున్నాయి.ఇక విశ్లేషణ మొదలు పెడదాం.
  • తులాలగ్నం వారు అందంగా ఉంటారు.మోడీ అంత అందగాడు కాదు.
  • మోడీ పెదవులు కొంచం బండగా ఉంటాయి.అలా ఉండాలంటే వృశ్చిక లగ్నం అయ్యి ఉండాలి.కారణం అక్కణ్ణించి నవమం మీద రాహు దృష్టి.
  • ఈయన పైన ముగ్గురు జ్యేష్టులున్నారు.తులా లగ్నం అయితే అలా కుదరదు.వృశ్చికం అయితే సరిపోతుంది.
  • మోడీ చిన్నప్పుడు బస్టాండ్ లో టీ కొట్లో పనిచేశాడు.అలాంటి వృత్తి చిన్నప్పుడు ఉండాలంటే దశమానికి శని సంబంధం ఉండాలి.వృశ్చిక లగ్నానికే అది సరిపోతుంది.
  • మోడీ బ్రహ్మచారి.తులా లగ్నం అయితే లాభంలో శని శుక్రులవల్ల వివాహం అవ్వాలి,వివాహ జీవితం బాగుండాలి. సప్తమాధిపతి కుజుని కుటుంబస్తితివల్ల కూడా అదే జరగాలి.అదే వృశ్చికం అయితే, సప్తమాధిపతి శుక్రుని దశమ కేంద్రస్తితివల్లా,లగ్న శత్రువైన శనియుతి వల్లా వివాహం బాగా ఆలస్యం కావాలి లేదా అసలు ఆ యోగమే ఉండదు.లేదా వివాహ జీవితంలో వెలితి ఉంటుంది.రెండోదే కరెక్ట్ కనుక ఈయనది వృశ్చిక లగ్నమే.
  • ఇంకొక్క ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.తులా లగ్నం అయితే ఎప్పుడూ గడ్డం పెంచుకుని తిరగడు.వృశ్చికం అయితేనే అందులోని నీచచంద్ర కుజులవల్ల గడ్డంతో తిరిగే యోగం కలుగుతుంది.మోడీ ఎప్పుడు చూచినా గడ్డంతో దర్శనమిస్తాడు.కనుక ఈయనది వృశ్చిక లగ్నమే.
  • ఈయన పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు.కనుక వృశ్చిక లగ్నం అయితేనే చతుర్ధ గురునివల్ల రాజపరిపాలనా సంబంధ విద్య ఉంటుంది. అదే తులాలగ్నం అయితే ఆ యోగం లేదు.కనుక ఇలా చూచినా వృశ్చిక లగ్నమే కరెక్ట్ అని అనిపిస్తుంది.
పై ఏడు పాయింట్స్ వల్ల మొదటి సమయం కరెక్ట్ కాదు అని తేలుతుంది. మిగతా రెండు సమయాలలో ఏదైనా వృశ్చికలగ్నాన్నే ఇస్తుంది.వాటిలో ఏది కరెక్టో వచ్చే పోస్ట్ లో విశ్లేషణ చేసి చూద్దాం.ముందుగా జనన సమయాన్ని సరి చేస్తే, ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో తీరికగా దృష్టి సారించవచ్చు.