“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, జూన్ 2013, గురువారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు

వెంకటేశ్వరరావుగారి వద్దనుండి వచ్చిన తర్వాత ఆయన గురువుగారైన కళ్యాణానందభారతీస్వామి గురించి వివరంగా తెలుసుకోవాలనిపించింది. ఆయన జగద్గురువనీ శంకరపీఠాన్ని అధిరోహించిన విశిష్టవ్యక్తి అన్న విషయం నాకు తెలుసు.శ్రీవిద్యను గుంటూరు ప్రాంతంలో బాగా ప్రచారంలోకి తెచ్చిన సద్గురువని కూడా తెలుసు.

స్వామివారి గురించి చాలా ఏళ్ళ క్రితమే చదివి ఉన్నాను.కాని ఆయన యొక్క విధానం ఏమిటి?శ్రీవిద్యలో ఉన్నట్టి అనేక సాంప్రదాయాలలో వారియొక్క సాంప్రదాయమూ సిద్ధాంతమూ ఏమిటి?మొదలైన వివరాలు వారి వ్యక్తిగతశిష్యుల నుంచి విశదంగా తెలుసుకుందామని ఇచ్చ కలిగింది.వారి జననవివరాలు దొరికితే జాతకాన్ని పరిశీలిద్దామని కూడా అనుకున్నాను.

నేను చాలాసార్లు ఒక విషయం గమనించాను.ఏదైనా తెలుసుకోవాలని నాకు బలంగా ఇచ్చకలిగితే ఆ తర్వాత ఏమీ చెయ్యక్కరలేదు. కొద్ది రోజులలో దానికి సంబంధించిన మనుషులే నావద్దకు వస్తారు.దానికి చెందిన పుస్తకాలు వచ్చి చేరతాయి.దానికి అనుకూలమైన పరిస్తితులు కల్పించబడతాయి.ఇలా నా జీవితంలో లెక్కలేనన్నిసార్లు జరిగింది.

శ్రీవిద్య గురించి నేను మొట్టమొదటిసారిగా 1977 లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులలో తెలుసుకున్నాను.అప్పుడు తెనాలి సాధన గ్రంధమండలి వారు ప్రచురించిన గ్రంధాలద్వారా మొదటిసారిగా శ్రీవిద్య గురించీ, శ్రీచక్రార్చన గురించీ,ఈశ్వరసత్యనారాయణశర్మగారి గురించీ చదివాను. తొమ్మిది పది తరగతులలో క్లాసు పుస్తకాలకంటే ఆధ్యాత్మిక గ్రంధాలే ఎక్కువ చదివాను.తర్వాత అనేక ఊళ్లు తిరిగీ,అక్కడి లైబ్రరీలలో గ్రంధాలు మధించీ, అందులో కృత పరిశ్రములైన అనేకమంది మహనీయులతో చర్చించి, వ్యక్తిగత సాధనచేసి, దాని లోతుపాతులు అర్ధం చేసుకోగలిగాను.

బళ్లారిలో 'లా' చదివే రోజుల్లో కాలేజీలోకంటే ఎక్కువగా పాతబస్టాండ్  దగ్గరున్న వ్యాయామశాలలోనో లేకపోతే లైబ్రరీలోనో కాలం గడిపేవాడిని.బళ్ళారి లైబ్రరీలో ఉన్న అన్ని తెలుగు ఇంగ్లీషు ఆధ్యాత్మికగ్రంధాలనూ నేను కొద్ది రోజులలో చదివేశాను.

ఒక విషయం గురించి నాకెంత తెలిసినా కూడా నిజమైన పెద్దలవద్ద కూచున్నపుడు నాకు ఏమీ తెలియనట్లే భావించి వారు చెప్పేది వినడం నా అలవాటు.వారు చెప్పేది నాకు ఇప్పటికే తెలిసిఉన్నా కూడా,ఒకవేళ వారికంటే ఎక్కువ తెలిసి ఉన్నాకూడా అదేమీ వారిముందు ప్రదర్శించను.నాకు తెలిసిన విషయాల గురించికూడా మళ్ళీ ప్రశ్నలు అడిగి వారేమి చెప్తారో అని వినయంగా పరిశీలించడం నా పధ్ధతి.ఈ పధ్ధతి నాకు ఎంతో ఉపయోగపడింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే వీలు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా, ఉండాల్సిన సరుకు లేకుండా అనవసర పెద్దరికాలు ప్రదర్శించేవారికి బడితెపూజ చెయ్యడం కూడా నాకు భలేసరదా.

అలా మూడునాలుగు రోజులు గడిచాయి.ఒకరోజున ఆఫీస్లో పని చేసుకుంటూ ఉన్నాను.తలుపు దగ్గర 'మే ఐ కమిన్' అని వినిపించింది.ఎవరా అని చూస్తూ 'ప్లీస్ కమిన్' అన్నాను.నాకు పాత పరిచయస్తుడైన 'శర్మగారు' అనబడే ఒకాయన నవ్వుతూ లోపలకు వచ్చాడు.ఆయన అసలు పేరు నాకు తెలియదు.'శర్మగారూ' అని మాత్రమె ఆయన్ను పిలుస్తాం.

కుశల ప్రశ్నలు అయ్యాక, 'ఏమిటి ఇలా వచ్చారు?' అంటూ అడిగాను.

'నేను రిటైరై 26 ఏండ్లు అయింది.అంటే నాకిప్పుడు 86 ఏండ్లు.రైల్వే నుంచి నాకు రావలసిన కొంత డబ్బు బాకీ ఉండిపోయింది.దానికోసం ఎప్పుడో అప్ప్లై చేసాను.పట్టించుకున్నవారు లేరు.ఆఫీస్లో మళ్ళీ ఒక్కసారి కలిసి పోదామని వచ్చాను.మీరున్నారని తెలిసి ఇలా వచ్చాను.'అన్నాడు.

'మీకు రావలసిన డబ్బు ఎంత? అడిగాను.

"రెండువేలు.దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది కదా వదిలిపెట్టడం ఎందుకు అని వచ్చాను." అన్నాడాయన.

'సరే' అంటూ దానికి సంబంధించిన స్టాఫ్ ను పిలిచి అంత పెద్దాయనను అంతలా ఎందుకు తిప్పుతున్నారని మందలించి ఆ ఫైల్ ఎక్కడుందో తీసి ఆయన డబ్బు ఆయనకు త్వరగా వచ్చేటట్లు చూడమని ఆదేశించాను.

'టీ' తీసుకుంటారా? ప్యూన్ ను పిలవడం కోసం బెల్ నొక్కబోతూ అడిగాను.

'వద్దు.టీ కాఫీ అలవాటు మొదటినుంచీ లేదు.కొత్త అలవాట్లు ఇప్పుడెందుకు?' అన్నాడాయన బోసినోటితో నవ్వుతూ.

'సరే.ఈ వయసులో కూడా మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నారు' అడిగాను.

'అవును.నేను అన్నం మానేసి నాలుగేళ్ళు అయింది.పగలు ఒక గ్లాసు రాగిజావ తాగుతాను.రాత్రికి పాలూ ఓట్స్ తీసుకుంటాను.అంతే నా ఆహారం. రోజూ బాగా నడుస్తాను.' అన్నాడు.

'కాలక్షేపం ఎలా?' అడిగాను.

'ఏముంది. మా స్వామివారు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేసుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ కాలం గడుపుతున్నాను.' అన్నాడు.

'ఎవరా స్వామివారు?' అడిగాను.

'ఆయన ప్రస్తుతం లేరు.ఆయన పేరు కల్యాణానందభారతీ స్వామి.' అన్నాడు.

లోపల్లోపల నవ్వుకుని మనసులోనే జగన్మాతకు ప్రణామం చేశాను.

కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ తెనాలి రామలింగేశ్వరపేటలో తానుంటున్న అడ్రస్ ఇచ్చి వీలున్నపుడు రమ్మని చెప్పాడు.తన దగ్గర స్వామివారు వ్రాసిన చాలా పాత పుస్తకాలున్నాయనీ అవి జీర్ణస్తితికి చేరాయనీ జాగ్రత్తగా ఉంచుకునే వారికి ఇద్దామని అనుకుంటున్నాననీ చెప్పాడు.

'వచ్చే ఆదివారం మీ ఇంటికి వస్తున్నాను.అప్పుడు వివరంగా మాట్లాడు కుందాం' అని ఆయనతో చెప్పాను.ఆయన సరేనంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.