“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, జూన్ 2013, గురువారం

వడ్లమూడి వెంకటేశ్వరరావుగారితో సంభాషణ -2

శ్రీచక్రము విశ్వానికి సూచిక అని అంటారు కదా.

ఒకాయన ఇలా  అడిగారు.'అదేంటండి. అందులో అన్నీ గజిబిజిగా త్రికోణాలే ఉన్నాయి.విశ్వం వర్తులాకారం కదా. మరి పొంతన ఎలా కుదురుతుంది?'

ఒకరోజున రోడ్డుమీద పోతుండగా ఒక బండిదగ్గర పుచ్చకాయకు గాటుపెట్టి ఒక ముక్కను కోస్తున్నాడు అమ్ముకునే అబ్బాయి.ఆ ముక్క త్రికోణంలాగా బయటకు వచ్చింది.అడిగిన అతనికి చూపించాను. 

'చూడు వర్తులం నుంచి త్రిభుజం వచ్చింది కదా.అలాగే అనేక త్రిభుజాలతో నిండియున్న వర్తులం విశ్వం.దానికి సూచిక శ్రీచక్రం' అని చెప్పాను.

Sri Chakra is a replica of the Universe.బిందువు, వృత్తము, త్రిభుజి, చతుర్భుజి అనేవి లేకుండా ఏ యంత్రమూ లేదు.బిందువు అనేది విశ్వానికి మూలం.Bindu is a circle with no radius.So both are similar.బిందువును expand చేస్తే వృత్తం అవుతుంది.దానిని అనంతంగా expand చేస్తూ పోతే విశ్వం (యూనివర్స్) గా మారుతుంది.త్రిభుజి, చతుర్భుజి,పంచభుజి ఇలా ఉన్నాయి కదా.విశ్వాన్ని ఒక infinite sided polygon అనుకుంటే దానిని మినిమైజ్ చేసుకుంటూ వస్తే మనకు మిగిలేది ఒక triangle.ఎందుకంటే అతి తక్కువరేఖలతో ఏర్పడే జ్యామెట్రీకల్ ఆకారం త్రిభుజి మాత్రమె.కనుక బిందువు,త్రిభుజి,వృత్తం,చతుర్భుజి అలా శ్రీచక్రం ఉంటుంది.

బిందువు శైవం.త్రికోణం శాక్తేయం.చతుర్భుజి వైష్ణవం.ఒకసారి చిన్మయ మిషన్ వారు నన్ను ఉపన్యాసం చెప్పమని అడిగారు. సరేనని వెళ్లాను. 'నాకు వేదాంతం తెలియదు.లెక్కల మేష్టార్ని కాబట్టి లెక్కలు చెప్పమంటే చెబుతాను' అని వారితో అన్నాను.

'ఏదో ఒకటి మీకు తెలిసినది చెప్పండి మాస్టారు.' అని వారన్నారు.

ముందుగా గ్రహాల ఆర్బిట్స్ నుంచి మన వారాలు ఎలా వచ్చాయో వారికి చెప్పాను.ఈ విషయం చాలామందికి తెలియదు.వారాల వెనుక గ్రహముల ఆర్బిట్స్ యొక్క క్రమం ఉన్నది.ఈ విషయం వారికి చెప్పిన తర్వాత,ఇంకో  విషయం చెప్పాను.భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఎన్నో విషయాలు బోధించాడు.రకరకాల ఫిలాసఫీస్ అన్నీ చెప్పాడు.అతని సందేహాలన్నీ తీర్చాడు.చివరికి విశ్వరూపం చూపించాడు. ఎందుకు? ఎన్ని చెప్పినా ఎన్ని వివరించినా చివరికి దర్శనం కానిదే సందేహం తీరదు.విషయం స్పష్టంగా ఎదురుగా కనిపించాలి.అప్పుడే సందేహం తీరిపోతుంది.కనుక విశ్వరూపం చూపించాడు.

అప్పుడు అర్జునుడు ఇలా ప్రార్ధించాడు.'తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే' అంటే సహస్ర బాహువులతో ఉన్న నీవు (infinite sided polygon) చతుర్భుజో భవ (become a square) నాలుగు భుజములతో ఉన్న నీ రూపాన్ని తిరిగి ధరించు అని వేడుకున్నాడు.కనుక వైష్ణవం అంటే చతుర్భుజి.అంటే నాలుగు వైపులకూ వ్యాపించే తత్త్వం.అదే శ్రీచక్రపు బాహ్య ఆవరణ అయినట్టి భూపుర త్రయం.

ఈరోజులలో మనకు దొరికే శ్రీచక్రాలూ మేరుప్రస్తారాలూ సరియైన కొలతలతో ఉన్నవి కావు.కొలతలు ఖచ్చితంగా లేనప్పుడు యంత్రానికి శక్తి ఉండదు. బజార్లో అమ్మేవాటిని కొనుక్కుని తెచ్చుకునేవారే గాని స్వయంగా తయారు చేసుకోగలవారు నేడు ఎవ్వరూ లేరు.యంత్రాలలోని దళాలను రకరకాలుగా చిత్రిస్తారు.ఆకులలాగా కొందరు చిత్రిస్తే,చివరలు వేలాడుతున్న ఆకులలాగా కొందరు చిత్రిస్తారు.ఇవన్నీ తప్పులే.దళం అంటే half circle.అది ఆ షేప్ లో ఉంటేనే సరిగ్గా ఉన్నట్లు లెక్క. యంత్రం అంటే ఖచ్చితమైన మేధమేటికల్  ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక జ్యామెట్రికల్ షేప్.అంతేగాని అది చిత్రకారుని ఊహ కాదు.ఎవరిష్టం వచ్చినట్లు వారు దానిని గీయకూడదు.ఒకవేళ గీస్తే దానిలో రావలసిన శక్తి అక్కడ రాదు.

విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్తాపించేటప్పుడు రెండు శ్రీచక్రాలను స్వయంగా పోత పోశారు.కోణాలు కొలతలు ఖచ్చితంగా ఉండేటట్లు ఏమీ తేడా లేకుండా ఉండేటట్లు సరిగ్గా డిజైన్ చేసి ఆ యంత్రాలను పోత పోశాడు.వాటిలో ఒకదానిని విద్యానగర(విజయనగర)సామ్రాజ్య  శంకుస్థాపనలో ఉంచాడు.ఒకదానిని తన అనుష్టానంలో ఉంచి నిత్యమూ దానిని పూజించేవాడు.అవి సరిగ్గా 5x5 అడుగుల ప్రమాణంలో ఉంటాయి.ముస్లిం దండయాత్రలలో విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత పీఠాన్ని రక్షించడానికి దానిని అనేక ఊర్లు తిప్పగా చివరకు గుంటూరు వచ్చి స్థిరపడింది. ఆయన పూజించిన శ్రీచక్రం అరండల్ పేట నాలుగో లైన్లో ఉన్న శ్రీపీఠంలో ఉన్నది.ఒకసారి వెళ్లి చూడండి.దానిని కల్యాణానంద భారతీ స్వామి పూజించేవారు.

బిందువు అంటే పరమశివుడు.త్రికోణం అంటే శక్తి.'చిదగ్ని కుండ సంభూతా' అని లలితానామాలలో ఉన్నది.చిదగ్నికుండం అంటే బిందుసహిత త్రికోణం.ఇది శ్రీ యంత్రంలో లోపలగా ఉంటుంది.చతురస్రం అంటే బయటగా ఉన్న భూపురత్రయం.చతుర్భుజం అనేది symmetrical outward expansion in four directions సూచిక. బిందువు,త్రికోణం,చతుర్భుజం-ఈ మూడూ లేకుండా ఏ యంత్రమూ ఉండదు.

సరిగ్గా తయారు చేసిన యంత్రంలో శక్తి ఉంటుంది.ఇది అనుభవంలో చూడవచ్చు.ఒకసారి ఒకరి ఇంటిలో మిత్రుడు అద్దంకి కృష్ణమూర్తిగారు హోమం చేస్తున్నారు.ఆ ఇంటి నేలలో బండల మధ్యన చిన్న ఖాళీలుగా ఉన్నాయి.ఆయనకు తెలీకుండా హోమగుండం కింద నేలలో నేనొక యంత్రాన్ని ఉంచి కాలేజీకి వెళ్లాను.హోమం మొదలైంది.వెంటనే రమ్మని కృష్ణమూర్తిగారు నాకు ఫోన్ చేసారు.వచ్చి చూచాను.'ఏం చేశావయ్యా నీవు? హోమం చేస్తుంటే ఒకటే చెమటలు పడుతున్నాయి.ఏదో తేడాగా ఉన్నది.చెప్పు?' అని ప్రశ్నించాడు.అప్పుడు చెప్పాను.'ఒక  యంత్రాన్ని మీకు తెలియకుండా హోమగుండం కింద ఉంఛి కాలేజీకి వెళ్లాను.'అని.

'ఏ యంత్రాన్ని అక్కడుంచారు?' అని వింటున్న నేను అడిగాను.

'వనదుర్గా యంత్రాన్ని అక్కడ ఉంచాను' అని వెంకటేశ్వరరావుగారు చెప్పారు.'ఈ రకంగా నేను చాలా టెస్ట్ లు చేశాను.యంత్రాలలో శక్తి ఉన్నమాట నిజమే.They do emit energy.'

'ఈ జ్యామేట్రికల్ షేప్స్ కు పంచభూతాలకు సంబంధం ఉన్నదికదా?' అని నేను ప్రశ్నించాను.  

'పంచభూత బీజాక్షరాలను మనం దళాలలో లిఖిస్తాం' అన్నారాయన.

'అది కాదు నేనడిగేది.అగ్నికి త్రిభుజం సూచిక కదా.ఎందుకంటే అగ్ని ఊర్ధ్వముఖంగా ఎగురుతుంది.అలాగే ఊర్ధ్వముఖంగా ఉన్న త్రిభుజం కూడా అగ్నిని సింబలైజ్ చేస్తుంది కదా'. అన్నాను నేను.

'అవును.కొన్నిగ్రంధాలలో పంచభూతాలకు సింబల్స్ ఇవ్వబడ్డాయి. యంత్రా లలోని ఆకారాలు సింబల్స్ మాత్రమే.' అన్నారాయన.'ఇదంతా మా గురువుగారైన కళ్యాణానంద భారతీస్వామివారు పెట్టిన భిక్షే.' అన్నారు.

కల్యాణానంద భారతీస్వామి 1900 ప్రాంతంలో BA కెమిస్ట్రీ చేశారు.అప్పట్లో కోస్తా ప్రాంతంలో మూడే కాలేజీలుండేవి.ఒకటి గుంటూరు ఏసీ కాలేజి.రెండు విజయనగరం కాలేజి.మూడు రాజమండ్రి కాలేజి.ఆయన అప్పట్లోనే కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ గనుక శ్రీవిద్యను సైన్స్ తో మేళవించి చక్కగా వివరించ గలిగేవారు.ఏది ఎందుకు చెయ్యాలి?ఎలా చెయ్యాలి?అలా చెయ్యడంలోని అర్ధం ఏమిటి?దాని వల్ల కలిగే ఫలితం ఏమిటి? మొదలైనవి లాజికల్ గా, అధారిటేటివ్ గా చెప్పగలిగేవారు.

1930 ప్రాంతాలలో ఆయన లలితా సహస్రనామాల మీద వ్యాఖ్యానం ఇస్తూ ఉపన్యాసం చెబుతున్నారు.అప్పట్లో ఆ ఉపన్యాసాలు వినడానికి తెనాలి నుంచీ ఇంకా చుట్టుపక్కలనుంచి అనేకమంది పండితులు ప్రముఖులు  ఇతరులు చాలామంది వచ్చేవారు.ఆ సందర్భంలో 'కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా' అనే నామాన్ని వివరిస్తూ ఒక్కక్షణం ఆగి 'అరే.ఇందులో పాశుపతాస్త్ర మంత్రం దాగి ఉన్నదయ్యా' అన్నారు. తర్వాత టాపిక్ మారిపోయింది.ఎవరూ దానిగురించి అడగలేదు.దానిని విన్న మా నాన్నగారికి మాత్రం అది మనసులో ఉండిపోయింది.అలా కొన్నేళ్ళు గడిచాయి. 

1944 లో స్వామివారికి పెద్దజ్వరం వచ్చింది.సంధిలాగా వచ్చి మగతలోకి పోతూ వస్తూ ఉన్నారు.చివరి ఘడియలు వచ్చాయని ఆయనకు అనిపించి, తనను మంచంనుంచి దించి దర్భశయ్య మీద పడుకోబెట్టమన్నారు. చుట్టూ దిగ్బంధనం చెయ్యమని ఏ ఏ మంత్రాలతో చెయ్యాలో కూడా ఆ స్తితిలోనే రాసి ఇచ్చారు.పక్కనే మా నాన్నగారున్నారు.ఆపుడు ఆయనకు పాశుపతాస్త్ర  మంత్రం సంగతి గుర్తుకు వచ్చింది.ఒకవేళ స్వామివారు పోతే ఆ మంత్రం లోకానికి అందకుండా పోతుందేమో అని భయంభయంగా స్వామివారిని అడిగారు. వెంటనే కాగితం తెమ్మని చెప్పి,స్వామివారు ఆ మంత్రాన్ని వ్రాసి ఇచ్చారు.ఆ కాగితం మా నాన్నగారు భద్రంగా దాచిఉంచారు.' అని చెబుతూ వెంకటేశ్వర రావుగారు లేచి లోపలకు వెళ్ళారు.

కొద్దిసేపట్లో ఒక చిన్న కవర్ లాంటి  కాగితంతో బయటకు వచ్చి చూడమని దానిని మాకిచ్చారు.ఒక చిన్న కాగితం మీద గజిబిజిగా బీజాక్షరాలతో ఆ మంత్రం లిఖించి ఉన్నది.దానిని జాగ్రత్తగా  ఇంకొక మందపాటి కాగితానికి అంటించి దానిని ఒక కవర్ లాగా మడిచి జాగ్రత్తగా దాచి ఉంచారు.పక్కనే ఏ తేదీన ఇది జరిగిందో కూడా రికార్డ్ చేసి పెట్టారు. దాని తర్వాత స్వామివారికి నెమ్మదించింది.అప్పటికి గండం గడిచి బయటపడి తర్వాత 1955 లో ఆయన గతించారు.

స్వామివారు ఆజానుబాహుడు. పచ్చని పసిమి చాయతో ఉండేవారు. మంత్రోపాసనా బలంవల్ల ఆయన అన్న మాటలు అన్నట్లు జరిగేవి.1952 లో నాగపూర్ లో ఎమ్మెస్సీ మేథ్స్ లో నాకు సీటోచ్చింది.వెళ్లబోయే ముందు స్వామివారి ఆశీర్వచనానికై వెళ్లి కనిపించాను.'ఆచార్యత్వం అన్నమాట'- అని సాలోచనగా అన్నారు.తదుపరి నేను మేథ్స్ లెక్చరర్ గా పనిచెయ్యడమే కాక ఇప్పటికి నూరు పైగా దేవతాప్రతిష్టలు జరిపించాను. స్వామివారు అన్నమాట అలా నెరవేరింది అనిపిస్తుంది.

స్వామివారు యువకునిగా ఉన్న రోజులలో శ్రీవిద్య అంతా గందరగోళంగా ఉండేది.పంచమకారాలు ఉపయోగించేవారు.శ్రీయంత్రానికి బెల్లం, అల్లంముక్క ఇత్యాది ద్రవ్యాలతో ఉపచారాదులు చేసేవారు. వామాచారం ఎక్కువగా ఉండేది.అది చూచి స్వామివారు చాలా బాధపడ్డారు.ఎంత గొప్ప మహావిద్య ఇది? ఇలా దిగజారింది ఏమిటి? అని బాధపడి దాన్నంతా సంస్కరించి ఒక శిష్టాచార విధానాన్ని తయారుచేసి దానిని శిష్యులకు నేర్పించి శ్రీవిద్యా సాంప్రదాయాన్ని మళ్ళీ నిలబెట్టారు.

ఆయన గుంటూరులోని తన శిష్య బృందాన్ని అంతా ఒకచోటకు చేర్చి వారికి ఇలా చెప్పారు.'మీకు శ్రీవిద్యను బోధించాను.దానిని శ్రద్దగా అనుసరించండి. మీలో మీరు కలహాలు లేకుండా చక్కగా కలసిమెలసి ఉండండి.లేకుంటే మీరు నాశనం అవుతారు జాగ్రత్త' అని హెచ్చరించారు.
  
మునుపు గుంటూరు ప్రాంతంలో శ్రీవిద్య లేదు.ఎక్కువగా ఈస్ట్ లో ఉండేది.విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలలో బాగా వ్యాప్తిలో ఉండేది.దానికి  ఈశ్వర సత్యనారాయణశర్మగారు కారకులు.ఆయన శ్రీవిద్యలో చాలా ఎత్తుకెదిగిన మహానుభావుడు.అయితే వారి శిష్యులు ఎక్కువగా వామాచారాన్ని అనుసరిస్తారు.సమయాచారం అని అంటారు గాని వామాచారం ఎక్కువగా ఉంటుంది.ఆయన పుస్తకాలను తెనాలి సాధన గ్రంధమండలి వారు ప్రచురించారు.

పూర్వమీమాంసావాదులు దేవతలనేవారు అసలు లేరని అంటారు.శబ్దాల యొక్క ఉచ్చారణ వల్ల ఆయా స్పందనలు రూపాన్ని ధరించి దేవతా రూపాలలో కనిపిస్తాయి అని వారి భావన. కనుక శబ్దానికి చాలా విశిష్టత ఉన్నది.శబ్దమే ultimate.జగత్తు శబ్దం నుంచే ఉద్భవించింది.నామం రూపం.నామం నుంచి రూపం పుట్టింది.మంత్రం అంటే శబ్దమే కదా.

'నాదొక చిన్న ప్రశ్న'- అంటూ నేను మధ్యలో అడిగాను.

'చెప్పండి' అంటూ ఆగారు ఆయన. 

'మీరిందాక  దిగ్బంధనం గురించి చెప్పారు కదా.దిగ్బంధనం అనేది ఎలా జరుగుతుంది? ఎవరైనా సరే ఆ మంత్రాన్ని చదివితే దిగ్బంధనం అయిపోతుందా? అలా జరిగినట్లు మనకు ప్రాక్టికల్ గా కనిపించడం లేదు. అలాగే,ఇందాక ప్రత్యన్గిరా మంత్రాన్ని గురించి మీరు వివరిస్తూ 'తిరిగి వెనక్కు వెళ్ళు' అని ఆ శక్తిని ఆజ్ఞాపిస్తాం అన్నారు.ఆ మంత్రాన్ని ఎవరు చదివినా ఆ శక్తి ఆ ఆజ్ఞను తలదాలుస్తుందా? లేక సాధకునికి ఏవైనా ప్రత్యెక క్వాలిఫికేషన్స్ ఉండాలా? ఊరకే మంత్రాన్ని చదివితే పని జరిగినట్లు ఎక్కడా దాఖలాలు లేవు కదా.దీనిని కొంచం వివరించండి.' అడిగాను.

'ప్రతి మంత్రానికీ కొంత జపసంఖ్య ఉంటుంది.అది పూర్తి అయితేనే ఆ మంత్రం యాక్టివేషన్ జరుగుతుంది.తర్వాత ప్రయోగ ఉపసంహారాదులు చెయ్యవచ్చు.సామాన్యంగా అక్షరలక్షలు అంటారు.లేదా ఒక లక్ష జపసంఖ్యను సాధారణంగా నిర్దేశిస్తారు.ముందు అది పూర్తి కావాలి.అపుడు  మంత్రం యొక్క బేసిక్ యాక్టివేషన్ జరుగుతుంది.' అన్నారు.

'ఒకసారి ఆ జపసంఖ్య పూర్తి అయితే సరిపోతుందా? ఎందుకంటే స్వయానా విద్యారణ్యస్వామే గాయత్రిని ఒక పునశ్చరణ చాలక అనేక పునశ్చరణలు చేసినట్లు చెప్తారు కదా?' అన్నాను.  

'అవును.అది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరమూ చెప్పలేము.యాక్టివేషన్ జరిగేంత వరకూ చేస్తూనే ఉండాలి.కొందరికి త్వరగా సిద్ధిస్తుంది.కొందరికి చాలా ఏళ్ళు పడుతుంది.అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది.ఎవరి అనుభవం వారిది.ఎవరి సాధన వారిది.నియమపూరితంగా లక్షసార్లు జపం అనేది మినిమంగా తీసుకోవాలి.ఆ పైన ఎంత పడుతుందో ఎవరూ చెప్పలేరు.దేవత ఒకటే అయినా ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కలాగా ఉంటుంది.అన్నీ సత్యాలే.' అన్నారు.

'అవును.దేవత ఒకటే. కాని మనం వేర్వేరుగా ఉన్నాం కదా.అందుకే అనుభవాలూ వేరుగా ఉంటాయి' అని నేను  నవ్వుతూ అన్నాను.

ఇంకా మాట్లాడుతూ 'శ్రీవిద్య చాలా గొప్పది.రామకృష్ణ పరమహంస మహానుభావుడు.అన్ని సాధనలు ఆయనకు కరతలామలకాలే.ఆయన అందరు దేవీ దేవతల దర్శనాలు పొందినవాడు.కాని అందరు దేవీ దేవతలు ఒక ఎత్తు అయితే షోడశి ఒక ఎత్తు అని ఆయన అన్నారు. షోడశి దర్శనం చాలా అద్భుతంగా ఉన్నదని ఆయన చెప్పారు.' అన్నారు.

ఈ మాటలు వింటుంటే శారదానందస్వామి వ్రాసిన 'శ్రీ రామకృష్ణ ది గ్రేట్ మాస్టర్' అన్న పుస్తకం నుంచి "Tantric sadhana" అన్న చాప్టర్ లోని ఈ వాక్యాలు నాకు గుర్తుకొచ్చాయి.

Besides the visions mentioned above,there was no limit to the number of the Devi's forms,ranging from the two-armed to the ten-armed,that he saw during this period.Again,some of them engaged themselves in conversing with him and gave him various instructions.Although all those forms of Hers were of extraordinary beauty,we were told by him that they were not worth comparison in that respect with that of Sri Rajarajeswari otherwise called Shodasi.The Master said-"I saw in a vision the beauty of the person of Shodasi which melted and spread all around illumining the quarters".

చాలాసార్లు చదివిన ఈ వాక్యాలు మదిలో మెదలగా ఏమీ జవాబివ్వకుండా మౌనంగా వింటూ ఊరుకున్నాను. 

(మిగతాది మూడో భాగంలో)