“Self service is the best service”

16, ఏప్రిల్ 2013, మంగళవారం

ఆత్మారామత్వం

నీరవ నిశీధిలోన
ఏకాంతపు మందిరాన 
మధురవేణు నాదమొకటి 
మది లోతుల మ్రోగింది 

ఐదుతాళ్ళ పంజరాన 
అఘోరించు రామచిలుక 
విశ్వపు టంచుల దారుల  
విహరించగ ఎగిరింది 

కట్టుకున్న తాళ్ళన్ని 
వాటికవే వదిలిపోవు 
ఉత్తరేణి మంత్రమొకటి 
ఊరకనే దొరికింది

గుదిబండలు వదిలిస్తూ 
గుంజాటనలను  తెంపెడి 
గూఢమైన దారి చేరు  
గుట్టు ఒకటి తెలిసింది 

అంతరాళ సీమలోన 
అమేయమౌ రహస్యాల 
ఆచూకీ తెలియజేయు 
ఆత్మ ఒకటి కలిసింది 

చీకటి ముసుగేసుకున్న 
చేతనాన్ని మందలించి 
చల్లనైన వెలుగొక్కటి
చిరునవ్వులు చిమ్మింది 

అనవసరపు బరువు వదలి 
ఆద్యంతం తేలికపడి 
ఆత్మ ఒకటి తేలిపోయి
అనంతాని కెగసింది

ఏదో ఉందను భ్రమలను 
చిక్కుకున్న వెర్రిమనసు  
ఏమీ లేదని తెలియగ 
ఎంతో ఉప్పొంగింది 

ఎదురుచూపు లెందుకనుచు 
ఆధారము లన్నివదలి 
ఆత్మయందు ఆత్మనిలిచి 
అవ్యయముగ చెలగింది  

మబ్బులన్ని వీడిపోయి 
మసకలింక తొలగిపోయి
అవధిలేని ఆనందం 
ఆత్మలోన పొంగింది