“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, ఏప్రిల్ 2013, ఆదివారం

వీరవిద్యాభ్యాసం -1

మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు టెన్త్ క్లాస్ చదివే రోజులనుంచి ఒక వ్యసనం.అది ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.మధ్యలో జరిగిపోయిన మూడున్నర దశాబ్దాల కాలంలో రకరకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం,వాటికోసం తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలు తిరగటం, వాటితో ప్రయోగాలు చెయ్యడం,స్కూల్స్ నడపడం,ఆ రాజకీయాలతో విసుగు పుట్టి,వాటినుంచి విరమించుకుని నా సొంత స్టైల్ నేను తయారు చేసుకోవడం, యోగానికీ తంత్రానికీ వీరవిద్య్లకూ ఉన్న సంబంధం మీద రీసెర్చి చెయ్యడం ఇలా అనేక మజిలీలుగా కధ సాగింది.

ఈ వీడియోలో  కుంగ్ ఫూ లోని అనేక శాఖలలో ఒకటైన వింగ్ చున్ సిస్టం కి సంబంధించిన మొదటి ఫాం "సిల్ లుం టావో" ని అభ్యాసం చెయ్యడం చూడవచ్చు.


వీరవిద్యల అభ్యాసం ఒక దండగ అని అనేకమంది అనుకుంటారు.చాలామందికి డబ్బు సంపాదించడానికి పనికొచ్చేవి గాక మిగిలిన పనులన్నీ టైంవేస్ట్ కింద లెక్క.వారి అజ్ఞానానికి నా జోహార్లు. జీవితంలో ప్రతిదాన్నీ ఒక వ్యాపారంగా చూచేవారికి నేనేం సమాధానం చెప్పలేనుగాని ఒక్కవిషయం చెప్పగలను.వీరవిద్యల అభ్యాసం మనిషికి అనేక లాభాలనిస్తుంది.
  • ఒకటి -అభ్యాసి ఆరోగ్యం బాగుంటుంది.
  • రెండు -ఎంత వయసొచ్చినా ఫిట్నెస్ చెక్కు చెదరదు.
  • మూడు -ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది.
  • నాలుగు -బిడియం పిరికితనం మటుమాయం అవుతాయి.
  • అయిదు-అవసరం వస్తే ఆత్మరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది.
  • ఆరు-అన్నిటికంటే ముఖ్యమైనది.దీనిని చివరివరకూ వదలకుండా అభ్యాసం చేస్తే,వేదాంత-యోగ-తంత్ర ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. దానివల్ల మనిషికి అంతిమ సంతృప్తి,జీవన సాఫల్యతా కలుగుతాయి. అయితే ఆస్థాయి వరకూ నేర్చుకునే వారూ ప్రస్తుతం ఎవరూ లేరు. నేర్పేవారూ ఎక్కడా దొరకరు.ఎందుకంటే నేటి మనిషి జీవితం "ర్యాట్ రేస్" లోనే గడచి పోతోంది.అందులో పడి ఉదాత్తమైన అంశాలను స్పృశించే సమయమూ ఓపికా ఎవరికీ ఉండటం లేదు.అది వేరే సంగతి.
మార్షల్ ఆర్ట్స్ అంటే ఉత్త ఫైటింగ్ మాత్రమే అనుకోవడం చాలా అపరిపక్వమైన  అవగాహన.నిజానికి అది క్రమేణా అభ్యాసిని 'జెన్' వైపు తీసుకెళుతుంది. ఎందుకంటే ప్రపంచానికి 'జెన్' ను పరిచయం చేసిన బౌద్ధ గురువు 'బోధిధర్మ' నే 'కుంగ్ ఫూ' విద్యకు కూడా మూలపురుషుడు కాబట్టి.

మార్షల్ ఆర్ట్స్ ను సరిగా, చివరివరకూ నేర్చుకుంటే అది యోగంగా మారుతుందని నేను వ్యక్తిగత అనుభవం నుంచి చెప్పగలను.