Love the country you live in OR Live in the country you love

30, ఏప్రిల్ 2013, మంగళవారం

ప్రకృతి నేర్పిన పాఠాలు

మాడ్చే వేసవి పగళ్ళు   
వెలిగించాయి జ్ఞానతేజస్సును 
చిమ్మచీకటి నిండిన రాత్రులు
కలిగించాయి తాంత్రికసిద్ధిని 

వణికించే చలికాలం 
ఇచ్చింది నిశ్చలసమాధిని 
మురిపించే వసంతం 
పెంచింది ప్రేమోన్మాదం  

పులకించే వానాకాలం 
ముంచెత్తింది అనుభవ వర్షం
మోడువారిన శిశిరం 
మోసుకొచ్చింది వైరాగ్యం 

పంచభూతాలే నేర్పాయి 
పంచ మకారాలను 
ప్రకృతే పరికింప చేసింది 
నీ నిత్యలీలావినోదాన్ని 

లోకమే నేర్పింది  
లోతైన పాఠాల్ని
శూన్యమే తెలిపింది
ఆత్మారామత్వాన్ని 

ప్రతి మనిషిలో చూచా 
ఒక వింత దీపాన్ని 
నీ ధ్యాసలో మరచా 
ఈ సమస్త ప్రపంచాన్ని ...