“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఏప్రిల్ 2013, బుధవారం

ఉగాది ఫలితాలు -2013 ఎలా ఉండబోతున్నది?

ఈరోజు సాయంత్రం 4.50 కి విజయ నామ సంవత్సర చైత్ర శుక్లపాడ్యమి మొదలు అవుతున్నది. సూర్యోదయాన్ని లెక్కలోకి తీసుకుంటే రేపు ఉగాది అవుతుంది.చాంద్రమానం ప్రకారం ఉగాది ఘడియలు మొదలు అవుతున్న నేటి 4.50 సాయంత్ర సమయానికి గ్రహస్తితి ఇలా ఉన్నది.ఈ కుండలిని బట్టి రాబోయే ఏడాది మన రాష్ట్రానికి ఎలా ఉంటుందో చూద్దాం.

హైదరాబాద్లో ఆసమయానికి కన్యాలగ్నం ఉదయిస్తున్నది.లగ్న దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో నీచ సంధిస్తితి వల్ల రాష్ట్ర పరిస్తితి ఏమంత గొప్పగా ఏమీ ఉండదు అనే విషయం కనిపిస్తున్నది.ఈరోజు వారాధిపతి నక్షత్రాధిపతి కూడా బుధుడే అవడం గమనార్హం.నాయకులలో అత్యాశ ఎక్కువైపోతుంది.పరిపాలన అనేది అద్వాన్నంగా గందరగోళంగా ఉంటుంది.రాష్ట్ర పరిస్తితి త్రిశంకుస్వర్గం అవుతుంది.ఆర్ధికరంగం బాగా దెబ్బతింటుంది.భూమికోసం కుమ్ములాటలు జరుగుతాయి.భూకుంభ కోణాలలో ఇరుక్కుని కొందరు నాయకులు దెబ్బ తింటారు.

లగ్నాధిపతి బుధుని సప్తమ స్తితివల్ల ఇంకోవిషయం అర్ధమౌతున్నది.రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా ఏ గట్టి నిర్ణయమూ తీసుకోలేని పరిస్తితి ఉంటుంది.ఏ విషయంలోనూ ఏమీ చెయ్యటానికి పాలుపోని స్తితి ప్రభుత్వంలో ఉంటుంది.

ధనస్తానంలో శనిరాహువుల స్తితివల్ల రాష్ట్ర ఆర్ధికరంగం దారుణంగా ఉంటుంది.వ్యక్తుల,గ్రూపుల అక్రమార్జనలు మాత్రం బాగా సాగుతాయి.  బ్లాక్ మనీ విపరీతంగా పెరుగుతుంది.

సప్తమంలో ఆరుగ్రహాల కలయిక వల్ల ప్రతిపక్షాలు బలంగా ఉంటాయి.అనేక విమర్శలతో ప్రభుత్వాన్ని ఎండగడతాయి.ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్తితి ఉండదు.అదే సమయంలో ప్రతిపక్షాలలో ఐకమత్యమూ ఉండదు.అవకాశవాద రాజకీయాలతో పాలన నడుస్తుంది.

కుజుని అస్తంగత్వస్తితి వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అసలు ఉందా లేదా అన్న పరిస్తితి కనిపిస్తుంది. 

నవమంలో శత్రుస్థానంలో గురుస్తితి వల్ల జనసామాన్యంలో (దొంగ)భక్తి విపరీతం అవుతుంది.దొంగ గురువుల చుట్టూ రాజకీయుల ప్రదక్షిణాలు ఎక్కువౌతాయి.హవాలా బ్లాక్ మనీ ఆశ్రమాలు పుట్టుకొస్తాయి.

చతుర్దంలో ప్లూటో వల్ల ప్రజలగతి అయోమయంలో పడుతుంది.ఆరింట నెప్ట్యూన్ వల్ల చాపకింద నీరులా ప్రభుత్వానికి శత్రుత్వం ఎక్కువౌతుంది.ఏడింట యురేనస్ వల్ల ప్రభుత్వానికి హటాత్తుగా గడ్డుసమస్యలు ఎదురౌతాయి.

ఏడాది పొడుగునా ఇవే పరిస్తితులు కొనసాగినప్పటికీ,ముఖ్యంగా ఇవి చైత్ర మాసానికి ఎక్కువగా వర్తిస్తాయి.అంటే రేపటినుంచీ వచ్చే నెలపాటు ఈ పరిస్తితులు స్పష్టంగా కనిపిస్తాయి.ఆయా మాసాల అమావాస్య కుండలులను బట్టి ముందు ముందు ఒక్కొక్క నెలనూ తర్వాత పరిశీలిద్దాం.

మొత్తంమీద విజయనామ సంవత్సరంలో మంచికీ మానవత్వానికీ పారదర్శకతకూ సుపరిపాలనకూ మాత్రం విజయం కనిపించడం లేదు.