“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, జనవరి 2012, మంగళవారం

మాయల మరాటీలు

"ఫలానా సామీజీ దర్శనం చేసుకుందాం వస్తారా ?" అడిగాడు మిత్రుడు. మిత్రుడి పేరును సంక్షిప్తంగా "కోపా" అని పిలుద్దాం.కోపా ఊళ్ళో అడుగుపెడితే నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు.ఎక్కడో ఒకచోట కలుసుకుని కొన్ని గంటలపాటు రకరకాల విషయాలమీద మాట్లాడుకోవడం జరుగుతుంది.ఎక్కువగా ఆధ్యాత్మికతే మా మాటల్లో దొర్లుతుంది.


"ఆయనంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు" చెప్పాను.


నా చిన్నతనంనుంచీ నిజమైన స్వాములను చూచి వారితో తిరిగి ఉండటంవల్ల, కొద్దిసేపు చూస్తె చాలు ఎవరు నిజమైన సాధువో ఎవరుకాదో నేను వెంటనే చెప్పగలను. కొద్దిసేపు వారి మాటలు వింటే చాలు, వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతలో ఉందో కూడా నాకు తెలిసిపోతుంది అని వినమ్రంగా చెప్పగలను. ఇది గర్వంతో చెప్పేమాట కాదు.


చిన్నతనంనుంచీ స్వీట్ల మధ్య పెరిగినవాడు ఏ స్వీట్ ఎలాంటిదో చూచి టక్కున చెప్పగలడు. ఇదే సూత్రం బిజినెస్ కి కూడా వర్తిస్తుంది. చిన్నతనం నుంచీ ఒక బిజినెస్ రంగంలో తిరిగినవారు దానికి సంబంధించిన కిటుకులు టక్కున పట్టుకోగలరు.ఆరంగంలో ప్రవేశం లేనివారు ఆపని అంత సులువుగా చెయ్యలేరు.ఇదీ అలాటిదే.ఏరంగంలోనైనా అనుభవం ఉన్నవారికి దానివిషయం టక్కున తెలిసిపోతుంది.ఇది అనుభవంతో వచ్చే నైపుణ్యం.అంతేకాని ఇదేదో అతీతశక్తి అనుకోకూడదు.


చాలా ఆశ్రమాలలో జరిగే తంతులు నాకు అస్సలు  నచ్చవు.ముఖ్యంగా రాజకీయులకూ మతగురువులకూ ఉండే అక్రమసంబంధాలు,డబ్బుకోసం నడిచే దొంగనాటకాలు నాకు కంపరం పుట్టిస్తాయి. అందుకని నాకు ఆషామాషీ స్వామీజీలు నచ్చరు. నిఖార్సైన వజ్రంలా ఉండేవారినే నేను ఇష్టపడతాను.అలాటివారు ప్రస్తుతం ఎక్కడాలేరు. కనుక ప్రస్తుతసమాజంలో చెలామణీలో ఉన్న ఏస్వామీజీ అయినా సరే నాకొక బఫూన్ లాగే కనిపిస్తాడు.


కర్మకాలి ఇంతకు ముందు ఒకటి రెండుసార్లు ఈ స్వామీజీ ఆశ్రమానికి నేను వెళ్లి ఉన్నాను.ఆ సమయానికే జరుగుతున్న కొన్ని వ్యవహారాలు నా కంట పడటమూ, ఇక దానితో మళ్ళీ ఆ చాయలకు నేను వెళ్ళకపోవడమూ  జరిగింది. అదే విషయం కోపాతో చెప్పాను. "అలాటివి పట్టించుకోకూడదు. ఆ స్వామీజీకి మంత్రశక్తులున్న మాట నిజమే" అని కోపా అన్నాడు. "ఉంటే ఉంచుకోమనండి నాకు వాటిమీద పెద్దగా ఆసక్తి లేదు" అంటూ, పోనీలే అడిగాడు కదా ఒకసారి వెళ్లిచూద్దాం అనిపించి, "సరే మీతో కలిసి వస్తాలే" అని చెప్పాను. "నాకేమీ సందేహాలు లేవు. స్వామీజీని మీరే ఏమైనా అడగండి." అన్నాడు కోపా. "నాదీ అదే పరిస్తితి. మీరు రమ్మన్నారు కదా అని మీతో వస్తున్నాను. లేకుంటే నేనా చాయలక్కూడా వెళ్ళను." చెప్పాను.


"సరే రామకృష్ణుడు గొప్పవాడా షిర్డీసాయి గొప్పవాడా? రామకృష్ణునికి గుళ్ళూ గోపురాలూ ఎందుకు లేవు? బాబాకి ఎక్కడ చూచినా ఎందుకు ఉన్నాయి? అని అడుగుతాను. మీరు గమ్మున ఊరుకోండి." అన్నాడు. 


"అలాగే. నేనేమీ మాట్లాడను. కనీసం నేను ఫలానా అని పరిచయం కూడా చేసుకోను.లోప్రొఫైల్లో ఉంటాను." అని ఒప్పుకున్నాను. కాకపోతే ఆరోజున ఆదివారమూ అమావాస్యా అయి కూచుంది. "కనుక ఆరోజు అక్కడ క్షుద్రహోమాలు చాలా జరుగుతాయేమో, అక్కడికి వెళ్లి వాటిని, వాళ్ళ ముఖాలను చూచే ఖర్మ మనకెందుకు. ఇంకో రోజు వెళ్లి చూద్దాంలే." అని అన్నాను. వాళ్ళ ఆశ్రమానికి కోపా వెళ్లి కనుక్కుంటే ఆరోజుకి ఒక నలభైమంది  పనికిమాలిన జనం అప్పటికే స్వామీజీ దర్శనార్ధం వచ్చి ఉన్నారనీ, ఆరోజు ఆయన దర్శనం కుదరకపోవచ్చుననీ తెలిసింది. పైగా అప్పుడే ఒక రాజకీయప్రముఖుని నుంచి కబురువస్తే ఈ స్వామీజీగారు పరిగెత్తుకుంటూ రాజకీయ అధికారి దర్శనార్ధం వెళ్ళాడని కోపా ఫోన్లో చెప్పాడు. నాకు బాగా నవ్వొచ్చింది. ఈ స్వామీజీలు ఇలాటిచోట్లే అడ్డంగా దొరికిపోతారు. రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే స్వామీజీ గోచీ ఊడుతున్నా చూసుకోకుండా పరిగెత్తిపోవడం ఏమిటో నా మట్టిబుర్రకు ఎంత తన్నుకున్నా అర్ధం కాలేదు.


"సర్వసంగపరిత్యాగికి రాజకీయాలతోనూ, నైతికంగా కుళ్ళిపోయిన నాయకులతోనూ పనేమిటి? స్వామి దర్శనార్ధం వారురావాలి గాని వారు పిలిస్తే వీరు పరిగెత్తిపోవడం ఏమిటి?" అడిగాను.


"అంటే, వారికీ వీరికీ ఏవో కొన్ని పనులుంటాయి కదా? వాటికోసం కొన్నికొన్ని చెయ్యక తప్పదు". అన్నాడు కోపా.


"అలాటప్పుడు "సర్వసంగపరిత్యాగి""పరమహంస పరివ్రాజకాచార్య" అంటూ వారికివారే తగిలించుకునే బిరుదుల  ప్రయోజనం ఏమిటి?వారు దేనిని పరిత్యజించినట్లు? ఒకసారి ఇందిరాగాంధీ తన దర్శనార్ధం వస్తే కంచిపరమాచార్య ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దానికి కారణం ఆమె ఎమర్జెన్సీ విధించడమూ, ఆ సమయంలో జరిగిన అకృత్యాలూనూ. ఆయన ఉన్న పూరిగుడిసెలోకి తడికెతలుపు తోసుకుని ఆమె వెళ్ళలేక కొన్నిగంటలు బైటే వేచిచూచి చివరికి తన సెక్యూరిటీతో సహా వెనక్కు వెళ్ళిపోయింది. అదీ స్వచ్చమైన తపశ్శక్తి  అంటే. అంతేగాని రాజకీయనాయకులు పిలవగానే వీరు పరిగెత్తి పోవడం కాదు."అన్నాను.


"మీకు నేను చెప్పలేనుగాని, రేపు స్వామీజీ ఖాళీగా ఉంటే మనం వెళదామా?" అడిగాడు.


"అలాగే. ఆశ్రమం వద్దకు మీరు వెళ్లి ఆయన ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చెయ్యండి. నేను వస్తాను." అని చెప్పాను.


సాయంత్రం ఆరు తర్వాత ఫోన్ మోగింది. "స్వామీజీ ఖాళీగా ఉన్నారు వచ్చెయ్యండి. మళ్ళీ కొద్దిసేపటిలో  ఆయన జన్మదిన సన్మానకార్యక్రమానికి వెళ్ళాలిట"  కోపా గొంతు మోగింది.


"స్వామీజీకి జన్మదినమా? అదేంటి?" మళ్ళీ నాకు సందేహం తలెత్తింది.


"అంటే ఆ పండుగను ఆయన చేసుకోకూడదు. భక్తులు చెయ్యవచ్చు." కోపా చెప్పాడు.


"రెంటికీ తేడా ఏంటి? ఆయన చేసుకున్నా వాళ్ళు చేసినా కార్యక్రమం జరుగుతుంది కదా?సన్యాసం స్వీకరించినవానికి సన్మానం ఏమిటి?జన్మదిన కార్యక్రమం ఏమిటి? ఇంకెక్కడి జన్మదినం? విరజాహోమంలో పాతజీవితం అంతా భస్మం అవ్వాలి కదా? అలాంటప్పుడు జన్మతేదీ ఎక్కడుంటుంది? దానికి మళ్ళీ సెలబ్రేషన్ ఏమిటి? "అడిగాను.


"బాబూ నీకు నేను చెప్పలేను గాని తొందరగా రా" అని ఫోన్లో వినిపించింది.నేను ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడేవో హోమాలూ అవీ మాంచి జోరుగా జరిగినట్లు పొగలు వస్తున్నాయి.అక్కడే బయట వేచి ఉన్న కొందరు పెద్ద మనుషుల్లా కనిపిస్తున్న వారిని "ఏమండీ స్వామీజీ ఉన్నారా? కలవొచ్చా?"అనడిగాను."ఆ! ఉన్నారు. ఎవరితోనో మాట్లాడుతున్నారు.వారోచ్చాక మీరు వెళ్లి కలవచ్చు." అన్నారు.


కోపా ఎక్కడా అని పరికించి చూచాను.స్వామీజీరూము బయట తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు.నన్ను చూచి నా దగ్గరకొచ్చి తానూ అదే చెప్పాడు.సరే నేను కూడా తనతో కలిసి ఆ తలుపు బయట కాపలా నిలబడ్డాను.మాతో బాటు ఎర్రటి బట్టలు వేసుకుని గడ్డం పెంచి పెద్ద బొట్టుతో ఒక మాంత్రికునిలాఉన్న ఒకవ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.


అలా కాసేపు ఆ పొగని భరిస్తూ నిలబడేసరికి, పంచె కట్టుకున ఒక ముసలిశాల్తీ తలుపు తోసుకుని బయటకొచ్చి "అందరూ ఒక పక్కగా నిలబడండి. ఏమిటిది అడ్డదిడ్డంగా నిలబడ్డారు?"అని కసురుకుంది.ఆ శాల్తీని నేను గుర్తుపట్టాను. కాని ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఒకానొక గురువుకు శిష్యున్నని చెప్పుకుంటూ వేదికలెక్కి ప్రేమతత్వం గురించి ఉపన్యాసాలు తెగదంచే మనిషి ఆయన. అనవసరంగా మమ్మల్ని అలా కసురుకోవాల్సిన అవసరం ఏమిటో నాకర్ధం కాలేదు. బహుశా ప్రేమతత్వం ఎక్కువైతే ఇలా వికటిస్తుందేమోలే అని సరిపెట్టుకున్నాను. సరే అందరం గోడకు ఆనుకొని బల్లుల్లా ఒకమూలకు నిలబడ్డాం.


అలా కొంతసేపు గేటుకాపలా కాసినతర్వాత, ఎర్రడ్రస్ మాంత్రికుడు లోపలకెళ్ళాడు.కోపాకూడా లోపలకి తొంగిచూచి నన్నూ రమ్మని సైగచేస్తూ లోపలకి అడుగుపెట్టాడు.సరే నేనూ లోపలకెళ్ళాను.ఇద్దరం ఒక పక్కగా నిలబడ్డాం. మాతోబాటు ఇంకా ముగ్గురు నిలబడి ఉన్నారు.స్వామీజీ ఒక ఫేము కుర్చీలాంటి దానిలో కూర్చుని ఉన్నాడు. ఆ ముగ్గురి వాలకమూ చూస్తే మేము తొందరగా బయటకెళితే ఏదో రహస్యవిషయం స్వామీజీతో మాట్లాడటానికి వేచి ఉన్నారని అర్ధమైంది. చేతుల్లో ఏవో సంచులు ఉన్నాయి.


ఎర్రగుడ్డల మాంత్రికుడు ఆయన ముందు నిలబడి ఏదో అడుగుతున్నాడు. "ఐశ్వర్యం వచ్చే మార్గం ఉపదేశించండి స్వామీ"అన్నట్లుగా నాకర్ధమైంది.స్వామీజీ ఇలా చెప్తున్నాడు.


"మీరు హోమాలు ఏమైనా చేస్తారా? బలులు ఇస్తారా?" అడిగాడు స్వామీజీ.


"చేస్తుంటాను. కాని బలి ఇవ్వను."మాంత్రికుడు చెప్పాడు.


"అదే మీరు చేస్తున్న పొరపాటు. హోమాలు చేసేటప్పుడు ఏదైనా బలి ఇవ్వాలి. లేకుంటే దేవతలు తృప్తి చెందరు.కనుక హోమంచేసి తర్వాత కూష్మాండంకాని గుమ్మడికాయకాని బలి ఇవ్వండి.తామరపూలతో హోమం చేస్తే మీకు ఐశ్వర్యం వస్తుంది.ఎర్రటి అన్నం మీకు మీరే దిష్టి తీసుకుని పక్షులకు వెయ్యండి."అంటూ ఈ ధోరణిలో ఏదేదో చెబుతున్నాడు.నాకు నవ్వు ఆగడం లేదు.బలవంతాన నవ్వు ఆపుకున్నా ముఖంలో  నవ్వు తెలిసిపోతోంది. "ఏంటి అందరూ భయభక్తులతో నిలబడి ఉంటే ఇతను ఇలా నవ్వుతున్నాడు?"అన్న భావంతో స్వామీజీ ఒకటి రెండుసార్లు నా వైపు తేరిపార  చూచాడు.


ఈలోపల కోపా వంతు వచ్చింది. ఆయన ఒకడుగు ముందుకేసి తన ప్రశ్న సంధించాడు. "స్వామీ. షిరిడీబాబా గొప్పవాడా? రామకృష్ణుడు గొప్పవాడా? బాబాకు గుళ్ళు విపరీతంగా ఉన్నాయి. రామకృష్ణునికి లేవు. ఎందుకలా?"


స్వామీజీ అసహనంగా చూచాడు.


"వాళ్లకి గుళ్ళు లేకపోతే మనకెందుకు?" అన్నాడు.


"అదికాదు స్వామి.ఈ సందేహం చాలాకాలం నుంచి నన్ను వేధిస్తున్నది." అడిగాడు కోపా.


"నువ్వడిగిన దానికి నేనొక ఉపన్యాసం చెప్పాలి. ఇప్పుడు  నాకంత టైం లేదు.జపం ధ్యానం చెయ్యి.నీకే అర్ధమౌతుంది."అన్నాడు స్వామీజీ.అలా అంటూ "ఇక మీరు వెళ్ళవచ్చు" అన్నట్లుగా ఒక అరటిపండు కోపా చేతిలో పెట్టాడు.


తేరగా డబ్బులు వచ్చి ఒళ్లో పడాలి అనడిగిన ఒకాయనకు బాగా వివరించి మరీ హోమాలు ఎలా చెయ్యాలో చెప్పాడు. ఒక మంచి ఫిలసాఫికల్ ప్రశ్న అడిగిన కోపా కేమో ఇలా అసహనంగా జవాబు చెప్పాడు. ఇదంతా నేను నవ్వుతూ చూస్తున్నాను.చేసేదిలేక కోపా వెనక్కితిరిగి బయటకొచ్చాడు. స్వామీజీకి ఒక నమస్కారం పడేసి నేనూ అనుసరించాను.


"ఎప్పుడూ స్వామీజీ బాగానే మాట్లాడతాడు.ఈసారి చుట్టూ మనుషులు ఉన్నారని నాతో అలా మాట్లాడాడు." అన్నాడు కోపా.


"పాపం ఆయనకొకపక్క సన్మానానికి టైం అవుతోంది. ఆయన తొందర ఆయనది. ఎంతైనా అన్నీ వదిలేసిన "పరమహంస పరివ్రాజకాచార్య" కదా.మన పిచ్చి ప్రశ్నలతో ఆయన్ను విసిగిస్తే ఎలా?మనం కూడా ఒక వెయ్యికోట్లు ఎలా తేరగావచ్చి వొళ్ళో పడతాయో అడిగితే మార్గం చెప్పేవాడు.ఇలాటి పిచ్చిప్రశ్నలు అడిగితే ఆయనకి కోపం రాదూ మరి." అన్నాను.


కోపా ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. సరే నేను వస్తానని చెప్పి నాదారిన నేను బయల్దేరాను.


నేటి స్వామీజీల తంతు ఇదీ.వాళ్ళు సంసారాన్ని వదిలామని చెప్పుకుంటారు.కాని అంతకంటే పెద్ద సంసారంలో చిక్కుకున్నారు.వాళ్ళకూ ఈషణత్రయంలో ఈతకొడుతున్న సామాన్యులకూ ఏమీ భేదం లేదు. ఒకరకంగా చూస్తే సామాన్యుడే మంచివాడు.తన స్తితిని తాను ఒప్పుకుంటాడు.కాని అన్నీ వదిలామనీ గురువులమనీ చెప్పుకుంటూ తద్భిన్నమైన జీవితాలు గడిపే స్వాములను ఏపేరుతో పిలవాలో అర్ధంకాదు.ఈతిబాధలకు తరుణోపాయాలు చెప్పేవాడు, సత్యాన్ని చెప్పనివాడూ,ఏమైనా కావచ్చు కాని సద్గురువూ జగద్గురువూ మాత్రం కాలేడు.సద్గురువైనవాడు పేరు ప్రఖ్యాతులకోసం ఏమాత్రం ఆరాటపడకుండా సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పాలి.అది ఇతరులకు నచ్చినా నచ్చకపోయినా సరే.ఒకరి మెప్పును ఆశించేవాడు సద్గురువు ఎలా అవుతాడు?


మౌనంగా ఆలోచిస్తున్న నాలో "సన్యాసం తీసుకోవడం కాదు. సన్యాసిగా మారాలి"అన్న రమణమహర్షి అమృతవాక్కులు గింగురుమన్నాయి.