“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జనవరి 2012, గురువారం

భరతమాత ముద్దుబిడ్డ వివేకానందస్వామి -2 (హస్తముద్రా విశ్లేషణ)


ఇది వివేకానంద స్వామి హస్తముద్ర. 6-4-1895 న ఈ హస్తముద్ర రికార్డ్ చెయ్యబడింది. ఈ హస్తరేఖాముద్రను ప్రఖ్యాత సాముద్రికుడు "కీరో" తన పుస్తకంలో ఇచ్చాడు. ఇది స్వామి సంతకంతో ఉన్న ఆయన కుడిచేతి హస్తముద్ర. ఇప్పటివరకూ నేను హస్తసాముద్రికం గురించి కొన్ని వ్యాసాలు వ్రాశానేగాని ఎవరి చేతినీ ప్రయోగాత్మకంగా  విశ్లేషించి వివరించి చూపలేదు. ఇప్పుడు వివేకానందస్వామి హస్తముద్రలోని రేఖలను విశ్లేషిద్దాం. స్వామి యొక్క హస్తపుతీరు చూడగానే ఇది తాత్వికహస్తాల (philosophic palm) గ్రూపులోకి వచ్చేదిగా వెంటనే చెప్పవచ్చు. అయితే అరచేయి యొక్క చతురస్రనిర్మాణం వల్ల ఇందులో ఆచరణాత్మకహస్తం (practical palm) కూడా కలిసి కనిపిస్తుంది. స్వామి ఉన్నతభావ సంశోభితుడు అని,తాత్విక చింతన కలిగినవాడు అనీ, అదే సమయంలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగిన ఒక లీడర్ అనీ ఈ చెయ్యి చూచి వెంటనే చెప్పవచ్చు.  

మొదటగా స్వామి యొక్క జీవితరేఖ (life line) చాలా చిన్నదిగా ఉండటాన్ని చూడవచ్చు.ఇది శిరోరేఖతో కలిసి చాలాదూరం కలిసి వచ్చింది. ఆ ప్రాంతంలో గొలుసుకట్టు నిర్మాణం ఉండటాన్ని చూడవచ్చు. అక్కడే ఉన్న ద్వీపనిర్మాణం (island) వల్ల స్వామికి చిన్నవయస్సులో కుటుంబపరమైన దుర్ఘటన జరిగింది అని తెలుసుకోవచ్చు. స్వామికి 18 ఏళ్ళ వయస్సులో ఆయన తండ్రిగారు మరణించాడు. వారి కుటుంబం దిక్కులేనిదయ్యింది. అలాగే జీవితరేఖ యొక్క హ్రస్వత్వం వల్ల స్వామి చిన్నవయస్సులోనే ( 39 ఏళ్ళకే) మరణించాడు.

స్వామియొక్క శుక్రస్థానం (mount of Venus) విశాలంగా బలంగా ఉండటం చూడవచ్చు. అందుకే ఆయనది చాలా ఊహాత్మకమైన ఆలోచనాశక్తి. ఆయనకు కవితాశక్తీ అధికమే. అంతేగాక గానం,వాయిద్యప్రతిభా ఆయనలో ఉండేవి. ఆయన తబలాను అద్భుతంగా వాయించేవాడు. ఆయనకు శృతి లయజ్ఞానం అమోఘంగా ఉండేది.ఆయన గానం గంధర్వగానంలా ఉండేదని చాలాచోట్ల వ్రాసి ఉంది. ఆయన పాటపాడితే శ్రీరామకృష్ణులు అదివిని తన్మయత్వంతో సమాధిస్తితిలోకి వెళ్ళేవారు. స్వామి గానం అంత మధురంగా ఉండేది. " ఓ మన్. చలో నిజనికేతనే." (ఓ మనసా నీ స్వస్థానానికి నీవు వెళ్ళు) అన్న కీర్తనను ఆయన మొదటిసారిగా శ్రీరామకృష్ణుల సమక్షంలో గానం చేశాడు. అది విని శ్రీరామకృష్ణులు పరవశులై సమాధి స్తితిని పొందారు.

శుక్రస్థానంలో ఎక్కువభాగం బొటనవేలు యొక్క అధీనంలో ఉండటం చూడవచ్చు. అంటే ఈయనకు గల లలిత కళలన్నీ కూడా ఆత్మశక్తికి లోబడి ఉన్నాయని అర్ధం అవుతుంది. ఒక కళాకారునికీ ఒక యోగికీ గల తేడాలలో ఇది ముఖ్యమైనది. కళాకారునికి ఆత్మనిగ్రహం ఉండవచ్చు లేకపోవచ్చు. కాని యోగికి ఆత్మనిగ్రహం ప్రాణం వంటిది. ఆత్మశక్తి అంగుష్ఠం (thumb) చేత తెలియబడుతుంది.

క్రిందుగా అమరిఉన్న బొటనవేలు (low set thumb) స్వామికి అజేయమైన ఆత్మశక్తీ, విశాలమైన భావపటిమా ఉన్నాయన్న విషయాలు సూచిస్తున్నది.  

విశాలమైన గురుస్థానం (mount of Jupiter) వల్ల ఆయనకు గల ఆధ్యాత్మికశక్తి సూచితం అవుతున్నది. అక్కడ ఉన్న చతుర్భుజగుర్తు (square symbol) వల్ల స్వామికి దైవకృప మెండుగా ఉందన్న విషయం తెలుస్తున్నది. సాలమన్స్ రింగ్(Solomon's ring)స్వామి చేతిలో ఉందో లేదో కనిపించడం లేదు. కాని మార్మికయోగుల చేతిలో ఉండే ఆగుర్తు స్వామి చేతిలో తప్పక ఉండే ఉంటుంది.

ధనరేఖ(fate line) స్వామి చేతిలో ఉంది. కాని హృదయరేఖ(heart line) క్రిందుగా ఆగిపోయి ఉండటంతో, తన హృదయానికి ఇష్టమైన ఆధ్యాత్మికత కోసం తనంతట తాను ధనసంపాదన జోలికి వెళ్ళలేదు అని తెలుస్తోంది. అంటే స్వామి స్వచ్చందంగా పేదరికాన్ని ఒక నియమంగా స్వీకరించి ఆచరించాడు. ఇది మన దేశంలో సాంప్రదాయ సాధువులు ఆచరించే నియమమే.

శిరోరేఖ ధనరేఖను ఖండిస్తూ చంద్రస్థానం(mount of Moon) వైపు వంగి ఉంది. కనుక స్వామి ఆలోచనలు ధనసంపాదన వైపు వెళ్ళలేదు. ధనరేఖ, చంద్రస్థానాల కలయిక స్వామి యొక్క జాతకంలో శనిచంద్రుల సంబంధాన్ని సూచిస్తోంది. స్వామి జాతకంలో శనిచంద్రులు కలిసి కన్యారాశిలో ఉన్నారు.ఇది వైరాగ్యయోగం, తాత్విక చింతనాయోగం.

శిరోరేఖ చంద్రస్థానం వైపు అమితంగా వెళ్ళినా చివరకు బలహీనంగా మారింది. దీనివల్ల స్వామికి గల భావావేశ స్వభావం(emotional nature) కనిపిస్తున్నది. కాని అది చివరకు బలహీనంగా మారినందువల్ల, భావావేశం స్వామి నిగ్రహంలోనే ఉండేదన్న విషయం తెలుస్తున్నది.

హృదయరేఖ చివరిలో అయిదురేఖలుగా చీలింది. ఒకటి గురుస్థానం వైపూ,మిగిలిన నాలుగూ శనిస్థానం వైపూ వెళ్ళాయి. ఇదొక అద్భుతయోగం. దీనివల్ల నాయకత్వ లక్షణాలూ, యోగశక్తీ, కష్టించి పనిచేసే లక్షణమూ  సూచింపబడుతున్నాయి. అయిదు తలల పాములాగా ఈ చిహ్నం ఉండి, వికసించిన కుండలినీ శక్తిని సూచిస్తోంది.


శనిస్థానం మీద ఉన్న చంద్రవలయం (circle of Moon) వల్ల ఒక రహస్యవిషయం బయట పడుతున్నది. స్వామి జాతకంలో శనిచంద్రులు కలిసి ఉన్నారన్న విషయం ఇది సూచిస్తున్నది. ఇదొక ఆశ్చర్యకరమైన సూచన. ఈ విధంగా చేతిని చూచి జాతకాన్నీ, జాతకాన్ని చూచి చేతిరేఖలనూ అంచనా వెయ్యవచ్చు. ఇవి చాలా సార్లు కరెక్ట్ గా సరిపోతూ ఉంటాయి. అంతేకాదు ఈ గుర్తు వల్ల కలిగే ఫలితం తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి గుర్తు చేతిలో ఉన్నవారిలో దివ్యశక్తులూ, ఆత్మజ్ఞానమూ,బ్రహ్మజ్ఞానమూ, అతీతసిద్ధులూ ఉంటాయి. ఉపాసనాబలమూ,ఈశ్వరసాక్షాత్కారమూ వీరికి కరతలామలకాలు. వీరికి వాక్శిద్ధి ఉంటుంది. వీరు ఒకమాట అంటే,అది శాపమైనా వరమైనా,జరిగి తీరుతుంది. విధిని మార్చగల తపశ్శక్తి వీరికి ఉంటుంది. చేతిలో ఈగుర్తు ఉన్నవారిని సద్గురువులుగా గుర్తించవచ్చు.

హృదయరేఖనుంచి రవిస్థానంలో(mount of Sun)ఉన్న రేఖలు ఒక కప్పు వంటి ఆకారంలో ఉన్నాయి. దీనివల్ల ఆయన రాజులకు, సమాజంలోని ఉన్నతులకు సన్నిహితుడౌతాడని  సూచన ఉంది. క్షత్రియకుటుంబంలో పుట్టడంతో ఆయనలో రాజరిక ఠీవి ఉండేదని కూడా మనకు తెలుసు. కాని ఈ రేఖ కేతుస్థానం(mount of Ketu) నుంచి చేతి మధ్యలో నుంచి బయలుదేరటంతో, ఈ పరిచయాలు ఆధ్యాత్మిక సంబంధమైనవనీ, స్వామి నడివయస్సు నుంచే ఇవి మొదలౌతాయనీ తెలుస్తుంది. స్వామి బతికినది 40 ఏళ్లే గనుక ఆయనకు నడివయసు అంటే 20 ఏళ్ళ నుంచే ఉంటుంది.అదేవిధంగా మహారాజులతోనూ, మహానీయులతోనూ ఆయనకు ఆవయస్సు నుంచే పరిచయాలు ఏర్పడ్డాయి.  

శిరోరేఖ,హృదయరేఖల మధ్యన ఉన్న అనేక డైమండ్ ఆకారాల (mystic crosses)వల్ల ఆయనలో అతీతశక్తులు ఉన్నాయని తెలుస్తోంది. గురుస్థానం క్రిందుగా ఉన్న "mystic eye" సింబల్ జాగ్రత్తగా పరిశీలిస్తే కనిపిస్తుంది. దీనివల్ల ఆయనకు దివ్యదృష్టి (divine clairvoyant vision) ఉన్నదన్న విషయం తెటతెల్లం అవుతున్నది.

చంద్రస్థానంలో గల రెండు అడ్డరేఖలవల్ల విదేశీ ప్రయాణాలు సూచితం అవుతున్నాయి. స్వామి అమెరికా మొదలైన విదేశాలకు రెండుసార్లు వెళ్లి వచ్చాడన్న విషయం గమనించాలి. 

బలహీనంగా అనేక రేఖలతో ఖండింపబడి ఉన్న ఆరోగ్యరేఖవల్ల(line of health) స్వామి చివరిలో అనేకరోగాలతో బాధ పడ్డాడని తెలుస్తోంది. ఆయనను చివరి రోజులలో బీపీ, షుగరూ, ఆస్తమా బాధించాయి.

మసకగా కనిపిస్తున్న ఈ హస్తముద్ర నుంచి ఇంతకంటే వివరాలు ఊహించడం కష్టం. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. హస్తసాముద్రికం ఎంతటి ఖచ్చితమైన ఫలితాలను సూచిస్తుందో ఈ విశ్లేషణవల్ల తెలుసుకోవచ్చు. అయితే చదువరులకు ఒక అనుమానం రావచ్చు. మీకు స్వామి జీవితం ముందే తెలుసు గనుక అలా చెప్పగలిగారు అని అనుకోవచ్చు. నేను వ్రాసిన ఫలితాలు రేఖలను బట్టే చెప్పాను. ఈ చెయ్యి వివేకానందస్వామిది కనుక అలా చెప్పలేదు.ఏ హస్తసాముద్రికుడైనా ఆ రేఖలను చూస్తే ఇవే ఫలితాలు చెప్తాడు. ఇందులో అతిశయోక్తులు ఏమీ లేవు. ఈ విషయం సాముద్రికజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా అర్ధం అవుతుంది.


జ్యోతిష్యానికి సాముద్రికానికి ఉన్న తేడా ఇదే. జ్యోతిష్య శాస్త్రం కష్టమైనది. అందులో కారకత్వాల గందరగోళం ఉంటుంది. అక్కడ జ్యోతిష్కుని ఊహాశక్తి చాలా  ఖచ్చితంగా ఉండాలి. స్ఫురణ శక్తి పని చెయ్యాలి. గ్రహబలాలూ భావబలాలూ బేరీజు వెయ్యాలి. గణితభాగం తెలిసి ఉండాలి. సాముద్రికం కూడా  కష్టమైన విద్యే,  కాని జ్యోతిష్యం కంటే తేలికైనది. ఎందుకంటే దీనిలో విషయం కళ్ళముందు కనిపిస్తూ ఉంటుంది కనుక ఎక్కువగా కష్టపడవలసిన పని ఉండదు. మనం ఎక్కువ కష్టపడకుండా ప్రకృతే మన చేతిలో మన జాతకాన్నిపెట్టింది. కాని ఇక్కడ కూడా మంచి విశ్లేషణాశక్తి లేనిదే ఫలితాలు ఊహించలేము.